హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 27,000 ప్రభుత్వ పాఠశాలలను 4,000కు కుదిస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటనను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ విద్యావేత్తలు, మేధావులు, పౌర సమాజం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖను రాశారు.
2026 జూలై 7న విడుదల చేసిన ఈ లేఖలో 23,000 బడుల మూసివేత ఆలోచన విద్యాహక్కు చట్టానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
బడులు మూతపడితే బాలకార్మికులుగా మారే ప్రమాదం..
జూన్ 6న బెంగళూరులో “ది హిందూ” పత్రిక నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఈ కుదింపు ప్రకటన చేశారని లేఖలో ప్రస్థావించారు.
ఈ నిర్ణయం అమలైతే రాష్ట్రంలోని 12,769 గ్రామ పంచాయతీలలో దాదాపు 8,769 గ్రామాల్లో ప్రభుత్వ బడులు శాశ్వతంగా మూతపడతాయని మేధావులు హెచ్చరించారు.
ఇది ఆర్టికల్ 21A, విద్యా హక్కు చట్టం ప్రకారం 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు ఉన్న ఉచిత, నిర్బంధ విద్యా హక్కును ఉల్లంఘించడమే అవుతుందని స్పష్టం చేశారు.
బడులు దూరమైతే రవాణా, భద్రతా కారణాల దృష్ట్యా దళిత, ఆదివాసీ, పేద వర్గాల పిల్లలు- ముఖ్యంగా ఆడపిల్లలు చదువు మానేసి డ్రాప్ అవుట్స్‌గా మిగిలిపోతారని, వారు ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీకి గురికావడమో లేదా బాల కార్మికులుగా మారడమో జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
మేనిఫెస్టో హామీలకు నీళ్లు..
ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ విద్యపై 15% బడ్జెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చి, ప్రస్తుతం కేవలం 8.2% మాత్రమే కేటాయించిందని లేఖలో విమర్శించారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం మూసివేసిన 6,000 బడులను మెరుగైన సదుపాయాలతో తెరుస్తామని చెప్పిన ముఖ్యమంత్రి, దానికి భిన్నంగా ఇప్పుడు ఏకంగా 23,000 పాఠశాలలను మూసివేయాలని చూడటం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు.
కూలిన పర్యవేక్షణ వ్యవస్థ – ప్రైవేటుకే పెద్దపీట..
ప్రభుత్వ బడులలో కేవలం 34% మంది పిల్లలు మాత్రమే మిగిలారనే వాస్తవం పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోందని విమర్శించారు.
నియోజకవర్గ స్థాయి నాయకులు, ఉన్నతాధికారులు “జయశంకర్ బడిబాట”ను కేవలం మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని, అందుకే జీరో ఎన్రోల్మెంట్ బడులు పెరుగుతున్నాయని తెలిపారు.
విద్యా వ్యవస్థను పర్యవేక్షించే అధికారులు కూడా లేరని; 33 జిల్లాలకు గాను 25 జిల్లాల్లో రెగ్యులర్ డీఈఓలు లేరని, 633 మండలాలకు గాను 612 మండలాల్లో ఎంఈఓలు లేరని గణాంకాలతో సహా వివరించారు. పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్‌లో తెలంగాణ దక్షిణాదిలోనే వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ముందు ఉంచిన తక్షణ డిమాండ్లు..
విద్యా విధ్వంసాన్ని ఆపడానికి తక్షణమే ఐదు చర్యలు చేపట్టాలని లేఖలో డిమాండ్ చేశారు.
బడుల మూసివేత ప్రకటనను తక్షణమే ఉపసంహరించుకోవాలి.
మేనిఫెస్టోలో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి చిన్న గ్రామంలో ప్రాథమిక పాఠశాలను కొనసాగించాలి, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలి.
అన్ని బడుల్లో అవసరమైన తరగతి గదులు, మరుగుదొడ్లు, తాగునీరు, డిజిటల్ వనరులను సమకూర్చాలి.
ఖాళీగా ఉన్న అన్ని బోధన, బోధనేతర పోస్టులను భర్తీ చేయాలి, ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించరాదు.
ప్రైవేటు పాఠశాలల నియంత్రణకు జీవో నెంబర్ 1ను పకడ్బందీగా అమలు చేయాలి.
ప్రభుత్వ విద్యా రంగాన్ని కాపాడుకోకపోతే తెలంగాణ సమాజ భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని హెచ్చరించిన ఈ బహిరంగ లేఖపై, హైకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్ బీ చంద్రకుమార్, జస్టిస్ రాధారాణి, ప్రొఫెసర్ శాంతా సిన్హా, ప్రొఫెసర్ కోదండరాం, గోరటి వెంకన్న లాంటి మొత్తం 125 మందికి పైగా మేధావులు, జర్నలిస్టులు, ఉద్యమకారులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు సంతకాలు చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
