నిర్జీవమైన వస్తువుల కంటే భాష ప్రజలకు ఎంతో ప్రాణప్రదమైనది, సాంద్రమైనది. ఇది వచనం, కవిత్వం, నాటకరంగాల పరంగా గొప్ప సంస్కృతికి మూలాధారం.
భావాలు, మనోభావాలు, ఆలోచనలను సంపూర్ణంగా వ్యక్తీకరించడానికి అనుమతించే ఒక విముక్తి శక్తి ఇది.
“ఏ రెండు భాషలు, లేదా ఒకే భాషలోని ఏ రెండు మాండలికాలు లేదా స్థానిక ఉపభాషలు తమ ప్రపంచాలను ఒకేలా గుర్తించవు, నిర్దేశించవు, రూపు కట్టవు. భద్రపరచబడిన జ్ఞాపకాలు, ఆచరణాత్మక పరిసరాలు, భాష నిర్వహించే, ప్రతిబింబించే సామాజిక సంబంధాలు(ఉదాహరణకు బంధుత్వం), దాని పదజాలంలో గుర్తించబడే రంగులు ఒక భాష నుంచి మరొక భాషకు తరచుగా పూర్తిగా భిన్నంగా ఉంటాయి” అని సాహిత్య విమర్శకుడు జార్జ్ స్టైనర్ అన్నారు.
భారతదేశ సాంస్కృతిక నిర్మాణంలో భాష ఒక ముఖ్యమైన భాగం – భాషను రక్షించడం అంటే బహుళత్వాన్ని, సాంస్కృతిక వైవిధ్యాన్ని రక్షించడమే.
మైనారిటీ సంస్కృతి – ప్రభుత్వ ఉదాసీనత..
రాజ్యాంగాన్ని రూపొందిస్తున్నప్పుడు, సాంస్కృతిక హక్కులు, ముఖ్యంగా మైనారిటీల ప్రత్యేక సాంస్కృతిక హక్కుల భావన అప్పట్లో ప్రాథమిక దశలోనే ఉండిపోయింది.
మైనారిటీలకు మతం, భాష, సంస్కృతి విషయాలలో స్వేచ్ఛకు హామీ ఇవ్వాలా, రాజ్యం నుంచి వివక్ష, జోక్యం లేకుండా వారిని రక్షించాలా అనేదే ఆనాటి ప్రశ్న.
కాంగ్రెస్ పార్టీ 1931 నాటి కరాచీ తీర్మానంలోనే మైనారిటీ సంస్కృతి, లిపి, భాషల పరిరక్షణ విధానానికి మద్దతు ఇచ్చింది.
అయితే, డ్రాఫ్టింగ్ కమిటీ ఛైర్మన్ అయిన డాక్టర్ అంబేద్కర్, సంస్కృతి పరిరక్షణలో రాజ్యం పాత్ర పరిమితంగానే ఉండాలని భావించారు.
దీనిని క్లుప్తంగా, “సాంస్కృతిక రక్షణలు చివరకు రాజ్యాంగంలో చేర్చబడిన రూపం ఎలా ఉందంటే – మైనారిటీలు తమ సంస్కృతిని పెంపొందించుకోవడానికి స్వేచ్ఛ కలిగి ఉంటారు, ప్రభుత్వ సహాయం పొందే అవకాశం ఉంటుంది కానీ అది ఒక హక్కుగా మాత్రం కాదు. కాబట్టి రాజ్యం పాత్ర పరిమితంగా ఉండిపోయింది” అని రచయిత్రి రోచనా బాజ్‌పాయ్ వివరిస్తారు.
మైనారిటీల సంస్కృతిని, భాషా వారసత్వాన్ని సంరక్షించడంలో ప్రభుత్వం ఎటువంటి క్రియాశీలక పాత్రను పోషించలేదు.
పైకి బహుళత్వాన్ని కాపాడుతామని చెప్పుకునే సమాజంలో మైనారిటీ సంస్కృతి పరిరక్షణ పట్ల ఈ విధమైన ఉదాసీనత ఆందోళన కలిగిస్తుంది.
ఎందుకంటే చాలా సందర్భాలలో సంస్కృతిని సంలీనం చేయడం అంటే దానిని నిర్మూలించడమే. సమకాలీన ఆలోచనలు బహుళ సాంస్కృతిక సమాజంలో సంస్కృతి పరిరక్షణ భావనకు ప్రాధాన్యతనిచ్చాయి.
యూపీ, బీహార్ ముస్లింలకు ఉర్దూ ప్రాముఖ్యత ఎంతో కీలకమైనది. అయినప్పటికీ యూపీలో 1950, 60వ దశకాల్లో వరుసగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు మైనారిటీ భాషా సంస్కృతి, వారసత్వాలను నిర్లక్ష్యం చేస్తూనే వచ్చాయి.
ఉర్దూ, హిందీల ఆవిర్భావం – ఆర్ఎస్ఎస్ వైఖరి..
1900ల నాటి ఉత్తర భారతదేశంలో, ప్రజా చర్చలలో ఉర్దూ భాష అత్యధికంగా చలామణిలో ఉండేది. నిజానికి, కాలమిస్ట్ సంతోష్ కుమార్ ఖారే రాస్తూ “హిందీ, ఉర్దూ రెండు వేర్వేరు భాషలు అనే భావన 19వ శతాబ్దం మొదటి అర్ధభాగంలో ఫోర్ట్ విలియం కాలేజీలో రూపుదిద్దుకుంది” అని పేర్కొన్నారు.
“వాటి భాషా సాహిత్య సామర్థ్యాలు దానికి అనుగుణంగానే నిర్మించబడ్డాయి. ఉర్దూ పర్షియన్/అరబిక్ నుంచి, హిందీ సంస్కృతం నుంచి పదాలను స్వీకరించాయి” అని ఆయన సూచించారు.
అయితే, ఆయన వాదనలోని అసలు ముఖ్యమైన విషయం; హిందీ మద్దతుదారులకు ఇబ్బంది కలిగించే విషయం ఏమిటంటే – “ఆధునిక హిందీ(లేదా ఖరీ బోలి) అనేది ఈస్ట్ ఇండియా కంపెనీ ఒక కృత్రిమ సృష్టి. ఇది ఉర్దూ వ్యాకరణాన్ని, శైలిని అలాగే ఉంచుతూ, దానిలోని ‘విదేశీ, గ్రామీణ’ పదాలను తొలగించి, వాటి స్థానంలో సంస్కృత సమానార్థక పదాలను చేర్చింది.”
విచిత్రమేమిటంటే, నేడు హిందీకి ప్రముఖ ప్రతినిధిగా ఉన్న ఆర్ఎస్ఎస్ భారతదేశంలోని ఇంగ్లీష్ మాట్లాడేవారిని “మెకాలే పిల్లలు” అని పిలుస్తూ ఎగతాళి చేయడంలో ఎంతో ఆనందిస్తుంది.
ఏదేమైనా, ఉర్దూ పట్ల ఆర్ఎస్ఎస్ వైఖరి శత్రుత్వంతో కూడుకున్నదే. యూపీలో మైనారిటీ భాష అయిన ఉర్దూకు ఎలాంటి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలనే ఆలోచననైనా అది హేళన చేస్తుంది.
కానీ ఒక రకంగా చూస్తే, యూపీలోని ఉర్దూ మాట్లాడేవారి ప్రస్తుత పరిస్థితి, 1932లో కమ్యూనల్ అవార్డు ప్రకటించినప్పుడు బెంగాల్‌లోని “భద్రలోక్” వర్గం ఎదుర్కొన్న దుస్థితిని గుర్తుచేస్తోంది.
ఆ అవార్డు శాసనసభలో బెంగాలీ “భద్రలోక్” స్థానాన్ని మైనారిటీ స్థాయికి తగ్గించింది. దీనికి నిరసనగా భద్రలోక్ సంఘం లార్డ్ జెట్లాండ్కు(బెంగాల్ మాజీ గవర్నర్) ఒక వినతిపత్రం పంపుతూ, “మేము బెంగాల్‌లోని హిందూ సమాజానికి చెందినవారము, ఇది ఒక మైనారిటీ సమాజం. కాబట్టి ఇతర ప్రావిన్సులలోని మైనారిటీలకు హామీ ఇవ్వబడిన రక్షణే మాకూ లభించాలి. బెంగాల్ హిందూ మైనారిటీ ఒక గుర్తింపు పొందిన మైనారిటీ హక్కుగా తమకు తగిన ప్రాతినిధ్యాన్ని డిమాండ్ చేస్తోంది” అని పేర్కొంది.
భాషను చేర్చని ఒక అస్పష్టమైన పదమైన “సంస్కృతి” అనే పేరుతో, 1946లో యునైటెడ్ బెంగాల్ ప్రతిపాదన వచ్చినప్పుడు ఈ భద్రలోక్ వర్గమే సమాఖ్యతత్వం గురించి, ఆ తర్వాత విభజన గురించి మాట్లాడటం గమనార్హం.
యూపీ ముస్లింలను, లేదా కనీసం “అష్రాఫ్”(ఉన్నత వర్గాల) వారిని ఉర్దూను నిలుపుకోవాలని పట్టుబట్టినందుకు విమర్శిస్తూ వచ్చారు, ఎందుకంటే ఒక చిన్న సంపన్న వర్గం ఉన్నత సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వడం, విభజననే పరిష్కారంగా పట్టుబట్టడం సమంజసం కాదని భావించారు.
యూపీలో ఉర్దూను రెండో భాషగా ఉంచడానికి ఎటువంటి రాజీ కుదరకపోవడానికి తగిన కారణం ఏదీ లేదు.
నెహ్రూ ఈ తీవ్రమైన ఉర్దూ వ్యతిరేక విధానం పట్ల తీవ్రంగా కలత చెందారని హసన్ అంగీకరించారు. కానీ ఆయన చేయగలిగింది ఏమీ లేకపోయింది.
ఒకానొక సందర్భంలో ఆయన, “నా సహచరులు అంగీకరించకపోతే, నేనేమీ చేయలేను” అని కూడా ఒప్పుకున్నారు.
ఉర్దూకు మరణశాసనం – కృత్రిమంగా మారిన హిందీ..
ఉర్దూకు అసలైన మరణశాసనం పాఠశాలల్లో ప్రవేశపెట్టిన త్రిభాషా సూత్రం ద్వారా లిఖించబడింది. యూపీలో, ఇందులో మొదటిది జాతీయ భాష అయిన హిందీ కాగా, సంస్కృతం రెండో భాషగా, మూడో భాషగా ఇంగ్లీష్ లేదా ఉర్దూలలో ఒకదానిని ఎంచుకునే అవకాశం ఉంది.
ఆధునిక భారతదేశంలో ముందుకు దూసుకుపోవాలని అనుకునేవారికి ఇంగ్లీష్ నేర్చుకోవడం చాలా కీలకం.
కాబట్టి ఉర్దూ కంటే ఇంగ్లీష్‌ను ఎంచుకున్న కొద్దిమంది ముస్లింలను లేదా ఉర్దూ మాట్లాడే నేపథ్యం ఉన్నవారిని తప్పుపట్టడం సరికాదు. కానీ స్పష్టంగా, త్రిభాషా సూత్రం హిందీ, సంస్కృతాలకి అనుకూలంగా మార్చబడింది. దీని వెనుక ఉర్దూను చరిత్ర చెత్తబుట్టలోకి నెట్టేయాలనే స్పష్టమైన ఉద్దేశం ఉంది.
ఉత్తర భారతదేశ అధికారిక భాషగా ఉర్దూ కొనసాగడాన్ని సమర్థించిన సర్ తేజ్ బహదూర్ సప్రూ లాంటి ఉన్నత వర్గ హిందువులలో కూడా ఉర్దూకు మద్దతుదారులు ఉన్నారు.
ఆయన హిందీని తీవ్రంగా అనుమానించారు. హిందుస్తానీ భాష నుంచి అనేక ఉర్దూ పదాలను, వాడుకలను తొలగించి దానిని సంస్కృతీకరించడానికి ఇది ఒక వ్యూహం మాత్రమే అని ఆయన భావించారు.
మున్షీ ప్రేమ్‌చంద్, ఫిరాక్ గోరఖ్‌పురి, పండిట్ హరిచంద్ “అఖ్తర్”, ఆనంద్ నారాయణ్ “ముల్లా” లాంటి అనేకమంది ప్రముఖ హిందూ రచయితలు ఉర్దూలో రాశారనే చెప్పాలి.
ఇది గొప్ప కళకు, ఉన్నత సంస్కృతికి మూలంగా ఉండటమే కాకుండా, వర్గాల మధ్య ఒక లౌకిక వారధిగా నిలిచింది.
ఉర్దూ స్థానంలో ఏదో ఒక ప్రజాదరణ పొందిన, సజీవమైన భాష వస్తోందని కాదు. హిందీ ఎప్పుడూ ఒక నిర్జీవమైన, బ్యూరోక్రాటిక్(అధికారిక) భాషగానే ఉంది.
నోబెల్ బహుమతి గ్రహీత, భారతదేశంలో మెక్సికో మాజీ రాయబారి అయిన ఆక్టావియో పాజ్ రాసినట్లుగా: “ప్రస్తుత భారతదేశంపై రుద్దబడిన హిందీకి మరొక ప్రతికూలత ఉంది: ఇది ఇంగ్లీష్, పర్షియన్ లేదా అరబిక్ లాంటి విదేశీ స్వరాలను అణచివేసిన భాష; వాటి స్థానంలో ఇది సంస్కృత నయా-పదాలను చేర్చింది.
ఇది నార్మన్ దండయాత్రకు ఆనవాళ్లు అనే కారణంతో ఇంగ్లీష్ వారు ఫ్రెంచ్ మూలాలున్న పదాలన్నింటినీ తమ భాష నుంచి తొలగించినట్లుగా ఉంది.
నిజం ఏంటంటే, అధికారిక హిందీని చాలా తక్కువ మంది మాత్రమే పూర్తిగా అర్థం చేసుకోగలరు. ఇది ఒక కృత్రిమ, బ్యూరోక్రాటిక్ మాండలికంగా మారిపోయింది.
‘హై హిందీ'(కొందరు వ్యంగ్యంగా పిలిచినట్లు) ఒక సజీవ భాషగా మారాలంటే, అది ప్రజా బాహుళ్యం మాట్లాడే భాషలో లీనమవ్వాలి.
విదేశీయుల స్వరాలను, వాటి మూలంతో సంబంధం లేకుండా స్వీకరించాలి. సజీవ భాషలు ఎప్పుడూ సంకరమైనవిగా, అపవిత్రమైనవిగా ఉంటాయి.
హిందీపై ఈ ప్రాధాన్యత వెనుక ఉన్న ఉద్దేశం స్పష్టం – ముస్లింలను ఇబ్బంది పెట్టడానికి, మిశ్రమ సంస్కృతిపై దాడి చేయడానికి ఉర్దూను తుడిచిపెట్టడమే – అంతకు మించి ఏమీ కాదు.
మైనారిటీ – ఎవరి సంస్కృతినైతే నిర్మూలించకపోయినా, కనీసం అట్టడుగుకు నెట్టేయాలని అనుకున్నారో ఆ వర్గానికి చెందిన భాష అది. నిజానికి, మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో కూడా చేయని విధంగా, యూపీ ఒక అడుగు ముందుకు వేసి ఉర్దూ మీడియం పాఠశాల విద్యను పూర్తిగా నిషేధించింది.
ప్రముఖ ఉర్దూ రచయిత షంసూర్ రెహమాన్ ఫారూఖీ దీనిపై చాలా నిర్మొహమాటంగా మాట్లాడుతూ, స్వాతంత్ర్యానంతరం యూపీలో ఉర్దూను పూర్తిగా నిర్మూలించడానికి ప్రయత్నం జరిగిందని అన్నారు.
అరబిక్ సంఖ్యల వివాదం – మితవాదుల పట్టుదల..
యూపీ నుంచి ఉర్దూను వదిలించుకోవాలనే హిందూ మితవాదపక్షం ఆలోచన సమంజసమైనదేనని చెప్పడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి.
ఉర్దూ లిపి సులభం కాదని, ఉత్తరాదిన ముస్లింలు, హిందువులు శతాబ్దాలుగా వాడుతున్నప్పటికీ, దేవనాగరి మరింత ఆచరణాత్మకమైన, రాయడానికి సులభమైన భాష అని వాదించారు.
ఇది వినడానికి సహేతుకంగా అనిపించవచ్చు. ఈ చర్చ నుంచి ముస్లిం వ్యతిరేక ద్వేషాన్ని తొలగించవచ్చు. కానీ ఒక విషయం ఇక్కడ అడ్డు వస్తుంది: సంఖ్యల(న్యూమరల్స్) గురించిన తీవ్రమైన వివాదం. హిందీ మద్దతుదారులు నేడు వాడుకలో ఉన్న పాశ్చాత్య అరబిక్ సంఖ్యలను(0, 1, 2, 3…) అంగీకరించడానికి నిరాకరించారు.
దేవనాగరి సంఖ్యలనే వాడాలని పట్టుబట్టారు. చరిత్రకారుడు జ్ఞానేష్ కుదైస్య ఏమంటారంటే, ఆ విషయాన్ని నేరుగా చెప్పనప్పటికీ, దానికి కారణం “వాటి ఇస్లామిక్ మూలాలే”.
పాశ్చాత్య దేశాలు అరబిక్ సంఖ్యలను స్వీకరించడానికి ఎటువంటి ఇబ్బంది పడనప్పుడు, హిందీ మద్దతుదారులు వాటిని తిరస్కరించడానికి ఇస్లామిక్ వారసత్వంపై ఉన్న తీవ్రమైన ద్వేషం, దానిని తుడిచిపెట్టాలనే కోరిక తప్ప మరేదైనా కారణం ఉందని సరిపెట్టుకోలేం.
1949లో రాజ్యాంగ పరిషత్తులో ఓట్లు సమమైన తర్వాత, భారతదేశం అధికారికంగా దేవనాగరి సంఖ్యలను స్వీకరించే పరిస్థితికి చాలా దగ్గరగా వచ్చింది.
నెహ్రూ జోక్యం చేసుకుని, అంత తక్కువ మెజారిటీతో దేవనాగరి సంఖ్యలను దేశంపై బలవంతంగా రుద్దకూడదని అనడంతో ఇది ఆగింది.
ముస్లిం వారసత్వం పట్ల హిందూ మితవాద పక్షానికి చెందిన చాలామంది సభ్యుల వైఖరికి ఇది అద్దం పడుతుంది కాబట్టే నేను ఈ ఉదాహరణను నొక్కి చెబుతున్నాను. ఇది ముఖ్యంగా యూపీలో స్పష్టంగా కనిపించింది.
స్థిరపడిన ఒక పెద్ద మైనారిటీ సమూహంతో సాంస్కృతిక విషయాలలో ఎలాంటి సహేతుకమైన ఒప్పందానికి రావడానికి వారి వైపు ఎటువంటి సుముఖత లేదనే వాదనను ఇది బలపరుస్తుంది.
సింధీ భాషకూ ఇదే ముప్పు..
ఉర్దూను తొలగించాలనే ఈ పట్టుదల గణనీయమైన పర్యవసానాలకు దారితీస్తుంది. ఎందుకంటే ఒక భాషతో పాటు దాని సాహిత్యం వస్తుంది. ఆ సాహిత్యంతో పాటు సంపన్న సాంస్కృతిక వారసత్వం వస్తుంది – దీనినే జార్జ్ స్టైనర్ సాంస్కృతిక వారసత్వం అని పిలిచారు.
ప్రొఫెసర్ కేసీ కందా తదితర ప్రతిభావంతులైన అనువాదకులు ఉర్దూ కవిత్వాన్ని దేవనాగరిలోకి, అలాగే రోమన్ లిపిలోకి అనువదించడానికి ప్రయత్నాలు చేశారు. కానీ అది అంత సులభం కాదు. సాధారణంగా ఒక భాష లిపి క్షీణించినప్పుడు లేదా తగ్గినప్పుడు దాని సాహిత్యం కూడా అంతరించిపోతుంది.
ప్రపంచవ్యాప్తంగా 35 మిలియన్ల కంటే ఎక్కువ మంది మాట్లాడే మరొక భారతీయ భాష విషయంలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా భారతదేశంలో వారి సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ వ్యాపారం, సంపద సృష్టి, దాతృత్వంలో అపారమైన పాత్ర పోషించిన ఒక సమాజానికి చెందిన భాష: సింధీ సమాజం.
సింధీ భాష పర్సో-అరబిక్‌తో సహా పలు లిపులలో వ్రాయబడుతుంది. సింధీ సాహిత్యంలో గొప్ప కవులు, రచయితలైన షా అబ్దుల్ లతీఫ్ భిట్టాయ్ లాంటివారు ఈ లిపిలోనే రాశారు.
సింధీ జానపద కథలను, సంప్రదాయాలను వివరించారు. నేటి తరం యువ సింధీలకు వారి సాంప్రదాయ లిపిని నిర్మూలించి, దాని స్థానంలో అసలు సింధీ సాహిత్యమే లేని ఒక లిపిని తీసుకురావాలనే సంకుచిత కోరిక కారణంగా, వారి సాహిత్య వైభవాన్ని, సంకర వారసత్వాన్ని పొందే అవకాశం నిరాకరించబడటం అతి పెద్ద విషాదం.
దీనిలోని విచిత్రమైన అంశం ఏమిటంటే, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు హిందీ పాలనాధికార భాషగా చేయబడింది.
విరుద్ధంగా, ఉర్దూను నిర్మూలించాలనే హిందూ మితవాద పక్షం స్పష్టమైన కోరిక ఉన్నప్పటికీ, “వాడుక భాషగా ఉర్దూ, దానిలోని పర్షియన్ పదాల గణనీయమైన భాగంతో కలిపి ఇప్పటికీ భారతదేశంలో జీవించే ఉంది. 19వ శతాబ్దంలో ఉన్నత సమాజపు హోదాగా ఉన్న దీని స్థానం కారణంగా, ఉత్తర భారతీయులు తమ సాంస్కృతిక వినియోగంలో (సినిమాలు, పాటలు మొదలైనవి) ఇప్పటికీ ఉర్దూ వైపే చూస్తారు” అని కాలమిస్ట్ షోయబ్ డానియల్ పేర్కొన్నారు.
దీనికి చాలా వరకు బాలీవుడ్ ప్రభావమే కారణం. నిజానికి, నిర్జీవమైన అధికారిక హిందీ కంటే ఈ హిందుస్తానీ భాషే ఉత్తరాదికి, దక్షిణాదికి మధ్య ఉన్న దూరాన్ని మరింత సమర్థవంతంగా తొలగిస్తుంది.
అనువాదం : కె సత్యరంజన్
‘హార్ట్‌ల్యాండ్ రైజింగ్: ది మేకింగ్ ఆఫ్ మెజారిటేరియన్ ఇండియా’ పుస్తకం నుంచి తీసుకోబడిన ఈ వ్యాసాన్ని స్క్రోల్ సౌజన్యంతో అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
