జర్మనీ నియంత హిట్లర్ కాలంలో యూదులపై మారణకాండ జరిగిన విషయం తెలిసిందే.
ఆ ప్రమాదం నుంచి తాత్కాలికంగా తప్పించుకుని, ఆ ఘాతుకాలను ప్రపంచానికి తెలియజేసింది ఒక సాహస బాలిక. ఆమె “ఆన్ ఫ్రాంక్”.
1942 జూలై 6 జీవితాన్ని మార్చిన రోజు: “యుద్ధం మనుషులను మాత్రమే చంపదు.
వారి కలలను, బాల్యాన్ని, భవిష్యత్తును కూడా బలి తీసుకుంటుంది”- ఈ సత్యాన్ని ప్రపంచానికి అత్యంత హృదయవిదారకంగా తెలియజేసిన పేరు ఆన్ ఫ్రాంక్.
చరిత్రలో అనేక యుద్ధాలు జరిగాయి. సామ్రాజ్యాలు కూలిపోయాయి.
సరిహద్దులు మారాయి. కానీ రెండో ప్రపంచ యుద్ధం మానవాళి మనస్సాక్షిని కుదిపేసిన ఘోర విషాదంగా నిలిచింది.
ఆ యుద్ధంలో జరిగిన హోలోకాస్ట్ మానవ నాగరికతపై చెరగని మచ్చగా మిగిలిపోయింది.
ఈ దారుణానికి ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన ఒక చిన్నారి రాసిన డైరీ నేటికీ ప్రపంచాన్ని ఆలోచింపజేస్తోంది. ఆ చిన్నారి ఆన్ ఫ్రాంక్.
హిట్లర్ ఎదుగుదల – ద్వేష రాజకీయాలకు ఆరంభం..
మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం జర్మనీ తీవ్ర ఆర్థిక, రాజకీయ సంక్షోభంలో చిక్కుకుంది. ఈ అసంతృప్తిని ఆసరాగా చేసుకుని నాజీ పార్టీ అధికారంలోకి వచ్చింది.
1933లో హిట్లర్ జర్మనీ ఛాన్సలర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత “ఆర్య జాతి అత్యున్నతమైనది” అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడు. యూదులు దేశ సమస్యలకు కారణమని ఆరోపిస్తూ వారిపై వివక్షను చట్టబద్ధం చేశాడు.
యూదు ప్రజల ఉద్యోగాలు, విద్య, వ్యాపారాలు, పౌర హక్కులు ఒక్కొక్కటిగా హరించబడ్డాయి.
సమాజంలో వారిని ఒంటరి చేశారు. ఇదే తరువాత మానవ చరిత్రలో అత్యంత భయానక జాతి నిర్మూలనకు దారితీసింది.
యుద్ధం నీడలో జన్మించిన బాల్యం..
ఆన్ ఫ్రాంక్ 1929 జూన్ 12న జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌లో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ఒట్టో ఫ్రాంక్, ఎడిత్ ఫ్రాంక్. అక్క మార్గోట్ ఫ్రాంక్. చిన్నప్పటి నుంచే ఆన్ చురుకైన స్వభావం కలిగిన బాలిక.
చదవడం, రాయడం అంటే అమితమైన ఆసక్తి. తన భావాలను అందంగా వ్యక్తపరచగలిగే ప్రతిభ చిన్న వయసులోనే కనిపించింది. కానీ ఆమె బాల్యం ఎక్కువ కాలం ప్రశాంతంగా సాగలేదు.
ఆమ్స్టర్డామ్కు వలస..
హిట్లర్ అధికారంలోకి వచ్చిన కొద్దికాలానికే యూదుల పరిస్థితి దారుణంగా మారింది. దీంతో ఫ్రాంక్ కుటుంబం జర్మనీ విడిచి నెదర్లాండ్స్‌లోని ఆమ్స్టర్డామ్కు వలస వెళ్లింది. అక్కడ కొంతకాలం ప్రశాంత జీవితం గడిచింది. ఆన్ పాఠశాలలో చేరింది. స్నేహితులను సంపాదించింది. రచయిత్రి కావాలనే కలలు కనసాగింది.
అయితే 1940లో నాజీ జర్మనీ నెదర్లాండ్స్‌ను ఆక్రమించడంతో ఆ ప్రశాంతత కూడా ముగిసింది.
యూదులపై పెరిగిన ఆంక్షలు..
నెదర్లాండ్స్‌లోనూ యూదులపై వరుసగా ఆంక్షలు విధించబడ్డాయి. ప్రత్యేక గుర్తింపు చిహ్నాలు ధరించాలి.
సాధారణ పాఠశాలల్లో చదవకూడదు. పార్కులు, సినిమా హాళ్లు, ప్రజా ప్రదేశాలకు వెళ్లకూడదు. వ్యాపారాలు నిర్వహించకూడదు. స్వేచ్ఛగా ప్రయాణించకూడదు.
ఒక చిన్నారి జీవితంలో ఇవన్నీ ఎంతటి మానసిక వేదన కలిగిస్తాయో ఆన్ తన డైరీలో హృదయాన్ని కదిలించేలా వర్ణించింది.
డైరీ–పుట్టినరోజు కానుక..
1942 జూన్ 12న తన 13వ పుట్టినరోజు సందర్భంగా ఆన్‌కు ఎరుపు-తెలుపు రంగుల అందమైన డైరీ బహుమతిగా లభించింది. ఆమె ఆ డైరీని తన ఆత్మీయ స్నేహితురాలిగా భావించింది. దానికి “కిట్టీ” అని పేరు పెట్టి ప్రతి రోజూ తన అనుభవాలు, భయాలు, ఆశలు, కలలు, కుటుంబ సభ్యుల గురించి రాయడం ప్రారంభించింది. ఆమెకు అప్పటికి తెలియదు, తాను రాసే ఈ పుటలు ఒకరోజు ప్రపంచ చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన పుస్తకాలలో ఒకటిగా నిలుస్తాయని.
1942 జూలై 6 – జీవితాన్ని మార్చిన రోజు..
1942 జూలై ప్రారంభంలో ఆన్ అక్క మార్గోట్కు నాజీ అధికారుల నుంచి కాన్సన్ట్రేషన్ శిబిరానికి హాజరుకావాలనే నోటీసు వచ్చింది. ఆ నోటీసు అంటే దాదాపు మరణశిక్షతో సమానం అని కుటుంబానికి తెలుసు. దాంతో 1942 జూలై 6న ఫ్రాంక్ కుటుంబం ముందుగానే సిద్ధం చేసిన రహస్య గృహంలోకి వెళ్లిపోయింది.
ఆమ్స్టర్డామ్లోని ఒట్టో ఫ్రాంక్ కార్యాలయం వెనుక భాగంలో ఉన్న ఈ రహస్య నివాసాన్ని తరువాత ప్రపంచం “సీక్రెట్ అనెక్స్”గా గుర్తించింది.
బయట నుంచి చూస్తే అది సాధారణ కార్యాలయ భవనం. కానీ ఒక తిరిగే పుస్తకాల అలమర వెనుక దాగి ఉన్న గదుల్లో ఎనిమిది మంది దాదాపు రెండు సంవత్సరాలు జీవించారు.
నిశ్శబ్దమే జీవితం..
రహస్య గృహంలో జీవితం అత్యంత కఠినంగా ఉండేది. పగటి వేళల్లో కింద కార్యాలయంలో ఉద్యోగులు ఉండటంతో నడవడం, మాట్లాడడం, నీళ్లు వదలడం, కిటికీలు తెరవడం కూడా ప్రమాదకరమే. రాత్రివేళల్లో మాత్రమే కొద్దిసేపు స్వేచ్ఛగా కదిలే అవకాశం ఉండేది. అయినప్పటికీ ఆన్ చదువును కొనసాగించింది.
చరిత్ర, సాహిత్యం చదివింది. రచయిత్రి కావాలనే తన కలను వదులుకోలేదు. ఆమె డైరీలో కనిపించే ప్రతి పేజీ ఒక బాలిక మనసులోని భయం, ఆశ, ఆవేదన, ధైర్యానికి ప్రతిబింబంగా నిలిచింది.
సశేషం…
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
