కేంద్ర ప్రభుత్వ కార్మిక, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ‘జైల్ భరో’కు కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, ఇతర పలు ప్రజా సంఘాలు పిలుపునిచ్చాయి.
పిలుపులో భాగంగా హైదరాబాద్ నగరంలో ఛలో లోక్ భవన్ కార్యక్రమం జరిగింది.
లోక్ భవన్ చేరుకోకముందే పోలీసులు వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు.
దేశవ్యాప్త జైల్ భరో పిలుపులో భాగంగా ఆయా సంఘాలు ఆగస్టు 10న ‘ఛలో లోక్ భవన్’ కార్యక్రమాన్ని నిర్వహించగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు.
కార్మికులు, రైతుల ప్రధాన డిమాండ్లు..
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రధాన మంత్రి హామీ మేరకు పంటలకు మద్దతు ధరను అమలు చేయాలని, జీ రామ్‌జీ పథకాన్ని రద్దు చేసి దాని స్థానంలో గత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని, ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు.
చేతిలో ప్లకార్డులు, జెండాలను పట్టుకొని నినాదాలిస్తూ ఖైరతాబాద్ చౌరస్తా నుంచి రాజ్‌భవన్‌కు శాంతియుతంగా ప్రదర్శనగా వెళ్తున్న వారిని రాజ్‌భవన్‌కు కొంత దూరంలోనే పోలీసులు అరెస్టు చేశారు.
అరెస్టయిన వివిధ సంఘాల నాయకులు..
కార్మిక సంఘాల నాయకులు పాలడుగు భాస్కర్, జె వెంకటేష్, డీజీ నర్సింహారావు(సీఐటీయూ), వీఎస్ బోస్, మహ్మద్ యూసుఫ్, బాల్‌రాజ్ (ఏఐటీయూసీ), ఎం శ్రీనివాస్ (ఐఎఫ్టీయూ), కె సూర్యం(టీయూసీఐ), ఆర్డీ చంద్రశేఖర్, బీ విజయ్ కుమార్ యాదవ్(ఐఎన్టీయూసీ), రాంబాబు యాదవ్(బీఆర్ఎస్టీయూ), ఝాన్సీ (పీవోడబ్ల్యూ), ప్రేమ్ పావని (శ్రామిక మహిళా ఫోరం) తోపాటు టీ సాగర్(తెలంగాణ రైతు సంఘం), పశ్య పద్మ (తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం), స్కైలాబ్ బాబు (కుల వివక్షత పోరాట సమితి) సహా అనేక మంది నాయకులు, కార్యకర్తలు అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
