‘ఆరోపణలు నిజమా? కాదా? తేల్చాల్సింది రాజకీయ వాదనలు కాదు— దర్యాప్తు సంస్థలు” అని సంస్థలో పాతికేళ్లు పనిచేసిన వ్యక్తి బయటకు వచ్చి అడిగిన ప్రశ్న ఇది.
ఒక సంస్థలో పాతికేళ్ల సుదీర్ఘ కాలం పాటు పూర్తిస్థాయి కార్యకర్తగా, ప్రచారక్‌గా సేవ చేసిన వ్యక్తి- ఆ సంస్థ అత్యున్నత నాయకత్వంపైనే దేశంలో బాంబు పేలుళ్ల కుట్రలకు పాల్పడిందంటూ సంచలన ఆరోపణలు చేస్తే, అది కేవలం ఒక వార్త కాదు- ఈ దేశ సామాజిక, రాజకీయ పునాదులను తీవ్రంగా కుదిపేసే భూకంపం.
1990 నుంచి ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్‌లలో క్రియాశీలకంగా వ్యవహరించిన యశ్వంత్ సహదేవ్ షిండే లేవనెత్తిన ప్రశ్నలు ఇవాళ దేశభద్రతకు, ప్రజాస్వామ్య మూలాలకే సవాలుగా మారాయి.
తాజాగా ఆర్ఎస్ఎస్, వీహెచ్‌పీ, బజరంగ్ దళ్లను అధికారికంగా ఉగ్రవాద సంస్థలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖార్గేలకు లేఖలు రాయడం దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది.
షిండే చేసిన ఆరోపణల వెనుక సుదీర్ఘమైన, ప్రమాదకరమైన నేపథ్యం ఉంది. 2006 నాందేడ్ పేలుడు కేసు ఆధారంగా 2022లో ఆయన సమర్పించిన సంచలనాత్మక అఫిడవిట్ ఈ వ్యవస్థల లోపలి చీకటి కోణాలను బయటపెట్టింది.
2003లో పుణే ప్రాంతంలో జరిగిన రహస్య శిక్షణ శిబిరంలో దాదాపు 20 మందితో కలిసి తనకు బాంబుల తయారీలో, ఆధునిక ఆయుధాల వినియోగంలో శిక్షణ ఇచ్చారని ఆయన స్పష్టం చేశారు.
వీహెచ్‌పీ నేత మిలింద్ పరాండే మార్గదర్శకత్వంలోనే ఈ కుట్ర సాగిందని, దేశంలో అలజడులు సృష్టించేందుకు స్వయంగా సంఘ్ పరివార్ నాయకత్వమే ఈ వినాశకర చర్యలకు ప్రణాళికలు రచించిందని షిండే కుండబద్దలు కొట్టారు.
విద్వేష భావజాలం.. గాడ్సే నీడ నుండి ఆధునిక విధ్వంసం దాకా..
యశ్వంత్ షిండే చేసిన ఆరోపణలు ఒక్కసారిగా గాల్లోంచి ఊడిపడలేదు. సంఘ్ పరివార్ దశాబ్దాల హింసాత్మక చరిత్రను, విద్వేష ప్రచారాలను నిశితంగా పరిశీలిస్తే ఇవి ఎంత ప్రమాదకరమైనవో అర్థమవుతుంది.
మహాత్మా గాంధీని దారుణంగా హత్య చేసిన నాథూరామ్ గాడ్సే ఆలోచనా విధానం నుంచి మొదలుకొని, దేశంలో మతపరమైన విభజనలను పెంచి పోషించడంలో ఆర్ఎస్ఎస్ పాత్రపై దశాబ్దాలుగా తీవ్ర ఆందోళనలు ఉన్నాయి.
1948లో గాంధీజీ హత్య తర్వాత నాటి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ ఆర్ఎస్ఎస్పై విధించిన నిషేధం వెనుక ఉన్న కారణాలు, గాడ్సే-హిందుత్వ సంస్థల సంబంధంపై దశాబ్దాలుగా కొనసాగుతున్న చర్చ భారత రాజకీయ చైతన్యంలో చెరిగిపోని నల్లటి మచ్చగా మిగిలిపోయాయి.
1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదు కూల్చివేతకు దారితీసిన తీవ్ర మత ధ్రువీకరణ, ఈ సంస్థాగత సమీకరణపై లిబర్హాన్ కమిషన్ చేసిన నివేదికలు సంఘ్ పరివార్ లోపలి ప్రమాదకర ధోరణులను స్పష్టంగా ఎండగట్టాయి.
ఆ తర్వాత 2002 గుజరాత్ హింస భారతదేశ సామాజిక చరిత్రలో మరో భయంకరమైన అధ్యాయంగా నిలిచింది.
వేలాది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన ఆ రక్తపాతంలో వీహెచ్‌పీ, బజరంగ్దళ్, ఆర్ఎస్ఎస్ స్థానిక కార్యకర్తల పాత్రపై, వారు సాగించిన విద్వేష ప్రచారంపై హ్యూమన్ రైట్స్ వాచ్ వంటి అంతర్జాతీయ సంస్థలు నమోదు చేసిన నివేదికలు దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేశాయి.
మతపరమైన బహిష్కరణలు, ఆయుధాల పంపిణీ, విద్వేష ప్రసంగాల ఆధారంగా జరిగిన ఈ దాడులపై సుప్రీంకోర్టు రికార్డుల్లో సైతం తీవ్రమైన చర్చ జరిగింది.
ఆర్ఎస్ఎస్ తన ప్రచారంలో ఒక నిర్దిష్ట సమాజాన్ని లేదా భావజాలాన్ని శత్రువుగా చిత్రీకరించినప్పుడు, ఆ మాటలు సమాజంలో విద్వేషంగా మారి చివరికి స్వదేశీ రక్తపాతానికి ఏ విధంగా దారితీశాయో ఈ ఘటనలే సజీవ సాక్ష్యాలు.
హింస, విద్వేషం మాటల్లో మొదలై, సమీకరణగా మారి, చివరికి వినాశకర బాంబు పేలుళ్ల రూపాంతరం చెందే ప్రతి మెట్టునూ ప్రజాస్వామ్య వ్యవస్థలు ప్రశ్నించాల్సిందే.
సంఘ్ పరివార్ లేదా దాని అనుబంధ సంస్థల ప్రతి కార్యకర్తను హింసకు బాధ్యుడిగా చేయడం ఎవరి ఉద్దేశం కాదు. కానీ వాటి చరిత్రలో మత విద్వేష రాజకీయాలపై వచ్చిన ఈ తీవ్రమైన ఆరోపణలను, రక్తసిక్తమైన నిజాలను ఆధారాలు లేకుండా చెరిపేయడం అంటే చరిత్రను తిరస్కరించడమే.
ఒకనాడు గాంధీజీ హత్యతో మొదలైన విద్వేష ప్రయాణం, నాందేడ్ పేలుళ్ల దాకా ఎలా రూపాంతరం చెందిందో యశ్వంత్ షిండే ఆరోపణలు ఆ పాత తీవ్రమైన ప్రశ్నలను కొత్త రూపంలో మనందరి ముందుకు మళ్లీ తెచ్చాయి.
బాంబు విస్ఫోటనాల కంటే ప్రమాదకరమైన ఈ విద్వేష భావజాలంపై నిజాన్ని వెలికితీయడం దేశ భవిష్యత్తుకే అత్యంత ఆవశ్యకం.
స్వదేశీ ఉగ్రవాద కుట్రలు.. వెలుగుచూసిన నిజాలు..
చరిత్రలోని ఆ విద్వేష భావజాలమే కాలక్రమేణా రూపాంతరం చెంది మరింత ప్రమాదకరమైన ఆయుధ శిక్షణగా మారిందని షిండే ఆధారాలతో సహా చెప్తున్నారు.
2003–04 కాలంలో మహారాష్ట్రలోని జల్నా, పూర్ణా, పర్భణి వంటి ప్రాంతాల్లో ఉన్న మసీదులను లక్ష్యంగా చేసుకుని జరిగిన పేలుళ్లు స్వదేశీ ఉగ్రవాద కుట్రలో భాగమేనని ఆయన అనేక ఇంటర్వ్యూలలో బయటపెట్టారు.
ఆ పేలుళ్లను ముస్లిం వర్గాలపై నెట్టివేసి, దేశంలో తీవ్రమైన సామాజిక ధ్రువీకరణ సృష్టించడం ద్వారా ఎన్నికల ప్రయోజనాలు పొందడమే ఈ వినాశకర వ్యూహం వెనుక ఉన్న అసలు లక్ష్యమని ఆయన నిలదీశారు.
‘నేను కనుక ఆ బాంబు తయారీ బృందంలో చేరడానికి ఒప్పుకుని ఉంటే, నా నెట్వర్క్ ద్వారా దేశవ్యాప్తంగా వందలాది పేలుళ్లు జరిగి వేలాదిమంది అమాయకుల రక్తంతో ఈ దేశ నేల తడిసిపోయేది’ అని షిండే చెప్పిన మాటలు ప్రతి పౌరుడి గుండెను పిండివేస్తాయి.
తనతో పాటు శిక్షణ పొందిన సహచరులు బాంబు పేలుళ్లలో, రహస్య దాడుల్లో ప్రాణాలు కోల్పోతుంటే, వారి త్యాగాలను సంఘ్ పరివార్ రాజకీయ అధికార ప్రయోజనాల కోసం స్వార్థంతో వాడుకుందో గ్రహించిన క్షణంలో ఆయనలోని మానవత్వం నిద్రలేచింది.
ఆత్మసాక్షిని చంపుకుని ఆ రక్తపాతంలో భాగం కాలేకనే ఆయన తిరుగుబాటు జెండా ఎగురవేశారు.
తన వద్ద ఉన్న సమాచారంతో షిండే ఊరికే కూర్చోలేదు. సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయించి నాందేడ్ కేసులో తనను సాక్షిగా విచారించాలని, నిజాలను వెలికితీయాలని కోరారు.
అలాగే సంఘ్ పరివార్ అగ్రనేతలు మోహన్ భగవత్, ఇంద్రేష్ కుమార్, శ్రీకాంత్ జోషి వంటి ప్రముఖులకు స్వయంగా లేదా మధ్యవర్తుల ద్వారా హెచ్చరికలు పంపి, సంస్థలో జరుగుతున్న ఉగ్ర కుట్రలను ఆపాలని విజ్ఞప్తి చేశారు. అయితే, ఆ నాయకత్వం ఈ కుట్రలను అణచివేయడానికి బదులు, దర్యాప్తు సంస్థల నుంచి రక్షణ పొందుతూ దాన్ని ప్రోత్సహించిందని షిండే చేసిన ఆరోపణలు ఈ వ్యవస్థల నిర్దాక్షిణ్య స్వభావాన్ని ఎండగడుతున్నాయి.
కప్పిపుచ్చిన నిజాలు.. తప్పించుకుంటున్న దర్యాప్తు సంస్థలు..
కానీ, ఈ దశాబ్దాల సుదీర్ఘ పోరాటంలో షిండేకు లభించింది తీవ్ర నిరాశే. ఘటన జరిగిన 16 ఏళ్ల తర్వాత కోర్టుకు వచ్చారనే నెపంతో 2023లో నాందేడ్ కోర్టు, 2025లో బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ ఆయన పిటిషన్‌ను కొట్టివేశాయి.
మరోవైపు, 2025 జనవరిలో నాందేడ్ పేలుడు కేసులోని తొమ్మిది మంది నిందితులను సెషన్స్ కోర్టు ఆధారాల అభావంతో నిర్దోషులుగా విడుదల చేసింది.
దర్యాప్తు సంస్థల జాప్యం, లోపభూయిష్టమైన విచారణల వల్ల వ్యవస్థాగతంగా నిజాలు ఏ విధంగా పాతిపెట్టబడతాయో చెప్పడానికి ఈ పరిణామాలు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.
ఇక్కడ ఉత్పన్నమవుతున్న అత్యంత అసౌకర్యమైన, భయంకరమైన ప్రశ్న ఏమిటంటే—ఒక మాజీ ప్రచారక్ ప్రాణాలకు తెగించి బయటకు వచ్చి దశాబ్దాల సీక్రెట్లను వివరిస్తుంటే, దర్యాప్తు సంస్థలు ఆయనను విచారించకుండా ఎందుకు తప్పించుకుంటున్నాయి?
మాలెగావ్, అజ్మీర్ షరీఫ్, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ వంటి కేసుల్లోనూ ఆరోపణలు రావడం, ఆర్మీ, ఇంటెలిజెన్స్ అధికారుల పేర్లు బయటకు రావడం చూస్తే- దేశంలోని భద్రతా వ్యవస్థలలోకి కూడా ఈ విద్వేష భావజాలం ఎంతలా చొచ్చుకుపోయిందో అర్థమవుతోంది. నిజాలను పరిశీలించకుండా కప్పిపుచ్చడమంటే ప్రజాస్వామ్య పునాదులను స్వయంగా తవ్వుకోవడమే.
ప్రభుత్వ రంగ సంస్థల నిధుల మళ్లింపు వెనుక కోణం..
ఒకవైపు మాజీ ప్రచారక్ యశ్వంత్ షిండే ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతుండగానే, మరోవైపు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, దాని అనుబంధ సంస్థలకు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా భారీగా నిధులు మళ్ళిస్తున్నారనే అంశం కూడా ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ గత పదేళ్ల కాలంలో తన కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుంచి దాదాపు రూ.668 కోట్లకు పైగా సొమ్మును ఆర్ఎస్ఎస్ తో ముడిపడి ఉన్న 20 సంస్థలకు కేటాయించడం వెనుక ఉన్న అసలు కోణంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఓఎన్జీసీ వెచ్చించిన మొత్తం సీఎస్ఆర్ నిధుల్లో ఇది దాదాపు 14.7 శాతానికి సమానం కావడం గమనార్హం. కేవలం ‘సామాజిక సేవా’ ముసుగులో జరుగుతున్న ఈ నిధుల కేటాయింపులు, క్షేత్రస్థాయిలో సంఘ్ పరివార్ రిక్రూట్మెంట్ నెట్వర్క్ విస్తరణకే దోహదపడుతున్నాయన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. షిండే బయటపెట్టిన నెట్వర్క్ స్వభావానికి, ఈ రకమైన ఆర్థిక సహాయానికి మధ్య ఉన్న బలమైన లంకెను ఈ వ్యవహారం స్పష్టంగా ఎత్తిచూపుతోంది.
ఒక విసిల్‌బ్లోయర్ అంతర్మథనం.. జాతికి హెచ్చరిక..
యశ్వంత్ షిండే ప్రయాణం కేవలం ఒక మాజీ కార్యకర్త ఆవేదన మాత్రమే కాదు. అది ఒక వ్యవస్థలో సుదీర్ఘకాలం ఉండి, దాని క్రూరత్వాన్ని కళ్లారా చూసి అగ్నిగుండంలా మారిన ఒక ‘విసిల్‌బ్లోయర్’ అంతర్మథనం.
తన స్వధర్మం పేరిట అమాయకుల ప్రాణాలను బలిపీఠంపై పెట్టే ధోరణి ఎంతమాత్రం హిందూత్వ కాదని, అది పక్కా దేశద్రోహమని ఆయన అంతర్జాతీయ వేదికలపై సైతం గొంతెత్తి చాటారు. నమ్మిన సిద్ధాంతమే తనకు శత్రువుగా మారిన వేళ, సొంత సంస్థ నుంచే ఎదురయ్యే ప్రాణబెదిరింపులను, శత్రుత్వాన్ని తట్టుకుంటూ నిజం వైపు నిలబడడం సాధారణమైన తెగింపు కాదు.
చివరికి యశ్వంత్ షిండే లేవనెత్తిన ఈ తీవ్రమైన ప్రశ్నలు భారతదేశ భావి తరాల భవిష్యత్తుకు సంబంధించినవి.
హింస, విద్వేషం, అధికార పిపాస ప్రాతిపదికగా నిర్మితమయ్యే ఏ భావజాలమైనా చివరికి దేశ సమగ్రతకే ముప్పుగా పరిణమిస్తుందని గాడ్సే ఉదంతం నుంచి నాందేడ్ పేలుళ్ల దాకా చరిత్ర నిరూపిస్తూనే ఉంది.
బాంబు పేలుళ్లలో నలిగిపోయి ప్రాణాలు కోల్పోయిన అమాయక మనుషుల నెత్తుటి చుక్కలు ఇవాళ వ్యవస్థల వైఖరిని ప్రశ్నిస్తున్నాయి.
అందుకే, యశ్వంత్ షిండే కథ చివరికి ఒక వ్యక్తి తిరుగుబాటుగా మాత్రమే మిగిలిపోకూడదు; ఇది భారత ప్రజాస్వామ్య వ్యవస్థలు తమను తాము వేసుకోవాల్సిన ఒక కఠినమైన ఆత్మపరిశీలనాత్మక ప్రశ్నగా మారాలి.
సిద్ధాంతం పేరుతో హింసకు శిక్షణ ఇచ్చారనే ఆరోపణలు వస్తే, ఆ సంస్థ ఎంత శక్తివంతమైనదైనా దర్యాప్తు పారదర్శకంగా జరగాలా వద్దా? మతం పేరుతో విద్వేషం రెచ్చగొట్టారనే ఆధారాలు సేకరిస్తే, రాజకీయ అధికారానికి అతీతంగా చట్టం తన పని తాను చేసుకుపోవాలా వద్దా?
సమాధానం స్పష్టం—చట్టం ముందు ఏ సంస్థా కాదు, ఏ వ్యక్తీ కాదు, ఏ సిద్ధాంతమూ కాదు; నిరపేక్షమైన నిజం మాత్రమే నిలబడాలి.
గాంధీజీ హత్య నుంచి బాబ్రీ విధ్వంసం వరకు, గుజరాత్ అల్లర్ల నుంచి నాందేడ్ విస్ఫోటనం వరకు భారత సమాజం మత హింసకు ఇప్పటికే తీవ్రమైన మూల్యాన్ని చెల్లించింది.
షిండే ఆరోపణల వెనుక ఉన్న నిజాన్ని వెలికితీయకుండా, కేవలం రాజకీయ స్వార్థం కోసం నిజాన్ని పాతిపెడితే- ఆ పేలుడు చప్పుడు క్షణంలో ముగిసిపోయినా, ఆ భావజాల విస్ఫోటనం తరతరాల మనస్సుల్లో కొనసాగుతూ మన ప్రజాస్వామ్యానికే పూడ్చలేని ముప్పుగా మారుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
