సత్యం ఎప్పుడూ కల్పనల కన్నా అద్భుతంగా ఉంటుంది. కొన్ని సత్యాలైతే మరీ ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. కొన్ని సంభ్రమంలో ముంచేస్తాయి.
ఉదాహరణకు గత పన్నెండేళ్ళుగా మన దేశంలో చూస్తున్నాం. ఆరోపణలు, ప్రత్యారోపణలు, విచారణా సంఘాలు, దావాలు, నివేదికలు, దాడులు, సోదాలు, పూట పూటకూ ఎన్నో మలుపులు ఉంటున్నాయి.
వార్తా ఛానళ్లలో ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్న మనకు క్షణక్షణం సంభ్రమాశ్చర్యాలు కలుగుతున్నాయి.
ప్రతిదీ నోరు వెళ్ళబెట్టే విషయమే, మరో గంటకు ఏమౌతుందోనన్న ఉత్కంఠతో, ఆందోళనతో రోజులు గడుపుతున్నాం. ఇదంతా మన దేశ నేతల కరుణా కటాక్షాల వల్లే.
చలనచిత్రాలను తలదన్నే చిత్ర విచిత్రాలు అన్ని మాధ్యమాలలో చూస్తున్నాం. బహుశా ఏ కాల్పనిక నవలలోనూ ఇన్ని అద్భుతాలు జరగవేమో.
గుజరాత్ ఫైల్స్ – వాస్తవ చిత్రణ..
శాంతి, అహింస, పరమత సహనం ప్రబోధించిన జాతిపిత పుట్టిన రాష్ట్రంలో మానవతకే మచ్చగా మిగిలిన అమానవీయ, మతోన్మాద శక్తుల పదఘట్టనల కరాళ నృత్యాన్ని ‘గుజరాత్ ఫైల్స్’ కళ్ళకు కట్టించింది కదా.. ఆ వాస్తవాల్ని వాస్తవాలుగానే బయట పెట్టింది కదా..
ప్రఖ్యాత పత్రికా విలేకరి, తెహల్కా ఉద్యోగి రానా అయ్యూబ్ రాసిన సంచలనాత్మక పుస్తకం ‘గుజరాత్ ఫైల్స్’ కొంత మందయినా చదివి ఉంటారు.
పరిశోధన కోసం ఆమె ‘మైథిలీ త్యాగి’గా పేరు మార్చుకుని, దాదాపు ఎనిమిది, తొమ్మిది నెలల పాటు ఒక భారతీయ-అమెరికన్ చలనచిత్ర నిర్మాతగా రూపాంతరం చెంది, మారువేషంలో రహస్య పరిశోధన చేసి బయట పెట్టిన అనేక వాస్తవాలు రుజువులతో సహా ఆ పుస్తకంలో భద్రపరిచారు.
నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఆయన అక్కడ జరిపించిన ఎన్నో బూటకపు ఎదురుకాల్పుల గురించిన వాస్తవాలు, ప్రభుత్వ దౌర్జన్యానికి అక్కడి రక్షకభట వ్యవస్థ ఎలా భాగస్వామ్యమయిందీ కళ్ళకు కట్టించిందే ఆ పుస్తకం.
చైతన్యవంతమైన జీవితం అని గొప్పలు చెప్పుకున్న గుజరాత్ వెనుక ఉన్న చీకటి నీడల జాడ తెలుసుకోవాలంటే ఈ పుస్తకం తప్పక చదవాలి.
వాస్తవికతలోని ఇంద్రజాలం..
నిజానికి ఆ పుస్తకం చదవాలంటే చాలా ధైర్యం కావాలి. సున్నిత మనస్కులు తట్టుకోగలరో లేదో గాని, అదయితే తప్పక చదవాల్సిన పుస్తకం.
కళ్ళ ముందే హింస జరుగుతూ ఉంటే, వివశులమై, నిస్సహాయంగా, మనసు కుదుట పరుచుకుని, నిస్తేజంగా చూస్తూ కూర్చున్నట్టుగా ఉంటుంది.
నిజంలో, నిజాయితీలో, వాస్తవంలో ఇంత గగుర్పాటు ఉంటుందా? అని అనిపిస్తుంది.
అందుకే చెప్పేది కల్పనలలో కంటే వాస్తవంలోనే ఇంద్రజాలం ఎక్కువ. అందుకే కాబోలు రిచర్డ్ డాకిన్స్ ‘వాస్తవికతలోని ఇంద్రజాలం‘ (ది మ్యాజిక్ ఆఫ్ రియాలిటీ) అనే అంశాన్ని సిద్ధాంతీకరిస్తూ మంచి పుస్తకమే రాశారు.
ఒక దశాబ్ద కాలంగా పాఠకుల అభిరుచి మారిపోయింది. కల్పనా సాహిత్యం, కవిత్వం వెనకబడ్డాయి.
వాస్తవ చిత్రణతో వచ్చే గ్రంథాలు, విజ్ఞానశాస్త్రం, చరిత్ర, ఆత్మకథలు, జీవిత చరిత్రలకు ప్రాముఖ్యం పెరిగింది.
ఒకప్పుడు నేర పరిశోధనాత్మక, ఉత్కంఠభరిత నవలలు, సాంఘిక నవలలు కొనుక్కుని చదువుకునేవారు, లేదా గ్రంథాలయాల నుంచి తెచ్చుకుని చదివేవారు. ఇప్పుడు ఆ అవసరం లేదు.
ఏ వార్తా పత్రిక తిరగేసినా, ఏ టీవీ ముందు కూర్చున్నా, అంతర్జాలంలో ఏ జాలగూడు(వెబ్సైట్) తెరచి చూసినా చాలు.
బోలెడన్ని అద్భుతాలు, ఊహకు అందని ఆశ్చర్యాలు, గుండె వేగాన్ని పెంచే వాస్తవ కథనాలు.
తీరిక చేసుకుని వరుసలో నిలబడి, ప్రవేశపత్రం కొనుక్కుని ఏ చిత్రమందిరంలోనో(సినిమా థియేటర్లోనో) కూర్చోనక్కరలేదు.
అద్భుతాలు చూడాలనుకుని, మనల్ని మనం మానసిక సంసిద్ధతలో ఉంచుకుంటే చాలు, వాస్తవ జగత్తులోనే బోలెడంత మత్తు ఉంది.
ప్రభుత్వ తీరు – పౌరుల దుస్థితి..
ప్రభుత్వమే పనిగట్టుకుని దేశ పౌరుల్ని మతం మత్తులో, ద్వేషం మత్తులో ముంచుతూ ఉంది.
ఇవి కాకుండా మంచి నీరే దుర్లభమై పోతోంది గానీ, మద్యాన్ని ప్రభుత్వం ఏరుల్లా పారిస్తోంది. ఇన్ని ఉన్నాక ఇక కల్పనా సాహిత్యం ఎందుకూ? పైగా గత యుగాల కల్పనా సాహిత్యంలోనే నేటి ప్రభుత్వాలు ప్రజల్ని నానబెడుతున్నాయి.
ప్రజలు నాని నాని, సనాతనానికి విత్తనాలై ఆకలి, ఉపాధి, ప్రగతి లాంటి మాటలు మాట్లాడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.
ప్రభుత్వం నేర్పించిన దేశభక్తి, హిందూ-ముస్లిం వంటి మాటలు అంధ భక్తులు చిలక పలుకుల్లా వల్లిస్తున్నారు.
జై శ్రీరామ్ నినాదంతో అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఎలాంటి దేశం ఎలా అయిపోయిందన్న ఆందోళన అధికారంలో ఉన్నవారికి లేదు.
రోజూ ఆరువందల మంది ఈ దేశ పౌరసత్వాన్ని వదిలేసి విదేశాలలో స్థిరపడుతున్నారన్న బెంగలేదు.
దేశ రాజధానితో సహా దేశంలో పలు ప్రధాన నగరాల్లో స్వచ్ఛమైన గాలి కూడా పీల్చుకోలేనంత దుర్భరంగా ఉంటే ఆ విషయం మీద చట్టసభలో చర్చ జరగదు.
నిరంకుశ భావజాలంతో నవల రాసిన బంకించంద్ర ఛటర్జీ ‘ఆనంద్ మఠ్’ నవలలోని గేయాన్ని తిరగతోడి, అది అత్యంత ఆవశ్యకమైన విషయమైనట్టు చట్టసభలో దాన్ని చర్చిస్తారు.
ప్రజా ధనం ఎలా వృధా చేస్తున్నారోనన్నది మనం ప్రత్యక్ష ప్రసారంలో మన ప్రభుత్వాన్ని చూస్తూ ఉంటే చాలు. చాలా చాలా నేర్చుకోవచ్చు.
శరవేగంగా మన సమాజాన్ని అనాగరిక కాలంలోకి బలవంతంగా తోసేస్తున్న ఈ ప్రభుత్వానికి మనం కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉండాలి.
తప్పిస్తే, విమర్శిస్తే ఇక అంతే సంగతులు. నీకు పౌరసత్వమే లేదంటారు లేదా చెరసాలలోకి నెట్టేస్తారు.
ఆర్థిక నేరాల దర్యాప్తు సంస్థ, కేంద్ర దర్యాప్తు సంస్థ, న్యాయస్థానాలు, పత్రికలు, ప్రసార మాధ్యమాలు అన్నవి ఉండనే ఉన్నాయి.
ఇవేవీ కాకపోతే వారికి మరో ప్రత్యామ్నాయం కూడా ఉంది, మొత్తానికే లేపేస్తారు. ఇవేవీ భరించలేని వాళ్ళు, ‘నీతో పాటే’ అని పాడుకుంటూ వారి ప్రక్షాళన యంత్రంలో దూరితే సరి, అన్నింటికీ అక్కడే ప్రక్షాళనమైపోతాయి.
దోషరహితులుగా గజదొంగల్లోంచి బయట పడొచ్చు. వాస్తవ జగత్తులోనే అనూహ్యమైన, భయానకమైన అద్భుతాలు జరుగుతున్నాయి చూడండని చెపుతున్నది అందుకే.
నెహ్రూ పట్ల ద్వేషమా? భయమా?..
రచయితలు రాసే కల్పనా సాహిత్యం ఎందుకు పనికొస్తుందీ? మీకు మనసనేది గనక ఉంటే, అది మిమ్మల్ని బాధ పెడుతూ గనక ఉంటే ముందు దాన్ని బయటికి లాగి పంపించేయండి.
మీ ఆరోగ్యం పాడై ఏడుస్తుంది. జవహర్లాల్ నెహ్రూ వందేమాతర గీతాన్ని ముక్కలు చేశారు గనకనే భారతదేశం హిందూస్థాన్, పాకిస్థానాలుగా ముక్కలయ్యిందని ఈ దేశ ప్రధాని 2025 డిసెంబరు 8న ప్రజాసభలో ప్రకటించారు.
ఈ నగ్న సత్యాన్ని ఈ దేశ ప్రజలకు ఇంత వరకు తెలియజెప్పిన వారు లేరు కదా? ఈ దేశ ప్రజల మీద గల అవ్యాజమైన ప్రేమతో ప్రధాని చెపితే కదా తెలిసిందీ? కల్పనా సాహిత్యం ఎందుకు పనికొస్తుందండీ? ప్రస్తుత ప్రధాని భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూను ద్వేషిస్తున్నాడని, ఆయన్ని తక్కువగా చేసి మాట్లాడుతున్నాడని సామాన్య జనం అనుకుంటున్నారు. కానీ, విచిత్రమేమంటే మోదీకి నెహ్రూ పేరు తలవనిదే తెల్లవారదు.
మాట మాటకూ నెహ్రూ పేరెత్తుతున్నాడంటే ఏమనుకోవాలీ? ఆయన నెహ్రూను అభిమానిస్తున్నాడనీ అనుకోవాలి. కావాలంటే చూడండి, సింధూరి సైనికచర్యను పురస్కరించుకుని ఉపన్యసించేప్పుడు మోదీ నెహ్రూ పేరు పద్నాలుగు సార్లు జపించారు.
అలాగే రాజ్యాంగం రూపొందించుకుని డెబ్బై ఐదేళ్ళు అయిన సందర్భంలో ఉపన్యసిస్తూ నెహ్రూ పేరు పదిసార్లు స్మరించుకున్నారు. ఇంత కచ్చితంగా ఎలా తెలిసింది అనే అనుమానమే అక్కరలేదు, జాతీయ కాంగ్రెస్ సభ్యులు మోదీ లెక్క ఎంతయిందో లెక్కగట్టి ప్రకటించారు.
ఏ విషయం మీద ఎప్పుడు ఎక్కడ మాట్లాడినా, ప్రదర్శక యంత్రంపై చదివినా పాపం, మోదీ నెహ్రూను తలుచుకోకుండా ఉపన్యసించలేరు. “జిన్హే హం భూల్నా చాహే ఓ అక్సర్ యాద్ ఆతే హై”(ఎవరినైతే మనం మర్చిపోవాలనుకుంటామో వారే తరచుగా గుర్తొస్తుంటారు) అనే హిందీ సినిమా పాట మోదీ మనసులో పాడుకుంటూ ఉంటాడేమో కూడా.
పటేల్ గొప్పదనం పేరుతో నెహ్రూపై బురద చల్లే యత్నం..
జాతీయ స్వయంసేవక సంఘం, భాజపాల ఆలోచనల ప్రకారం తొలిప్రధానిగా ఆ స్థానంలో సర్దార్ పటేల్ రావల్సిందని అంటుంటారు. తమకు అందిన ‘ఓట్ల దొంగ’ బిరుదును నెహ్రూకు బహూకరించి, నెహ్రూ ఓట్ల దొంగతనంతో ప్రధాని అయ్యాడని చెప్పుకుని సంతృప్తి పడతారు.
ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పేరు మార్చి జహంగీర్ జాతీయ విశ్వవిద్యాలయమని కేరింతలు కొడతారు. జవహర్‌కు ముస్లిం వారసత్వాన్ని అంటగట్టామని పండగ చేసుకుంటారు. అది వారికొక తృప్తి.
నెహ్రూ తన నివాస భవనాన్ని దేశానికి అంకితం చేశారు. ఆనంద భవనం తర్వాత కాలంలో జవహర్లాల్ నెహ్రూ వస్తుసంగ్రహాలయం అయ్యింది. నెహ్రూ పేరు వినబడితే ఎలా అని ఇప్పటి మోదీ ప్రభుత్వం దాన్ని ప్రధాన మంత్రుల వస్తుసంగ్రహాలయంగా మార్చింది.
నిజానికి అందులో ఉన్నవన్నీ నెహ్రూ వస్తువులే. ఇతర ప్రధాన మంత్రులవి ఎవరివీ ఏమీ లేవు. విమర్శలు రాకుండా ఉండడానికి కనీసం తొలి ప్రధాన మంత్రి వస్తుసంగ్రహాలయం అని అయినా అనాల్సింది.
అంధభక్తులకు అంత తెలివి ఎక్కడిదీ? వయసులో పెద్దవాడయినా పటేల్ స్వయంగా నెహ్రూకు ఉత్తరం రాశారు.
“ఈ దేశానికి మీరు చేసిన త్యాగాల ముందు మేమంతా చిన్నవాళ్ళం. మీరు ఆదేశిస్తే, దేశాభివృద్ధి కోసం నేను ఏ విభాగంలోనైనా పనిచేయగలను” అని రాశారు.
జాతీయ పుస్తక సంస్థ ప్రచురించిన పుస్తకంలో పటేల్ ఉత్తరాన్ని కావల్సిన వారు చదువుకోవచ్చు. పటేల్ దృష్టిలో నెహ్రూ మహాన్నతుడు. జాతీయ స్వయంసేవక సంఘం, భాజపా వారికి చెప్పుకోవడానికి నాయకుడు ఎవరూలేక, గుజరాత్ వాడయినందుకు పటేల్ గురించి గొప్పగా చెప్పుకుంటారు.
కేంద్ర మంత్రిగా పటేల్ జాతీయ స్వయంసేవక సంఘాన్ని రెండుసార్లు నిషేధించిన విషయం మాత్రం చెప్పుకోరు. పటేల్ విగ్రహం పెట్టుకున్నారేమో గాని, దేశ ప్రజల మనసుల్లోంచి నెహ్రూ స్థానాన్ని తగ్గించలేరు. అది వారి వల్ల కాదు.
విద్యారంగంలో మాయాజాలం..
భక్తులు కష్ట కాలంలో ‘దేవుడా.. దేవుడా..’ అని అంగలారుస్తారు, తమ భయాన్ని పోగొట్టుకుంటారు. మోదీ-షాలు, జాతీయ స్వయంసేవక సంఘం, భాజపాలు ఏ కష్టమొచ్చినా ‘నెహ్రూ.. నెహ్రూ..’ అని అంగలారుస్తున్నారు, భయం పోగొట్టుకుంటున్నారు.
చెప్పేది ఒకటి చేసేది మరొకటి. దేశ పౌరుల్ని సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తడమంటే ఇదే. వాస్తవంలో మనకు కనిపిస్తున్న ఇంద్రజాలం ఇలాంటిదేనన్న మాట.. అన్నింటికన్నా ఈ ప్రభుత్వం చేస్తున్న పెద్ద ఇంద్రజాలం ఏమిటంటే, చదువు పేరుతో పిల్లల్ని పాఠశాలల్లో ఉంచకుండా స్వేచ్ఛగా వీధుల్లో తిరగమని వదిలేశారు.
మహా మహా నాయకుల రాష్ట్రమైన గుజరాత్‌లోనే బడి మానేసిన పిల్లల సంఖ్య గత ఐదేళ్ళలో మూడు వందల డెబ్బై ఒక శాతం పెరిగింది. అంటే వారు రెండున్నర లక్షల మంది! ఇక గత ఐదేళ్ళలో బడి మానేసిన పిల్లల సంఖ్య దేశంలో అరవై ఆరు లక్షల మంది.
ఈ చదువురాని పాలకులు భావి భారత పౌరులను తమంతటి వారిగా చేయాలని ఉబలాట పడుతున్నట్లుగా ఉంది. ఇలాంటి గారడీలు తెలుసుకున్న ఈ దేశ పౌరులకు ఆనంద బాష్పాలు వాటంతట అవే రాలిపోక ఏమవుతాయీ?
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
