పార్లమెంటు డీపీడీపీ చట్టం ద్వారా ఆర్టీఐ చట్టాన్ని సవరించవచ్చా? ఒక చట్టం ద్వారా మరొక చట్టాన్ని సవరించడంపై రాజ్యాంగ నిషేధం లేకపోయినప్పటికీ, ఈ సవరణ సారాంశం మౌలిక హక్కులను కాలరాస్తోందా లేదా అనేది ప్రధాన ప్రశ్న అని తెలియజేస్తోంది.
మామూలు సవరణ కాదిది. మొత్తం ఆర్టీఐని దారుణంగా చంపేస్తుంది. బతికినట్టు కనపడుతూ ఉంటుంది.
ప్రతి సమాచారం ప్రభుత్వం వారిదే అవుతుంది. అందులో ఒక్కమాట అడగడానికి వీల్లేదు. ఒక గ్రామాధికారి వివరాలు కూడా అడగడం చట్టం ప్రకారం నిషేధం.
జిల్లా కలెక్టర్ నిర్ణయాల వివరాలు వారు చెబితే వినాలి. మంత్రి ఏం చెబితే అది కిం అనకుండా ఆర్టీఐ కింద అడగకూడదు.
అది కలెక్టర్ వివరాలు అడగవద్దు. మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా సరే ఆర్టీఐ కింద సమాచారం అడిగితే అది ప్రయివేట్ సమాచారం అంటే ఇక మనకు ఆర్టీఐ ఉందా అనే అన్నట్టా?
డిజిటల్ వ్యక్తిగత డేటా పరిరక్షణ(డీపీడీపీ) చట్టం, 2023లోని సెక్షన్ 44(3) ద్వారా సమాచార హక్కు(ఆర్టీఐ) చట్టం, 2005కు చేసిన సవరణ మన ప్రజాస్వామ్య పునాదులను, పౌరుల “తెలుసుకునే హక్కును” తీవ్ర ముప్పులోకి నెట్టివేసింది.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) హామీ ఇచ్చిన భావప్రకటన, వాక్ స్వాతంత్య్రానికి సమాచార హక్కు అంతర్భాగం.
అయితే, కొత్త డేటా పరిరక్షణ చట్టం పేరుతో ప్రభుత్వం ఆ సమాచార హక్కుకే పాతర వేసే ప్రయత్నం స్పష్టంగా సాగిస్తున్నది.
సుప్రీంకోర్టుకు చేరిన డేటా పరిరక్షణ వివాదం..
ఆగస్టు 7న సుప్రీంకోర్టు ధర్మాసనం(జస్టిస్ జైమల్య బాగ్చి, ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్లతో కూడిన బెంచ్) ఈ పిటిషన్ల తీవ్రతను గుర్తించి, దీనిపై విచారణను ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి (కాన్స్టిట్యూషన్ బెంచ్) బదిలీ చేయడం ప్రజాస్వామ్యవాదులకు, ఆర్టీఐ కార్యకర్తలకు ఒక సానుకూల పరిణామం. ఎందాకా సాగుతుందో చూడాలి.
న్యాయస్థానం ముందున్న మౌలిక రాజ్యాంగ ప్రశ్నలు..
వ్యక్తిగత సమాచారం – మినహాయింపు పరిధి గొడవ గురించి ఈ ప్రశ్న. “వ్యక్తిగత సమాచారం” (పర్సనల్ ఇన్ఫర్మేషన్) అనే పదం రాజ్యాంగబద్ధంగా స్పష్టమైన మినహాయింపును ఇస్తుందా? లేదా అధికారులు తమ ఇష్టారీతిన సమాచారాన్ని నిరాకరించడానికి (ఆర్బిట్రరీ డినైయల్) ఇది మితిమీరిన అధికారాలను ఇస్తోందా?
ఇష్టారీతిన కాదు, పూర్తిగా తమను అడగవద్దు అంటూ ఉంటే మితి మీరిన అనడానికి కాదు. అసలు అడగవద్దు అంటుంది ఈ చట్టం.
ప్రజాప్రయోజనం వర్సెస్ వ్యక్తిగత గోప్యత మధ్య సంఘర్షణ. గోప్యతా హక్కు (ప్రైవసీ) ప్రజాప్రయోజనాన్ని పూర్తిగా అణచివేయగలదా? లేక దామాషా సూత్రం (ప్రొపోర్షనాలిటీ టెస్ట్) ఆధారంగా రెండింటి మధ్య సమతుల్యత పాటించాలా?
ఒక చట్టం ద్వారా మరో చట్టం ప్రాణాన్ని తీసేస్తున్నారు. బతకలేని చట్టంగా మిగిలిస్తారు. ‘ప్రజాప్రయోజన రక్షణ’ తొలగింపు చట్టబద్ధత న్యాయమా? ఆర్టీఐలోని పాత సెక్షన్ 8(1)(జె)లో ఉన్న “ప్రజాప్రయోజన మినహాయింపు”(పబ్లిక్ ఇంట్రెస్ట్ ఓవర్రైడ్)ను సెక్షన్ 44(3) ద్వారా తొలగించడం రాజ్యాంగబద్ధంగా చెల్లుతుందా?
ప్రతి రాష్ట్రంలో ఒక ఆర్టీఐ చట్టం ఉండేది. అందువల్ల రకరకాల తేడాలతో ఆర్టీఐ చట్టాలు తయారు చేస్తూ ఉంటే, చాలా ఇబ్బందులు వస్తాయి.
కనుక రాజ్యాంగం ప్రాథమిక హక్కు ద్వారా చాలా గొప్ప సంస్కరణ వంటి గొప్ప సమాచార, పాత్రికేయ హక్కును కూడా పటిష్టం చేయగలిగిన ఒక చట్టాన్ని దేశవ్యాప్తంగా సమానమైన చట్టం కావాలని కేంద్రం, పార్లమెంట్ నిర్ణయించింది. ఇదొక చారిత్రిక ఘట్టం.
అందులో భాగమైన పరిశోధనాత్మక పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిద్దామా? డీపీడీపీ రాజ్యాంగ చట్రం ఆర్టికల్ 19(1)(ఎ)ను, ముఖ్యంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంను రక్షించగలుగుతుందా?
సంస్థాగత స్వయంప్రతిపత్తి (డేటా ప్రొటెక్షన్ బోర్డ్) సమస్య. కార్యనిర్వాహక వర్గానికి (ఎగ్జిక్యూటివ్) లభించిన అపరిమిత అధికారాలు డేటా ప్రొటెక్షన్ బోర్డు నియామకాలు ఆర్టికల్ 14, 19, 21 లతో పాటు శక్తుల అధికారాల విభజన రాజ్యాంగ సిద్ధాంతాన్ని, ఫెడరల్ విధానాన్ని (సెపరేషన్ ఆఫ్ పవర్స్) ఉల్లంఘిస్తున్నాయా? పిటిషినర్ అడిగినట్టే కోట్లాది మంది ఇదే అడుగుతున్నారు.
పౌరుల తెలుసుకునే హక్కుకు భంగం: కీలక పిటిషన్లు..
ఈ అంశంపై దాఖలైన మూడు ప్రధాన రిట్ పిటిషన్ల (డబ్ల్యూపీ(సీ) నంబర్లు 177/2026, 211/2026, 212/2026)ను సుప్రీంకోర్టు ప్రస్తుతం పరిశీలిస్తోంది:
వెంకటేష్ నాయక్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూపీ(సీ) నంబర్ 177/2026): పౌరుల తెలుసుకునే హక్కును సెక్షన్ 44(3) నిరంకుశంగా అడ్డుకుంటోందని ఆర్టీఐ కార్యకర్త వెంకటేష్ నాయక్ దాఖలు చేశారు.
ది రిపోర్టర్స్ కలెక్టివ్ ట్రస్ట్, అలాగే మరొకరు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూపీ(సీ) నంబర్ 211/2026): పాత్రికేయులు, పరిశోధకులు, విజిల్బ్లోయర్ల సమాచార సేకరణను డీపీడీపీ చట్టం అడ్డుకుంటోందని నితిన్ సేథీ నేతృత్వంలోని రిపోర్టర్స్ కలెక్టివ్ సవాలు చేసింది.
నేషనల్ క్యాంపెయిన్ ఫర్ పీపుల్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ (ఎన్సీపీఆర్ఐ) వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూపీ(సీ) నంబర్ 212/2026): సమాచార వ్యవస్థను నిర్వీర్యం చేయడంపై దాఖలైన పిటిషన్.
(పాత్రికేయురాలు గీతా శేషు, ఎస్ఎఫ్ఎల్సీ దాఖలు చేసిన పిటిషన్లు కూడా ప్రభుత్వం వద్ద ఉండే డేటా, వ్యక్తిగత డేటా మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాయి).
సెక్షన్ 44(3) తో పొంచి ఉన్న తీవ్ర ప్రమాదాలు..
ఆర్టీఐ చట్టం, 2005లోని అసలు సెక్షన్ 8(1)(జె) నిబంధన ప్రకారం: ఒక వ్యక్తిగత సమాచారం ప్రజా కార్యకలాపాలతో సంబంధం లేకపోయినా, లేదా దానివల్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగే అవకాశం ఉన్నా అధికారులకు మినహాయింపు ఉండేది.
అయితే, అంతకంటే పెద్ద ప్రజాప్రయోజనం (లార్జర్ పబ్లిక్ ఇంట్రెస్ట్) ఉంది అని అధికారి భావిస్తే ఆ సమాచారాన్ని తప్పక వెల్లడించాల్సిందే. అంతేకాకుండా, “పార్లమెంటుకు లేదా శాసనసభకు నిరాకరించలేని ఏ సమాచారాన్ని కూడా ఏ పౌరుడికీ నిరాకరించకూడదు” అనే సదాశయ సూత్రం ఇందులో ఉండేది.
డీపీడీపీ చట్టం సెక్షన్ 44(3) తెచ్చిన మార్పు..
ఈ సుదీర్ఘమైన, సమతుల్య నిబంధన స్థానంలో “వ్యక్తిగత సమాచారానికి సంబంధించిన సమాచారం” అనే ఒకే ఒక్క పొడి మాటతో పాత నిబంధనను మార్చివేసింది.
దీనివల్ల ‘ప్రజాప్రయోజన రక్షణ'(పబ్లిక్ ఇంట్రెస్ట్ ఓవర్రైడ్) ‘శాసనసభ సమానత్వ నిబంధన’ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి.
నిఘా రాజ్యంగా మార్చే కుట్ర..
డీపీడీపీ సెక్షన్ 44(3) (ఆర్టీఐ సెక్షన్ 8(1)(జె) సవరణ) ద్వారా వ్యక్తిగత సమాచారం పేరుతో అధికారుల అవినీతి, ఆస్తులు, నిధుల దుర్వినియోగాన్ని దాచేసే వీలు కల్పించారు.
ఆర్టికల్ 19(1)(ఎ) (వాక్ స్వాతంత్య్రం), ఆర్టికల్ 14 (సమానత్వం)కు ఇది పెద్ద దెబ్బ.
కాని పుట్టస్వామి తీర్పు ప్రకారం ‘గోప్యతా హక్కు’ (రైట్ టు ప్రైవసీ) ప్రాథమిక హక్కు; దాని పరిరక్షణకే ఈ సవరణ అని స్పష్టంగా తెలుస్తోంది.
ప్రజాప్రయోజనం వర్సెస్ వ్యక్తిగత గోప్యత సమతుల్యత (ప్రొపోర్షనాలిటీ టెస్ట్) అనే అంశంపైన సుప్రీంకోర్టు చర్చించవలసి ఉంటుంది.
డీపీడీపీ సెక్షన్ 17(1)(సీ), 17(2)ను వాడుకుంటూ ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 (జీవించే హక్కు, స్వేచ్ఛ) భంగం చేస్తూ, ప్రభుత్వ సంస్థలకు డేటా ప్రాసెసింగ్ నుండి విస్తృత మినహాయింపులు ఇవ్వడం వల్ల ఇది ‘నిఘా రాజ్యాన్ని’ (సర్వైలెన్స్ స్టేట్) ప్రోత్సహిస్తుందని తేలిపోతుంది.
జాతీయ భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ నేరాల నిరోధానికి ప్రభుత్వ అధికారాలు అత్యవసరం అనే సాకుతో ఎక్కువ అధికారాలను కైవసం చేస్తున్నారు.
సుప్రీంకోర్టు రీజనబుల్ రెస్ట్రిక్షన్ (సమంజసమైన పరిమితులు) దామాషా పరీక్షను పరీక్షించాలి.
డీపీడీపీ సెక్షన్ 36, రూల్ 23(2) కింద ఆర్టికల్ 19(1)(ఎ), ఆర్టికల్ 14 భంగపరిచే పని ఇది. ఆ విధంగా ప్రభుత్వం సమాచారాన్ని పొందేందుకు అపరిమిత అధికారాలు ఉంటాయి, కానీ డేటా యజమానికి తెలియకుండా రహస్యంగా ఉంచవచ్చు అని ప్రభుత్వం వివరిస్తున్నది.
స్పష్టంగా కనిపించేదేమంటే ఏక పక్షంగా పరిపాలిస్తారు. అంటే మేనిఫెస్ట్ ఆర్బిట్రారినెస్ – ప్రత్యక్ష నిరంకుశత్వ పరీక్ష అని అర్థమైతే బాగుంటుందని సుప్రీంకోర్టును ఆశిస్తున్నారు.
డీపీడీపీ సెక్షన్ 18, రూల్స్ 17(1), (2) కింద ఆర్టికల్ 14, 21 (సెపరేషన్ ఆఫ్ పవర్స్) అనే ఫెడరల్ సూత్రానికి, పాలన సంస్థ, న్యాయ పాలిక సంస్థ వారి అధికారాల విభజనలో ఆరోగ్యకరమైన పరిపాలనకు తీవ్రమైన విఘాతం తగులుతుంది. కాని ప్రభుత్వం చాలా తేలికగా రొటీన్ రెగ్యులేటరీ బాడీ మాత్రమే కాబట్టి కార్యనిర్వాహక నియామకాలు సమంజసమే అని వాదిస్తున్నది.
న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీస్తాయని ఆందోళన, ఆ విషయాన్ని సుప్రీంకోర్టు పరిశీలిస్తుంది.
పరిశోధనాత్మక పత్రికా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడి..
పిటిషనర్ల తరఫు సీనియర్ అడ్వకేట్లు కోర్టులో వాదిస్తూ, డీపీడీపీ చట్టం పాత్రికేయులకు ఎలాంటి ప్రత్యేక మినహాయింపులను (జర్నలిస్టిక్ ఎక్సెంప్షన్) ఇవ్వలేదని ఎత్తిచూపారు.
ఒక విలేకరి ఒక కుంభకోణాన్ని బయటపెట్టాలంటే, సంబంధిత వ్యక్తి (డేటా ప్రిన్సిపల్) అనుమతి పొందాల్సి వస్తుంది.
ఆ వ్యక్తి తన డేటాను చెరిపివేయాలని(రైట్ టు ఇరేజర్) కోరితే జర్నలిస్ట్ ఏ నివేదికనూ ప్రచురించలేడు.
ఫలితంగా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, బడా కాంట్రాక్టర్ల అవినీతిని వెలికితీసే “పరిశోధనాత్మక పత్రికా స్వేచ్ఛ” మూగబోతుంది.
న్యాయమూర్తి జస్టిస్ జైమల్య బాగ్చి వ్యాఖ్య కీలకమైనది: “పూర్వపు ఆర్టీఐ చట్టం షరతులతో కూడిన సమాచార ప్రాప్యతను ఇచ్చింది. కానీ డీపీడీపీ చట్టం ఒకేసారి ‘ఎన్ బ్లాక్ ఎంబార్గో’ (పూర్తి నిషేధం) విధిస్తోంది. ఈ కొత్త చట్టం పాత చట్టాన్ని రద్దు చేసేలా పనిచేస్తుందా లేదా అనేది అత్యంత జాగ్రత్తగా పరిశీలించాలి. ఆర్టీఐ విస్తృత పరిధి కలిగినది.”
సుప్రీంకోర్టు ముంగిట రాజ్యాంగబద్ధమైన పరిష్కారాలు..
ప్రజాస్వామ్య వ్యవస్థలో సమాచార హక్కు (ఆర్టీఐ), వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ) రెండూ రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులే. ఒకదానికోసం మరొకదాన్ని పూర్తిగా బలి ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం.
కోర్టు స్వీకరించాల్సిన ఆదర్శవంతమైన సూత్రం..
నిజమైన వ్యక్తిగత సమాచారం: పౌరుల వ్యక్తిగత జీవితానికి భంగం కలిగించని వివరాలకు కచ్చితమైన రక్షణ ఉండాలి.
ప్రజాధికారం, ప్రజాధనం, బాధ్యత: ప్రభుత్వ ఆస్తులు, నిర్ణయాలు, ప్రజాధనం ఖర్చు, అధికారుల నియామకాలు, అవినీతి ఆరోపణలకు సంబంధించిన ప్రతి సమాచారం పౌరుల నిరంతర పరిశీలనకు అందుబాటులో ఉండాలి.
స్వతంత్ర ప్రజాప్రయోజన పరీక్ష(ఇండిపెండెంట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ టెస్ట్): రెండూ ఒకదానికొకటి తాకినప్పుడు, ఒక స్వతంత్ర సంస్థ లేదా అధికారి “ప్రజాప్రయోజనం” ప్రాతిపదికన నిర్ణయం తీసుకునే సమతుల్య విధానం (ప్రొపోర్షనాలిటీ బ్యాలెన్సింగ్ టెస్ట్) పునరుద్ధరించబడాలి.
రాజ్యాంగ ధర్మాసనం తీర్పు భారత ప్రజాస్వామ్యంలో పారదర్శకత నిలుస్తుందా లేదా గోప్యత ముసుగులో నిరంకుశత్వం రాజ్యమేలుతుందా అనే కీలకమైన ప్రశ్నలను సుప్రీంకోర్టు నిర్ణయించవలసి ఉంటుంది.
దేశానికి మన రాజ్యాంగానికి అనుకూలంగా న్యాయమూర్తులు నిర్ణయించాలని ఆశిస్తున్నారు. పాలకుల తీవ్రమైన అధికారాలను చలాయించకుండా నియంత్రించడం చాలా అవసరం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
