రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని తిరిగి వచ్చాను. ఈ రెండు రోజుల్లో దేశ రాజధానిలో నేను గమనించిన కొన్ని విషయాలు, పరిణామాలు, వాటి రాజకీయ పూర్వాపరాల గురించి మీతో పంచుకుంటాను.
ఢిల్లీలో దిగగానే ముందస్తుగా నిర్ణయించుకున్న అపాయింట్మెంట్ ప్రకారం సుప్రీంకోర్టుకు వెళ్లాను. అంతకు ముందు రోజే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. ఫలితాలు విడుదలయ్యాయి.
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి మద్దతుతో రంగంలోకి దిగిన సీనియర్ అడ్వకేట్ గౌరవ్ భాటియా హోరాహోరీగా జరిగిన బార్ అసోసియేషన్ ఎన్నికలలో ఓడిపోయారు. సీనియర్ అడ్వకేట్ ప్రదీప్ రాయ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో అధికార ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు అనుబంధంగా ఉన్న న్యాయవాదులందరూ ఏకమై గౌరవ్ భాటియాను గెలిపించేందుకు శతవిధాలా ప్రయత్నం చేశారు.
చివరకు కేంద్ర న్యాయశాఖకు సంబంధించిన ప్రతినిధులు కూడా ఎన్నికల సందర్భంగా జరిగిన ఒక జనరల్ బాడీ సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం నుండి భారీ స్థాయిలో సహాయ సహకారాలు చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న ప్రతినిధిని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌కు ఎంపిక చేసుకోవడంలో విఫలం కావడం పట్ల ఆవేదన వ్యక్తం చేసినట్లు పలువురు అడ్వకేట్స్ ఆన్ రికార్డు వెల్లడించారు.
అయితే తొలిసారి కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ప్రత్యక్షంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికల్లో జోక్యం చేసుకోవడంపై న్యాయవాదులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఎన్నికల్లో గెలుపొందిన ప్రదీప్ రాయ్‌కు 822 ఓట్లు రాగా పాలక బీజేపీ బలపరిచిన గౌరవ్ భాటియా 370 ఓట్లతో నాలుగో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.
సుమారు 10 వేల మందికి పైగా సభ్యులు ఉన్న సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్‌లో రోజువారీ ప్రాక్టీసులో ఉండేవాళ్లు సుమారు మూడున్నర వేలమంది ఉంటారని అంచనా.
ప్రస్తుతం ఉన్న కార్యవర్గంపై అవినీతి ఆరోపణలతో పాటు ప్రతి న్యాయవాదికీ కీలకమైన కేసుల లిస్టింగ్ ప్రక్రియలో సంస్కరణలు, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్ చేయదల్చుకునే జూనియర్ న్యాయవాదులకు ప్రోత్సాహకాలు వంటి ఎన్ని హామీలతో భారీ ఎన్నికల ప్రణాళిక ప్రకటించినా భాటియా నాలుగో స్థానానికి పరిమితం కావాల్సి రావడం గత కొంతకాలంగా తగ్గుతున్న పాలక పార్టీ పలుకుబడికి నిదర్శనం అన్న అభిప్రాయం సుప్రీంకోర్టు న్యాయవాదుల్లో వ్యక్తమవుతోంది.
ఢిల్లీలో రాజకీయ గాలులు ఎటువైపు వీస్తాయో తెలుసుకోవడానికి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు, ఢిల్లీ విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘం ఎన్నికలు ఒక ప్రమాణంగా ఉండేవి.
ఇప్పటికీ అవే ప్రమాణాలుగా కొనసాగుతూ ఉంటే గత దశాబ్దానికి పైగా దేశ రాజకీయాలలో హవా చూపించిన బీజేపీ పరివారం మితవాద రాజకీయాల మత్తు నుండి ప్రజలు క్రమంగా బయటపడుతున్నారని చెప్పడానికి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ఎన్నికలు ఒక నిదర్శనం.
సొంత గొంతుకలు వినిపిస్తున్న యువతరం..
తర్వాత ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరిగిన పిచ్చాపాటి చర్చల్లో ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో దీర్ఘకాలం పని చేసిన ఒక సీనియర్ విలేకరిని కలిశారు.
ఈ నెలరోజుల కాలంలో ఆయనకు ఎదురైన రెండు అనుభవాల గురించి పంచుకున్నారు.
అందులో మొదటిది జంతర్ మంతర్ నిరసనల్లో పాల్గొనడానికి వెళ్తున్న విద్యార్థులున్న కుటుంబంలో జరిగిన సంభాషణ. ఆ పిల్లలు అన్నాచెల్లెళ్లు. వాళ్ల తాత భారత రెవెన్యూ సర్వీస్ కేడర్‌కు చెందిన ఉద్యోగి. భారత ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌గా కూడా పని చేసి పదవీ విరమణ చేశారు. ఇప్పుడున్న మోదీ భక్తులకు ఏ మాత్రం తీసిపోని మోదీ అభిమాని.
ఆయన కొడుకు, పిల్లల తండ్రి కూడా ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పని చేస్తున్నారు. వాళ్ల అమ్మ ఢిల్లీలో ఒక కళాశాల ప్రిన్సిపల్. ఆ పిల్లల్లో అబ్బాయి ఈ మధ్యనే ఒక ప్రైవేటు కంపెనీలో చేరాడు. అమ్మాయి డిగ్రీ చివరి సంవత్సరం చదువుతోంది.
ఇద్దరూ రోజూ లేవగానే బ్యాగులు భుజాన తగిలించుకుని జంతర్ మంతర్ వెళ్తున్నారు. అలాగే ఒకరోజు తయారైతే మాజీ ఇన్కమ్ టాక్స్ కమిషనర్ అయిన తాత ఎక్కడికెళ్తున్నారని అడిగాడట. పిల్లలు జంతర్ మంతర్‌కు వెళ్తున్నామని సమాధానం ఇచ్చారు.
“దేశద్రోహులతో మీకేం పని” అని తాత ఆగ్రహం. “మోదీ దేశభక్తుడు అని నువ్వు సర్టిఫికెట్ ఇస్తావా” అని మనవడి ఆవేశం. పరిస్థితి విషమిస్తోందని గ్రహించిన నానమ్మ “ఆయనేమన్నాడు అంతలా ఉడికిపోతున్నావ్” అని మనవడిని నిలదీసింది.
వెంటనే చెల్లెలు జోక్యం చేసుకుని “నువ్వు నోరు మూయమ్మ” అంటూ అన్న చేయి పట్టుకుని లాక్కెళ్లిపోయింది. తాతా మనవళ్ల సంభాషణ మౌనంగా వింటూ కూర్చున్నాడు తండ్రి.
ఇది ఆ సీనియర్ జర్నలిస్టు సమక్షంలో జరిగిన ఘటన. ఢిల్లీలో విద్యార్థులకు మోదీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఉన్న అభిప్రాయం తెలియజేసే ఒక సందర్భంగా ఈ తాతా మనవళ్ల సంభాషణను చూడొచ్చు.
యువతరం పల్స్ పట్టుకోవడానికి బీజేపీ ఆరాటం..
అదే సీనియర్ విలేకరితో ప్రైవేటు సంభాషణలో ఒక కేంద్ర మంత్రి “జంతర్ మంతర్‌లో అంత మంది ఒకేసారి ఎలా పోగయ్యారు, జర్నలిస్టు కమ్యూనిటీ ఏమనుకుంటోంది” అని అడిగారు.
యువతను చేరుకోవడానికి ఉన్న మార్గాల గురించి సలహాలు సూచనలు కూడా అడిగారు. అదేరోజు కేంద్ర క్యాబినెట్ సమావేశంలో మంత్రులు అందరూ మే 1 నుంచి జులై వరకు సోషల్ మీడియాలో ఏయే స్థాయిల్లో క్రియాశీలకంగా ఉన్నారో పరిశీలించి మార్కులు వేసినట్టు వార్త వచ్చింది.
అంతేకాకుండా బీజేపీ అధినేతలు, కేంద్ర మంత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క యూనివర్సిటీకి వెళ్లి విద్యార్థులతో చర్చించాలని కూడా నిర్ణయం జరిగింది.
రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంరక్షణలో బార్ కౌన్సిల్ భవనం..
హైదరాబాద్ నల్సార్ విద్యార్థుల విషయంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మన్నన్ మిశ్రా చేసిన వ్యాఖ్యలు, రాసిన లేఖలు, వాటి చుట్టూ ఉన్న వివాదం తెలిసిందే.
చివరకు బెంగళూరు, ముంబై విద్యార్థులు కూడా భారత ప్రధాన న్యాయమూర్తిని తమ క్యాంపస్‌లలో జరిగే కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా ఆహ్వానించడంపై పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.
ఈ నేపథ్యంలో రౌస్ ఎవెన్యూ, ఐటీఓ ప్రాంతంలో ఉన్న బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కార్యాలయం ముందు విద్యార్థులు నిరసనకు వస్తారేమోనన్న సందేహంతో ఆ భవనం చుట్టూ భారీ ఎత్తున రాపిడ్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు.
ఎప్పుడు ఎక్కడ విద్యార్థులు ఫ్లాష్ మాబ్ లాగా అకస్మాత్తుగా పోగవుతారేమో అన్న ఆందోళన ప్రభుత్వానికి ఉన్నట్లుగా ఈ పరిణామం స్పష్టం చేస్తుంది.
బార్ కౌన్సిల్ అధ్యక్షుడు వ్యవహార శైలిపై దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన బాంబే బార్ అసోసియేషన్ కూడా యువ న్యాయవాదులతో గొంతు కలిపి మన్నన్ మిశ్రా బీసీఐ అధ్యక్షుడుగా రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
మోదీ చాలీసా – పూజలు..
ఈ రెండు రోజుల పర్యటనలో గమనించిన చివరి అంశం మోదీ చాలీసా భజనలు. పార్లమెంటు సమీపంలోని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా భవనంలో శ్రీరాముడి వేషధారణతో ఉన్న మోదీ నిలువెత్తు కటౌట్ పెట్టి “జై జై మోదీ” అంటూ హనుమాన్ చాలీసా తరహాలో మోదీ చాలీసాతో భజనలు చేశారు.
ఈ వీడియో పెద్ద ఎత్తున వైరల్ కావడంతో ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమంతో తమకు ఏమి సంబంధం లేదని వివరణ ఇచ్చింది.
సాధారణంగా సమావేశాలకు ప్రెస్ కాన్ఫరెన్స్‌లకు అద్దెకు ఇచ్చినట్లే ఒక సంస్థకు ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా మొదటి అంతస్తులోని సమావేశ మందిరాన్ని అద్దెకిచ్చామని, తరువాత ఈ విషయాలు సోషల్ మీడియా ద్వారా తమ దృష్టికి రావడంతో తక్షణమే జోక్యం చేసుకొని కార్యక్రమాన్ని నిలిపివేశామని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన బీహార్ రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ వెల్ఫేర్ బోర్డ్ ఉపాధ్యక్షులు రాజన్ సింగ్ త్వరలో తాము బీహార్‌లో మోదీకి గుడి కట్టనున్నామని ప్రకటించారు.
ఐదు ఎకరాల విస్తీర్ణంలో 100 కోట్లకు పైగా ఖర్చుపెట్టి మోదీ గుడి నిర్మించనున్నట్లు రాజన్ సింగ్ తెలిపారు.
మోదీని భగవంతుని చేయడంపై వస్తున్న విమర్శలకు స్పందిస్తూ రాజన్ సింగ్ దేశంలో మొట్టమొదటిసారి ట్రాన్స్జెండర్లకు మోదీ ప్రభుత్వంలోనే గుర్తింపు, హక్కులు వచ్చాయని అందువల్ల ఆయనను తాము దేవుడుగానే చూస్తామని రాజన్ సింగ్ అన్నారు.
ఈ నాలుగు పరిణామాలు గమనిస్తే బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత సార్వత్రిక వ్యతిరేకతగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు.
అయితే ఈ సార్వత్రిక వ్యతిరేకతను అడ్డుకుని కావల్సినన్ని చీలికలు తెచ్చి తన పబ్బం గడుపుకోగల సామర్థ్యం కూడా బీజేపీ పరివారానికి తక్కువేమీ లేదు. ఆ వాస్తవాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్న ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ వ్యాఖ్యలు కూడా గమనించదగినవి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
