ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగంలో భారతదేశం జాతీయవాద, తయారీ ఆధారిత, స్వయంసమృద్ధి గల ఆర్థిక వ్యవస్థను నిర్మిస్తుందని చెప్పారు. కానీ దాని వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరుతుందో ఆయన చెప్పలేదు.
ఆగస్టు 15న భారత ప్రధాని ఎర్రకోట నుంచి మాట్లాడుతూ, ప్రపంచం ప్రపంచీకరణను విడిచిపెడుతోందని అన్నారు. ప్రపంచీకరణతో గాఢమైన అనుబంధం కలిగిన ఒక దేశ ప్రధాని నుంచి ఇలాంటి ప్రకటన రావడం వెనుక అర్థం ఏమిటి?
డంకెల్ ప్రతిపాదనలు మొదటిసారిగా చర్చల్లోకి వచ్చినప్పుడు నేను విశ్వవిద్యాలయ విద్యార్థిని. మేము ఆ ప్రతిపాదనల ప్రతులను పట్టుకుని, అవి భారత్ సహా అభివృద్ధి చెందుతున్న(గ్లోబల్ సౌత్) దేశాల స్వయంసమృద్ధిని ఎలా దెబ్బతీస్తాయో వాదించే వాళ్లం.
1994లో ప్రపంచ దేశాలు ఉరుగ్వే రౌండ్ తుది పాఠంగా డంకెల్ డ్రాఫ్ట్‌పై సంతకం చేసి, ప్రపంచ వాణిజ్య సంస్థ ఆవిర్భవించినప్పుడు, మన క్యాంపస్‌లతో సహా నవ-ఉన్నత వర్గాలు రాబోయే ఈ మార్పును స్వాగతించడం మేము చూశాం.
మార్కెట్ వ్యవస్థల ఆధిపత్యం..
పైకి వాణిజ్య వివాదాల సాంకేతిక పరిష్కారం కోసం ఉద్దేశించినట్లు కనిపించినప్పటికీ, వాస్తవానికి ఇది ఒక పెద్ద ప్రశ్నకు సంబంధించిన రాజకీయ పరిష్కారం. ఇది ఒకే ప్రపంచ మార్కెట్ పైన నిలిచే ఒక సంస్థాగత నిర్మాణాన్ని అమలు చేయడానికి వచ్చింది.
సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం కావడాన్ని అప్పుడే చూసిన మూలధనం, ఇప్పుడు అన్ని నిబంధనలను స్వయంగా రూపొందిస్తోంది.
సోషలిస్టు కూటమి పతనం ఈ రూపుదిద్దుకుంటున్న పరివర్తనకు కొత్త ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. రాజకీయ ఆర్థిక వ్యవస్థను బోధించిన విశ్వవిద్యాలయ విభాగాలు ‘సంస్కరణలను’ బోధించడం ప్రారంభించాయి. అభివృద్ధి ప్రణాళిక స్థానంలో నిర్మాణ సర్దుబాటు వచ్చింది.
రాజ్య పాత్ర బాధ్యత నుంచి కేవలం సదుపాయాల నిర్వాహకుడిగా కుదించబడింది. వీటన్నింటి వెనుక పెట్టుబడి సరళీకరణ ఉంది.
20వ శతాబ్దంలో పెట్టుబడికి ప్రత్యామ్నాయాలను నిర్మించిన వ్యవస్థను చివరికి స్థిరీకరిస్తుందనే ఆశతో, జాతీయ నియంత్రణల నుంచి దానిని స్వేచ్ఛగా వదిలివేశారు.
పెట్టుబడిదారీ విధాన వైఫల్యం..
మూడు దశాబ్దాల తరువాత, ఈ నవ-ఉదారవాద మార్పు ఒక డెడ్ ఎండ్‌కు చేరుకుంది. ఎందుకంటే ఇది పెట్టుబడిదారీ విధానం అంటే ఏమిటో తప్పుగా అవగాహన చేసుకోవడంపై ఆధారపడి ఉంది.
పెట్టుబడిదారీ విధానం బాహ్య విపత్తుల వల్ల కూలిపోతుందని మార్క్స్ ఎప్పుడూ చెప్పలేదు. ఈ వ్యవస్థ అంతర్గతంగా ఎక్కువగా పెట్టుబడి కేంద్రీకరణ, లాభాల రేటు తగ్గడం, అదనపు ఆదాయాన్ని వినియోగించుకోవడానికి కొత్త సరిహద్దులను వెతకాలనే ఒత్తిడి వంటి తన సొంత యంత్రాంగాల ద్వారా సంక్షోభాలను ఉత్పత్తి చేస్తుందని మార్క్స్ నిర్వచించారు. కానీ అది దాని విస్తరణకు కూడా దారితీస్తుంది.
నవ-ఉదారవాద ప్రపంచీకరణ ఈ ధోరణిని ప్రపంచీకరించింది. ఇది 2008 ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. ఈ వ్యవస్థ తర్కం ప్రపంచ స్థాయిలో ఎలా పనిచేస్తుందో ఇది ప్రతిబింబించింది.
రుణ సంక్షోభాలు, ఆస్తుల బుడగలు, రికార్డు స్థాయి కార్పొరేట్ లాభాల మధ్య వేతన స్థబ్దత వంటివన్నీ 2008 తర్వాత రికవరీ కంటే కూడా వరుస భూకంపాల తదనంతర ప్రకంపనలు గానే ఉన్నాయి. 2008 నుంచి, నగరాలు ఈ సంచయన, అనిశ్చిత ప్రక్రియకు కేంద్రాలుగా కొనసాగుతున్నాయి.
విఫలమైన విధానాలను అంగీకరిస్తున్న ప్రపంచం..
ప్రస్తుత తరుణంలో విశేషమేమిటంటే, మూలధనానికి చెందిన సొంత రాజకీయ ప్రతినిధులు కూడా సిద్ధాంతపరంగా కాకపోయినా ఆచరణలో దీనిని అంగీకరిస్తున్నారు.
సుంకాలు, రీ-షోరింగ్ వైపు అమెరికా మళ్లీ మొగ్గు చూపడం పెట్టుబడిదారీ విధానాన్ని తిరస్కరించడం కాదు. దాని నవ-ఉదారవాద, తీవ్ర-ప్రపంచీకరణ రూపం విఫలమైందని అంగీకరించడమే.
ఈ నేపథ్యంలోనే, భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజుల నుంచి భారత ప్రధాని దేశ ప్రజలతో మాట్లాడుతూ, ప్రపంచీకరణ చుట్టూ జరుగుతున్న అంతర్జాతీయ చర్చలు ప్రభావవంతంగా మూగబోయాయని, దాని పాత మద్దతుదారుల మాటలు ఇక వినిపించడం లేదని, ప్రతి దేశం తన స్వంత ప్రయోజనాలను కాపాడుకోవడం వైపు మళ్లిందని చెప్పారు.
నవ భారతానికి ఉత్పాదకతే పునాది..
ఇందుకు ప్రతిగా నూతన ప్రపంచానికి విడిభాగాలు, పూర్తయిన ఉత్పత్తులతో కూడిన సంపూర్ణ తయారీ విలువ గొలుసును భారతదేశం నిర్మించాలని ఆయన అదే సమయంలో పిలుపునిచ్చారు.
దశాబ్దానికి పైగా ప్రజలకు ప్రపంచీకరణ వాగ్దానాలను విక్రయించిన ప్రభుత్వ అధినేత నుంచి ఇటువంటి ప్రకటన రావడం వైఫల్యాన్ని అంగీకరించడం తప్ప మరొకటి కాదు.
ఖచ్చితంగా చెప్పాలంటే, మోదీ తన ప్రసంగంలో ప్రపంచీకరణను తప్పు పట్టలేదు. దాని స్థానంలో ఏమి వస్తుందో మాత్రమే సూచించారు. అది జాతీయవాద, తయారీ ఆధారిత, స్వయంసమృద్ధి గల భారతదేశం.
ఈ ప్రతిస్పందన అసంపూర్ణంగా ఉండటమే కాకుండా, ఈ చర్యలు ఉత్పత్తులను తయారు చేసే ఆర్థిక వ్యవస్థ సామర్థ్యానికి పునాదిగా ఉన్న ఉత్పాదక స్థావరాన్ని పునరుద్ధరించడానికి సహాయపడతాయో లేదో చెప్పడం లేదు.
సంరక్షణవాదం.. గ్లోబల్ సౌత్‌కు పరిష్కారం కాదు..
ఒకవేళ ఈ కొత్త ఉత్పాదక స్థావరం ఏర్పడితే, భారతదేశంలో దానిని ఎవరు నియంత్రిస్తారు, లేదా అది ఏ షరతులపై ఆధారపడి ఉంటుంది అనే దాని గురించి కూడా ఆయన ఏమీ చెప్పలేదు.
గ్లోబల్ సౌత్ దేశాలకు ఇవే అసలైన ప్రశ్నలు. గ్లోబల్ నార్త్(అభివృద్ధి చెందిన దేశాల) సంరక్షణవాదాన్ని కేవలం అనుకరించడం ద్వారా వీటికి సమాధానం ఇవ్వలేము.
ఎందుకంటే గ్లోబల్ నార్త్‌లో, సంరక్షణవాదం వైపు మళ్లడం అనేది శ్రమపై పెట్టుబడి ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఉద్దేశించబడింది.
మొత్తం ప్రక్రియను ప్రజాస్వామ్యయుతం చేయడానికి బదులుగా కొద్దిమంది చేతుల్లోనే ఉత్పాదక సామర్థ్యాన్ని భద్రపరిచే తయారీ రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రధాని దీనిని సాధించలేరు.
గ్లోబల్ సౌత్ దేశాలు ఇప్పుడు అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాలు అనుసరించిన నమూనాను అనుసరించడం ద్వారా సమాధానం ఇవ్వలేవు.
నిజానికి, ప్రపంచీకరణ వర్సెస్ సంరక్షణవాదం అనేది అసలు ప్రశ్నే కాదు. నవ-ఉదారవాదం అంతరించిపోవడం వల్ల ఏర్పడిన ఖాళీలో ఎలాంటి ఉత్పాదక, సామాజిక వ్యవస్థ నిర్మించబడుతుంది అనేదే ప్రశ్న.
గ్లోబల్ సౌత్ దేశాలలో, ఈ కాలంలో ప్రధాన జనాభా మార్పు, పరివర్తన ఏమిటంటే ప్రజలు నగరాలకు తరలిపోవడం. ఆ వ్యవస్థ చాలా వరకు అర్బన్ ప్రాంతాలలోనే నిర్ణయించబడుతుంది.
పట్టణీకరణ ఒక సంక్షోభం..
నా ‘సిటీస్ ఇన్ ట్రాన్సిషన్’ పుస్తకంతో సహా నేను ఇతర చోట్ల చెప్పినట్లుగా, ఇప్పుడు గ్లోబల్ సౌత్ అంతటా జరుగుతున్న పట్టణీకరణ సాంప్రదాయ ఐరోపా మార్గాన్ని పునరావృతం చేయడం లేదు.
ఐరోపాలో పారిశ్రామిక రంగం గ్రామీణ శ్రామికులను పరిశ్రమలలోని ఉపాధి వైపు ఆకర్షించింది. ఇక్కడ వ్యవసాయ సంక్షోభం, నిర్వాసితులను చేయడంతో పాటు అవకాశాల ద్వారా నడిచే “మిగులు శ్రమ పట్టణీకరణ”, ఉత్పత్తి ద్వారా ఉపాధి కంటే అద్దె వసూలు, అనధికారిక సేవా రంగం, రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్ చుట్టూ ఆర్థిక వ్యవస్థలు వ్యవస్థీకృతమైన నగరాల్లోకి ఇది ప్రజలను నెడుతుంది.
ఈ నమూనాలో, నగరం ఉత్పత్తి కేంద్రంగా కాకుండా ఇతర మార్గాల ద్వారా సంపద పోగుపడేలా చేసే ప్రాంతంగా మారుతుంది.
పెట్టుబడి ఎక్కువగా కేంద్రీకరణ సంక్షోభానికి పట్టణీకరణ ఒక స్థానిక పరిష్కారంగా పనిచేస్తుందని డేవిడ్ హార్వే పేర్కొన్నారు. అంటే, ఉత్పత్తిలో లాభదాయకమైన మార్గాలను కనుగొనలేని మిగులు మూలధనం నిర్మిత వాతావరణంలోకి, సామాజిక అవసరాల కంటే సర్క్యులేషన్, స్పెక్యులేషన్‌కు ఉపయోగపడే రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాలలోకి మళ్లించబడుతుంది.
పాట్రిక్ బాండ్ ఈ విశ్లేషణను ప్రత్యేకంగా గ్లోబల్ సౌత్‌కు అన్వయించి చెప్పారు. అసమాన భౌగోళిక అభివృద్ధి అనేది వృద్ధి ద్వారా పూరించవలసిన తాత్కాలిక లోటు కాదని, మూలధనం తనను తాను పునరుత్పత్తి చేసుకునే విధానానికి సంబంధించిన నిర్మాణ అవసరం అని చెప్పారు.
గ్లోబల్ సౌత్‌లోని నగరాలు అసమానంగా ఉంచబడినందున మాత్రమే అవి చౌకైన భూమి, చౌకైన శ్రమ, స్పెక్యులేటివ్ అవకాశాల రిజర్వాయర్లుగా పనిచేస్తాయి.
ఇద్దరూ ఒకే పరిష్కారాన్ని సూచిస్తున్నారు. అంటే, నవ-ఉదారవాద పెట్టుబడిదారీ విధాన సంక్షోభం, దక్షిణ దేశాల పట్టణీకరణ సంక్షోభం సమాంతర కథలు కావు. అవి వేర్వేరు మార్గాలలో చెప్పబడిన ఒకే కథ.
వామపక్షాల ఆవశ్యకత..
ఇక్కడే విశాలమైన, వ్యవస్థీకృత వామపక్షం లేకపోవడం నిర్ణయాత్మకంగా మారుతున్నది. పూర్వ కాలంలో, పెట్టుబడిదారీ పట్టణీకరణ వైరుధ్యాలను కార్మిక ఉద్యమం లేదా వాటిని రాజకీయంగా నిలదీయగల ఒక పార్టీ సమూహం ఎదుర్కొని ఉండేది.
ఎందుకంటే అప్పట్లో నగరాలు తయారీ రంగానికి, ఆ రకంగా వ్యవస్థీకృత కార్మిక వర్గ ఉద్యమాలకు కేంద్రాలుగా ఉండేవి.
భారతదేశంతో సహా చాలా గ్లోబల్ సౌత్ దేశాలలో ఆ నిర్మాణం ధ్వంసమైంది. ఇది ఉత్పాదక పెట్టుబడి లేదా కార్మికవర్గ సంక్షేమం కంటే మతపరమైన, మతతత్వ మౌలిక సదుపాయాల వైపు పట్టణ మిగులును, ప్రజల దృష్టిని మళ్లించే ఏకపక్ష రాజకీయాలకు(మెజారిటేరియన్ పాలిటిక్స్) తెరలేపింది.
ఈ శూన్యంలో ప్రగతిశీల వామపక్షంగా ఉండటం అంటే పాత రూపాల పట్ల వ్యామోహం పెంచుకోవడం కాదు. ప్రణాళికలు రచించడానికి, పరిపాలించడానికి ప్రజల సొంత సామర్థ్యంలో పాతుకుపోయిన ఒక ప్రత్యామ్నాయాన్ని ప్రాథమిక స్థాయి నుంచి నిర్మించడమే దీని అర్థం.
ప్రస్తుత రాజ్యాంగ నిర్మాణాలలో కూడా ఇది సాధ్యమేనని కేరళలోని ‘పీపుల్స్ ప్లాన్ క్యాంపెయిన్’ నిరూపించింది. భారత రాజ్యాంగ 74వ సవరణ దీనిని వాగ్దానం చేసినా ఎన్నడూ అమలు చేయలేదు.
నగరాల పునర్నిర్మాణమే ప్రత్యామ్నాయం..
కాబట్టి, ప్రత్యామ్నాయం అనేది కేవలం ఉత్తమంగా నిర్వహించబడే ప్రపంచీకరణ కాదు. లేదా ఉత్తర దేశాల సంరక్షణవాదానికి దక్షిణ దేశాల నకలు కాదు. ఇది నగరాలనే ఆలోచనాత్మకంగా పునర్నిర్మించడం.
మిగులు పెట్టుబడి ద్వారా ఉత్పాదక, గౌరవప్రదమైన ఉపాధి కేంద్రంగా మార్చడం. బాధ్యత లేని స్పెషల్ పర్పస్ వెహికల్స్(స్మార్ట్ సిటీస్ ఫ్రేమ్‌వర్క్‌లో చూసినట్లుగా) ద్వారా పాలించబడే ప్రాంతం నుంచి వికేంద్రీకృత, ప్రజాస్వామ్య సంస్థల ద్వారా పాలించబడే ప్రాంతంగా మార్చడం.
మార్పిడి విలువ చుట్టూ అమర్చబడిన ప్రదేశం నుంచి ఉపయోగ విలువ చుట్టూ అమర్చబడిన ప్రదేశంగా మార్చడం.
నవ-ఉదారవాద పెట్టుబడిదారీ విధాన ప్రపంచ సంక్షోభం పాత ఏకాభిప్రాయాన్ని నిలబెట్టుకోవడం అసాధ్యంగా మార్చింది. దీని స్థానంలో ఏమి వస్తుందనేది ఇంకా రాయబడలేదు. కానీ గ్లోబల్ సౌత్ నగరాల్లో ఈ సంక్షోభం తీవ్రంగా ఉంటే, దానికి ప్రత్యామ్నాయం నిర్మించబడే అత్యుత్తమ అవకాశం కూడా అక్కడే ఉంది.
(సిమ్లా మాజీ డిప్యూటీ మేయర్. ఆయన ‘లేహ్ విజన్’ పత్రంపై పనిచేశారు. డజను నగరాలకు విజన్ పత్రాలను రాశారు. మూడు పుస్తకాల రచయిత అయిన ఆయన, సమ్మేళన నగరాల(ఇన్‌క్లూజివ్ సిటీస్) రూపకల్పనలో పనిచేస్తున్న అర్బన్ స్పెషలిస్ట్, కేరళ అర్బన్ కమిషన్ సభ్యుడు. వారు ది వైర్ ఇంగ్లీష్‌కు రాసిన దానికి తెలుగు అనువాదం.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
