Reading Time: 4 minutes
1947కు ముందు భారతదేశ పటంలో నేటి పాకిస్థాన్, బంగ్లాదేశ్; ఇంకా అంతకన్నా ముందు ఆఫ్ఘనిస్తాన్ కూడా భాగంగా ఉండేవనీ, రాంభట్ల కృష్ణమూర్తి ప్రకారం కొంత యూరప్ కూడా కలిసి ఉన్న ప్రదేశాన్ని భరతవర్షం అనేవారనీ ‘మంత్రకవాటం…’ పుస్తక రచయిత అంటారు.
మహాభారతంలో గాంధార దేశపు రాజు కూతురూ, ధృతరాష్ట్రుని భార్య అయిన గాంధారి గురించి చెబుతూ, గాంధార దేశం నేటి ఆఫ్ఘనిస్తానేనంటారు.
మహాభారతంలో సామాజిక సంక్షోభాలు..
అలాగే, ముందుగా బ్రాహ్మణులు గణనిర్బంధాల నుంచి బయట పడ్డారనీ, క్షత్రియగణాలు ఆయుధోపజీవులుగా విస్తరిస్తూ పోయారనీ, వీరు సృష్టించిన సమస్యలను, సంక్షోభాలను చిత్రించి, చర్చించడమే మహాభారతంలో ఆద్యంతమూ వ్యాపించిన ప్రధాన వస్తువనీ ఆయన అంటారు.
ఎంతమంది భారతాన్ని ఎన్ని రకాలుగా చెప్పినా ఇదే ముఖ్యమైనదంటారు. ఆయన ప్రకారం, స్థూలంగా చెప్పాలంటే భారతంలో భీముడు, ద్రౌపది ప్రతీకారం వైపు, కృష్ణుడు హింసావాదం వైపు, ధర్మరాజు అహింస వైపు మొగ్గుతారు; అర్జునుడు రెండు వాదాలకూ మధ్యస్థంగా ఉంటాడు.
మాతృస్వామ్య లక్షణాలు – పురుషాధిక్యత..
పాండవులను తపతీ-సంవరణుల పరంపరకు చెందినవారిగా స్త్రీ వైపు నుంచి ‘తాపత్య’ వంశీకులని చెప్పడం, అర్జునుడు ద్రౌపదీ స్వయంవరానికి వెళ్ళడం, అతడు గెలిచిన ద్రౌపదిని పాండవులు ఐదుగురికీ భార్యగా ఉండమని కుంతి చెప్పడం మాతృస్వామ్య వ్యవస్థ లక్షణం కిందికి వస్తుందని రచయిత అంటారు.
గంగా శంతనుల వివాహం కూడా మాతృస్వామికమే. గ్రీకు కథలతో చాలా పోలికలున్న కథలు ఇవన్నీ. లైంగిక సంబంధాల విషయంలో వ్యత్యాసాలు ఎలా ఉన్నా వివాహాన్ని మాత్రం ఒక వ్యవస్థగా, ఉన్నతవిలువగా ప్రపంచం గుర్తించిందని రచయిత అంటూ; వివాహవ్యవస్థకు అనుగుణంగా స్త్రీ, పురుష స్వేచ్ఛను, లైంగికతను నియంత్రించలేనప్పుడు వాటికి అనుగుణంగా సర్దుబాట్లు చేయవలసి వచ్చిందంటారు.
పితృస్వామ్యం స్త్రీకి తనదైన భాష లేకుండా చేసిందనీ, పితృస్వామ్యంలో స్త్రీ పురుషుని భాష మాట్లాడుతుందనీ, పురుషునిలా ఆలోచిస్తుందనీ భారతంలోని కొన్ని కథలు చెబుతాయని వ్యాఖ్యానిస్తారు.
గణసమాజాలపై మోర్గన్ పరిశోధన..
లూయీ హెన్రీ మోర్గన్ అనే పండితుడు గణసమాజంపై అనేక సంవత్సరాలపాటు అన్ని వైపుల నుంచీ పరిశోధన చేసి 1877లో ఏన్షియంట్ సొసైటీ(పురాతన సమాజం) అనే పుస్తకం రాశాడు.
భారత, గ్రీకు, రోమన్ సమాజాలలోని గణలక్షణాలతో అన్వయిస్తూ తన అధ్యయనాన్ని వెలువరించాడు. భౌగోళిక దూరాలతో సంబంధం లేకుండా ప్రపంచమంతటా ఒకనాడున్న గణసమాజాలు అన్నిటిలో ఉన్న పోలికలను బయట పెట్టాడు.
విచిత్రం ఏమిటంటే, పురాకాలపు స్త్రీ పురుష సంబంధాల గురించి 19వ శతాబ్దంలో మోర్గన్ చెప్పడానికి చాలా ముందే వ్యాసుడు కుంతి, పాండురాజు, ధర్మరాజులతో చెప్పించాడని రచయిత అంటారు.
రామాయణం – పర్షియన్ ఇతిహాసాల పోలికలు..
చరిత్రలో తొలి అతిపెద్ద రాజ్యం పర్షియన్లది. వీరు కూడా ఆర్యులే. వారిది జొరాస్ట్రియన్ మతం. పర్షియాలో మధ్య, పశ్చిమ ఆసియాలు కూడా అంతర్భాగాలు. రామాయణం రాముని వీరుడిగా, ధర్మరక్షకుడిగా, సత్యవంతుడిగా చెబుతుంది; పర్షియన్ రాజులకు, మెసొపొటేమియాలో రాజ్య స్థాపకులైన సార్గాన్, హమ్మురాబిలకు కూడా ఇవే గుణాలతోపాటు; రాముడికి లానే సూర్య సంబంధాన్ని కూడా చెప్పడం ఆసక్తికరం అంటారు.
రాముడు, పర్షియన్ రాజు గ్జెరెక్సెస్… ఇద్దరూ శత్రువుతో యుద్ధానికి బయలుదేరినప్పుడు సముద్రం సహకరించకపోవడం, దాంతో వారు సముద్రం మీద కోపగించడం వంటి పోలికలు ఉంటాయి. గ్రీకు కథలలో హనుమంతుని వంటి పాత్ర కూడా కనిపిస్తుంది.
అరణ్యాలలో ఆశ్రమాలు – ఆటవిక సంబంధాలు..
అలాగే రచయిత- అరణ్యాలలో ఆశ్రమాలు నిర్మించుకుని నివసించే మునులూ, క్షత్రియులకు సన్నిహితంగా ఉండే బ్రాహ్మణులూ నిర్వహించిన పాత్ర గురించి కూడా ఆసక్తికరమైన అంశాలను ముందుకు తెస్తారు.
ఆదివాసీ తెగలు అరణ్యాలనే ఆశ్రయించుకుని ఉంటాయి కనుక, మునులకూ, ఆదివాసీ తెగలకూ మధ్య స్నేహసంబంధాలు ఏర్పడతాయనీ; రాజ్యమూ, వ్యవసాయమూ విస్తరించడంలో భాగంగా క్షత్రియులు అరణ్యాలలోకి చొచ్చుకు వెళ్ళడానికి అక్కడి మునులు పర్మిట్గా ఉపయోగపడ్డారని రచయిత అంటారు.
ఆపైన మునుల దగ్గర మంత్రమే కాదు, ఎదుటివారిని మంత్రించే మాట కూడా ఉంటుంది. అలాగే, ఇతర బ్రాహ్మణులు కూడా. వారు ఆదివాసుల మధ్యకు వెళ్ళడమే కాదు, వాళ్ళతో సంబంధాలు కలుపుకున్నారు, కొందరు వాళ్ళలో కలిసిపోయారు.
హిందూ జీవనవిధానం – బహుళేశ్వర ఆరాధన..
‘హిందూ’ అనేది ఒక మతం కాదని పలు సందర్భాల్లో హిందుత్వ సిద్ధాంతవాదులు చెప్పడం చూస్తున్నాం. హిందూ అనేది ఒక జీవనవిధానమని వారు అంటారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఉటంకిస్తూ, మతంగా కాక జీవన విధానంగా ఉండడం ప్రపంచం మొత్తం మీద హిందువుల ప్రత్యేకతగా వారు చెపుతుంటారు.
ఇందులో కొంత నిజం ఉంది, కొంత నిజం కానిది ఉందని రచయిత అంటారు. మతం అనే మాటను విశాలార్థంలో తీసుకున్నప్పుడు ఒకానొక ఆధ్యాత్మిక విశ్వాసాన్ని, ఆరాధనా పద్ధతిని అనుసరించే ప్రతిదీ ఒక మతమే.
హిందూకు పూర్వ రూపమైన వైదికం ఒక మతమే. అలాగే బౌద్ధ, జైనాలు కూడా. కాకపోతే, హిందూ అనేది క్రైస్తవం, ఇస్లాంలా ఒకే ఒక పవిత్ర గ్రంథం కలిగిన ఏకేశ్వర మతం కాక, బహుళేశ్వర మతం అవుతుందంటారు.
ఇక్కడ బహుళ దేవతారాధన ఉందనీ, క్రీస్తుపూర్వ దశకు చెందిన బహురూప ఆస్తికత ఇప్పటికీ అధికారికంగా కొనసాగుతున్న దేశం ఒక్క మనదేశమే కావచ్చనీ రచయిత అంటారు.

ఆటవిక సంస్కృతి – బ్రాహ్మణీయ సంబంధం..
అలాగే రచయిత చెప్పిన ప్రకారం, మన దగ్గర శ్రీశైల మల్లికార్జున స్వామికి ఆటవికులైన చెంచులు పూజించే భ్రమరాంబ భార్య కావడం, భద్రాచలంలో గిరిజన మహిళ పోకల దమ్మక్కకు కలలో రాముడు కనిపించి గుడి కట్టమని చెప్పడం వంటివి ఆటవిక, బ్రాహ్మణీయ సంబంధాన్ని సూచిస్తాయి.
మన దేశంలో అమ్మవారిని పూజించినట్లే ప్రాచీన ఈజిప్టులో అసంఖ్యాక భక్తులు ఐసిస్ అనే దేవతను ఆరాధించేవారు. ఆమె ముందు దీపారాధన చేసి నైవేద్యం పెట్టేవారు. ఇంకా విశేషమేంటంటే, ఐసిస్ ఆలయంలోని అర్చకులు శిరోముండనం చేసుకుని, బ్రహ్మచర్యం పాటించేవారు.
ఈ పుస్తకంలోని మరికొన్ని ఆసక్తికర పరిశీలనలు, వివరణలు..
పురాచరిత్ర కోణం నుంచి తమిళనాడు ప్రత్యేకత కుతూహలం రేకెత్తిస్తుంది. ఇక్కడ వ్యక్తి పూజ ఎక్కువ. పురాతన వ్యవసాయ నాగరికతలో జనం గుడి కట్టి దాని చుట్టూ తమ పారలౌకిక జీవితాన్ని అల్లుకునేవారు.
వ్యవసాయ భూములకు దేవతే యజమాని. భూమి పంపకానికి దేవాలయమే కేంద్రంగా ఉండేది. అన్నవితరణా అక్కడే జరిగేది. తమకు జీవనోపాధిని కల్పించేది, అన్నం పెట్టేది దేవతే కనుక లౌకికం, పారలౌకికం అన్న తేడాకు అవకాశం లేదు. పాలక స్థానంలో జయలలిత ఉన్నా, మరొకరు ఉన్నా జనానికి పని కల్పించి, అన్నం పెడితే దేవతే అవుతారు.
ఇది ఊహాప్రాయమైన పోలిక కాదు; ఈజిప్టు, మెసపొటేమియా, ఏజియన్, సింధు నాగరికతల నాటి నగర రాజ్యాలనుంచి అందిన ఉమ్మడి వారసత్వం.
అదలా ఉంచితే, పారలౌకికం ఖాతాలో పుణ్యాన్ని జమ చేసుకోవడంపై ఉన్న శ్రద్ధ; లౌకికం ఖాతాలో నీతి, నియమాలను చట్టబద్ధతను జమ చేసుకోవడం మీద ఉండకపోవడం మన స్వభావంలో భాగమైంది.
సూర్యసంబంధమైన రోజునే క్రిస్మస్గా మార్చారు..
మొదట్లో మనిషి ప్రకృతిశక్తులతో ఒంటరిగా కాకుండా సంఘటితంగా పోరాడి ఉంటాడు. మనిషికి మనిషి తోడన్న భరోసాతో భారం కొంత తగ్గి ఉంటుంది. రానురాను ఇహలోకం నరకమై, బ్రతుకు భారమై కొంచెం సుఖ సంతోషాలనిచ్చే స్వర్గం కోసం పాకులాడక తప్పలేదు. తోటి మనిషి శత్రువైనప్పుడు దేవునికి మానవరూపం సృష్టించుకోవడం అనివార్యమైంది.
క్రీశ ఒకటి, రెండవ శతాబ్దాలకు వచ్చేసరికి రోమన్ సామ్రాజ్యంలో క్రౌర్యం, అణచివేత ఎక్కువయ్యాయి. మతంలో ఓదార్పును వెతుక్కునే ప్రయత్నంలో ఈజిప్షియన్లలో అమరత్వంపై కోరిక బలంగా వ్యక్తమైంది.
పర్షియన్ల మతం మిత్రాయిజం వచ్చింది. మిత్రుడంటే సూర్యుడు. ఒకనాటి అమెరికాతో సహా అంతటా సూర్యారాధన ఉండేది.
డిసెంబర్ 25 సూర్యుడికి సంబంధించిన రోజు. సూర్యారాధకులను, అంటే మిత్రమతం వారిని క్రిస్టియన్లుగా మార్చి వారు పవిత్రంగా భావించే రోజునే క్రిస్మస్గా మార్చారు. అలా ఐసిస్ నుంచి జీసస్కు వచ్చారన్నమాట.
యూదుల అస్తిత్వమంతా వారి అక్షరంలోనే..
ప్రపంచంలో యూదుల ప్రాముఖ్యానికి వారి లిఖిత సాహిత్యమే కారణం. యూదులు ఒక విలక్షణ జనం. వారిలా వేధింపులకు, ఊచకోతకు గురైనవారు, అంత దుఃఖాన్ని అనుభవించినవారు వేరొకరు లేరు. ప్రారంభంలో వీరు అంత నాగరికులు కాదు, ఐకమత్యంగానూ లేరు. వీరిది పుస్తక మతం. బైబిల్ వాళ్ళకు సర్వస్వం. అదే వారిని సంఘటితంగా ఉంచింది.
జెరూసలెం వారి నామమాత్రపు రాజధాని. నిజమైన రాజధాని బైబిలే. యూదులు పూర్తిగా ఒక సరికొత్త ప్రజారూపం. వారికొక రాజు లేడు, ఒక ఆలయం లేదు. కేవలం అక్షరమే వారిని కలిపి ఉంచింది; అక్షరంలోనే వారి అస్తిత్వం ఉంది.
శూర్పణఖ రాక్షసి, మండోదరి ఉత్తమురాలు ఎలా అయ్యారు?
మన పురాణ కథల్లోని నల దమయంతుల కథకూ గ్రీకు కథలోని ఒడీసియస్ – పెనెలొపి కథకు తేడాలతోపాటు ఎన్నో పోలికలున్నాయి. స్త్రీ స్వామ్యంపై పురుష స్వామ్యాన్ని స్థాపించే ప్రయత్నం మాత్రం రెండింటిలోనూ సమానం.
మన ఇతిహాస, పురాణాల్లోని తాటకి, పూతన, శూర్పణఖ మొదలైన స్త్రీలు రాక్షసులైతే, రావణుని భార్య మండోదరి మాత్రం వారికి భిన్నంగా ఉత్తమురాలు, పతివ్రత అయింది.
స్త్రీస్వామ్యంలో ఉన్న స్త్రీలందరూ రాక్షసులైతే, పురుషస్వామ్యాన్ని, పురుషాధిపత్యాన్ని అంగీకరించిన స్త్రీలు పతివ్రతలూ, ఉత్తమురాళ్ళూ అయ్యారన్నమాట.
నీలగిరి తోడాలలో మెసొపొటేమియా జాడలు..
మెసొపోటేమియా దగ్గర తవ్వకాలలో ఆరు దేవాలయాలు బయటపడ్డాయి. అవి క్రీపూ 4000-3500 ఏళ్ళ నాటివి. అవి అండాకారంలో ఉన్నాయి. వాటిలో ఒకటైన ‘ఒబెయిద్’ ఆలయంలో దేవత పేరు నిన్ హుర్ సగ్. అన్ని జీవరాశులకూ ఆమె తల్లి.
భారతదేశంలోని అమ్మవార్ల ఆలయం గర్భగుడిలో యోని ఆకారంలో ఉండే నిర్మాణంలానే ఇది కూడా ప్రకృతిలోని పునరుత్పాదక శక్తికి, అంటే సంతానాన్ని కని, పెంచి, పోషించే స్త్రీత్వానికి ప్రతీక.
ఆలయంలోని గోవులు ఆమె ప్రతిరూపాలు. వాటి పాలే ఆమె ప్రసాదం. తమిళనాడులోని నీలగిరుల్లో తోడాలని పిలిచే ఒక తెగ ఉంది. వీరికి ఇరుగు పొరుగు వారితో సంబంధాలకు దూరంగా నిగూఢంగా ఉంటారు. వీరు కూడా అమ్మవారి ఆలయాల్లో పశువుల్ని ఉంచి పూజిస్తూ ఉంటారు. లేగదూడను బలిస్తారు.
అక్కడ దేవత ప్రార్థనలో నిన్ కుర్ షగ్ అనే మాట వినిపిస్తుంది. మెసపోటేమియా నుంచి ఈ తంతు భారతదేశం వరకూ చేరుకుని ఇప్పటికీ కొనసాగుతోందని జోసెఫ్ కాంబెల్ అంటాడు.
కంచుయుగానికి చెందిన ఉమ్మడి పౌరాణిక వారసత్వం, ఉమ్మడి చారిత్రకత..
పై పోలికలు యాదృచ్ఛికం కావు; కంచుయుగానికి చెందిన ఉమ్మడి పౌరాణిక వారసత్వంగా, ముఖ్యంగా ఉమ్మడి చారిత్రకతగా వీటిని అర్థం చేసుకోవాలి. చరిత్రకూ, పురాణానికి పెద్ద తేడా లేదు. పురాణేతిహాసాలు నరుని నాయకునిగా మలచి బయటకు తీసుకొచ్చాయి.
మహాభారతంలో అర్జునుడు, రామాయణంలో రాముడూ నరులే. ధర్మం-అధర్మం, నీతి -అవినీతి, మంచి -చెడు అనే జంట పదాలకు ప్రాతినిధ్యం వహించే వ్యక్తులు, శక్తుల మధ్య సంఘర్షణలో ధర్మం, నీతి, మంచి విజయం సాధించడం అనే మూలసూత్రం ఒక మూసగా మారి ముందుకొచ్చింది. ఆదిమకాలం నుండి నేటివరకు చరిత్ర ఒక క్రమపద్ధతిలో సాగుతూ ఉండడం ఆశ్చర్యకరం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
