న్యూఢిల్లీ: జూలై 27న, అంచనా సంవత్సరాలు 2021-22, 2025-26 మధ్యకాలంలో రూ 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్న భారతీయుల సంఖ్య 142 నుంచి 576కి పెరిగిందని పార్లమెంటులో అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రభుత్వం తెలిపింది.
భారతదేశంలో రూ 100 కోట్లు అనేది చాలా పెద్ద మొత్తం. అంత తక్కువ సమయంలో శతకోటీశ్వరుల సంఖ్య నాలుగు రెట్లు పెరగడం అనేది సాధారణ విషయమేమీ కాదు.
ఇంత మొత్తం కేవలం జీతాల రూపంలో వచ్చి ఉండటానికి అవకాశం తక్కువ. 2023-24(అంచనా సంవత్సరం 2024-25)కి మించి ఆదాయపు పన్ను డేటాను ప్రభుత్వం ఇంకా విడుదల చేయలేదు.
అయినప్పటికీ, 2023-24లో రూ 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ జీతం పొందుతున్నట్లు కేవలం 19 మంది మాత్రమే నివేదించారు.
పెట్టుబడుల కన్నా రెంటియర్ వైపే మొగ్గు..
మరో ఆసక్తికరమైన అంశం ఏమిటంటే- కోవిడ్ మహమ్మారి తదుపరి కాలంలో ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడులను పెంచడానికి ప్రైవేట్ రంగం తగినంతగా కృషి చేయడం లేదని ప్రభుత్వం పదే పదే విమర్శిస్తోంది.
అందుబాటులో ఉన్న ఆదాయపు పన్ను రిటర్న్(ఐటీఆర్) డేటా, కార్పొరేట్ ఇండియా ఆర్థిక నివేదికలను విశ్లేషిస్తే – సంపన్నులుగా మారడానికి ఎక్కువ కార్పొరేట్ సంస్థలు “ఎంటర్ప్రెన్యూర్”(వ్యాపారవేత్త) మార్గాన్ని కాకుండా “రెంటియర్”(అద్దె, డివిడెండ్లు, వడ్డీ, మూలధన లాభాల ద్వారా ఆదాయం పొందే) మార్గాన్ని ఎంచుకుంటున్నాయని తెలుస్తోంది.
తగ్గుతున్న వ్యాపార ఆదాయాలు – పెరుగుతున్న రెంటియర్ ఆదాయాలు..
ఐటీఆర్ డేటా వివిధ మార్గాల నుంచి వచ్చే ఆదాయాల విభజనను అందిస్తుంది. హెచ్‌టీ ఈ రకమైన ఆదాయాలను మూడు విభాగాలుగా వర్గీకరించింది: ఆదాయం (జీతం), పెట్టుబడి(క్యాపిటల్), రెంటియర్ ఆదాయం.
మొదటిది జీతాల ద్వారా వచ్చే ఆదాయం కాగా; రెండవది వ్యాపార(లాభం) ఆదాయం; మూడవది దీర్ఘకాలిక లేదా స్వల్పకాలిక పెట్టుబడి లాభాలు(క్యాపిటల్ గెయిన్స్), గృహ ఆస్తి ఆదాయం, వడ్డీ ఆదాయం, లాభాల నుంచి మినహాయించే ముందస్తు నష్టాల మొత్తం.
ఈ వర్గీకరణ ముఖ్య ఉద్దేశ్యం ఆర్థిక కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయాన్ని వేరు చేయడం- శ్రమకు వచ్చే జీతం, పెట్టుబడికి వచ్చే లాభాలు- అలాగే ముందస్తు ఆస్తులు లేదా రెంట్-సీకింగ్ (అద్దెల ద్వారా ఆదాయం) నుంచి వచ్చే ఆదాయాన్ని వేరు చేసి చూడటం.
2012-13 నుంచి 2023-24 వరకు ఉన్న డేటా ఒక స్పష్టమైన ధోరణిని స్పష్టం చేస్తుంది. వ్యాపార ఆదాయాలతో పోలిస్తే రెంటియర్ ఆదాయాలు గణనీయంగా పెరిగాయి.
చార్ట్ 1: పన్ను చెల్లింపుదారుల మొత్తం ఆదాయంలో ఆదాయ వర్గాల వాటా (క్యూములేటివ్ శాతంలో)..

అధిక ఆదాయ వర్గాల్లో తగ్గిన వ్యాపార ప్రాధాన్యం..
రెంటియర్ ఆదాయాలు ఏ ఆదాయ వర్గానికైనా చెందవచ్చు. ఇవి తమ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ పొందే పదవీ విరమణ పొందిన వ్యక్తికి లేదా పెద్ద మొత్తంలో ట్రెజరీ కార్యకలాపాల ద్వారా భారీ పెట్టుబడి లాభాలను ఆర్జించే బడా కంపెనీకి కూడా రావచ్చు. అందుకే ఐటీఆర్ డేటాలోని వివిధ ఆదాయ వర్గాలలో వ్యాపార ఆదాయాలు, రెంటియర్ ఆదాయాల పోలికను చూడటం చాలా ముఖ్యం.
2012-13, 2023-24 సంఖ్యల పోలిక ఒక నివ్వెరపరిచే విషయాన్ని వెల్లడిస్తుంది. ఆదాయ వర్గాలు పెరిగేకొద్దీ, వ్యాపార ఆదాయాలు తమ ప్రాముఖ్యతను కోల్పోయాయి.
2012-13 నుంచి 2023-24 మధ్య రెంటియర్ ఆదాయాలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కంపెనీలు తమ వ్యాపార కార్యకలాపాల ద్వారా లాభాలను ఆర్జించడం కంటే రెంటియర్ కార్యకలాపాల ద్వారానే ఎక్కువ సంపాదిస్తున్నాయనే వాదనకు ఇది బలం చేకూరుస్తోంది.
చార్ట్ 2: వివిధ ఆదాయ శ్రేణులలో ‘వ్యాపార ఆదాయం’, ‘పెట్టుబడి (రెంటియర్) ఆదాయాల’ నిష్పత్తి..

కార్పొరేట్ ఆర్థిక గణాంకాలు: తగ్గిన పారిశ్రామిక విక్రయాలు..
సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) డేటాబేస్ ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. మొత్తం కార్పొరేట్ సంపాదనలో పారిశ్రామిక విక్రయాల వాటా తగ్గుతోందని సుదీర్ఘకాల పోలికలు తెలియజేస్తున్నాయి.
మరోవైపు కార్పొరేట్ రెంటియర్ కార్యకలాపాల ఆదాయాలు—అనగా డివిడెండ్లు, వడ్డీ ఆదాయం, ట్రెజరీ కార్యకలాపాల ఆదాయాల మొత్తం—పెరిగాయి. వీటి ప్రాముఖ్యత పారిశ్రామిక విక్రయాలతో పోలిస్తే పెరిగింది.
నిజానికి, లభ్యమైన చివరి డేటా ప్రకారం(2024-25), ఈ రెంటియర్ ఆదాయాలు పారిశ్రామిక విక్రయాల కంటే నాలుగు రెట్లు ఎక్కువ వేగంతో పెరిగాయి.
చార్ట్ 3: భారతీయ కార్పొరేట్ల ఆదాయంలో పారిశ్రామిక అమ్మకాల ప్రాముఖ్యత తగ్గుదల..

ఆర్థిక వ్యవస్థపై పడే ప్రభావం..
దీని నుంచి మూడు నిర్ధారణలకు రావచ్చు. అసమానతలను తగ్గించకపోయినా, ప్రాథమికంగా సంపద సృష్టికి దోహదపడే వృద్ధి ఆర్థిక వ్యవస్థకు మంచిది. కానీ సట్టా వ్యాపారం(స్పెక్యులేషన్) లేదా రెంటియర్ సట్టా కార్యకలాపాల నుండి డబ్బు సంపాదించే ధనికుల వర్గం గురించి ఇలా చెప్పలేము. ఆర్థిక వ్యవస్థ పట్ల విశ్వాసం తగ్గినా కూడా ఈ రకమైన సంపాదన కొనసాగవచ్చు.
క్యాపిటల్ మార్కెట్(స్టాక్ మార్కెట్) లాభాలకు లభించిన మద్దతు బాహ్య కారణాల వలన కూడా జరిగి ఉండవచ్చు.
కృత్రిమ మేధ (ఏఐ) విప్లవం, భౌగోళిక రాజకీయ అనిశ్చితుల మధ్య భారత స్టాక్ మార్కెట్లు సుదీర్ఘ బుల్ రన్‌ను చవి చూశాయి.
ఈ పరిస్థితి మూలధనాన్ని నిజమైన పరిశ్రమల నుంచి మార్కెట్ సట్టా వ్యాపారాల వైపు మళ్లించడానికి దారితీసింది. ఇది పూర్తిస్థాయిలో మంచి పరిణామం అని చెప్పలేము.
మొత్తం కార్పొరేట్ ఆదాయాల్లోనే కాకుండా పారిశ్రామిక అమ్మకాల ప్రాముఖ్యత తగ్గడం తీవ్ర ఆందోళన కలిగించే అంశం.
చైనా పోటీ వలనా, లేదా సులభంగా, ఆకర్షణీయమైన రాబడులను ఇచ్చే క్యాపిటల్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం వలనా- భారతీయ కంపెనీలు తయారీ రంగానికి దూరంగా జరుగుతున్నాయా?
ఈ మార్పులు చట్టవిరుద్ధమైనవా, తప్పుడు పనులా అంటే కాదు, కానీ వీటి పరిణామాలు ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుకు అంత మంచి సంకేతం కావు.
(హిందుస్థాన్ టైమ్స్ నుండి)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
