తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పాలిటెక్నిక్ విద్యతో పాటు ఐటీఐ, ఏటీసీ కళాశాలలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలలో విలీనం చేస్తూ తెచ్చిన జీవో నంబర్ 97తో పాలిటెక్నిక్ విద్యార్థుల్లో, ఉపాధ్యాయుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పాలిటెక్నిక్ విద్య రెండు ముక్కలు కానుంది. పాలిటెక్నిక్‌తో పాటు ఐటీఐ, ఏటీసీ కాలేజీలు స్కిల్ యూనివర్సిటీ కిందకు, ఉద్యోగులంతా శక్తి శాఖ(డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్ హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్) పరిధిలోకి వెళ్ళనున్నారు.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు పోరుబాట పట్టారు.
పాలిటెక్నిక్, ఐటీఐ విద్యను సాంకేతిక విద్యా శాఖలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, పూర్వ విద్యార్థులు ఆందోళనలు, ధర్నాలు, కలెక్టరేట్ల ముట్టడి లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
పేదలకు వరం పాలిటెక్నిక్, ఐటీఐ కోర్సులు..
పదవ తరగతి తరువాత ఉపాధి, ఉద్యోగం చేయాలనుకునే విద్యార్థులకు ఐటీఐ, పాలిటెక్నిక్ విద్య ఒక సువర్ణ అవకాశం లాంటివి. ఐటీఐ విద్య ఒక ఒకేషనల్ కోర్సు.
ఐటీఐలో ప్రాక్టికల్ నాలెడ్జ్ పై 70 శాతం కంటే ఎక్కువ శ్రద్ధ పెడతారు. యంత్రాలను ఎలా ఆపరేట్ చేయాలి, రిపేర్ ఎలా చేయాలి అనే ‘క్రాఫ్ట్స్‌మెన్’ నైపుణ్యాలను నేర్పుతారు.
పాలిటెక్నిక్ విద్య అనేది డిప్లమా కోర్స్. దీనిలో థియరీ(ఇంజనీరింగ్ సిద్ధాంతాలు)తో పాటు ప్రాక్టికల్స్ సమానంగా నేర్పుతారు. ఒక ఇంజనీరింగ్ ప్రాజెక్ట్ వెనుక ఉన్న సాంకేతికతను అర్థం చేసుకోవడంపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారు.
డిప్లమా విద్య పూర్తి చేసుకున్న వేలాది విద్యార్థులు నేడు కేవలం సాంకేతిక రంగానికే పరిమితం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగులుగా, ఇస్రో, డీఆర్డీఓ, భెల్, ఎన్ఎఫ్సీ, ఎఫ్‌సీఐ లాంటి సంస్థల్లో సైంటిస్టులుగా, ఇంజనీర్లుగా పనిచేస్తూ దేశ అభివృద్ధిలో భాగం అవుతున్నారు. డిప్లమా తరువాత ఉన్నత చదువులు చదవాలనుకునే విద్యార్థులకు ఈసెట్ ఎంట్రన్స్ ద్వారా లాటరల్ విధానంతో ఇంజనీరింగ్ కోర్సులలో రెండవ సంవత్సరంలోకి నేరుగా ప్రవేశం లభిస్తుంది.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 59 ప్రభుత్వ కళాశాలలు, 54 ప్రైవేట్ కళాశాలల్లో మొదటి, రెండవ, మూడవ సంవత్సరాల్లో దాదాపుగా లక్ష మంది విద్యార్థులు చదువుతున్నారు.
పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థుల్లో దాదాపుగా గ్రామీణ ప్రాంతానికి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ విద్యార్థులే అధికం. అందులో ఎక్కువ శాతం బాలికలే.
స్కిల్ వర్సిటీతో ఫీజుల భారం..
ఇక స్కిల్ యూనివర్సిటీ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానం- 2020లో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులోని ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది.
ఈ యూనివర్సిటీ పబ్లిక్ అండ్ ప్రైవేట్ పార్టనర్ షిప్(పీపీపీ) మోడల్ లో నడుస్తుంది. యువతలో సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసి ఉద్యోగాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ యూనివర్సిటీ ఏర్పాటు చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది.
15 మందితో యూనివర్సిటీ బోర్డు ఏర్పాటు చేయగా, అందులో ఏడుగురు మల్టీనేషనల్ కంపెనీల యజమానులు ఉన్నారు. దీనికి ఛాన్సలర్‌గా సీఎం రేవంత్ రెడ్డి, చైర్మన్‌గా మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ఉన్నారు.
ఈ యూనివర్సిటీకి నిధులు ప్రభుత్వం, కార్పొరేట్ నిధులతో పాటు బ్యాంకులు, కార్పొరేషన్ ద్వారా సమకూరనున్నాయి. దాతలు డబ్బులు ఇస్తే భవనాలు, గదులు, సెంటర్లు నిర్మించి వాటికీ దాతల పేర్లు పెట్టనున్నారు.
ఫీజుల విషయానికొస్తే బయట కోర్సుల కంటే అధికంగా ఉన్నాయి. ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంలో నడుస్తున్న యూనివర్సిటీ కనుక యూనివర్సిటీ వద్ద నిధులు లేకుంటే ఆ భారం విద్యార్థుల మీద పడనుంది. ఫీజులు చెల్లించి చదువుకోవాల్సిన పరిస్థితి వస్తే రానున్న రోజుల్లో వేలాది మంది విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదం ఉంది. ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విద్య పట్ల ఉన్న నిర్లక్ష్య వైఖరిని తెలియజేస్తుంది.
కార్పొరేట్ ప్రయోజనాల కోసమేనా..
దశాబ్దాల చరిత్ర కలిగిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలను, కోట్ల విలువ చేసే కళాశాలల భూములతో సహా, పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) మోడల్లో నడిచే ‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ’ పరిధిలోకి నెట్టడం వెనుక కార్పొరేట్ ప్రయోజనాలు దాగున్నాయి.
కార్పొరేట్ కంపెనీలకు అవసరమైనట్టు సామాజిక భద్రత లేకుండా, తక్కువ జీతాలతో పనిచేసే కొద్దిమంది అసంఘటిత కార్మికుల తయారీ మాత్రమే ఈ స్కిల్ యూనివర్సిటీలో జరుగుతుంది. తద్వారా దేశ అభివృద్ధి వెనక్కి నెట్టబడుతుంది.
చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలి..
పాలిటెక్నిక్ విద్యార్థులకు పోరాటం కొత్తకాదు. ఈ దేశంలో జరిగిన అనేక సామాజిక, రాజకీయ పోరాటాల్లో పాలిటెక్నిక్ విద్యార్థులు అగ్రభాగాన నడిచి పోరాటం చేశారు. మండల్ కమిషన్, కమండల్ గో బ్యాక్ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేశారు.
1980వ సంవత్సరంలో పాలిటెక్నిక్ విద్యార్థులు 100 రోజుల పాటు చారిత్రక సమ్మె చేసి వారి సమస్యలను పరిష్కారం చేసుకున్నారు.
ఆ పూర్వ విద్యార్థుల పోరాట వారసత్వాన్ని ఇప్పటి విద్యార్థులు పునికిపుచ్చుకొని నేడు ఆందోళన చేస్తున్నారు. విద్యార్థుల పోరాటం ఉధృతం కాకముందే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విద్యా నిపుణులు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలతో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు జరపాలి.
ఎస్బీటీఈటీని యథావిధిగా కొనసాగించి, నిధులు పెంచి మరింతగా అభివృద్ధి చేయాలి. ప్రజల అవసరాలను తీర్చడానికి రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని ప్రభుత్వ రంగంలోనే వేలాది చిన్న, కుటీర పరిశ్రమలను ఏర్పాటు చేస్తే, వాటికి అవసరమైన నైపుణ్యాలను ఇప్పుడు ఉన్న ఐటీఐలూ, పాలిటెక్నిక్‌లలో నేర్పించే విధానం ఏర్పాటు చేస్తే తెలంగాణలో భారీగా ఉద్యోగ అవకాశాలతో పాటు ఉపాధి దొరికి నిరుద్యోగ నిర్మూలన కూడా జరుగుతుంది. ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
