వెయ్యి అబద్ధాలు ఆడి అయినా ఓ పెళ్లి చేయాలనేది తెలంగాణ ప్రసిద్ధ సామెత. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంతకు మించిన అబద్ధాలు ఆడి అయినా సరే ఈ పథకాన్ని రద్దు చేయాలని భావిస్తున్నట్లుంది. అందుకే హైకోర్టులో ఈ పథకంపై పిటిషన్ దాఖలైంది మొదలుకుని దాన్ని నిలిపేసే వరకు ప్రభుత్వం పట్టనట్లే ఉన్నది.
తెలంగాణలో పేదింటి ఆడబిడ్డల వివాహాల కోసం పెద్ద మనస్సుతో గత కేసీఆర్ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రారంభించింది.
లక్షలాది పేద కుటుంబాలకు మాజీ ముఖ్యమంత్రివర్యులు తానే కుటుంబ పెద్దగా మారారు. డబ్బులు లేకుండా ఎవరి పెళ్లిళ్లూ ఆగొద్దని భావించారు. తెలంగాణ స్వయం పాలనలో పేదల ఆత్మగౌరవానికి పెద్దపీట వేశారు.
కల్యాణ లక్ష్మి పథకం దేశానికే మార్గదర్శిలా మారింది. పోరాడి సాధించుకున్న తెలంగాణ ఏం సాధించిందని ఎవరైనా అంటే, ఇదో ఆడబిడ్డలను ఆశీర్వదిస్తోందని ప్రతి తెలంగాణ పౌరుడు చెప్పుకునేలా ఉన్నది.
వాస్తవానికి ప్రజల పేదరికానికి విద్య, వివాహం, వైద్యం ఈ మూడు అంశాలే ప్రధాన కారణం. తమ బిడ్డల వివాహాలు చేసేందుకు తల్లిదండ్రులు వారికున్న కొద్దిపాటి ఆస్తిపాస్తులను అమ్ముకుంటున్నారు. నిలువ నీడ లేకుండా పోతున్నది.
క్షేత్రస్థాయి వాస్తవ విషయాలను గుర్తించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణ లక్ష్మి ద్వారా పేదలకు అండగా నిలిచారు. తామున్నామనే భరోసానిచ్చారు.
ఈ పథకం ప్రారంభించింది మొదలుకుని 2023 డిసెంబర్ నాటి తెలంగాణలో జరిగిన పేద ఆడబిడ్డల వివాహాలకు వెన్నుదన్నుగా నిలిచింది ముమ్మాటికీ కల్యాణ లక్ష్మి పథకమే.
పథకం అమలుకు బ్రేకులు..
గతంలో రెండు రకాల సందళ్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాల వద్ద కనిపించేవి. ఒకటి వివాహాలకు తమ నాయకులను ఆహ్వానించేందుకు పెళ్లి కార్డులతో పేదలు వచ్చేవారు. రెండోది వివాహం అయిన తర్వాత చెక్కుల పంపిణీ కార్యక్రమం చాలా కోలాహలంగా జరిగేది. ఇప్పుడా పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు.
పేదింటి బిడ్డల వివాహాలకు లక్షా నూట పదహార్లే కాదు తులం బంగారం కూడా ఇస్తామని కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేసుకున్నారు. అంతేకాదు గత ప్రభుత్వానికి తాము చాలా భిన్నంగా ఉంటామని కూడా చెప్పారు. వాస్తవం అందుకు భిన్నంగా ఉన్నది.
ఎన్నికల్లో గెలిచిన మరునాటి నుంచే పథకం అమలుకు బ్రేకులు వేయడం ప్రారంభించారు. ఏదో రూపంలో దీన్ని అడ్డుకోవాలనే అనుకున్నారు.
ఈ పథకం ద్వారా పేదలకు జరుగుతున్న న్యాయాన్ని అడ్డుకున్నారు. గ్రామీణ తెలంగాణ, పట్టణ పేదలు.. వీరే ఈ పథకాన్ని ఎక్కువగా వినియోగించుకున్నారు. మాజీ ముఖ్యమంత్రివర్యులు సంపదను సృష్టించారు, పేదలకు పంచారు. నేటి పాలకులకు ఈ రెండూ చేతకావడం లేదు.
గత ప్రభుత్వం అమలు చేసిన పథకాన్ని రద్దు చేసేందుకు సరికొత్త కుట్రలకు తెరతీస్తున్నారు. హైకోర్టు కేంద్రంగా జరుగుతున్న ప్రభుత్వ కుట్ర బుద్ధే దీనికి నిదర్శనం.
కల్యాణ లక్ష్మి పథకం చట్టబద్ధతపై ఓ న్యాయవాది కోర్టులో పిటిషన్ వేశారు. దానికి తగు సమాధానం ఇవ్వాలని కోర్టు చెప్పింది. నాలుగైదు సార్లు వాయిదా కోరారు ప్రభుత్వ న్యాయవాదులు. కానీ వాస్తవాలు కోర్టుకు సమర్పించలేదు.
పీపీలు, జీపీలు ఉండి ఏం ప్రయోజనం. ప్రజలకు నష్టం జరుగుతున్నా తగు రీతిలో ప్రభుత్వ యంత్రాంగం స్పందించకుంటే నష్టపోయేది పేదలు మాత్రమే. అయినా కూడా ఈ ప్రభుత్వం తగు రీతిలో స్పందన చూపించలేదు.
దిగువ మధ్యతరగతికి భరోసా..
పేదింటి బిడ్డల వివాహాలకు లక్షా నూట పదహార్లు ఇవ్వడం ద్వారా లక్షలాది పేద కుటుంబాలకు ప్రభుత్వం అండ దొరికింది. అంతేకాదు ఈ పథకం వలన కేసీఆర్కు ప్రజలు తమ గుండెలో స్థానం కల్పించారు. దీన్ని ప్రస్తుత పాలకులు తట్టుకోలేకపోతున్నారు. అందుకే దీన్ని క్రమంగా రద్దు చేయాలని అనుకున్నారు.
ఏదో రూపంలో పగ తీర్చుకోవాలని భావించారు. కోర్టు నెపంతో ఈ పథకాన్నే రద్దు చేయజూస్తున్నారు. మన దేశంలోనే పేదల కోసం ఏ ప్రభుత్వమూ అమలు చేయని విధంగా ఒక అద్భుతమైన పథకాన్ని ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణ పౌరులుగా అందరూ గర్వపడాలి. దానికి మరిన్ని నిధులు జోడింపునివ్వాలి.
పథకాన్ని మరింత మందికి విస్తరింపచేయాలి. అలాంటి పురోగతి చర్యలకు బదులు ప్రజాపాలన పేరుతో తిరోగమన చర్యలకు పూనుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ పథకం ప్రవేశపెట్టిన తర్వాత చాలా రాష్ట్రాల్లో పేదింటి ఆడబిడ్డల వివాహాల కోసం రకరకాల పేర్లతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పథకాల అమలుకు పూనుకున్నాయి.
ఈ పథకానికున్న సామాజిక బాధ్యతనే కాదు, సామాజిక మార్పు లక్షణాన్ని చాలా రాష్ట్రాలు గుర్తించాయి. అందుకే కేసీఆర్కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు జేజేలు పలికారు. మరీ ముఖ్యంగా దిగువ మధ్యతరగతి, పేద వర్గాల నుండి ఊహించని స్థాయిలో ప్రశంసలు, ఆశీర్వాదాలు వచ్చాయి.
ఇదే ఈ పాలకులకు కన్నుకుట్టేలా చేసింది. అందుకే పేదలను నట్టేట ముంచేందుకు కుటిల యత్నాలకు పూనుకుంటున్నారు.
నిలిచిన సాయం.. పేదలపై అప్పుల భారం..
మహబూబ్ నగర్, ఆదిలాబాద్, నల్గొండ, మెదక్ వంటి ప్రాంతాల్లో పెళ్లికి అయిన అప్పులు తీర్చేందుకే ప్రజలు వలసలు వెళ్లేవారు. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల వలసలకు ఇదో ప్రధాన కారణం. ఈ పథకం అమలు చేసిన తర్వాత ప్రజల వలసలపై తీవ్ర ప్రభావం చూపించింది.
అంతేకాదు వివాహాల కోసం ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుండి అప్పులు తీసుకునే వారి సంఖ్య భారీగా తగ్గింది. తాము సంపాదించుకున్న దానికి తోడు ప్రభుత్వం నుండి అందే లక్షా నూట పదహార్ల సాయం సరిపోతున్నది. గౌరవప్రదంగా చాలా మంది పేదలు తమ బిడ్డల వివాహాలు జరిపించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత దీని అమలు గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. పైగా ప్రజలకు సరైన సమాధానం కూడా ఇవ్వడం లేదు. తప్పకుండా దొరుకుతుందనే సాయం నిలిచిపోయింది.
పేదల ఆశలపై నీళ్లు చల్లినట్లు అయింది. ఇంకాస్త ఆలస్యం అయినా డబ్బులు ప్రభుత్వం నుండి వస్తాయనే భరోసా లేకుండా పోయింది.
వివాహాల కోసం పేదలు అప్పులు చేయక తప్పని స్థితి వచ్చింది. అసలు, మిత్తీలు కలిపి పేద కుటుంబాలపై భారీ ఎత్తున అప్పుల భారాలు పడబోతున్నాయి.
సామాజిక సోయి ఉన్న నాయకత్వం లేమి కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందనేది అందరికీ అర్థం అవుతున్న విషయం.
పథకం కొనసాగింపుకై బీఆర్ఎస్ పోరాటం..
ప్రజలకు నష్టం జరుగొద్దనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్నది. ఈ పథకం రద్దుకు ప్రభుత్వం చేస్తున్న కుట్రను బద్దలు కొట్టింది.
కల్యాణ లక్ష్మి పథకాన్ని కొనసాగించాలని పోరాటం చేస్తున్నది. తొలుత ప్రభుత్వానికి చెప్పి చూసింది. అయినా వారి నుండి స్పందన లేదు. పైగా పేదలకు మరింత నష్టం చేస్తామనే తీరే వారి ప్రవర్తన ద్వారా వ్యక్తమవుతున్నది.
పేదింటి బిడ్డల వివాహాలు ఆగొద్దంటే ఉద్యమించక తప్పని స్థితిని ఈ ప్రభుత్వం కల్పిస్తున్నది. ప్రజల మేలు కోరుతున్న నాయకులపై ముఖ్యమంత్రి ఉల్టా సీదా మాట్లాడుతున్నారు.
సామాజిక సంక్షేమాన్ని విస్మరిస్తున్నారు. సామాజిక బాధ్యతకు మంగళం పాడుతున్నారు. పేదల పక్షాన మాట్లాడుతున్న బీఆర్ఎస్ నాయకుల చిత్తశుద్ధిని శంకిస్తున్నారు.
ఈ తిరోగమన పోకడలను తెలంగాణ సమాజం గమనిస్తున్నది. పేదలకు చేస్తున్న అన్యాయాన్ని చూస్తున్నది. అందుకే బీఆర్ఎస్ చేస్తున్న పోరాటానికి భారీ ఎత్తున మద్దతు ఇస్తున్నారు.
ప్రజలకు సిసలైన ప్రజాసంక్షేమ ప్రభుత్వం బీఆర్ఎస్సే అని అంటున్నారు. పేదింటి పెద్ద కొడుకు కేసీఆర్ అని అంటున్నారు. కేసీఆర్ పేదల కోసం అమలు చేసిన కల్యాణ లక్ష్మి పథకాన్ని తిరిగి కొనసాగించేంత వరకు పోరాటాన్ని ఆపేది లేదని బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నది. పేదలకు నష్టం, కష్టం కలుగనీయమని మరోసారి గుర్తు చేస్తున్నది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
