ఈ డబ్బు ఎలా వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వసూలు చేశారు, ఏ ప్రాతిపదికన ఆ డబ్బును ఎలా ఖర్చు చేశారనే వివరాలు ఎక్కడా లేవు.
న్యూఢిల్లీ: పీఎం కేర్స్ నిధి 2023-24, 2024-25 ఆర్థిక సంవత్సరాలకు తన ఆడిట్ ప్రకటనలను ఆగస్టు 17న వెబ్సైట్లో పెట్టింది.
ఈ అకౌంట్లను ఆగస్టు 6న ఆడిట్ చేయగా ఆగస్టు 7న ఆడిటర్లు సంతకాలు చేశారు.
ప్రకటన ప్రకారం, 2024-25 ఆర్థిక సంవత్సరానికి విరాళాలు, డిపాజిట్లపై వడ్డీల ద్వారా రూ 1,200 కోట్ల నిధిని స్వీకరించింది.
మార్చి 31, 2025 నాటికి పూర్తయిన సంవత్సరానికి ఖర్చుల కింద రూ 87 లక్షలుగా నమోదు చేశారు. మార్చి 31, 2025 ముగింపు నాటికి పీఎం కేర్స్ ఖాతాల్లో రూ. 8,452 కోట్లు ఉన్నాయి.
భారీగా నిధుల సేకరణ..
కోవిడ్-19 చెలరేగడంతో అత్యవసర విపత్తును ఎదుర్కోవడానికి మార్చి 2020లో పీఎం కేర్స్ నిధిని ఏర్పాటు చేశారు. మొదటి మూడు సంవత్సరాలలోనే అది రూ 13,000 కోట్లను సేకరించింది, కేవలం మొదటి వారంలోనే సుమారు రూ 3,000 కోట్లను వసూలు చేసింది.
ఆర్టీఐ పరిధిలోకి రాదన్న ప్రభుత్వం..
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కారణంగా సీఎస్ఆర్ డబ్బును పీఎం కేర్స్ నిధి స్వీకరిస్తుందని, డబ్బు వసూలు చేస్తున్న సమయంలో ప్రభుత్వం చెప్పింది.
ప్రభుత్వ అధికారులు తమ వేతనాల నుంచి విరాళాలు ఇవ్వాలని మంత్రులు “విజ్ఞప్తులు” చేశారు. అయితే ప్రజలు సమాచారాన్ని కోరినప్పుడు ఈ ట్రస్టు పబ్లిక్ అథారిటీ కాదని వాదిస్తూ ఆర్టీఐ చట్టం కింద సమాధానాలు ఇవ్వలేమని ప్రభుత్వం స్పష్టం చేసింది.
లోక్‌సభ నియమ నిబంధనల కింద పీఎం కేర్స్ గురించి ప్రశ్నలు, ఇతర పార్లమెంటరీ జోక్యాలకు అనుమతించరాదని లోక్‌సభ సచివాలయానికి ఇటీవల ప్రధాన మంత్రి కార్యాలయం తెలియజేసింది. నిధికి సంబంధించిన ఆడిట్ నివేదికల గల్లంతు గురించి ప్రశ్నలు కూడా తలెత్తాయి.
పారదర్శకత లేమిపై ఆందోళన..
గతంలో కోర్టులు, సమాచార కమిషన్ల ద్వారా పీఎం కేర్స్‌పై మరిన్ని వివరాలు రాబట్టడానికి ప్రయత్నించిన అంజలి భరద్వాజ్‌తో సహా పారదర్శకత కార్యకర్తలు “పారదర్శకత లోపించడం చూస్తే దాతలను అజ్ఞాతంలో ఉంచి పరిమితమైన ప్రజా జవాబుదారీతనంతో ఉన్న ఎన్నికల బాండ్ల పథకాన్ని పోలి ఉన్నట్లు కనిపిస్తోంది” అని ఆందోళన వ్యక్తం చేశారు.
“పెద్ద మొత్తంలో విరాళాలను పరిశీలనల నుంచి కాపాడినట్లయితే ఒకదానికి బదులు మరొకటి (క్విడ్ ప్రో కో) ఏర్పాట్ల ద్వారా అవినీతికి ద్వారాలు తెరవగలవు. క్విడ్ ప్రో కో ఏర్పాట్లు, నిబంధనలు పాటించకపోవడం, దోపిడీ వంటివి ఎన్నికల బాండ్ల వివాదాలలో వెలుగులోకి వచ్చిన మాదిరిగానే అదే తరహా దుర్వినియోగాలకు వ్యవస్థను గురిచేయడానికి ఇలాంటి అస్పష్టతలు అవకాశం ఇస్తాయి.”
నిధిలో ఇంత పెద్ద మొత్తంలో డబ్బును ఎందుకు పని లేకుండా ఉంచారని కూడా భరద్వాజ్ ప్రశ్నించారు.
ఆడిట్ స్టేట్మెంట్ పై సందేహాలు..
“అమలు చేసే ఏజెన్సీలు” తెలియని కారణాలతో, గుర్తు తెలియని ఏజెన్సీల ద్వారా తిరిగి అందజేసిన దాదాపు రూ 324 కోట్ల చెల్లింపులకు సంబంధించిన సమాచారం లేదని ఆమె చెప్పారు.
“ఆడిట్ రిపోర్టుకు తోడుగా ఉన్న నోట్స్‌ను ఎందుకు అప్లోడ్ చేయలేదు?” అని భరద్వాజ్ ప్రశ్నించారు.
అరవింద్ గుణశేఖర్.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
