2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్రం బీజేపీ దక్షిణాది విస్తరణకు వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన రాష్ట్రంగా గుర్తింపు పొందింది.
ఆ మేరకు గత బీజేపీ జాతీయ నాయకత్వంలో తెలంగాణ నుంచి డీకే అరుణ, కే లక్ష్మణ్, బండి సంజయ్ వంటి ప్రముఖులు పలు కీలక బాధ్యతలకు ఎంపికయ్యారు.
జాతీయ కార్యవర్గంలో కోల్పోయిన స్థానం..
కానీ 2026 ఆగస్టు 17వ తేదీన జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గం పునర్నిర్మాణంలో తెలంగాణ ప్రాధాన్యతను కోల్పోయిన వైనం కనిపిస్తోంది.
మొన్నటి వరకు జాతీయ కార్యవర్గంలో ప్రధాన బాధ్యులుగా ఉన్న డీకే అరుణ, కే లక్ష్మణ్, బండి సంజయ్ ఆయా బాధ్యతల నుంచి విరమించబడ్డారు. ఆ స్థాయి బాధ్యతల్లోకి తెలంగాణ నుంచి మరెవరినీ తీసుకోలేదు.
ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ కార్యవర్గంలో వివిధ హోదాలలో ఉన్న పురందరేశ్వరి, విష్ణువర్ధన్ రెడ్డి తమ స్థానాలను కాపాడుకోగా గత కొంతకాలంగా నిర్మాణపరమైన బాధ్యతలకు దూరంగా ఉంటున్న రామ్ మాధవ్ తిరిగి కీలక బాధ్యతలోకి ప్రవేశించారు.
అమిత్ షా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రామ్ మాధవ్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
సుదీర్ఘకాలం విరామం తర్వాత తిరిగి నిన్న జరిగిన పార్టీ కార్యవర్గం పునర్నిర్మాణంలో రామ్ మాధవ్ ఉపాధ్యక్షుడిగా తెరమీదకు వచ్చారు.
ఉత్తరాదిపైనే అధినాయకత్వం దృష్టి..
ఈ పరిణామాలు గమనిస్తే బీజేపీ అధినాయకత్వం తెలంగాణలో పార్టీ విస్తరణ లక్ష్యాన్ని పక్కనపెట్టి ప్రస్తుతం ప్రశ్నార్థకం కాబోతున్న ఉత్తరాది రాష్ట్రాలలో తన పలుకుబడి, ప్రభావాలను నిలుపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తున్నది.
దేశంలో హల్చల్ చేస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనల్లో అత్యధికంగా భాగస్వాములవుతున్నది బీజేపీకి బలమైన కేంద్రాలుగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలలోనే.
సాపేక్షంగా చూసుకున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో ఈ ఉద్యమ కదలికలు పరిమితంగానే ఉన్నాయి.
తగ్గిన పోరాట పటిమ..
దీనికి తోడు బండి సంజయ్ తెలంగాణ బీజేపీ పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగినన్ని ఆందోళనలు, పోరాటాలు, ప్రభుత్వంతో ఘర్షణలు తర్వాతి కాలంలో కనిపించడం లేదు.
రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీకి, కిషన్ రెడ్డి నాయకత్వంలోని బీజేపీకి మధ్య పోరాటం వాద ప్రతివాదనలకే పరిమితం అవుతోంది.
కరువైన నిర్దిష్ట కార్యాచరణ..
మరొక ఏడాదిన్నర కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నా రాష్ట్రంలో అధికారం కోసం బరిలో నిలవనున్నామంటున్న బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసే ఒక నిర్దిష్ట ఎజెండాను గాని, సమస్యను గానీ గుర్తించలేకపోయింది.
రాష్ట్రంలో ఓటింగ్ మోతాదులను గణనీయంగా ప్రభావితం చేయనున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కసరత్తులో కూడా బీజేపీ పెద్ద ఎత్తున జోక్యం చేసుకున్న దాఖలాలు కనిపించడం లేదు.
వెనుకబట్టు పట్టిన ప్రాధాన్యత..
ఏ రకంగా చూసుకున్నా 2023-24తో పోలిస్తే రాష్ట్రంలో బీజేపీ కార్యాచరణ కుదించుకుపోయిన దాఖలాలు మాత్రమే కనిపిస్తున్నాయి.
జాతీయ రాజకీయాలలో మారుతున్న మోదీ-అమిత్ షాల ప్రాధాన్యతల్లో తెలంగాణలో బీజేపీ విస్తరణ ప్రాధాన్యత వెనకపట్టు పట్టినట్లుగా తాజాగా పునర్నిర్మించబడిన బీజేపీ జాతీయ కార్యవర్గం పొందికను పరిశీలిస్తే అర్థమవుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
