దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు, యువత తమ విద్య, ఉపాధి, పరీక్షలు, భవిష్యత్తుకు సంబంధించిన సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగారు.
అయితే, తమ సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా పోరాడుతున్న విద్యార్థులపై బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించటం దారుణం. అయినా ఒక్క అడుగు వెనక్కి తగ్గకుండా రోజుల తరబడి అక్కడే ఉండి పోరాటాన్ని కొనసాగించారు.
ఈ ఉద్యమం సాగుతున్న కొద్దీ విద్యార్థుల డిమాండ్లపై చర్చ జరగాల్సిన చోట పోలీసుల ఆంక్షలు, బ్యారికేడ్లు, నిర్బంధాలు ప్రధానంగా కనిపించాయి. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ఆలోచించకుండా పోరాటాన్ని అణచివేయడంపై దృష్టి పెట్టింది.
చివరి దశలో చలో సంసద్‌కు విద్యార్థులు పిలుపునిచ్చినప్పుడు పోలీసు జోక్యం మరింత తీవ్ర రూపం దాల్చింది. దేశవ్యాప్తంగా ఈ పోరాటానికి మద్దతుగా రోడ్లపైకి వచ్చిన విద్యార్థులు, యువతని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు బలగాలతో అణచివేయాలని తీవ్రంగా ప్రయత్నం చేశాయి.
ఎక్కడికక్కడ అరెస్టులు, గృహనిర్బంధాలు, లాఠీ ఛార్జీలు, కేసులు, వాటర్ ఫైరింగ్‌లు సర్వసాధారణం అయిపోయాయి. ఢిల్లీలో మొదలుపెడితే తమిళనాడు వరకు దేశం మొత్తం ఇదే పరిస్థితి.
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఈ చర్యలు మరింత ఎక్కువ. బీహార్, బెంగాల్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఈ ఘటనలు మన కళ్లల్లో ఎప్పటికీ మెదులుతూనే ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం పరిపాలనలో ఉన్న మన ఆంధ్రప్రదేశ్‌లో కూడా మేము ఏమీ తక్కువ కాదన్నట్లు జూలై 23న జరిగిన విద్యార్థి సంఘాల బంద్‌ను విఫలం చేయడానికి చేయని ప్రయత్నం లేదు.
విశాఖ, అనంతపురం, శ్రీకాకుళం, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో పోలీసులు విద్యార్థి నాయకులను అరెస్టులు చేసే సందర్భంగా ఈడ్చి పడేసిన ఘటనలు చూశాం.
ఎన్ని నిర్బంధాలు విధించినా విద్యార్థులను పోరాటంలోకి రాకుండా నిరోధించలేకపోయారు. కోట్లాది మంది విద్యార్థులు, యువత ఈ పోరాటంలో భాగస్వామ్యం అయ్యారు. 
జంతర్ మంతర్ చుట్టూ పెరిగిన పోలీసు నిఘా..
దీర్ఘకాలికంగా నిరసన కొనసాగడంతో జంతర్ మంతర్ పరిసరాల్లో పోలీసుల నిఘా మరింత పెంచారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు, యువతపై నిఘా, ర్యాలీ మార్గాలపై నియంత్రణ, బ్యారికేడ్ల ఏర్పాటు వంటి చర్యలన్నీ విద్యార్థుల కదలికలను పరిమితం చేయాలనే ఉద్దేశమే.
ఒకవైపు విద్యార్థులు తమ శిబిరాన్ని కొనసాగించడానికి ఆహారం, నీరు, టెంట్లు, వైద్య సహాయం వంటి కనీస అవసరాలను సమకూర్చుకుంటూ ఉంటే, మరోవైపు పోలీసు ఆంక్షల వలన కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఎవరైనా సహకరించిన వారిని బయటపెట్టడం దాడిచేయటం, లేదా వారినీ దేశద్రోహులను చేయటం, ఆహారం కూడా అందకుండా చేయటం వంటివి జరిగాయి.
దీర్ఘకాలిక నిరసన శిబిరంలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో వారి రాకపోకలు, మద్దతుదారుల ప్రవేశం, అవసరమైన సామగ్రి తీసుకురావడం వంటి అంశాలు కూడా ముఖ్యంగా మారాయి. ఈ పరిస్థితుల్లో పోలీసు జోక్యం విద్యార్థులకు మరింత ఆటంకంగా మారింది.
సోనమ్ వాంగ్చుక్ను శిబిరం నుంచి తరలించిన ఘటన..
ఉద్యమంలో కీలకమైన పరిణామం సోనమ్ వాంగ్చుక్ను జంతర్ మంతర్ నుంచి ఆసుపత్రికి తరలించడం. జూలై 18న పోలీసులు ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వైద్యుల సూచన, ఆరోగ్య పరిస్థితి కారణంగానే ఈ చర్య తీసుకున్నామని తెలిపారు.
నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యార్థుల డిమాండ్లపై చర్చ పెట్టాలి కదా. దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్ను పరదాల చాటున బలవంతంగా తీసుకెళ్లారు. అడ్డుకున్న నాయకులను కర్కశంగా ఈడ్చేశారు. నిజంగా ఆయన ఆరోగ్యంపై శ్రద్ధ ఉంటే అలా ఈడ్చుకుపోతారా? ఆ శిబిరాన్ని మొత్తం పోలీసులు అధీనంలోకి తీసుకొని అత్యంత దారుణంగా కిడ్నాప్ చేశారు. తీసుకెళ్లిన తరువాత కూడా ఎవరినీ కలవనివ్వకుండా నిర్బంధించారు.
ఈ ఘటన ద్వారా ఒక ముఖ్యమైన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. నిరసన శిబిరంలో ఉన్న వ్యక్తి ఆరోగ్యం గురించి ప్రభుత్వం ఆందోళన చెందడం సహజమే అయినప్పటికీ, అలాంటి పరిస్థితిలో విద్యార్థులతో సంప్రదింపులు జరిపి పరిష్కారం కనుగొనాల్సిన అవసరం లేదా?
చలో సంసద్‌కు ఉక్కుపాదం..
జూలై 20న చలో సంసద్‌కు పిలుపు ఇవ్వడంతో పోలీసులు విద్యార్థులపైన మరింత నిర్బంధం ప్రయోగించారు. విద్యార్థులు పార్లమెంట్‌కు రాకుండా మెట్రోను బంద్ చేశారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు పెట్టి విద్యార్థులను నిర్బంధించారు.
ఢిల్లీ పోలీసులు ఈ కార్యక్రమానికి అనుమతి లేదని ప్రకటించారు. పార్లమెంట్ పరిసరాల్లో భారీగా బలగాలను మోహరించి, అనేక ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
విద్యార్థుల అడుగులు పార్లమెంట్ వైపు పడకుండా అడ్డుకునేందుకు పోలీసు యంత్రాంగం తీవ్ర నిర్బంధం ప్రయోగించింది. దీంతో విద్యార్థుల ప్రశ్నలు పార్లమెంట్‌కు చేరకముందే వాటిని పోలీసు బ్యారికేడ్ల వద్ద నిలిపివేసిన పరిస్థితి ఏర్పడింది. అయినా ఈ నిర్బంధాన్ని అధిగమించి చలో సంసద్‌కు లక్షలాది మంది విద్యార్థులు, యువత జంతర్ మంతర్ వద్దకు చేరుకున్నారు.
ఎంత అణచివేయాలని చూసినా లక్షలాదిగా తరలి వచ్చిన విద్యార్థులు, యువత పార్లమెంట్ వైపుకు అడుగులు వేశారు. బ్యారికేడ్లను అడ్డుపెట్టి విద్యార్థులను ఆపాలని చూస్తే ఆక్రోశించిన విద్యార్థులు వాటిని తోసి సమస్య పరిష్కారం కోసం ముందుకు సాగారు.
ఇదంతా ఓర్చుకోలేక విద్యార్థులకు దేశవ్యాప్తంగా పెరుగుతున్న మద్దతు చూసి విద్యార్థులపైన అత్యంత కర్కశంగా అమిత్ షా(ఢిల్లీ) పోలీసులు లాఠీలు ఝుళిపించారు.
యూనిఫాం లేకుండా నేమ్ బోర్డు లేకుండా పోలీసు ముసుగులో వచ్చిన వ్యక్తులు మరింత దారుణంగా ప్రవర్తించారు. ఆడ, మగ తేడాల్లేకుండా వారి ప్రైవేటు పార్టులు తాకడం, లాఠీలతో కొట్టడం ఇప్పటికీ సోషల్ మీడియాలో చూస్తున్నాం.
లాఠీలతో ఆగకుండా పోలీసులే ఒక రాళ్ల లారీని ఉంచుకొని అవి విద్యార్థులపై విసరడం, టియర్ గ్యాస్ ప్రయోగించటం, వాటర్ కెనాన్ ఉపయోగించారు. విద్యార్థులను విచక్షణ రహితంగా కొట్టడమే కాకుండా పెల్లెట్ బాంబులు వేయటం కూడా చూశాం.
వందలాది మంది విద్యార్థులు గాయపడగా వారిని ఆసుపత్రికి తీసుకెళ్లే దానికి కూడా పోలీసులు ఆంక్షలు విధించారు. ఇదంతా గోదీ మీడియా ఎక్కడా ప్రచురించకపోయినా కనీసం విద్యార్థులు సోషల్ మీడియా ద్వారా అయినా బయటపెట్టాలని చూస్తే జామర్లు పెట్టి మొత్తం సిగ్నల్స్‌ని తొలగించారు. విద్యార్థులకు ఎటువంటి కమ్యూనికేషన్ లేకుండా తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించారు.
విద్యార్థులు తమ సమస్యలను పార్లమెంట్‌కు తీసుకెళ్లడానికి ప్రయత్నించినప్పుడు, వారితో చర్చించడానికి బదులుగా పోలీసు బలగాలను ఉపయోగించడం ఎంతవరకు ప్రజాస్వామిక పరిష్కారం? అనే ముఖ్యమైన ప్రశ్న ముందుకు వస్తుంది. ప్రజాస్వామ్యంలో నిరసన పౌరులకు హక్కు. ఆ హక్కును అమలు చేసే సమయంలో బలప్రయోగం జరగకుండా చూడటం ప్రభుత్వ బాధ్యత.
నిర్బంధం అంటే కేవలం అరెస్టు కాదు..
ఈ ఉద్యమంలో నిర్బంధాన్ని కేవలం అరెస్టులతో కొలవలేం. ర్యాలీకి వెళ్లకుండా అడ్డుకోవడం, మార్గాలను మూసివేయడం, బ్యారికేడ్లతో విద్యార్థులను నియంత్రించడం, వారిని అదుపులోకి తీసుకోవడం, నిరసన ప్రదేశానికి పరిమితం చేయడం వంటి చర్యలన్నీ ఉద్యమంపై విధించిన పరిమితుల్లో భాగమే.
ఒక విద్యార్థి ఢిల్లీకి వచ్చి తన సమస్యను చెప్పేందుకు ప్రయత్నించినప్పుడు అతని ముందున్న ప్రధాన అడ్డంకి ప్రభుత్వం సమాధానం కాకుండా పోలీసు బ్యారికేడ్గా మారితే, అది ప్రజాస్వామ్య వ్యవస్థ పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తుతుంది.
పోలీసు చర్యలతో ఉద్యమం ఆగలేదు..
చలో సంసద్ సందర్భంగా పోలీసు ఆంక్షలు, నిర్బంధాలు ఎదురైనా విద్యార్థుల ప్రశ్నలు అక్కడితో ఆగలేదు. ఢిల్లీలో జరిగిన పరిణామాలపై ఇతర ప్రాంతాల్లో కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. విద్యార్థులపై పోలీసు చర్యలను ప్రశ్నిస్తూ సంఘీభావ కార్యక్రమాలు జరిగాయి.
ఇది ఒక ముఖ్యమైన విషయాన్ని తెలియజేస్తుంది. ఒక ప్రదేశంలో విద్యార్థులను అడ్డుకోవడం ద్వారా వారి సమస్యలను అడ్డుకోలేరు.
సమస్యకు పరిష్కారం లభించనంతకాలం ఆ ప్రశ్న మరోచోట, మరో విద్యార్థి గొంతులో మళ్లీ వినిపిస్తుంది.
26 రోజుల పోరాటం చెప్పిన పాఠం..
సోనమ్ వాంగ్‌చుక్ 26 రోజుల నిరాహార దీక్షను ముగించినప్పటికీ, ఈ ఉద్యమం లేవనెత్తిన ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. ముఖ్యంగా విద్యార్థుల శాంతియుత నిరసన హక్కు, పోలీసుల బలప్రయోగం, నిర్బంధ చర్యలు, ప్రభుత్వ స్పందన వంటి అంశాలు ప్రజాస్వామిక చర్చలో కొనసాగాల్సిన అవసరం ఉంది.
జంతర్ మంతర్ నుంచి చలో సంసద్ వరకు జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఈ పోరాటంలో ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది: విద్యార్థులు తమ సమస్యలను చెప్పడానికి రోడ్డుపైకి వచ్చినప్పుడు ప్రభుత్వం వారి మాట వినాల్సిన బాధ్యత కలిగి ఉంది. పోలీసు బ్యారికేడ్లు ఆ ప్రశ్నలను తాత్కాలికంగా ఆపగలవు కానీ వాటికి సమాధానం ఇవ్వలేవు.
అందుకే ఈ పోరాటాన్ని కేవలం ఒక నిరసనగా కాకుండా విద్యార్థుల ప్రజాస్వామిక హక్కుల కోసం జరిగిన పోరాటంగా, నిర్బంధ రాజకీయాలకు వ్యతిరేకంగా విద్యార్థులు వ్యక్తం చేసిన ప్రతిఘటనగా చూడాల్సిన అవసరం ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
