నాటి దేశ స్వాతంత్ర్య పోరాటం నుంచి నేటి పౌర, ప్రజాతంత్ర, మానవ హక్కుల పోరాటాల వరకూ న్యాయవాదుల పాత్ర తెలియనిది కాదు.
మొన్న విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సాయి కృష్ణ లాకప్ డెత్ దుర్ఘటన నుంచి నేటి నల్సార్ యూనివర్సిటీ నిరంకుశ సంఘటన వరకూ న్యాయవాద లోకం పోషించే పాత్ర తెలియనిది కాదు.
పోలీస్ బాధితులకు అండగా న్యాయవాదులు..
పోలీస్ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా, రాజ్య హింసకు నిరసనగా గొంతెత్తడంలో, పోలీస్ బాధితులకు అండగా నిలవడంలో సందర్భానుసారంగా న్యాయవాద లోకం తన వంతు పాత్ర పోషిస్తూనే ఉంది.
ఇవన్నీ గత, వర్తమాన చరిత్రలే. ఆ చరిత్రలోకి ఇప్పుడు వెళ్లడం లేదు. తాజాగా అనంతపురంలో జరిగిన ఒక సంఘటన ప్రత్యేకంగా పేర్కొనాలి.
అనంతపురం న్యాయవాదుల నిరసన కలెక్టర్, ఎస్పీలకు వినతి పత్రాలిచ్చి వెళ్లిపోయేది కాదు.
నల్ల బ్యాడ్జీలతో నిరసన నినాదాలు ఇచ్చి వెళ్లిపోయే ఆందోళన కాదు. అది ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుట మెయిన్ రోడ్‌పై రాస్తారోకో కావడం గమనార్హం.
15 గంటల పాటు సాగిన నిరసన దీక్ష..
ఆ రాస్తారోకో కూడా పావుగంటో, అరగంటో చేపట్టి ముగించింది కాదు. గంట లేదా రెండు గంటలు చేసి విరమించింది కాదు.
ఏకంగా 15 గంటల రాస్తారోకో చేసింది. రోడ్ రోకో స్థలంలోనే టెంట్లు వేసి తమ డిమాండ్ నెరవేరే వరకూ కదిలేది లేదని, భోజనాలు సైతం రోడ్డు మీదే తిని దీక్షతో పోరాడి తుదకు విజయం సాధించిన గొప్ప స్ఫూర్తిదాయక పోరాటమది. అత్యంత విశ్వసనీయ సమాచారం ఆధారంగా నివేదిస్తున్నాను.
అసలేం జరిగింది?..
ఆగస్టు 13న గౌతమ్ కృష్ణ అనే యువ న్యాయవాది పట్ల పోలీస్ జులుంపై నిరసనగా జరిగింది. వెహికల్ చెకింగ్‌లో భాగంగా తనను రోడ్‌పై ఆపి అవసరమైన పత్రాలు అడిగారు. అవి సమర్పించాడు. ఆ క్రమంలో లాయర్ గుర్తింపు కార్డు కూడా చూపించాడు. లాయర్ అయితేనేమి అంటూ రూరల్ సీఐ చాలా హై హ్యాండెడ్‌గా ప్రవర్తించారు. పైగా పోలీస్ స్టేషన్‌కి లాక్కెళ్ళి కొట్టించడం జరిగింది. ఆ ఘటన ఆందోళనకు కారణం.
ముందురోజు తనను స్టేషన్‌కి తీసుకెళ్లి కొట్టించిన సీఐ దౌర్జన్య చర్య గూర్చి నిన్న 14వ తేదీన కోర్టుకు వచ్చి బార్ అసోసియేషన్‌కి ఆ బాధిత లాయర్ నివేదించారు. జిల్లా బార్ అసోసియేషన్ సత్వరంగా, తీవ్రంగా స్పందించింది. వెంటనే అత్యవసర సమావేశం జరిపి కోర్టు విధుల బహిష్కరణకు తీర్మానం చేసింది.
కోర్టు ఎదురుగా మెయిన్ రోడ్డుకు అవతల సైడ్ రూరల్ పోలీస్ స్టేషన్ ఉంది. సామూహికంగా లాయర్లు స్టేషన్‌కి వెళ్లి సీఐ నుండి క్షమాపణ కోరారు. ఆ డిమాండ్ ఫలించక పోవడంతో పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చి రోడ్ మీదే బైఠాయింపుకు దిగారు. అది నిన్న 14వ తేదీన ఉదయం 11 గంటలకు ప్రారంభమై ఈరోజు ఉదయం 2 గంటలకు ముగిసింది.
పోరాట స్థలంలోనే లంచ్, డిన్నర్..
కోర్టులో లాయర్ల క్యాంటీన్లో యుద్ధ ప్రాతిపదికన భోజనం వండించి సీనియర్ లాయర్లతో సహా రోడ్డు మీద రాస్తారోకో టెంట్ దగ్గరే లంచ్ చేయడం విశేషం.
ఆందోళన అనేక రకాల మలుపులు తిరిగింది. ఆ వివరాలను ఇక్కడ పేర్కొనడం లేదు. కానీ మూల మలుపులను టూకీగా ప్రస్తావిద్దాం.
మధ్యాహ్నం 12 నుండి సాయంత్రం 5 గంటల మధ్య డీఎస్పీ ఎనిమిది రౌండ్లు బార్ అసోసియేషన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు.
పోలీసుల ప్రతిపాదనలు – లాయర్ల తిరస్కరణ..
లాయర్లను వదిలేసి బార్ ప్రతినిధివర్గం పోలీస్ స్టేషన్ లోనికి వస్తే సీఐతో క్షమాపణ చెప్పించే ప్రతిపాదన డీఎస్పీ నుండి ఒక దశలో వచ్చింది. న్యాయవాద లోకం తిరస్కరించింది.
తమ సీఐని కోర్టులో బార్ అసోసియేషన్ హాల్‌కి తీసుకొని వచ్చి ఆ బాధిత లాయర్‌కి ఆంతరంగిక క్షమాపణ చెప్పించే ప్రతిపాదన మరో దశలో వచ్చింది. ఇదీ తిరస్కరించారు.
కోర్టు ఆవరణలో లాయర్ల సమక్షంలో బహిరంగ క్షమాపణ చెప్పించే ప్రతిపాదన మరో దశలో వచ్చింది. అదీ తిరస్కారానికి గురైనది.
ఒకటే డిమాండ్ – బహిరంగ క్షమాపణ..
“మా లాయర్ని రోడ్డు మీదే బహిరంగంగా కొట్టారు. తిరిగి రోడ్డుపై లాయర్ల అందరి సమక్షంలో బాధిత లాయర్‌కి క్షమాపణ చెప్పాలి” అని మొదటి నుంచి చివరి వరకూ లాయర్ల డిమాండ్ ఇది ఒకటే.
సాయంత్రం 5 గంటల తర్వాత పోలీస్ వ్యూహం మారింది. లాయర్లు రోడ్డు మీద ఉదయం 11 గంటల నుండి ఉన్నందున ఇక చీకటి పడుతుంటే ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారని అంచనా వేశారు. ఆకస్మికంగా చర్చలు ఆపివేశారు. డీఎస్పీ సహా స్టేషన్ నుండి నిష్క్రమించి నిశ్శబ్ద వాతావరణాన్ని వ్యూహాత్మకంగా సృష్టించారు.
రాస్తారోకో నిశ్శబ్దంగా హతమవుతుందని అంచనా వేశారు. కానీ పోలీస్ అంచనా తిరగబడింది. దీనిని ఒక సవాల్‌గా తీసుకొని సోషల్ మీడియా ద్వారా లాయర్ల సమీకరణకి బార్ అసోసియేషన్ పూనుకుంది. వారి సంఖ్య మరింత పెరిగింది. సాయంత్రం ఇళ్లకు వెళ్లిన లాయర్లు సైతం తిరిగి వచ్చారు.
అర్ధరాత్రి వరకూ వీడని పట్టు..
చీకటి పడింది. రాత్రి 7 గంటలు, 8, 9, 10, 11 ఇలా గడుస్తూ పోయింది. లాయర్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. అనంతపురం పరిసర పట్టణాల లాయర్లు కూడా రాసాగారు.
అర్ధరాత్రి దాటింది. తిరిగి డీఎస్పీ వచ్చి సంప్రదింపుల ప్రక్రియ పునఃప్రారంభం చేశారు. అర్ధరాత్రి 2 గంటలకు సీఐని బయటకు తీసుకొచ్చి రోడ్డు మీద లాయర్ల సమక్షంలో క్షమాపణ చెప్పించారు. దీనితో ఆందోళన ముగిసింది.
ఉదయం 11 గంటల నుండి అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల వరకూ దాదాపు 15 గంటల పాటు సాగిన సుదీర్ఘ పోరాటమిది. ఇంకో మాటలో 14వ తేదీ ఉదయం ప్రారంభమై 15వ తేదీన ఉదయం ముగిసింది. ఉదయం 11 నుండి తెల్లవారుజాము 2 గంటల వరకు. రెండు భోజనాలు లంచ్, డిన్నర్ రోడ్డు మీదే తిన్నారు.
స్ఫూర్తినిచ్చిన ఐక్యత..
అనంతపురంలో పెద్ద పేరు ప్రతిష్టలతో పాటు ప్రజాదరణ పొందిన సీనియర్ లాయర్లతో సహా 15 గంటల పాటు వందల సంఖ్యలో లాయర్లు రోడ్డు మీద బైఠాయించడం ప్రత్యేక విశేషం.
యువ లాయర్లు చాలా క్రియాశీల పాత్రను పోషించారు. మహిళా లాయర్లు మరింత ఆదర్శ పాత్రను పోషించారు.
ఈ సందర్భంగా లాయర్ల ప్రసంగాల్లో ప్రజల పట్ల కూడా తమ ఆర్ద్రత ప్రదర్శించారు. “లాయర్ల పట్ల ఇలా దౌర్జన్యకరంగా ప్రవర్తిస్తే సామాన్య ప్రజల పట్ల పోలీస్ జులుం ఎంత ఘోరంగా ఉంటుందో” అని ప్రశ్నలు వేశారు. బాధిత ప్రజల పట్ల తమ సానుకూల, సానుభూతి వైఖరులు ప్రదర్శించారు.
ఏమైనా అనంతపురం లాయర్లు సాగించిన నిన్నటి 15 గంటల పోరాటం ఆషామాషీ విషయం కాదు. ఇది మొత్తం న్యాయవాద లోకానికి ఆదర్శంగా నిలుస్తుంది.
అదే విధంగా మున్ముందు పోలీస్ దౌర్జన్యాలు, దురాగతాలకు వ్యతిరేకంగా ధైర్యంగా నిలబడి పోరాడేందుకు సామాన్య ప్రజలకు, ముఖ్యంగా పీడిత, తాడిత, బాధిత ప్రజలకు స్ఫూర్తిని ఇస్తుంది.
నిన్నటి అనంతపురం లాయర్ల ఆందోళనతో పాటు అది సాధించిన విజయానికి విశేష ప్రాచుర్యం కల్పిద్దాం.
ఇది ప్రజాస్వామ్య విజయం..
రాజ్యాంగబద్ధంగా దఖలైన తమ విధులు నిర్వహించడానికి బదులు ఇలాంటి చట్టవిరుద్ధ చర్యలకు పాల్పడే సందర్భాల్లో అనంతపురం లాయర్ల పోరాటం ఆదర్శంగా తీసుకోవాల్సి ఉంది.
అది కేవలం లాయర్ల లోకానికి పరిమితమైన విజయం కాదు. ఇది సమస్త ప్రజాస్వామ్య పోరాటాలకు లభించిన విజయం. సారాంశంలో ఇదో ప్రజా విజయంగా కూడా ప్రచారం చేద్దాం. ఈ 15 గంటల సుదీర్ఘ పోరాటం సాగించిన అనంతపురం లాయర్ల లోకానికి జేజేలు చెబుదాం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
