భారతదేశంలోని తూర్పు, ఈశాన్య ప్రాంతాలలోని అనేక భాగాలలో ప్రజా పోరాటాలతో బంగ్లా భాషకు సుదీర్ఘమైన చరిత్ర ఉంది.
భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నేతృత్వంలోని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, తన అధికారిక సమాచార ప్రసారాలన్నీ బంగ్లా లేదా హిందీ భాషలలోనే ఉంటాయని ప్రకటించడం ద్వారా భారతదేశంలో ఎప్పటి నుంచో ఉన్న భాషా వివాదాన్ని మళ్లీ రాజేసింది.
ఈ ప్రకటన డార్జిలింగ్, కాలింపాంగ్ కొండలు, తెరాయ్, డూఆర్స్ ప్రాంతాల్లోని నేపాలీ మాతృభాషా పౌరులలో ‘మళ్లీ ఇదేనా?’ అనే ఆందోళనను కలిగించింది.
ఎందుకంటే దశాబ్దం కంటే తక్కువ సమయం క్రితమే(2017లో), అధికారిక భాషగా కేవలం బంగ్లాను మాత్రమే రుద్దే నాటి ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈ ప్రాంతమంతా నిరసనలతో అల్లకల్లోలమైంది. అనేక మంది తమ ప్రాణాలను కోల్పోయారు.
ప్రతిపాదిత ‘భాషా’ విధానం, ప్రభుత్వం విభిన్న తరగతుల ప్రజలు, వారి భాషలను ఎలా చూస్తుందో, వివిధ తరగతుల ప్రజలు ప్రభుత్వ ఉద్దేశాలను ఎలా అర్థం చేసుకుంటున్నారో అనే లోతైన ప్రశ్న మరోసారి ఉత్పన్నమైంది.
భాషా ఆందోళన అనేది అస్తిత్వం, అనుబంధం, ప్రజాస్వామ్య భాగస్వామ్యం(లేదా మినహాయింపు)పై సాగుతున్న విస్తృత పోరాటంలో ఒక భాగం. ‘లాంగ్వేజ్ రైట్స్ యాజ్ హ్యూమన్ రైట్స్'(మానవ హక్కులుగా భాషా హక్కులు) పుస్తకంలో స్టీఫెన్ మే రాసినట్లుగా, “ఇతర భాషలన్నింటినీ మినహాయించి ఒకే భాషకు ప్రాధాన్యతనిచ్చే ఏ విధానమైనా అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే అది ఏకీకరణకు బదులుగా విభజనను ప్రోత్సహించే అంశంగా మారుతుంది.”
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించిన ప్రతిపాదిత భాషా విధానం వల్ల సమానంగా ప్రభావితమయ్యే సంథాలీ, రాజ్‌బంశీ, కురుఖ్, సాద్రీ, ఇతర ఆదివాసీ సమాజాలైన ముండారీ, కోడా/కోరా, తోతో, లోధా, ఇతర మాతృభాషా పౌరులలో కూడా ఇది తీవ్ర ఆందోళనలను కలిగించింది.
భాష, సంస్కృతి – మానవశాస్త్ర అవినాభావ సంబంధం..
సంస్కృతి, సమాజంలో భాష ప్రాముఖ్యతను మానవశాస్త్రం(ఆంత్రోపాలజీ) ఎంతగానో గౌరవిస్తుంది. భాషను దాని నాలుగు ప్రధాన విభాగాలలో ఒకటిగా ‘భాషా మానవశాస్త్రం'(లింగ్విస్టిక్ ఆంత్రోపాలజీ)గా అధ్యయనం చేస్తారు.
మానవశాస్త్రం అనేది సంస్కృతితో కూడా ముడిపడి ఉంటుంది. సంస్కృతులు ఒక తరం నుండి మరొక తరానికి కొనసాగుతుంటాయని మనకు తెలిసిందే. అసాధ్యమైనదిగా అనిపించే కార్యం భాష ద్వారానే సాధ్యమవుతుంది.
మానవులకు సంక్లిష్టమైన భాషా నిర్మాణాలు ఉన్నాయి. ఒక పిల్లవాడి మొదటి భాషను మాతృభాష అని పిలుస్తారు. భాషలు తమ పరిమితులను దాటి ఒక సమూహం గుర్తింపులో భాగమవుతాయి. దాని సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. దాని ప్రపంచ దృష్టిని(వరల్డ్‌వ్యూ) తీర్చిదిద్దుతాయి.
అనేక జాతీయతలు/జాతులు తమ మాట్లాడే భాషల పేర్లతో (నేపాలీలు, తమిళులు, సంథాల్లు, మలయాళీలు, బెంగాలీలు, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జపనీస్ మొదలైనవి) పిలువబడటంలో ఆశ్చర్యం లేదు. ఆ విధంగా భాష అనేది అనేక సమూహాలకు ప్రాథమిక భావోద్వేగంగా, అస్తిత్వంగా ఉద్భవిస్తుంది.
ఆధునిక రాజ్యం, మార్కెట్, ప్రజాస్వామ్యం ఆవిర్భావం, పాఠశాలల ద్వారా విద్యను వ్యవస్తికరించడంపై మానవశాస్త్ర పరిజ్ఞానం, మనం పూర్తిగా భిన్నమైన సిద్ధాంతాలతో వ్యవహరిస్తున్నామని తెలియజేస్తుంది.
సమాజాలే తమ పౌరులకు తమ తమ భాషల్లో విద్యను అందించాయి. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత, వలసవాదం దాని వికృత రూపంలో అంతరించినందున, భిన్నత్వ జనాభా కలిగిన దేశాలు లేదా దేశ-రాజ్యాల (నేషన్-స్టేట్స్) అనే నూతన దృగ్విషయం ఉద్భవించడం ప్రారంభమైంది.
ఈ భిన్నత్వ రాజ్యాలలో స్వయం పాలనతో మరొక ప్రశ్న ఎదురయింది. వివిధ సమూహాలలో(భాషాపరంగా కూడా) ఏ సమూహానికి రాజకీయ అధికారం లభిస్తుంది? దీనికి ప్రజాస్వామ్యం అనే భావన “ప్రజల, ప్రజల చేత, ప్రజల కొరకు ప్రభుత్వం”గా సమాధానమిచ్చింది.
అయితే, ఇతర భాషలను ఆధిపత్య భాషగా మార్చడం, సాంస్కృతికంగా రుద్దడం వల్ల కలిగే ముప్పుపై కొన్ని భాషా మైనారిటీలు పదే పదే అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. స్వతంత్ర దేశంగా మన దేశం జన్మించినప్పటి నుండి భారతదేశం అనేక భాషా ఉద్యమాలను చూసింది.
భాషా ఉద్యమాల చరిత్ర..
నాటి మద్రాసు రాష్ట్రం నుండి తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక రాష్ట్రాన్ని డిమాండ్ చేస్తూ 58 రోజుల నిరాహారదీక్ష అనంతరం పొట్టి శ్రీరాములు మరణించడంతో, తెలుగు మాట్లాడే ప్రజలు అదే డిమాండ్‌ను వినిపిస్తూ భారీ ఎత్తున నిరసనలు వ్యక్తం చేశారు. దీని ఫలితంగా నాటి నెహ్రూ ప్రభుత్వం 1953లో ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భావానికి ఆమోదం తెలిపింది.
అంతకుముందు భాషా ప్రాతిపదికన మరిన్ని విభాగాలు ఏర్పడే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకోవడానికి ప్రభుత్వం ఎంతో అయిష్టంగా ఉండేది. కానీ భాష ప్రాముఖ్యతను, దానికి ఉన్న ప్రాథమిక భావోద్వేగాన్ని అప్పటి ప్రభుత్వం తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికి పొట్టి శ్రీరాములు మరణం అవసరమైంది.
ఇది 1953లో ఫజల్ అలీ నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటుకు దారితీసింది. ఆ కమిషన్ సిఫార్సుల మేరకు 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చింది.
రాజ్యాంగంలోని 7వ సవరణ ద్వారా 1956లో ప్రధానంగా భాషా ప్రాతిపదికన రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగింది.
అప్పటి మద్రాసు రాష్ట్రంలో రాజకీయ రంగాన్ని శాసించిన తమిళ భాష మాట్లాడే వారిచే తాము ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడబడుతున్నామని నాటి మద్రాసులోని తెలుగు ప్రజలు భావించారు.
సీఎన్ అన్నాదురై (అందరూ ప్రేమగా ‘అన్నా’ అని పిలుచుకునే) నాయకత్వంలో అదే మద్రాసు రాష్ట్రం, 1969లో శాసనసభ ద్వారా ఆ రాష్ట్రాన్ని ‘తమిళనాడు’ (తమిళుల నాడు/దేశం)గా పునర్నామకరణం చేసింది.
పార్లమెంటులో ‘అధికారిక భాషా బిల్లు, 1963’పై ప్రసంగిస్తూ ఆయన, “ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ పాలన మాత్రమే కాదు” అని కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గుర్తుచేశారు.
ఈవీ రామస్వామి (ప్రేమగా ‘పెరియార్’ అని పిలువబడే) స్థాపించిన ద్రావిడ కళగం నుండి ఉద్భవించిన తమిళనాడులోని ద్రావిడ పార్టీలు, హిందీని బలవంతంగా రుద్దడానికి వ్యతిరేక పోరాటాల ద్వారా ప్రాంతీయ రాజకీయాల్లో తమ పాత్రను సుస్థిరం చేసుకున్నాయి. హిందీకి వ్యతిరేకంగా 1937లో పెరియార్ నాయకత్వంలో పోరాటం ప్రారంభమైంది.
అయితే, ఇటీవల పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పెరియార్ పేరు ప్రస్తావించకుండా, ఆయన తమిళాన్ని ఒక ‘అనాగరిక’ భాషగా తోసిపుచ్చారని అనడం, దానికి నటుడు-ఎంపీ కమల్ హాసన్ సీతారామన్ వ్యాఖ్యలను విమర్శిస్తూ ఇచ్చిన సమాధానం తమిళ రాజకీయ వర్గాల్లో వైరల్ అయినాయి. దీనిని పెరియార్ రాజకీయ దృక్పథం ద్వారా చూడాల్సి ఉంది.
పెరియార్ సామాజిక దృక్పథం, హిందీ వ్యతిరేకత..
పెరియార్ బలవంతంగా రుద్దడాన్ని (అది ఏ రూపంలోనైనా సరే), వివక్షను లేదా దోపిడీని తీవ్రంగా వ్యతిరేకించారు. అణచివేతపై ఆయన చెప్పిన ప్రసిద్ధ వాక్యం పెరియార్ రాజకీయం దేనికి నిదర్శనమో తెలియజేస్తుంది.
సామాజిక-రాజకీయ రంగంలో హిందీ లేదా బ్రాహ్మణ ఆధిపత్యం రుద్దడాన్ని పెరియార్ వ్యతిరేకించారని స్పష్టమవుతోంది. కానీ అదే పెరియార్ తమిళం గొప్పతనాన్ని రొమాంటిసైజ్ చేస్తూ (అతిగా పొగుడుతూ) తనను తాను తగ్గించుకోలేదు. ఆయన ఇలాంటి సంకుచిత నిర్వచనాలు, అవగాహనల పరిధిలోకి రాని ఒక ఆలోచనాపరుడు, తత్వవేత్త. ఆయన అన్ని రకాల అణచివేతలకు వ్యతిరేకి. అణచివేతకు గురైన వారికి మద్దతుగా నిలిచారు.
భాషగా బంగ్లాకు తూర్పు ఈశాన్య భారతదేశంలోని అనేక భాగాలలో ప్రజా ఉద్యమాలతో ముడిపడి ఉన్న సుదీర్ఘ చరిత్ర ఉంది.
1960లో స్థానిక ఉద్యోగాలు, జీవనోపాధిలో బెంగాలీ మాట్లాడే వారి ఆధిపత్యాన్ని నిరసిస్తూ అస్సామీ మాట్లాడేవారు చేపట్టిన ‘బొంగాల్ ఖేడా'(బెంగాలీల తోసివేత) ఉద్యమాన్ని 1961లోని ‘బెంగాలీ భాషా ఉద్యమం’ తీవ్రంగా నిరోధించింది.
ముఖ్యంగా దక్షిణ అస్సాంకు చెందిన బెంగాలీ మాట్లాడేవారు అధికారిక భాషగా అస్సామీని రుద్దడానికి వ్యతిరేకంగా పోరాడారు.
బెంగాలీ మేధావులు ఒడియా భాష ప్రాముఖ్యతను కూడా తగ్గించి, ఒడియా మాతృభాషగా ఉన్న ప్రాంతాలలో బంగ్లాను అధికారిక భాషగా చేయడానికి ప్రయత్నించారు. ఇది 19వ శతాబ్దంలో ఒడిషాలో బెంగాలీని రుద్దే ప్రయత్నాలను నిరోధిస్తూ బలమైన భాషా ఉద్యమానికి దారితీసింది.
మాతృభాషా దినోత్సవం పుట్టుక వెనుక రక్త చరిత్ర..
భారతదేశం నుంచి పాకిస్తాన్ విభజన మతపరమైన కారణాల వల్ల జరిగిందని మనందరికీ తెలుసు. అయితే తూర్పు పాకిస్తాన్‌లోని బెంగాలీ మాట్లాడేవారి భాష(మరొక ప్రాథమిక భావోద్వేగం) ప్రమాదంలో పడినప్పుడు మతం అనే ప్రాథమిక భావోద్వేగం నిలబడలేకపోయింది.
1952 ఫిబ్రవరి 21న పాకిస్తాన్ ఉర్దూను అధికారిక భాషగా, బోధనా మాధ్యమంగా రుద్దడాన్ని నిరసిస్తూ బెంగాలీ మాట్లాడే విద్యార్థులు చేసిన ప్రాణత్యాగం, 1971లో ప్రత్యేక దేశంగా బంగ్లాదేశ్ ఆవిర్భావంలో ఎల్లప్పుడూ ఒక చారిత్రక ఘట్టంగా గుర్తుంటుంది.
అంతేకాకుండా, తూర్పు పాకిస్తాన్లో బెంగాలీ మాట్లాడేవారు చేసిన ఈ భాషా ఉద్యమ అమరవీరుల త్యాగానికి గౌరవంగా యునెస్కో ఫిబ్రవరి 21ని ‘అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం’గా గుర్తించింది.
కపటత్వమే అన్నింటికీ మూల కారణం..
తమిళనాడు హిందీ రుద్దడాన్ని ఎందుకు నిరోధిస్తుంది? అప్పటి మద్రాసు రాష్ట్రంలో తెలుగు మాట్లాడేవారికి సురక్షితమైన వాతావరణం ఎందుకు కల్పించలేకపోయింది? తీరప్రాంత ఆంధ్రప్రదేశ్ తెలుగు మాట్లాడేవారు తెలంగాణ ప్రజలు మాట్లాడే తెలుగును ఎందుకు ఎగతాళి చేసి చులకన చేశారు(ఎక్కువగా ప్రసిద్ధ సంస్కృతి, రాజకీయ సంభాషణల ద్వారా)?
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజల ప్రధాన చర్చనీయాంశాలలో, ఐక్యతాంశాలలో ఇది ఒకటిగా ఎందుకు మారింది?
తూర్పు పాకిస్తాన్‌లోని బెంగాలీ మాట్లాడేవారు ఉర్దూ రుద్దడానికి వ్యతిరేకంగా ఎందుకు పోరాడారు? పూర్వపు బెంగాల్ ప్రెసిడెన్సీలో ఒడియా మాట్లాడేవారిని ఎందుకు అణచివేశారు? ముంబై, కర్ణాటకలలో వివిధ భాషా సమూహాల మధ్య భాషా వివాదాలను మనం ఇప్పటికీ ఎందుకు చూస్తున్నాం? కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న భాషలు (హిందీ, సంస్కృతం) ఇతర అందమైన భాషలను (బీహార్‌లోని మైథిలి, భోజ్‌పురి, మగాహి, అంగిక, బజ్జిక, ఉత్తరప్రదేశ్‌లోని అవధి, బ్రజ్ భాష, బుందేలి, కన్నౌజి, ఖరీబోలి) అంతరించిపోయే అంచులకు ఎందుకు నెడుతున్నాయి?
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం రాష్ట్రంలోని ఇతర మాతృభాషా పౌరులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నట్లు కనిపిస్తోంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ‘కపటత్వం’ (హిపోక్రసీ) అనే భావనలోనే దాగి ఉంది.
సాంస్కృతిక నరమేధం కంటే ఏమాత్రం తక్కువ కాదు..
భారత రాజ్యాంగంలోని 29, 30 అధికరణలు తమ పౌరులకు సంస్కృతి, భాషా హక్కులను హామీ ఇస్తున్నాయి. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల సార్వత్రిక ప్రకటన, ఆదివాసీ ప్రజల హక్కులపై ఐక్యరాజ్యసమితి ప్రకటన కూడా ఒకరి సంస్కృతిని పాటించే హక్కును పదే పదే పునరుద్ఘాటిస్తున్నాయి.
ప్రాథమిక భావోద్వేగాన్ని రేకెత్తించే సంస్కృతి ముఖ్యమైన సూచికలలో భాష ఒకటి. భాష మనిషికి గుర్తింపును ఇస్తుంది.
ప్రభుత్వ నిర్వహణలోని పాఠశాలల్లో అధికారిక సమాచార ప్రసారాలు, బోధనా మాధ్యమం కోసం ‘అధికారిక భాష’ను ప్రకటించడం ద్వారా ఒక భాషను క్రమపద్ధతిలో నాశనం చేయడం అనేది మైనారిటీ భాష, దానిని మాట్లాడేవారు వివక్షకు గురయ్యే అనేక మార్గాలలో ఒకటి.
భాషలు కేవలం సమాచార మార్పిడి సాధనాలు మాత్రమే కావు. అవి ఆవిర్భావ కథల రహస్యాలను, తమ చుట్టూ ఉన్న ప్రపంచ వర్గీకరణను, సంస్కృతి, పర్యావరణంతో ముడిపడి ఉన్న జాతి-సామాజిక పదాలను, అలౌకిక భావనలను, జంతువులు, మొక్కలు, నదులు, స్వయంగా ప్రకృతిని వర్ణించే అందమైన పదాలను కలిగి ఉంటాయి.
ఏ భాషనూ ఆధిపత్యమైనదిగా పరిగణించకూడదు. ఇతర భాషల కంటే రాష్ట్ర ప్రోత్సాహానికి అర్హమైనదిగా భావించకూడదు. ఏ భాష మాట్లాడే వారైనా తమ భాషను తక్కువగా చూసేలా, దానివల్ల తమను తక్కువగా భావించి, వివక్షకు గురిచేసేలా, తమ పిల్లలకు మాతృభాషను నేర్పడానికి నిరాకరించే లాంటి పరిస్థితులలో జీవించకూడదు.
భాషను చెరిపేయడం అంటే గుర్తింపును తుడిచేయడమే..
ప్రజలు ఒక భాష మాట్లాడటం మానేసే వాతావరణాన్ని సృష్టించడం అనేది ఒక సమగ్ర సంస్కృతిని తుడిచిపెట్టడంగా, ఒక వ్యక్తి లేదా సమూహం గుర్తింపును తిరస్కరించడంగా, వేలాది సంవత్సరాల సాంస్కృతిక చరిత్రను, మానవత్వాన్ని పూర్తిగా తొలగించే ఉద్దేశపూర్వక ప్రయత్నంగా పరిగణించాలి. ఇది సాంస్కృతిక నరమేధంతో సమానం.
ప్రజాస్వామ్య వ్యవస్థలోని ప్రభుత్వం కేవలం మెజారిటీ వాద పాలననే వినిపిస్తూ, ప్రవర్తిస్తూ, దానినే సాధారణీకరిస్తున్నట్లు కనిపిస్తే, ప్రజాస్వామ్యం నెమ్మదిగా, నిశ్చితంగా మరణిస్తుంది. ప్రజాస్వామ్యం అంటే మెజారిటీ వాదం కాదు. ప్రతి సమూహాన్ని గౌరవించాలి. ప్రతి భాషనూ అభినందించాలి.
మైనారిటీలో ఉన్న ప్రజలకు తాము గుర్తించబడుతున్నామని, అర్థం చేసుకుంటున్నారని, తమను మరింతగా మినహాయించడం లేదా పక్కన పెట్టడం లేదని భరోసా ఇవ్వాలి. కాబట్టి, భాషపై జరిగే ఏ దాడికైనా ప్రజాస్వామ్యం అనే రాజకీయ భావనపై జరిగే దాడిగానే పరిగణించాలి.
రియా గురుంగ్, సిపాయ్ సర్వేశ్వర్..
(రచయితలు: రియా గురుంగ్ – శాంతి నికేతన్‌లోని విశ్వ భారతి విశ్వవిద్యాలయం, ఆంత్రోపాలజీ విభాగంలో రీసెర్చ్ స్కాలర్. సిపాయ్ సర్వేశ్వర్ – ఆంత్రోపాలజీ ఉపాధ్యాయులు. ది వైర్ ఇంగ్లీష్‌లో రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
