మోదీ-మెలోనీ “మెలోడీ” స్నేహంపై, ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ గురించి కాంగ్రెస్ సమావేశంలో చేసిన ప్రస్తావన అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ సమావేశంలో ఇటలీ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ ప్రస్తావన రాజకీయ వివాదానికి దారితీసింది.
ఈ నేపథ్యంలో ఇటలీతో “గౌరవప్రదమైన” “పరస్పర అవగాహనతో” కూడిన సంబంధాన్ని భారత్ కోరుకుంటుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆగస్టు 14న నొక్కి చెప్పింది.
దౌత్య సంబంధాలపై విదేశాంగ శాఖ స్పందన..
ఒక రాజకీయ సమావేశంలో ఇటలీ ప్రధాని గురించి “రాహుల్ గాంధీ వ్యాఖ్యల” గురించి ప్రస్తావిస్తూ వేసిన ప్రశ్నపై విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ స్పందించారు.
మోదీపై కాంగ్రెస్ నాయకుడి విమర్శపై నేరుగా మాట్లాడకుండా, దానికి బదులుగా, గడచిన కొద్ది సంవత్సరాలుగా భారత్-ఇటలీల మధ్య స్నేహ సంబంధాల పటిష్టత గురించి చెబుతూ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ దౌత్య సంబంధాలను కొనసాగించుకోవాలని అన్నారు.
“ఇటలీతో మనకు బలమైన సంబంధాలున్నాయి. గడచిన కొద్ది సంవత్సరాలుగా ఇటలీతో మన సంబంధాలు అన్ని విధాలుగా విస్తరించి బలపడుతున్నాయని” జైస్వాల్ చెప్పారు.
“దౌత్య ప్రక్రియలో భాగంగా మేము మా సంబంధాన్ని పటిష్టపరిచాము, ఒకరిని ఒకరు గౌరవించుకోవాలనేది దృష్టిలో పెట్టుకొని ఇరు పక్షాల మధ్య పరస్పర అవగాహన అత్యంత ముఖ్యమైనదని” గుర్తు చేశారు.
విదేశాంగ విధానంపై రాహుల్ విమర్శలు..
ఢిల్లీలో ఆగస్టు 13న జరిగిన రచనాత్మక్ కాంగ్రెస్ జాతీయ సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ రాజకీయ నాయకుల మధ్య వ్యక్తిగత అవగాహన గురించే విదేశాంగ విధానం ఉంటుందనే ఆలోచనను ప్రశ్నించారు.
“నాయకులను ఆలింగనం చేసుకోవడమే విదేశాంగ విధానం అనే ఆలోచన ఆయనకు ఎక్కడి నుంచి వచ్చిందో ఆ అజ్ఞానాన్ని ఊహించుకోండి” అని మోదీని ప్రస్తావిస్తూ గాంధీ అన్నారు.
ఈ విషయాన్ని ఉదహరిస్తూ ఆ తర్వాత ఆయన రచనాత్మక్ కాంగ్రెస్ చీఫ్ సందీప్ దీక్షిత్‌ను ఆలింగనం చేసుకున్నారు.
సభావేదికపై దీక్షిత్, రాహుల్ మధ్య హాస్యం..
అనంతరం దీక్షిత్ స్పందిస్తూ ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోనీ గురించి ప్రస్తావించి “ఒక విషయం అడగాలనుకుంటున్నాను?” అంటూ రాహుల్ గాంధీని అడిగారు.
“మెలోనీ అనుకుని పట్టుకోలేదు కదా?” అని దీక్షిత్ అడగడంతో రాహుల్ గాంధీ గట్టిగా నవ్వుతూ “నేను ఇంకా అంత వరకు వెళ్లలేదని” బదులిచ్చారు.
బీజేపీ-ఆర్ఎస్ఎస్లపై తీవ్ర విమర్శలు..
గాంధీ మోదీ ప్రభుత్వం, బీజేపీ-ఆర్ఎస్ఎస్పై గట్టిగా దాడి చేస్తున్న తరుణంలో ఈ సంభాషణ జరిగింది. ప్రజలు స్వేచ్ఛగా తమ భావాలను చెప్పుకోవడానికి అనుమతించడానికి బదులుగా భారత్‌పై రాజకీయ “క్రమాన్ని” విధిస్తున్నారని ఆరోపించారు, బీజేపీ-ఆర్ఎస్ఎస్లను “జోకర్ల సమూహం”, “విదూషకులు” అని రాహుల్ గాంధీ వర్ణించారు.
సామాజిక మాధ్యమాల్లో ‘మెలోడీ’ ట్రెండ్..
సామాజిక మాధ్యమాల ద్వారానే కాకుండా ఇటలీ ప్రధాన మంత్రి, మోదీ మధ్య స్నేహం నేపథ్యంలో వారి బంధాన్ని వ్యక్తిగతంగా చిత్రీకరిస్తూ ప్రజల దృష్టి ఆకర్షించడంతో మెలోనీ ప్రస్తావన కూడా వచ్చింది.
వారి పరస్పర చర్యలు “మెలోడీ” అనే పదానికి జన్మనిచ్చాయి. ఈ పేరును మద్దతుదారులు, మీడియా సంస్థలు తరచుగా ఉపయోగిస్తూ వారి స్నేహాన్ని వర్ణించారు.
ఈ ఏడాది మేలో మోదీ ఇటలీ పర్యటన సందర్భంగా మెలోనీ ఒక సెల్ఫీ వీడియో పోస్టులో, “మెలోడీ” అనే మారుపేరుకు తగ్గట్లుగా పార్లే మెలోడీ టోఫీని బహూకరించినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ వీడియో వైరల్ అయింది, కేవలం ఆరు గంటల వ్యవధిలో ఆమె సామాజిక మాధ్యమ ఖాతాలో 110 మిలియన్ల మంది చూశారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
