అద్దెదారులను త్వరగా ఖాళీ చేయించడానికి అనుమతించడం, ఆస్తులను స్వాధీనం చేసుకునే ప్రభుత్వ అధికారాన్ని పరిమితం చేయడం వంటి అంశాలతో కూడిన వివాదాస్పద బిల్లుకు వ్యతిరేకంగా వేలాది మంది ప్రదర్శనలు చేపట్టారు.
ఆగస్టు 6న, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిలే ఈక్వెడార్‌లో అధికారికంగా పర్యటించి, ఈక్వెడార్ అధ్యక్షుడు డేనియల్ నొబోవాతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఆయన కొలంబియా నూతన అధ్యక్షుడు అబెలార్డో డి లా ఎస్ప్రియెల్లా ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రయాణమయ్యారు.
ఈ విధంగా మిలే, కొందరు నిపుణులు “లాటిన్ అమెరికన్ రైట్-వింగ్ కొత్త తరంగం” అని పిలిచే సిద్ధాంతపరమైన, ప్రాంతీయ మిత్రపక్షాలైన ఇద్దరు నాయకులకు తన మద్దతును అందించడానికి ప్రయత్నించారు.
వీధుల్లోకి వచ్చిన ప్రజలు..
అయితే, స్వయం ప్రకటిత “అతి-వామపక్ష వ్యతిరేక, అతి-దక్షిణపక్ష” అధ్యక్షుడు ఆండీస్ పర్వత ప్రాంతాలలో పర్యటిస్తున్న సమయంలోనే, ఆగస్టు 6న వేలాది మంది అర్జెంటీనా ప్రజలు ప్రభుత్వానికి, నయా-ఉదారవాద అజెండాకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి వీధుల్లోకి వచ్చారు.
బిల్లులోని అభ్యంతరకర అంశాలు..
ముఖ్యంగా, విదేశీయులు అర్జెంటీనాలో కలిగి ఉండే భూమి శాతాన్ని పెంచడం (మొత్తం జాతీయ భూభాగంలో పరిమితిని 25 శాతానికి పెంచాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తుంది), బాకీలు ఉన్న అద్దెదారులను ఖాళీ చేయించే ప్రక్రియను వేగవంతం చేయడం, దేశంలోని కొన్ని ప్రాంతాలలో భూమిని స్వాధీనం చేసుకునే ప్రభుత్వ అధికారాన్ని తొలగించడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లును వ్యతిరేకిస్తూ నిరసనకారులు వీధుల్లోకి వచ్చారు.
పార్లమెంట్ ముందు జరిగిన ఈ ప్రదర్శనలో వేలాది మంది విద్యార్థులు, కార్మికులు, రాజకీయ పార్టీ కార్యకర్తలు, సామాజిక ఉద్యమ సభ్యులు, దేశంలోని అతిపెద్ద కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
“మాతృభూమి అమ్మకానికి లేదు” అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ భారీ ఎత్తున నినాదాలు హోరెత్తించారు.
పోలీసుల నిర్బంధం – పాత్రికేయులకు గాయాలు..
మధ్యాహ్న సమయానికి, బైక్‌లపై వచ్చి, వాటర్ క్యానన్లను ఉపయోగిస్తూ భారీ సంఖ్యలో ఉన్న ప్రభుత్వ భద్రతా దళాలు రబ్బరు బుల్లెట్లు, వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్, ఇతర నియంత్రణ పద్ధతులను ఉపయోగించి నిరసనను చెదరగొట్టే చర్యలకు ప్రభుత్వం ఒడిగట్టింది.
ఈ సంఘటనను కవర్ చేస్తున్న పాత్రికేయులతో సహా అనేక మందిని అరెస్టు చేశారని, అనేక మంది గాయపడ్డారని పలు మీడియా సంస్థలు పేర్కొన్నాయి.
గాయపడిన వారిలో ‘లా ఇజ్క్వియెర్డా డైరియో’కు చెందిన ఒక మహిళా విలేకరి కూడా ఉన్నారు. తన తలపై దెబ్బ తగలడం వల్ల పుర్రెకు గాయమై చెవి నుండి రక్తం కారిందని ఆమె తెలిపారు.
చట్టసభలో చర్చలు – బిల్లు సవరణ..
మరోవైపు పార్లమెంటు లోపల, ఈ సంస్కరణలను ఆమోదించాలా వద్దా అనే విషయమై ప్రజాప్రతినిధులు చర్చించారు.
విదేశీ భూ యాజమాన్య పరిమితిని పెంచడంపై విస్తృత నిరసన వ్యక్తమైన నేపథ్యంలో, దీనిని ఆమోదించడానికి అవసరమైన మద్దతు లభించే వరకు ఆ నిర్దిష్ట నిబంధనను పక్కన పెట్టాలని ప్రభుత్వం క్రితం రోజే నిర్ణయించిందని సెనెటర్, మాజీ భద్రతా మంత్రి ప్యాట్రిషియా బుల్రిచ్ తెలిపారు.
నిరాశ్రయులవుతున్న అద్దెదారులు..
అయితే, బాకీలు ఉన్న అద్దెదారులను త్వరగా ఖాళీ చేయించేందుకు అనుమతించే చట్టాన్ని ఆమోదించడం ద్వారా మిలే ప్రభుత్వం విజయం సాధించింది.
సెంటర్ ఫర్ లీగల్ అండ్ సోషల్ స్టడీస్ ప్రకారం, ఆర్థిక సంక్షోభం మధ్యలో ఈ బిల్లు సమస్యాత్మకమైనది. ఎందుకంటే “ఇది ఈ నిర్ణయాల సమతుల్యతను అంచనా వేయకుండా లేదా నిరాశ్రయులైన కుటుంబాలకు ప్రత్యామ్నాయ నివాసాలను చూపకుండా, నిర్బంధంగా ఖాళీ చేయించేందుకు బిల్లు దోహదం చేస్తుంది”. సెంటర్ ఫర్ లీగల్ అండ్ సోషల్ స్టడీస్ డేటా ప్రకారం అర్జెంటీనాలో, “2025లో అద్దెకు ఉంటున్న కుటుంబాలలో 57 శాతం మంది తమ ఆదాయంలో సగానికి పైగా అద్దెకే వెచ్చించారు, ఇది 2024 కంటే దాదాపు 20 శాతం ఎక్కువ. ఇది గృహ వ్యయాలకు సంబంధించి ప్రజల కొనుగోలు శక్తి క్షీణతను సూచిస్తుంది” అని ఫ్రాంక్ తెలిపారు.
ప్రభుత్వ భూసేకరణపై ఆంక్షలు..
అంతేకాకుండా, కొత్త చట్టం ప్రభుత్వం ఆస్తులను స్వాధీనం చేసుకోవడాన్ని మరింత కష్టతరం చేస్తుంది. ప్రస్తుతం, “ప్రజా ప్రయోజనం” అనే ప్రాతిపదికన భూసేకరణను ప్రతిపాదిత బిల్లు సమర్థిస్తుంది.
ఇది ఆస్తులను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వానికి విస్తృతమైన అవకాశాన్ని ఇస్తుంది. కానీ ఇప్పుడు, ప్రభుత్వం తాను సాధించాలనుకుంటున్న లక్ష్యాన్ని ప్రత్యేకంగా గుర్తించాలి, భూసేకరణ ఆవశ్యకతను, భూసేకరణకు వేరే మార్గం లేదని నిరూపించాలి.
ప్రభుత్వ అధికారాలను పరిమితం చేస్తూ ప్రైవేట్ పెట్టుబడులకు ప్రయోజనం కల్పించడం కాకుండా ఇతర చర్యలను తీసుకోవాలనీ విశ్లేషకులు తెలియజేస్తున్నారు.
న్యూస్ క్లిక్ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
