ఫిడెల్ క్యాస్ట్రో శత జయంతి సందర్భంగా హవానాలో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సు నుంచి మిత్రుడు వెంకట్‌తో పంచుకున్న ముచ్చట్లు.
“సామ్రాజ్యవాదాన్ని ఎదుర్కొంటాం, సోషలిజాన్ని నిలుపుకుంటాం” అంటూ క్యూబా ప్రజలు చేస్తున్న వీరోచిత పోరాటం స్ఫూర్తిదాయకంగా ఉందని మిత్రుడు వెంకట్ తెలిపారు.
ఫిడెల్ క్యాస్ట్రో 100వ జయంతి సందర్భంగా ఆగస్టు 10 నుంచి 13 వరకు అంతర్జాతీయ సదస్సులు హవానాలో జరుగుతున్నాయి. ఈ సదస్సుకు బి వెంకట్‌తో పాటు మన దేశం నుంచి మరికొందరు ప్రతినిధులుగా హాజరయ్యారు.
దేశ అధ్యక్షుడు మిగ్యుల్ డియాజ్-కానెల్ బెర్ముడెజ్ ఈ సదస్సుకు ప్రారంభోపన్యాసం చేశారని, సదస్సుకు ప్రపంచ నలుమూలల నుంచి హాజరైన ప్రతినిధుల నినాదాల మధ్య ప్రారంభమైందని వెంకట్ చెప్పారు.
భారతదేశం నుంచి వెంకట్‌తో పాటు, అరుణ్ కుమార్, విజ్జు కృష్ణన్, శ్రీమతి టీచర్, మీనాక్షి సుందరం, చంద్రన్, మహాపాత్ర, అనిల్, సీపీఐ నుంచి రామకృష్ణ హాజరయ్యారు.
1980 దశకంలో ఎస్ఎఫ్ఐలో నేను ఖమ్మం జిల్లాలో పనిచేస్తున్న సమయంలో జిల్లా కార్యదర్శిగా బి వెంకట్ బాధ్యతల్లో ఉన్నారు. నిన్న రాత్రి 10:30కి నేను బి వెంకట్‌కు ఫోన్ చేసి సదస్సు ఎలా కొనసాగుతోందని ఎంతో ఉత్సాహంతో ఆరాతీశాను. ఆయన సదస్సులో బిజీగా ఉన్నా సదస్సు వివరాలను, క్యూబా ప్రస్తుత స్థితిని ఓపిగ్గా వివరించారు.
అమెరికా కుట్రలు – క్యూబా వీరోచిత పోరాటం..
“క్యూబాలోని సోషలిస్టు వ్యవస్థను కూలదోయాలని చూస్తున్న సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రాణాలకు తెగించి మా దేశ ప్రజలు అనునిత్యం పోరాడుతున్నార”ని ఆ దేశ అధ్యక్షుడు ఉద్వేగంతో వెల్లడించారని తెలిపారు.
అన్ని విధాల ఆంక్షలతో అణగదొక్కాలని, సోషలిజాన్ని అంతమొందించాలని, కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతున్న అమెరికన్ పాలకుల దుర్మార్గాలను గత 67 ఏళ్లుగా వీరోచితంగా ఎదుర్కొంటున్న తీరు ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించిందని వెంకట్ చెప్పుకొచ్చారు. అందుకు క్యాస్ట్రో అమలు చేసిన విధానాలు ఇప్పుడు కూడా మార్గదర్శకంగా కనిపిస్తున్నాయని దేశాధ్యక్షుడు చెప్పడం ఎంతో సంతోషం కలిగించిందని చెప్పారు.
క్యాస్ట్రో 1959 జనవరి 1 క్యూబా దేశానికి విప్లవాన్ని సాధించిన దగ్గర నుంచి చనిపోయే వరకు క్యూబా ప్రజల కోసమే కాదు, ప్రపంచ ప్రజల కోసం పని చేసిన యోధుడు.
అలాంటి యోధుని శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో ఉద్వేగానికి గురిచేసిందని వెంకట్ వివరించారు. చాలా దారుణమైన ఆంక్షల మధ్య క్యూబా ప్రజలు బతకాల్సి వస్తోందన్నారు.
సామ్రాజ్యవాదాన్ని, ప్రపంచంలో జరుగుతున్న దోపిడీని ఎదిరిస్తూ నికరంగా నిలబడిన ఫిడెల్ క్యాస్ట్రో క్యూబా నాయకుడే కాదు ప్రపంచ ప్రజల నాయకుడు.
అప్పుడు, ఇప్పుడు తమ విజయాలను, సోషలిస్ట్ ప్రభుత్వాన్ని అమెరికా కూలదోయడానికి, అణచివేయటానికి చేస్తున్న ప్రయత్నాలను అధ్యక్షుడు వివరిస్తున్నప్పుడు, సదస్సులో పాల్గొన్న ప్రతి ఒక్కరం అనేక సార్లు లేచి నిలబడి చప్పట్ల వర్షం కురిపించాం.
స్పానిష్‌లో వారి నినాదాలు, వినసొంపైన భాష అర్థం కాకపోయినా వారేంటో, వారి సంకల్పం ఏమిటో అర్థమైందని వెంకట్ భావోద్వేగంతో వెల్లడించారు.
ట్రంప్ నాయకత్వంలో ఇప్పుడు అమెరికా మరింత దూకుడు పెంచి క్యూబాను ఒంటరిని చేయాలని చూస్తోందని, రోజుల తరబడి అక్కడ కరెంట్ ఉండటం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.
మందులు దొరకటం లేదు, వేలాది మంది పిల్లలు గుండె, క్యాన్సర్ లాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. మందులు లేక ఆపరేషన్స్ కూడా చేయలేని దుస్థితి ఏర్పడింది.
ప్రపంచంలో 104 మందికి ఒక డాక్టర్ ఉన్న దేశంలో ఈ పరిస్థితి ఏర్పడటానికి అమెరికానే కారణమని చెప్పుకోవచ్చు అన్నారు. కరోనా సమయంలోనైనా, ప్రపంచంలో ఎక్కడ వైద్య సేవలు కావాలన్నా స్వచ్ఛందంగా ముందుండే దేశాన్ని అమెరికా ఇంతగా ఇబ్బంది పెట్టడం బాధ కలిగిస్తుందన్నారు.
“ఇలాంటి స్థితిలో కూడా 23 మంది పాలస్తీనా విద్యార్థులకు క్యూబా మెడికల్ కాలేజీలో విద్యా బోధన జరుగుతోంది. అమెరికా నుంచి పదుల సంఖ్యలో ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ఇది మాకెంతో సంతోషాన్ని కలిగించింది” అన్నారు.
“పక్క దేశానికి మా సంఘీభావం” అనే ప్రత్యేక టీ షర్ట్స్ ధరించి ప్రత్యేక ఆకర్షణగా వారు నిలిచారు. క్యూబాపై అమెరికా అంత అణచివేతతో ఉన్నా అదే గడ్డ నుంచి క్యూబాకు ప్రతినిధులుగా వచ్చి క్యూబా లాంగ్ లివ్ అంటూ నినదించడం ప్రతినిధులందరినీ ఉత్తేజపరిచింది.
క్యూబా సాధించిన ప్రగతి – విద్య, వైద్యం..
వెంకట్ హవానాలో ఉండి సదస్సు విషయాలే కాకుండా ఎంతో గర్వంగా క్యూబా సాధించిన విజయాలను, సాధించిన ప్రగతిని ఒక్కొక్కటి వివరించసాగారు.
నేను 1989 ప్రాంతంలో “లాటిన్ అమెరికాలో అరుణతార క్యూబా” అనే పుస్తకాన్ని కొని తొలిసారిగా క్యూబా గురించి తెలుసుకుని ఎంతో ఉత్తేజం పొందాను. అప్పటి మా నాయకుడు ఇప్పుడు ఆ క్యూబా గడ్డపై నుంచి ఆ దేశం గురించి చెబుతుంటే ఎంతో గొప్పగా అనిపించింది.
1959 జనవరి 1న క్యూబాలో విప్లవం సాధించిన తర్వాత, ఆ దేశం అనేక రంగాల్లో గణనీయమైన మార్పులు సాధించింది. ముఖ్యంగా నిరక్షరాస్యత నిర్మూలన.
1961లో క్యూబా దేశవ్యాప్తంగా భారీ అక్షరాస్యత ఉద్యమాన్ని నిర్వహించింది. పేదల నివాస ప్రాంతాలు, మారుమూల గ్రామాలకు వేలాది మంది యువకులు వెళ్లి ప్రజలకు చదువు నేర్పారు. విప్లవానికి ముందు ఉన్న తీవ్రమైన నిరక్షరాస్యతను చాలా తక్కువ కాలంలోనే దాదాపు నిర్మూలించారు.
ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య వరకు ప్రభుత్వ బాధ్యతగా ఉచిత విద్య అందించే వ్యవస్థను నిర్మించింది. ప్రపంచ బ్యాంకు కూడా క్యూబా విద్యా వ్యవస్థను ప్రత్యేకమైన విజయంగా పేర్కొంది. అందరికీ ఉచిత ఆరోగ్య సేవలు.
క్యూబా ఆరోగ్య వ్యవస్థలో వైద్యం మాత్రమే కాకుండా నివారణ, టీకాలు, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, విప్లవం తర్వాత ఆరోగ్య సేవలను సార్వత్రికంగా అందించడంపై దృష్టి పెట్టింది.
1959లో క్యూబాలో శిశు మరణాల రేటు 1,000 జననాలకు సుమారు 60గా ఉండగా, 1980ల మధ్య నాటికి అది 15కి తగ్గింది.
ప్రస్తుతం యునిసెఫ్ డేటాలో శిశు మరణాల రేటు సుమారు 1,000 జననాలకు 7గా ఉంది. ఇలా ఆ దేశం అమెరికా ఆంక్షల మధ్య ప్రజల సకల సౌఖ్యాల కల్పనకు రాజీ లేని కృషి చేస్తోందని వివరించారు. తమ ప్రతినిధి బృందం ప్రత్యేక శ్రద్ధతో ఈ సదస్సులో పాల్గొంటుందన్నారు.
ఇంకా ఇలా వివరించారు..
క్యూబా ప్రభుత్వం సాధిస్తున్న అభివృద్ధి, ఇప్పుడు ఎదురవుతున్న సవాళ్లను, అమెరికా నాయకత్వంలో సామ్రాజ్యవాదం చేస్తున్న దాడులు, యుద్ధాలు అన్నింటిపై చర్చలు జరిగాయి. క్యూబా తన పరిమిత ఆర్థిక వనరుల మధ్య వైద్య విద్య, పరిశోధన, బయోటెక్నాలజీ రంగాల్లో ప్రత్యేక సామర్థ్యాన్ని అభివృద్ధి చేసింది.
ఒక మాటలో చెప్పాలంటే, 1959 తర్వాత క్యూబా సాధించిన గొప్ప విషయం ఏమిటంటే- పేద దేశంగా ఉన్నప్పటికీ, విద్య, ఆరోగ్యాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడం.
అంతర్జాతీయ విపత్తుల్లో క్యూబా వైద్య సహాయం..
ప్రపంచ మానవాళిని సంరక్షించేందుకు, సామ్రాజ్యవాదం సృష్టిస్తున్న ఆటంకాలు, ఆంక్షలను అధిగమిస్తూ ఒక చిన్న దేశం సోషలిస్ట్ స్ఫూర్తితో ప్రపంచంలో నిలబడటమే కాదు విపత్తులు, అంటువ్యాధులు వచ్చినప్పుడు ఇతర దేశాలకు వైద్య బృందాలను పంపడం ఒక ప్రత్యేకత.
“హెన్రీ రీవ్” వైద్య బృందం..
2005లో క్యూబా “హెన్రీ రీవ్ ఇంటర్నేషనల్ మెడికల్ కాంటింజెంట్” అనే ప్రత్యేక అత్యవసర వైద్య బృందాన్ని ఏర్పాటు చేసింది. భూకంపాలు, వరదలు, తుఫాన్లు, అంటువ్యాధులు వంటి విపత్తులు సంభవించిన దేశాలకు వైద్యులు, నర్సులు, ఇతర ఆరోగ్య సిబ్బందిని పంపడం దీని ప్రధాన ఉద్దేశం.
“అసోసియేషన్ ఆఫ్ కరేబియన్ స్టేట్స్”..
2017 నాటికి ఈ బృందం 21 దేశాల్లో 3.5 మిలియన్లకు పైగా ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించింది. సుమారు 7,400 మంది క్యూబన్ ఆరోగ్య కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీనికి డబ్ల్యూహెచ్ఓ/పాహో తరఫున 2017లో డాక్టర్ లీ జోంగ్ వూక్ మెమోరియల్ ప్రైజ్ ఫర్ పబ్లిక్ హెల్త్ కూడా లభించింది.
2005లో పాకిస్తాన్లో సంభవించిన భూకంపం సమయంలో 2,564 మంది క్యూబన్ వైద్య సిబ్బంది అక్కడికి వెళ్లి సహాయ సహకారాలు అందజేశారు.
2005లో గ్వాటెమాలలో వరదలప్పుడు 668 మందిని, 2006లో బొలీవియా వరదలప్పుడు 602 మందిని పంపించి సహాయక చర్యల్లో పాల్గొనేలా చేసింది.
చిన్న దేశమైనా పెద్ద హృదయం కలిగిన దేశంగా కరోనా సమయంలో క్యూబా వైద్యులు అనేక దేశాలకు వెళ్లారు.
2020 ఏప్రిల్ 1 నాటికే 14 దేశాలకు 593 మంది క్యూబన్ వైద్య సిబ్బంది వెళ్లి అద్భుతమైన సేవలందించింది.
ఒక ముఖ్యమైన విషయం..
ఇది కేవలం కరోనా సమయంలోనే ప్రారంభమైన కార్యక్రమం కాదు. 1963లో అల్జీరియాకు క్యూబా తన మొదటి వైద్య బృందాన్ని పంపినప్పటి నుంచి దశాబ్దాలుగా ఈ అంతర్జాతీయ వైద్య సహకారం కొనసాగుతోంది.
అందుకే క్యూబా గురించి చెప్పేటప్పుడు ఒక ఆసక్తికరమైన అంశం ఏమిటంటే- ఆర్థికంగా చిన్న దేశమైన క్యూబా, తనకు ఉన్న పరిమిత వనరుల్లో వైద్యులను పెద్ద సంఖ్యలో తయారు చేసి, దేశంలోనే కాకుండా ప్రపంచంలోని విపత్తులు, అంటువ్యాధుల సమయంలో ఇతర ప్రజలకు సేవ చేయడానికి పంపించింది.
ఐక్యరాజ్య సమితి క్యూబాపై ఆంక్షలు వద్దు అని ఎన్నిసార్లు తీర్మానం చేసినా అమెరికా అహంకారంతో వాటిని అమలు చేయలేదు.
అమెరికా ఆంక్షలలో భాగంగా క్యూబాతో ఏ దేశం కూడా వాణిజ్య వ్యాపార వ్యవహారాలు నడపకూడదని పెట్రోలియం ఉత్పత్తులు, ఆహార పదార్థాలు అందించకూడదని కఠినమైన షరతులు విధించింది.
క్యూబాకు వెళ్లే సహాయాన్ని అన్ని దేశాల మార్గాలను కట్టడి చేసింది. దీనితో కరెంటు లేక ప్రజల ఇబ్బందులు వర్ణాతీతంగా ఉన్నాయి. అయినా బాధలు భరిస్తున్నారు తప్ప, అమెరికాకు లొంగటానికి ఏమాత్రం సిద్ధంగా లేరని మాకు స్పష్టమైందని వెంకట్ తెలియపరిచారు.
“ఈ సదస్సులో పాల్గొన్నందుకు ఎంతో గర్వపడుతున్నాం, విద్యార్థి ఉద్యమాల్లో పనిచేస్తున్న సమయంలో క్యూబా విప్లవ చరిత్రను తెలుసుకుని ఎంతో స్ఫూర్తిని పొందాను. అదే గ్రేట్ క్యూబాలో ఇప్పుడు అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడం నా జీవితంలో ఎప్పటికీ గుర్తుండే స్ఫూర్తిని నింపింది” అని రాత్రి పన్నెండు గంటల వరకు వివరించారు బి వెంకట్.
నేను కూడా ఆయన చెబుతున్నంత సేపు క్యూబా సదస్సు విషయాలను ఎంతో ఆసక్తిగా విన్నాను. క్యాస్ట్రో, చేగువేరాలు నాకు ఎంతో స్ఫూర్తినిచ్చిన అంతర్జాతీయ నాయకులు. క్యూబాపై అమెరికా ఆంక్షలను వ్యతిరేకిద్దాం, మనమంతా అక్కడి ప్రజల తెగింపు, త్యాగాల నుంచి స్ఫూర్తిని పొందుదాం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
