నల్సార్, జాతీయ న్యాయ, పరిశోధనా విశ్వవిద్యాలయం లా యూనివర్సిటీ 2026 గ్రాడ్యుయేటింగ్ బ్యాచ్ ఎన్‌రోల్‌మెంట్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తూ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) నిర్ణయం తీసుకుంది.
ఈ చర్య తర్వాత ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ బీసీఐ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా పెద్ద చట్టపరమైన, చట్ట వ్యతిరేకమైన, రాజ్యాంగ విఘాతమైన, కేవలం రాజకీయ అధికార చర్యల వల్ల న్యాయవ్యవస్థపై గందరగోళానికి దారితీసింది.
భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)ని ఆహ్వానించడాన్ని నిరసిస్తూ విద్యార్థులు చేపట్టిన ప్రచారాన్ని నిరోధించేందుకు బీసీఐ ప్రయత్నించడం ద్వారా తన పరిధిని దాటి ప్రవర్తించిందా? లేదా అనే సవాల్ రాజ్యాంగ బద్ధమైన సమాధానాలు వెతకాల్సిన అవసరం ఉంది.
న్యాయం చేసిన సీజేఐ..
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయ మూర్తి(సీజేఐ), ఆగస్టు 14 మధ్యాహ్నం ఒక మంచి ఉత్తర్వు జారీ చేశారు. నల్సార్ న్యాయవిద్యార్థులను బార్లో చేర్చడానికి బీసీఐ నిషేధం ఇవ్వడాన్ని తీవ్రంగా విమర్శించారు.
శాంతియుతంగా నిరసనలు తెలిపే అధికారం, హక్కు, వాక్ స్వాతంత్ర్యం ఉండి తీరుతుందని ప్రధాన న్యాయమూర్తి వివరించారు.
ఒక ఉత్తరం రాసి వ్యతిరేకించిన మాత్రాన ఇంత అనవసరమైన రాద్ధాంతం చేయడం న్యాయమా, నల్సార్ న్యాయ విద్యార్థులకు ఉత్తరం వ్యవహారం విషయం వారికి తనకు మధ్య వ్యవహారమే అనీ, మిగతావారు అందులో, ముఖ్యంగా బీసీఐ వారు జోక్యం చేసుకోవలసిన అవసరం లేదని, సరైన ఆదేశాన్ని ఇచ్చారు.
“నేను చదువుకుంటున్న రోజుల్లో మేం కూడా, విద్యార్థులపై విమర్శలు నిరసనలు చేయవలసిన పరిస్థితులు ఎదుర్కొన్నాం. వారిని ఆపడం ఎందుకు? ఏ విధంగా కూడా వారిని ఆపే అధికారం లేదే” అని సీజేఐ చెప్పారు.
ఈ ధర్మాసనంలో సీజేఐతో పాటు జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చీ కూడా మాట్లాడుతూ, “దీనికోసం ఏదైనా తీర్మానం చేశారా?” అని ప్రశ్నించారు.
సుప్రసిద్ధ లా ప్రొఫెసర్ కీర్తిశేషులు ఎన్ ఆర్ మాధవమీనన్ ఆలోచన నుంచి ఉద్భవించిన మహా అధ్యాపకుడు. ఇవ్వాళ దాదాపు 25 నేషనల్ లా యూనివర్సిటీలను, వేలాది పట్టభద్రులు, నిపుణులైన లాయర్లను తయారు చేసి దేశానికి సమర్పిస్తున్న సంస్థలను దెబ్బతీస్తారా?
450 మంది నల్సార్ న్యాయవాదులకు శిక్షణ ఇచ్చి ఉత్తమ పౌరులైనవారిని నిర్మించి రాబోయే న్యాయవ్యవస్థల భవిష్యత్తును విఘాతం చేసే పని ఇది. బీసీఐ అధ్యక్షుడనే ఒక చిన్న అధికారం ఉన్నందుకు, రాజ్యాంగ వ్యతిరేకంగా దుర్వినియోగం చేస్తారా?
ఇది కేవలం 2026 సంవత్సరానికి నిర్మిస్తున్న లాయర్ల సొంత సమస్య కాదు. నల్సార్ భవిష్యత్తు మాత్రమే కాదు. రాబోయే తరతరాలకు ఒక అపూర్వ దుర్ఘటన.
అజ్ఞాన భయానక చీకటి నుంచి కొంత చిన్న జ్ఞానోదయంతో వెలుగు వచ్చినందుకు ఈ ప్రభుత్వం, వారి చెప్పుచేతలతో తమ దుర్మార్గమైన ప్రయత్నం ఆగిపోవడం చాలా మంచి ఆలోచన.
లాయర్ల భవిష్యత్తుపై దెబ్బ..
“క్రిమినల్ లా ప్రకారం, హత్య తీవ్రమైన నేరం. కాని హత్యాప్రయత్నం, బాధితుడు బతికి ఉన్నప్పటికీ, చంపడానికి చాలా ప్రయత్నాలు చేస్తే అది కూడా తీవ్రమైన నేరమే” అని ఈ రచయిత వంటి లా టీచర్ దశాబ్దాల నుంచి పాఠాలు చెబుతున్నా, అధికారులకు అర్థం కాకపోవడం దురదృష్టం.
మొత్తం ఒక బ్యాచ్ నల్సార్ న్యాయవిద్యార్థుల భవిష్యత్తు దెబ్బతీసే తీర్పును బీసీఐ లేఖ మొదటి మధ్యాహ్నానికి విడుదల చేయడం, సాయంత్రం సవరణ లేఖను బీసీఐ అధ్యక్షులు ప్రకటించి, బీసీఐ పరువును, ప్రభుత్వ పరువును, న్యాయవ్యవస్థపై మోసిన భయానకమైన బరువును ఎత్తివేయడం చాలా సంతోషం.
హమ్మయ్య, గండం తప్పింది..
ఈ సందర్భంలో నల్సార్ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ కృష్ణదేవరావ్ బీసీఐకి ఒక లేఖ రాసి పంపారు. అది పరిస్థితిని వివరిస్తుంది.
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుండి 13 ఆగస్టు 2026 తేదీతో(రిఫ్ నం బీసీఐడీ 5449/2026) ఒక లేఖను విశ్వవిద్యాలయం అందుకుంది. అందులో 2026 బ్యాచ్‌కు చెందిన మా పట్టభద్రులైన బీఏ, ఎల్ఎల్బీ(ఆనర్స్) విద్యార్థులందరి నమోదు ప్రక్రియను అనుమతించకూడదని పేర్కొంది.
అలాగే, రాబోయే స్నాతకోత్సవానికి సంబంధించిన ఇటీవలి పరిణామాల్లో పాల్గొన్న వ్యక్తులపై విచారణ నివేదికను సమర్పించాలని విశ్వవిద్యాలయాన్ని కోరింది.
తదనంతరం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి 13 ఆగస్టు 2026 తేదీతో(రిఫ్ నం బీసీఐడీ 5450/2026) మరో లేఖను మేము అందుకున్నాము. అందులో 2026 బ్యాచ్‌కు చెందిన మా పట్టభద్రులైన విద్యార్థుల నమోదు ప్రక్రియను అనుమతించకూడదని రాష్ట్ర బార్ కౌన్సిళ్లకు ఇచ్చిన ఆదేశాన్ని ఉపసంహరించుకుంది.
అయినప్పటికీ…
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెండవ లేఖ(రిఫ్ నం బీసీఐడీ 5450/2026) సంబంధిత వ్యక్తులపై ఉపకులపతి విచారణ నివేదికను సమర్పించాలనే నిబంధనను కొనసాగిస్తోంది.
అభ్యర్థన స్వభావాన్ని దృష్టిలో ఉంచుకుని, అటువంటి విచారణను నిర్వహించడం తన అధికారాల రాజ్యాంగపరమైన వినియోగం అవుతుందా అనే విషయాన్ని విశ్వవిద్యాలయం పరిశీలించాల్సి ఉంటుంది.
విశ్వవిద్యాలయానికి సహాయపడేందుకు, అటువంటి విచారణను నిర్వహించడం రాజ్యాంగబద్ధమైనదా? విశ్వవిద్యాలయ పాలనా నిబంధనల ప్రకారం అనుమతించదగినదా? అనే అంశాన్ని అంచనా వేయడానికి, ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ కార్యనిర్వాహక మండలి ముందు ఉంచడం జరుగుతుంది(విశ్వవిద్యాలయాన్ని స్థాపించే శాసనం ప్రకారం కార్యనిర్వాహక మండలి విశ్వవిద్యాలయంలో అత్యున్నత నిర్ణయాలు తీసుకునే సంస్థ).
కార్యనిర్వాహక మండలితో సంప్రదింపుల ప్రక్రియ పూర్తయిన తర్వాత, అదే విషయాన్ని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తెలియజేయడం జరుగుతుంది.
పై వివరాలను కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు తెలియజేసే ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోందని శ్రీ కృష్ణదేవరావు పేర్కొన్నారు.
ఏదైనా గాని నల్సార్ లా విశ్వవిద్యాలయ విద్యార్థి మిత్రుల భవిష్యత్తు గండం గడిచిందనిపిస్తుంది.
బార్ కౌన్సిల్ నిర్వాకం, ఏమిటీ అన్యాయం?
నల్సార్ లా విశ్వవిద్యాలయం 2026 బ్యాచ్ గ్రాడ్యుయేట్లను న్యాయవాదులుగా ఎన్రోల్ (నమోదు) చేసుకోకుండా రాష్ట్ర బార్ కౌన్సిళ్లను ఆదేశించిన వారు మహానుభావుడు అధ్యక్షులైన మనన్ కుమార్ మిశ్రా నిర్ణయించారు. వారి ఆరుపేజీల లేఖను నల్సార్‌కు మిగతా అందరికీ కూడా మీడియా ద్వారా ప్రచురించారు. మన న్యాయానికి ఇంత అన్యాయమా?
‘‘తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు 2026లో నల్సార్ నుండి లా డిగ్రీ పొందిన విద్యార్థులను ఎన్రోల్ చేసుకోవద్దని’’ బీసీఐ అధ్యక్షులు 13 ఆగస్టు ఉదయం అన్ని రాష్ట్ర బార్ కౌన్సిళ్లను ఆదేశించారు.
‘‘స్నాతకోత్సవంలో(కన్వోకేషన్) సీజేఐ పాల్గొనడాన్ని నిరసిస్తూ చేపట్టిన ప్రచారాన్ని ప్రారంభించడంలో, నిర్వహించడంలో, సమన్వయం చేయడంలో లేదా సమీకరించడంలో ప్రధానంగా ప్రమేయం ఉన్నవారిని గుర్తిస్తూ విశ్వవిద్యాలయం నుండి ప్రమాణీకరించబడిన వాస్తవ నివేదికను పంపాల’’ని కూడా ఆయన కోరారు.
ఢిల్లీ విద్యార్థుల నిరసనలపై సీజేఐ సూర్యా కాంత్ చేసిన వ్యాఖ్యల పట్ల, ఆయనను కన్వోకేషన్కు ఆహ్వానించడాన్ని నల్సార్‌లోని కొంతమంది విద్యార్థులు వ్యతిరేకించినట్లు వచ్చిన నివేదికల తర్వాత ఈ ఆదేశాలు విడుదల చేసారు.
సీజేఐ పాల్గొనడం లేదా ఆహ్వానించడానికి సంబంధించి విశ్వవిద్యాలయానికి సమర్పించిన ఏదైనా వినతిపత్రం, పిటిషన్, మెమోరాండమ్ లేదా ఇతర సమాచార ప్రతులని, వాటిపై సంతకం చేసిన వారి పూర్తి జాబితాతో సహా తమ అధికారిక రికార్డుల నుంచి అందించాలని బీసీఐ నల్సార్‌ను కోరింది.
విద్యార్థి సంఘాలు, అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, పూర్వ విద్యార్థులు లేదా బయటి వ్యక్తుల ప్రమేయం ఏమైనా ఉంటే ఆ వివరాలను కూడా అందించాలని విశ్వవిద్యాలయాన్ని ఆదేశం వంటి సూచన చేసింది.
నల్సార్ వైస్-ఛాన్సలర్ నివేదిక అందిన తర్వాత, ఈ అంశంపై తన తుది నిర్ణయాన్ని 2026 ఆగస్టు 19 నాడు తీసుకోవాలని నిర్ణయించిందని చెప్పారు.
జ్ఞానోదయం..
ఆ తరువాత జ్ఞానోదయం రావడంతో సంహార లేఖను పొద్దున్న జారీ చేసిన ఆదేశాలను బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సాయంత్రానికి ఉపసంహరించుకుంది.
విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో(కాన్వోకేషన్) భారత ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ పాల్గొనడాన్ని నిరసిస్తూ చేపట్టిన సోషల్ మీడియా, వైస్ ఛాన్సలర్‌కు ఇచ్చిన లేఖను ఇవ్వడంలో, విద్యార్థులకు ఎటువంటి ప్రమేయం లేదంటూ, వారందరూ దోషులు కారని, చాలామంది నిర్దోషులే అని మంచి బుద్ధిపుట్టింది. ఎంతో గొప్ప నిర్ణయం తీసుకుంది.
చాలా చర్చ చేసిన తరువాత బార్ కౌన్సిల్, ఆగస్టు 13 సాయంత్రపు ఆదేశాలను మార్చింది. నల్సార్ 2026 గ్రాడ్యుయేట్లు అందరూ తమకు నచ్చిన రాష్ట్ర బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకోవడానికి అనుమతించాలని నిర్ణయించి శుభాంతం చేసింది.
విద్యార్థుల వైపు ఏ తప్పూ లేకుండా వారిని నష్టపోనివ్వకూడదని స్పష్టం చేయడం మంచి మాట.
ఈ తాజా లేఖలో “బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఛైర్మన్, నల్సార్ లా విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌కు; అన్ని రాష్ట్ర బార్ కౌన్సిళ్ల కార్యదర్శులకు జారీ చేసిన లేఖపైన కౌన్సిల్ సమగ్రంగా చర్చించి, ఆలోచించింది. క్షుణ్ణంగా చర్చించిన తర్వాత, తాజా నివేదిక ప్రకారం నల్సార్ విద్యార్థులలో (2026లో ఉత్తీర్ణులైన విద్యార్థులు) అత్యధిక శాతం నిర్దోషులని; గౌరవభంగం కలిగించే చర్యలో భాగం కావడానికి వారు ఇష్టపడలేదని సభ్యులు ఏకగ్రీవంగా అభిప్రాయపడ్డారు. తదనుగుణంగా, రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో నల్సార్ విద్యార్థుల ఎన్రోల్మెంట్పై ఉన్న నిషేధానికి సంబంధించి ఛైర్మన్ ఉత్తర్వులను కౌన్సిల్ సవరించింది. విద్యార్థులందరూ తమకు నచ్చిన రాష్ట్ర బార్ కౌన్సిళ్లలో నమోదు చేసుకోవడానికి అర్హులు” అని ఆ ఉత్తర్వు పేర్కొంది.
ఎందుకీ చెడు నిర్ణయాలు?
ఎంత ఉన్నతమైన అధికారం చేతిలో ఉన్న ఒక పబ్లిక్ సర్వెంట్, అధికార రాజకీయాలకు భజన చేసే విధమైన పగబట్టి చెడు నిర్ణయాలు చేసుకోకూడదు.
అంతకుముందు అమాయకులైన విద్యార్థులను రెచ్చగొట్టడంలో కొద్దిమంది ఉపాధ్యాయులు; బయటి వ్యక్తుల ప్రమేయం ఉందనడానికి “కొన్ని విశ్వసనీయ వర్గాల” నుంచి నివేదికలు అందాయని కూడా ఆ లేఖలో ఆరోపించారు.
నల్సార్ వైస్-ఛాన్సలర్ నుంచి విచారణ నివేదిక వచ్చే వరకు వేచి చూసి, నివేదిక అందిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని బార్ కౌన్సిల్ చెప్పడం భయానకమైన పరిణామాలు ఉంటాయనే హెచ్చరిక కనిపిస్తూనే ఉంది.
బీసీఐ అతి నియంత్రణ, అధికారాలు..
బీసీఐ తన చర్యలను సమర్థించుకోవడానికి అడ్వకేట్స్ యాక్ట్, 1961లోని కొన్ని నిబంధనలను ఉటంకిస్తుంది:
వృత్తిపరమైన ప్రమాణాల పరిరక్షణ(సెక్షన్ 7(1)(బీ))..
న్యాయవాదుల వృత్తిపరమైన ప్రవర్తన, నైతిక ప్రమాణాలను నిర్దేశించే అధికారం బీసీఐకి ఉంది. సుప్రీంకోర్టు లేదా సీజేఐ వంటి రాజ్యాంగ వ్యవస్థల పట్ల గౌరవం లేని ప్రవర్తన న్యాయవాద వృత్తికి పనికిరాదని బీసీఐ భావిస్తుంది.
న్యాయ విద్య నియంత్రణ(సెక్షన్ 7(1)(హెచ్), (ఐ))..
న్యాయ విద్య ప్రమాణాలను పర్యవేక్షించేందుకు, విశ్వవిద్యాలయాలను తనిఖీ చేసేందుకు బీసీఐకి అధికారాలు ఉన్నాయి. విశ్వవిద్యాలయాలు న్యాయ వ్యవస్థను బలహీనపరిచే కేంద్రాలుగా మారకుండా చూడటం తమ బాధ్యత అని బీసీఐ పేర్కొంటుంది.
సాధారణ పర్యవేక్షణ అధికారం (సెక్షన్ 7(1)(ఎల్))..
చట్టంలోని లక్ష్యాలను నెరవేర్చడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే హక్కు తమకు ఉందని బీసీఐ వాదిస్తుంది.
ఈ సమస్యపై 10 తీవ్ర అంశాల విశ్లేషణ..
ఈ వ్యవహారంలో తలెత్తిన ముఖ్యమైన చట్టపరమైన ప్రశ్నలు, వాటి నిజానిజాలను పరిశీలించాలి.
1. విద్యార్థులపై విచారణ జరిపే అధికారం..
అడ్వకేట్స్ యాక్ట్ ప్రకారం విశ్వవిద్యాలయాల్లో విద్య ప్రమాణాలను తనిఖీ చేసే అధికారం బీసీఐకి ఉంది. అయినప్పటికీ, ఇంకా అడ్వకేట్‌గా ఎన్రోల్ కాని విద్యార్థుల వ్యక్తిగత ప్రవర్తనపై లేదా రాజకీయ నిరసనలపై విచారణ జరిపే అధికారం బీసీఐకి లేదు.
2. సెక్షన్ 7(1)(హెచ్), (ఐ) పరిధి..
కోర్సు పాఠ్యాంశాలు, బోధనా ప్రమాణాలు, మౌలిక వసతులను పర్యవేక్షించడానికే ఈ సెక్షన్లు పరిమితం. విద్యార్థుల రాజ్యాంగబద్ధమైన భావప్రకటన స్వేచ్ఛను లేదా క్యాంపస్ నిరసనలను నియంత్రించేందుకు ఈ అధికారాలు విస్తరించవు.
3. ఎన్రోల్మెంట్ నిలిపివేసే అధికారం..
రాష్ట్ర బార్ కౌన్సిళ్లు స్వతంత్ర చట్టబద్ధమైన రోల్స్‌ను నిర్వహిస్తాయి. చట్టంలో లేని కారణాలతో ఒక బ్యాచ్ మొత్తానికి ఎన్రోల్మెంట్ నిలిపివేయాలని రాష్ట్ర బార్ కౌన్సిళ్లను ఆదేశించే స్పష్టమైన అధికారం బీసీఐకి లేదు.
4. బీసీఐ ఛైర్మన్ వ్యక్తిగత అధికారాలు..
ఛైర్మన్ ఏకపక్షంగా ఇటువంటి ఆదేశాలు ఇవ్వలేరు. ఏదైనా నిర్ణయం చట్టం, రూల్స్‌కు అనుగుణంగా కౌన్సిల్ ద్వారా మాత్రమే జరగాలి.
5. సెక్షన్ 24ఏ కింద అనర్హత..
అడ్వకేట్స్ యాక్ట్ సెక్షన్ 24ఏ ప్రకారం నేరపూరిత నేరాల్లో శిక్ష పడటం లేదా ప్రభుత్వ ఉద్యోగం నుండి తొలగించబడటం వంటివి మాత్రమే అనర్హతలు. శాంతియుతమైన నిరసనలు లేదా ప్రచారాల్లో పాల్గొనడం చట్టబద్ధమైన అనర్హత కిందకు రాదు.
6. బ్యాచ్ మొత్తాన్ని శిక్షించడం (సామూహిక శిక్ష)..
కొందరు విద్యార్థుల ప్రవర్తనను కారణం చూపి, మొత్తం బ్యాచ్ ఎన్‌రోల్‌మెంట్‌ను నిలిపివేయడం తీవ్రమైన ఏకపక్ష చర్య. ఇది ఆర్టికల్ 14 (సమానత్వ హక్కు) నిబంధనలకు విరుద్ధం.
7. అడ్వకేట్లు కానివారిపై బీసీఐ పరిధి..
అడ్వకేట్స్ యాక్ట్ చాప్టర్ వీ(సెక్షన్ 35) కింద, ప్రొసీడింగ్స్ కేవలం ఎన్రోల్ అయిన అడ్వకేట్లకు మాత్రమే వర్తిస్తాయి. విద్యార్థులపై చర్యలు తీసుకునే పరిధి బీసీఐ కి లేదు.
8. విశ్వవిద్యాలయ క్రమశిక్షణా పరిధి (నల్సార్ యాక్ట్)..
క్యాంపస్‌లో విద్యార్థుల క్రమశిక్షణను పర్యవేక్షించే పూర్తి అధికారం నల్సార్ యాక్ట్ సెక్షన్ 17(2) ప్రకారం వైస్-ఛాన్సలర్, ప్రాక్టోరియల్ బోర్డుకు మాత్రమే ఉంటుంది.
9. రాజ్యాంగబద్ధత (ఆర్టికల్ 14, 19)..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఏ) విద్యార్థులకు భావప్రకటన స్వేచ్ఛను, ఆర్టికల్ 19(1)(బీ) శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును కల్పిస్తాయి. నిరసన తెలిపినందుకు భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తామని బెదిరించడం రాజ్యాంగ హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతుంది.
10. “అత్యున్నత న్యాయస్థానం పట్ల గౌరవం” – అర్హతా ప్రమాణమా?..
న్యాయవాదిగా మారడానికి పార్లమెంటు సెక్షన్ 24, 24ఏ లలో స్పష్టమైన అర్హతలు, అనర్హతలను నిర్దేశించింది. “న్యాయ వ్యవస్థ పట్ల గౌరవం” అనే భావనను విమర్శలను అణచివేసే సాధనంగా లేదా ఎన్రోల్మెంట్ నిబంధనగా మార్చడానికి చట్టబద్ధమైన ప్రాతిపదిక లేదు.
బీసీఐ తన ఉత్తర్వులను ఉపసంహరించుకోవడం ద్వారా తక్షణ వివాదం సమసినప్పటికీ, ఇది న్యాయ విద్య నియంత్రణ సంస్థల పరిధులపై ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తింది.
విమర్శనాత్మక ఆలోచనను, రాజ్యాంగబద్ధమైన నిరసనను ప్రోత్సహించాల్సిన లా విశ్వవిద్యాలయాలలో, భవిష్యత్తు న్యాయవాదుల కెరీర్‌ను భయపెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదకరం.
బీసీఐ ప్రధాన బాధ్యత వృత్తిపరమైన ప్రమాణాలను కాపాడటమే తప్ప, విద్యార్థుల ఆలోచనలను లేదా రాజకీయ అభిప్రాయాలను నియంత్రించడం కాదని ఈ పరిణామం గమనించాల్సిన అవసరం ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
