ఈ 20 నిష్పత్తికి మించి ఇథనాల్ బ్లెండింగ్ చేయడం వ్యవసాయ మార్కెట్‌ను దెబ్బతీస్తుందని, అలాగే వాహనదారులకు వారు ఉపయోగించాలనుకునే ఇంధనాన్ని ఎంచుకునే వెసులుబాటు ఉండాలని ప్రధాన ఆర్థిక సలహాదారు అభిప్రాయపడ్డారు.
న్యూఢిల్లీ: ఇథనాల్ బ్లెండింగ్ వల్ల లభించే ప్రయోజనాలకు కొన్ని పరిమితులు ఉన్నాయని, ఇవి అపరిమితంగా ఉండవని భారత ప్రధాన ఆర్థిక సలహాదారు వీ అనంత నాగేశ్వరన్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఎడిటోరియల్ పేజీ వ్యాఖ్యలో రాశారు.
ఇంధనంలో 20 శాతం కంటే ఎక్కువ ఇథనాల్ కలపడం వల్ల నూనె గింజల రైతులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ కన్సల్టెంట్ ఆకాష్ పూజారితో కలిసి రాసిన వ్యాసంలో ఆయన అభిప్రాయపడ్డారు.
కార్బ్యురేటర్లతో నడిచే ఏడున్నర నుంచి 8 కోట్ల వాహనాలు 20 శాతం బ్లెండింగ్‌తో సమర్థవంతంగా నడవలేవని పేర్కొన్నారు.
“పెట్రోల్ పంపులలో మళ్ళీ ఈ 10 వంటి తక్కువ బ్లెండ్ ఇంధనాన్ని అందుబాటులోకి తెస్తూ, దాంతో పాటు ఈ 20 కొనుగోలు చేసే వెసులుబాటును ఇవ్వడం వల్ల ప్రజల్లో ఉన్న ఆందోళన తగ్గుతుంది. ఇది ఇథనాల్ వినియోగాన్ని పెంచడానికి బదులుగా మొత్తం వినియోగాన్ని తగ్గిస్తుంది. అలాగే రెట్రోఫిట్ ప్రోగ్రామ్ పుంజుకునే వరకు ప్రస్తుతం ఉన్న వాహనాలను రక్షిస్తుంది” అని రాశారు.
మంత్రి నితిన్ గడ్కరీ వైఖరికి భిన్నంగా వాదన..
జూన్ నెలలో వాహనాలు 100 శాతం వరకు ఇథనాల్‌ను ఉపయోగించే నిబంధనలకు ఆమోదం తెలిపిన కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వైఖరికి నాగేశ్వరన్, పూజారి రాసిన వ్యాసంలో అంచనాలు, ఆందోళనలు భిన్నంగా ఉన్నాయి.
దానికి బదులుగా, పాత వాహనాల యజమానులకు 10 శాతం ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగించే అవకాశం ఇవ్వాలని, ఈ 20కి మించిన అధిక మిశ్రమాలను ప్రవేశపెట్టకూడదని వారు పేర్కొన్నారు.
ప్రస్తుతం ఉన్న 20 శాతం మిశ్రమం కారణంగా ఇంజిన్ పనితీరు, దెబ్బతినడంపై వాహనదారులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలను గడ్కరీ అనేకసార్లు కొట్టిపారేశారు.
తమ వ్యాసంలో 20 శాతం ఇథనాల్ మిశ్రమ ఇంధనాన్ని ఉపయోగించడానికి వాహనాలు తగినట్లుగా ఉంటే, మైలేజీలో స్వల్ప తగ్గుదల(సుమారు 6 శాతం) తప్ప వాహనాలకు ఎలాంటి నష్టం జరగదని అయితే అనంత నాగేశ్వరన్, పూజారి అంగీకరించారు.
పాత వాహనాల కోసం ఈ 10 ఇంధనం అందుబాటులో ఉండాలి..
అయితే, భాగాలను మార్చకుండా 20 శాతం మిశ్రమాన్ని ఉపయోగించలేని స్థితిలో ఏడున్నర నుండి 8 కోట్ల వాహనాలు ఉన్నందున, 10 శాతం ఇథనాల్ మిశ్రమ ఇంధనం అందుబాటులో ఉండాలనే వాహనదారుల డిమాండ్‌కు వారు మద్దతు ఇచ్చారు.
మెకానిక్‌లతో సహా విడిభాగాల మార్కెట్ ఇంత వేగంగా ఈ మార్పును తట్టుకోలేదని నాగేశ్వరన్, పూజారి ఎత్తిచూపారు.
“ప్రారంభ రోడ్మ్యాప్లోనే దీనిని ఊహించి, పాత వాహనాల కోసం తక్కువ మిశ్రమ ఇంధనాన్ని విక్రయించాల్సిందిగా అభ్యర్థించారు. కానీ ఆ ఇంధనం పెట్రోల్ బంకుల నుండి నిశ్శబ్దంగా కనుమరుగైంది. దానిని మళ్ళీ తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది” అని నాగేశ్వరన్ అభిప్రాయపడ్డారు.
ఇథనాల్ బ్లెండింగ్ ముడి చమురు దిగుమతి బిల్లును ఆదా చేయడానికి సహాయపడిందని, అయితే ఈ పొదుపు భవిష్యత్తులో నిరంతరం కొనసాగదని రచయితలు అభిప్రాయపడ్డారు.
నూనె గింజల రైతులకు ముప్పు..
ఇథనాల్ శాతాన్ని మరింత పెంచడం ద్వారా ముడి చమురు దిగుమతి బిల్లును తగ్గించడానికి ప్రయత్నిస్తూనే ఉంటే, భారతదేశం నూనె గింజల పంటల స్థానంలో జొన్నలు, మొక్కజొన్న వైపు మళ్ళాల్సి వస్తుంది. అయినప్పటికీ, ముడి చమురు దిగుమతి బిల్లు మూడు నుంచి నాలుగు శాతం కంటే ఎక్కువ తగ్గే అవకాశం లేదని వారు పేర్కొన్నారు.
సమయం గడిచేకొద్దీ ఇంధన డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది, పైగా ముడి చమురు ధరలలో హెచ్చుతగ్గులు ఉంటాయి, కాబట్టి ఈ ప్రయోజనాలు నిరంతరం కొనసాగేవి కావు అనేది నిగూఢంగా వారి సూచన.
మరోవైపు, భారతదేశంలో ఇథనాల్ ఉత్పత్తికి మొక్కజొన్న ఒక ప్రధాన వనరు కాబట్టి, ఇంధన పరిశ్రమకు ఇథనాల్ సరఫరా చేసే దిశగా సాగు విస్తరణ పెరగడం వల్ల నూనె గింజల రైతులు తీవ్రంగా నష్టపోతారని రచయితలు ఎత్తి చూపారు.
“భారతదేశ ఇథనాల్‌లో దాదాపు సగం ఇప్పుడు మొక్కజొన్న నుంచి వస్తుంది. ధాన్యాలు అన్నీ కలిపి దాదాపు 67 శాతం ఇస్తున్నాయి” అని చెబుతూ- “మొక్కజొన్న పంట సోయాబీన్, వేరుశనగ, ఆవాలతో ఒకే పొలాల కోసం పోటీ పడుతుంది” అని పేర్కొన్నారు.
దేశీయ స్వయంసమృద్ధి లక్ష్యానికి విఘాతం..
మరింత బ్లెండింగ్ చేయడానికి వ్యతిరేకంగా రచయితలు బలమైన వాదన వినిపిస్తూ, ఇథనాల్ బ్లెండింగ్ ప్రోగ్రామ్ నూనె గింజల స్వయంసమృద్ధి లక్ష్యాన్ని దెబ్బతీస్తోందని అన్నారు.
“ముడి చమురు బిల్లు సంవత్సరానికి సుమారు 11-12 లక్షల కోట్లు. తినే నూనెల(వంటనూనెల) దిగుమతి బిల్లు చాలా తక్కువ. సుమారు 1.6 నుంచి 1.75 లక్షల కోట్లు. ఈ 20 వద్ద ఇథనాల్ ముడి చమురు బిల్లులో కేవలం మూడు నుండి నాలుగు శాతాన్ని మాత్రమే తగ్గిస్తుంది. తినే నూనెల లోటు అంత భయానకంగా లేదు, దానిని సులభంగా భర్తీ చేయవచ్చు” అని చెప్పారు.
అధిక బ్లెండింగ్ నిష్పత్తుల కోసం ప్రస్తుతం జరుగుతున్న ప్రయత్నం రైతులపై రెండు రకాల ప్రభావం చూపుతుంది. ‘ఇథనాల్’ సాగు ఒక నిర్దిష్ట (ఫిక్స్డ్) ధరల వ్యవస్థ కింద పనిచేస్తుంది, అయితే నూనె గింజల రైతులు మార్కెట్ ఆధారిత ధరల వ్యవస్థ కింద పనిచేస్తారు.
రెండవది, ఇథనాల్ తయారీ కోసం డిస్టిలేషన్ చేసిన తర్వాత మిగిలిపోయిన మొక్కజొన్న ధాన్యాన్ని పశువుల మేతగా విక్రయిస్తారు. ఇది కూడా సోయాబీన్ పిండి కంటే తక్కువ ధరకు లభిస్తుంది. “దీనివల్ల నూనె గింజల రైతు రెండుసార్లు నష్టపోతాడు” అని రామేశ్వరన్, పూజారి పేర్కొన్నారు.
పర్యావరణపరమైన వాదనలకు శాస్త్రీయత లేదు..
తక్కువ ఉద్గారాలతో సహా మిశ్రమ ఇంధనం వల్ల పర్యావరణ ప్రయోజనాలు ఉన్నాయని వారు గుర్తు చేశారు. కానీ ఇథనాల్ ఉత్పత్తికి ఉద్దేశించిన పంటలను(చెరకు, మొక్కజొన్న మొదలైనవి) పెంచడానికి ఉపయోగించే నీటి వినియోగాన్ని భారతదేశం పరిగణనలోకి తీసుకోవాలి.
మహారాష్ట్ర, కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాల్లో, చెరకు సాగు “ఇప్పటికే తీవ్రమైన నీటి ఎద్దడి ఉన్న వనరులపై ఎక్కువగా ఆధారపడుతోంది” అని వారు పేర్కొన్నారు.
“10 నుంచి 20 శాతం ఇథనాల్ బ్లెండింగ్ కంటే ఇంకా ఎక్కువ శాతం ఇథనాల్ బ్లెండింగ్ కోసం పర్యావరణపరంగా చెప్పే వాదనలు శాస్త్రీయంగా నిలబడకపోవచ్చు” అని వారు పేర్కొన్నారు.
“ఇతర పంటల కంటే మొక్కజొన్నకు అనుకూలంగా ఉండేలా ఉన్న ధరలు, నీటి వ్యత్యాసాలను సరిచేయండి. దేశీయ స్వయంసమృద్ధి వైపు అడుగులు వేయడానికి వంటనూనెలపై ఉన్న దిగుమతి సుంకాన్ని పునఃపరిశీలించండి. అలాగే ఆహారం వర్సెస్ ఇంధనం మధ్య ఉన్న వ్యత్యాసాలను భారతదేశం పూర్తిగా అంచనా వేసే వరకు ఈ 20 వద్దనే నిలిపి వేయండి” అని వారు ముగించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
