సంప్రదాయం ప్రకారం వేడుకకు ముఖ్య అతిథిగా సీజేఐ కాంత్‌ను ఆహ్వానించే విషయంలో ధృవీకరించినట్లు నాలుగు రోజుల క్రితం నల్సార్ తెలియజేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం వెల్లడించింది.
న్యూఢిల్లీ: వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొనే ఆహ్వానాన్ని తాను అంగీకరించలేదని, అందుచేత తాను పాల్గొనే ప్రశ్నే తలెత్తదని భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ టైమ్స్ ఆఫ్ ఇండియాకు చెప్పారు.
స్నాతకోత్సవంలో తన ఉనికిని వ్యతిరేకిస్తూ నల్సార్ విశ్వవిద్యాలయం లా విద్యార్థులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును సమర్థించిన కొన్ని రోజుల తర్వాత ఆయన ఈ విషయాన్ని చెప్పారు.
స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడానికి “నల్సార్ ఆహ్వానానికి ఎన్నడూ సమ్మతించలేదని” సీజేఐ సూర్యకాంత్ చెప్పినట్లు టీఓఐ కథనం తెలియజేసింది.
“స్నాతకోత్సవంలో నేను పాల్గొనే ప్రశ్నే తలెత్తదు” అని ఆయన అన్నారు.
బీసీఐ ఆదేశాలు – సీజేఐ అసంతృప్తి..
బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్, భారతీయ జనతా పార్టీ సభ్యుడు మనన్ కుమార్ మిశ్రా అకస్మాత్తుగా తలదూర్చి 2026 నల్సార్ గ్రాడ్యుయేట్లను చేర్చుకోరాదని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లకు ఆదేశాలు జారీ చేశారు.
ఆ తర్వాత ఆ ఆదేశాలను ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పడంతో ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి స్పందనకు ప్రాముఖ్యత సంతరించుకుంది.
బీసీఐ చర్యపై ఏమాత్రం సంతృప్తిగా లేని సీజేఐ..
“బీసీఐ అనవసరంగా చర్యలు తీసుకుంటోంది” అని కాంత్ ఆగస్టు 14న చెప్పారు. నిరసన తెలియజేయడానికి విద్యార్థులకు ఏవైనా కారణాలు ఉంటే “నిరసన తెలిపే హక్కు వారికి ఉంది” అని స్పష్టం చేశారు. బీసీఐ జోక్యం “పూర్తిగా అనవసరమైనది” అని, ఇది విద్యార్థులు, సీజేఐ మధ్య చర్చించుకునే అంశం అని ఆయన చెప్పారు.
నల్సార్ ఆహ్వానం – విద్యార్థుల నిరసన..
ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్‌లో జరపతలపెట్టిన వేడుకకు, కొనసాగుతున్న సంప్రదాయం మేరకు ముఖ్య అతిథిగా సీజేఐ కాంత్‌ను ఆహ్వానించినట్లు నాలుగు రోజుల క్రితం నల్సార్ ధృవీకరించిందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది.
జూలై 20న సంసద్ మార్చ్ సందర్భంగా విద్యార్థులపై పోలీసుల దమనకాండకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ మొత్తం 1,400 మందిలో 400 మందికి పైగా విద్యార్థులు సీజేఐ ఉనికిని వ్యతిరేకించారు.
కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు నేపథ్యం..
ఈ నిరసనల్లో సీజేఐది వినూత్నమైన పాత్ర అన్నది అందరికీ తెలిసిన విషయమే. “ఈ యువకులు బొద్దింకల్లాంటి వారని, వారికి ఎలాంటి ఉపాధి లభించదని, వృత్తిలో వారికి స్థానం లేదు” అని సీజేఐ సూర్యకాంత్ మేలో చేసిన వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకొని అదే పేరుతో ఏర్పడిన కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో నెల రోజుల పాటు నిరసనలు తెలియజేశారు.
జూలై 20న మార్చ్‌కు పిలుపునివ్వగా అందులో సుమారు 75 వేల మంది పాల్గొన్నారు.
ఆ పరిణామం చివరకు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు దారి తీసింది.
జూలై 20న నిరసనకారులపై పోలీసుల దమనకాండకు సంబంధించిన వీడియోలను చూడటంపై తనకు ఎలాంటి ఆసక్తి లేదని జూలై 22న సీజేఐ సూర్యకాంత్ పేర్కొంటూ, కోర్టు సమయాన్ని వృథా చేయవద్దని పిటిషనర్‌ను కోరారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
