ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకులకు 2006 నుంచి యూజీసీ వేతనాల చెల్లింపు విధానాన్ని అమల్లోకి తెచ్చారు.
2014లో రాష్ట్రం రెండుగా విభజించబడింది. ఏడవ వేతన సంఘం సిఫారసులకు అనుగుణంగా ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకులకు సవరించిన యూజీసీ స్కేల్స్ – 2016ను అమలు చేయడానికి మార్గదర్శకాలను సూచించమని 2019 ఫిబ్రవరి 25న నాటి చంద్రబాబు ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 138 ద్వారా ఒక కమిటీని నియమించింది.
కమిటీ నివేదిక సమర్పించే నాటికి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ఆ కమిటీ సమర్పించిన నివేదికను చెత్తబుట్టలో వేశారు.
యూజీసీ స్కేల్స్ – 2016ను అమలు చేయకుండా, “ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ రివైజ్డ్ పే స్కేల్స్ – 2020” అంటూ ఒక కొత్త వేతన విధానాన్ని అమల్లోకి తెస్తూ 2021 మార్చి 1న జీవో ఎంఎస్ నంబర్ 22 జారీ చేశారు.
యూజీసీ స్కేల్స్ – 2016ను అమలు చేస్తే, 2016 జనవరి 1 నుండి 2021 ఫిబ్రవరి 28 వరకు అంటే ఐదు సంవత్సరాల రెండు నెలలకు సంబంధించిన వేతన బకాయిలు చెల్లించాల్సి వస్తుందన్న దివాళాకోరు ఆలోచనతో వాటిని ఎగ్గొట్టడానికి కొత్త వేతన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.
తద్వారా ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకులను గత ప్రభుత్వం దగా చేసింది.
నాడు అమలు చేసి.. నేడు వివక్ష చూపడం తగునా?
నేటి ముఖ్యమంత్రే, 2014-19 మధ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులకు సవరించిన యూజీసీ స్కేల్స్ – 2016ను అమలుచేస్తూ 2019 ఫిబ్రవరి 13న ఉన్నత విద్యా శాఖ జీవో ఎంఎస్ నంబర్ 14ను జారీ చేసింది.
రాష్ట్రంలో సాధారణ విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అధ్యాపకుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్షతో వ్యవహరిస్తున్నది అనడానికి ఇదొక ప్రబల నిదర్శనం.
అలాగే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకులకు యూజీసీ స్కేల్స్-2016ను అమలు చేస్తూ 2020 సెప్టెంబర్ 9న జీవో ఎంఎస్ నంబర్ 43ను జారీ చేసి, అమలు చేసింది.
వేతన బకాయిలను చెల్లించడానికి కూడా జీవో ఎంఎస్ నంబర్ 164ను 2023 సెప్టెంబర్ 23న జారీ చేసింది.
అదే దారిలో ప్రస్తుత కూటమి ప్రభుత్వం..
ఈ పూర్వరంగంలో, ప్రజలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దెదించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దుతామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం “ఎగ్గొట్టే” విషయంలో మాదీ జగన్ బాటే అనడం హాస్యాస్పదంగా ఉంది.
తప్పుడు నిర్ణయాన్ని, విధానాన్ని, చేసిన అన్యాయాన్ని సరిదిద్ది, ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకులకు యూజీసీ స్కేల్స్ – 2016 అమలును పునరుద్ధించాల్సిన బాధ్యత నేటి కూటమి ప్రభుత్వంపై ఉన్నది.
అలాగే, 2016 జనవరి 1 నుంచి 2021 ఫిబ్రవరి 28 వరకు చెల్లించాల్సిన వేతన బకాయిలను చెల్లించాలి. ఈ న్యాయసమ్మతమైన కోరికను ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకులు గడచిన రెండేళ్లుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళుతుంటే, చావు కబురు చల్లగా చెప్పినట్లు ఆరోగ్య వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి “అభ్యర్థన పరిశీలనకు ఆచరణ సాధ్యం కాదని తేలింది” అంటూ సెలవిచ్చారు. ఆ ఉన్నతాధికారి ఈ అభిప్రాయాన్ని తెలియజేసే ముందు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖామాత్యులతో, ఆయన ద్వారా ముఖ్యమంత్రితో చర్చించి, ఈ నిర్ణయానికి వచ్చారో, లేదో, తెలియదు. కానీ, అది ప్రభుత్వ నిర్ణయం.
2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరచిన “కడప ఉక్కు కర్మాగారం” నెలకొల్పడానికి “ఫీజిబిలిటీ” లేదని మోడీ ప్రభుత్వం వెల్లడించి, ఎగ్గొట్టిన రీతిలోనే, రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకుల యూజీసీ వేతన బకాయిలను ఎగ్గొట్టడానికి “ఫీజిబిలిటీ” లేదని చెప్పడం హాస్యాస్పదం కాదా.
ఈ సమస్యపైన కర్నూలు ప్రభుత్వ వైద్య కళాశాలకు చెందిన కొందరు అధ్యాపకులు హైకోర్టును కూడా ఆశ్రయించారు. కానీ, ఈ సమస్యను పరిష్కరించడానికి న్యాయస్థానానికి ఎన్నేళ్ళు పడుతుందో, అసలు పరిష్కరిస్తుందో.. లేదో..!
గాడి తప్పిన ప్రభుత్వ వైద్య కళాశాలల వ్యవస్థ..
రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల వ్యవస్థ గాడి తప్పి నడుస్తోంది. వైద్య విద్య నాణ్యతా ప్రమాణాలను పెంచే విషయాన్ని గాలికి వదిలేశారు. జగన్ ప్రభుత్వం ఒకేసారి 16 కళాశాలలను నూతనంగా నెలకొల్పడానికి పూనుకుని, అరాకొర మౌలిక సదుపాయాలతో నాలుగు కళాశాలను ప్రారంభించి, వెళ్లిపోయింది.
వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న మిగిలిన కళాశాలలను ప్రైవేట్-పబ్లిక్-పార్టనర్షిప్ (పీపీపీ) విధానం కింద నెలకొల్పడానికి కూటమి (బాబు) ప్రభుత్వం పూనుకున్నది.
దశాబ్దాలుగా నడుస్తున్న వైద్య కళాశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలన్న ధ్యాస లేదు. పెండింగ్లో ఉన్న నిర్మాణ పనులను పూర్తి చేయడానికి నిధులను వెచ్చించడం లేదు.
యూజీ, పీజీ సీట్ల సంఖ్యను పెంచేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ, అధ్యాపకుల కొరత వెంటాడుతున్నది. నేటి ప్రభుత్వ నియామక ప్రక్రియ లోపభూయిష్టంగా ఉన్నది. సీనియర్ ప్రొఫెసర్స్ కొరత తీవ్రంగా ఉన్నదని, రిటైర్మెంట్ వయసును పెంచే ఆలోచన చేస్తున్నారు.
జూనియర్ డాక్టర్లకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు స్టైపెండ్ పెంచకపోవడం వల్ల వాళ్ళు ఆందోళనకు దిగారు. సమస్యల వలయంలో వైద్య విద్య ఉన్నదనడానికి ఇవన్నీ కళ్ళ ముందు కనపడుతున్నాయి.
వైద్య విద్యా రంగాన్ని ప్రక్షాళన చేయాలి..
ప్రభుత్వ వైద్య కళాశాలల అధ్యాపకులు, జూనియర్ డాక్టర్ల న్యాయసమ్మతమైన సమస్యలను తక్షణం పరిష్కరించి, అధ్యాపకులకు అధ్యాపకేతర పనులను అప్పగించకుండా, అధ్యాపకుల కొరత లేకుండా చేసి, నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు అందించడానికి, విద్యా ప్రమాణాలను పెంపొందించడానికి, ప్రభుత్వ వైద్య విద్యా రంగాన్ని ప్రక్షాళన చేయడానికి కూటమి ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరించాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
