ఇతర ఏ విశ్వసనీయ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఇలాంటి ప్రజాభిప్రాయ సర్వేలను నిర్వహించేందుకు మీడియా వెంటనే రంగంలోకి దిగేది.
తొలుత ఫోన్ ద్వారా, ఆ తర్వాత మహానగరాల పరిధిలో సర్వేలు నిర్వహించేవారు. వీటిని చాలా సులభంగా, తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు. ఆ తర్వాత వారం లేదా పది రోజుల్లోనే మరింత విస్తృతంగా, క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సర్వేలు వెలువడేవి.
నిరసనలపై వాస్తవ కవరేజీ..
మీరు గత నెలలో జరిగిన విద్యార్థుల నిరసనలను సమర్థించొచ్చు లేదా తీవ్రంగా వ్యతిరేకించి ఉండొచ్చు. కానీ వాటిపై మీడియాలో విస్తృతంగా వార్తలు రావడం వాస్తవం. అక్కడ అసలేం జరిగింది, నిరసనకారులు, పోలీసులు ఎలాంటి వైఖరి అవలంబించారు అనే దానిపై మనకు స్పష్టమైన అవగాహన ఉంది.
నిరసనకారుల నేపథ్యాలు, వారిలో కొందరితో చేసిన ఇంటర్వ్యూలు కూడా మీడియాలో ప్రముఖంగా వచ్చాయి. వారి భవిష్యత్తు ప్రణాళికలు, నిరసనల శైలి, వ్యూహం, సాధించిన ఫలితాలపై జరిగిన చర్చలు, విశ్లేషణలను కూడా మనం విన్నాం.
ఈ అంశాలన్నింటినీ మీడియా నిష్పాక్షికంగా, సమతూకంతో కవర్ చేసి ఉండకపోవచ్చు. అయినప్పటికీ, ఈ అంశాలన్నీ మీడియా ద్వారా మనకు అందుబాటులోకి వచ్చాయి.
ప్రజల స్పందనపై ప్రశ్నార్థకం..
జరిగిన సంఘటనలను ప్రజలు ఎలా చూశారు? నిరసనకారుల పట్ల వారి అభిప్రాయం ఏమిటి? వారితో వ్యవహరించిన తీరును ప్రజలు ఎలా అంచనా వేశారు? రాజకీయ నాయకుల స్పందనను ఎలా చూశారు? అగ్ర నాయకత్వం మౌనం పట్ల వారి అభిప్రాయం ఏమిటి? చివరకు జరిగిన పరిణామాలపై ప్రజల స్పందన ఎలా ఉంది? ఇలాంటి విషయాలు మాత్రం మనకు తెలియవు.
సులభంగా చెప్పాలంటే, గత నెలలో జరిగిన సంఘటనలు, వెలువడిన ప్రకటనలు, వివిధ వర్గాల ప్రవర్తన, తదనంతరం చోటుచేసుకున్న పరిణామాలపై భారత ప్రజలు నిజంగా ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసిన సర్వేలు, ప్రజాభిప్రాయ సేకరణలు మాత్రం మనకు కనిపించలేదు.
సాధారణ సర్వేలే కానీ.. స్పష్టత ఏది?
“ప్రస్తుతం దేశంలో ఎన్నికలకు సంబంధించిన ప్రధాన సమస్య ఏమిటి?” లేదా “మీరు ఎవరికి ఓటు వేస్తారు?” వంటి కొన్ని సాధారణ ప్రశ్నలతో ఒకట్రెండు సర్వేలు వచ్చిన మాట వాస్తవమే. కానీ, జూలై నెలలో జరిగిన నాటకీయ పరిణామాల తర్వాత ఇలాంటి ప్రశ్నలు అర్థరహితమైనవి, కనీసం ఈ సందర్భానికి ఏమాత్రం సంబంధం లేనివి.
ఇప్పుడు మనకు కావాల్సింది నిర్దిష్టమైన, సూటిగా సమాధానం రాబట్టే ప్రశ్నలు. కానీ ఆ పని మాత్రం ఎవ్వరూ చేయలేదు.
ఉదాహరణకు, నేను తెలుసుకోవాలనుకున్నా, ఎక్కడా లభించని కొన్ని విషయాలకు సంబంధించిన ప్రశ్నలు ఇవి.
అడగాల్సిన ప్రాథమిక ప్రశ్నలివే..
మొదటగా, అడిగి ఉండాల్సిన కొన్ని సాధారణ ప్రశ్నలు: జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనపై మీ అభిప్రాయం ఏమిటి? పార్లమెంటు వైపు మార్చ్ చేయడానికి చేసిన ప్రయత్నం సమర్థనీయమేనా? పోలీసులు వృత్తిపరంగా వ్యవహరించారా, లేక క్రూరంగా ప్రవర్తించారా?
విద్యార్థులపై టియర్ గ్యాస్, లాఠీఛార్జ్ ప్రయోగించడం సమర్థనీయమేనా? నిరసనలో పాల్గొన్న విద్యార్థులు అగ్ర నాయకులను ఎగతాళి చేస్తూ పోస్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ రీల్స్, సోషల్ మీడియా సందేశాలను మీరు సమర్థిస్తారా? మంత్రులు నిరసనకారులతో మరింత ముందుగానే చర్చలు జరిపి ఉండాల్సిందని మీరు భావిస్తున్నారా?
ఇలాంటి ప్రశ్నలు ఇంకా చాలా ఉన్నాయి. నేను కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇస్తున్నాను.
తెలుసుకోవాల్సిన నిర్దిష్ట అంశాలు..
రెండవది, మనం తెలుసుకోవాల్సిన కొన్ని నిర్దిష్టమైన అంశాలు: సోనం వాంగ్‌చుక్ మూడు వారాల నిరాహార దీక్షను మీరు ఎలా చూస్తారు? ఢిల్లీలో విద్యార్థులపై పెల్లెట్ గన్స్, బీహార్‌లో ఏకే-47లను ఉపయోగించడాన్ని సమర్థించవచ్చా?
నిరసనలకు ప్రభుత్వం ఎంత బాధ్యతాయుతంగా, ఎంత సమర్థవంతంగా స్పందించింది? హోంమంత్రి మౌనం వహించడం అర్థం చేసుకోదగినదా, కాదా? ప్రధానమంత్రి ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించిన తీరు ప్రభావవంతంగా ఉందా? తనను దూషించిన వారిని క్షమించానని ఆయన చెప్పడం సమర్థనీయమేనా, లేక అది అహంకారపూరిత వైఖరా?
వెంటనే రంగంలోకి దిగాల్సిన మీడియా..
ఇతర ఏ విశ్వసనీయ ప్రజాస్వామ్య దేశంలోనైనా ఇలాంటి ప్రజాభిప్రాయ సర్వేలను నిర్వహించేందుకు మీడియా వెంటనే రంగంలోకి దిగేది.
తొలుత ఫోన్ ద్వారా, ఆ తర్వాత మహానగరాల పరిధిలో సర్వేలు నిర్వహించేవారు. వీటిని చాలా సులభంగా, తక్కువ సమయంలో పూర్తి చేయవచ్చు. ఆ తర్వాత వారం లేదా పది రోజుల్లోనే మరింత విస్తృతంగా, క్షేత్రస్థాయిలో పకడ్బందీగా నిర్వహించిన ప్రజాభిప్రాయ సర్వేలు వెలువడేవి.
సమాచార లేమి – మీడియా తీరుపై సందేహాలు..
ఇప్పటికే నిరసనలు ముగిసి మూడు వారాలకు పైగా గడిచాయి. గత నెలలో జరిగిన ఈ కీలక పరిణామాలను దేశ ప్రజలు ఎలా చూశారనే దానిపై ఇప్పటికి మనకు విశ్వసనీయమైన, దాదాపు సమగ్ర అవగాహన ఉండాలి. కానీ, దురదృష్టవశాత్తూ, మనకు అలాంటి సమాచారం లేదు.
ఒక ప్రజాస్వామ్య దేశంగా మనం ఈ విషయాలను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దానికి బదులు, మనకేమీ తెలియని పరిస్థితిలో ఉండిపోయాం. మన మీడియాకు ఇలాంటి సర్వేల ఆలోచనే రాలేదని గానీ, లేదా వాటిని అనవసరమైనవిగా, అసందర్భమైనవిగా భావించారని గానీ నేను నమ్మలేను.
మీడియా మిత్రులు ఖచ్చితంగా ఇలాంటి సర్వేల కోసం పట్టుబట్టేవారని, ప్రతి జర్నలిస్టు సహజ ప్రవృత్తి కూడా ఈ సర్వేల కోసం తహతహలాడి ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. మరి అలాంటప్పుడు అసలు ఏం జరిగింది? నేను ఊహించగలను, నా ఊహ సరైనదేనన్న నమ్మకం కూడా నాకు ఉంది.
అధికార ఒత్తిళ్లే కారణమా?
అధికారంలో ఉన్న ఎవరో ఒకరు, ఎడిటర్ కావచ్చు, లేదా మీడియా సంస్థ అధినేత కావచ్చు, ఇలాంటి సర్వేలకు ‘నో’ చెప్పి ఉంటారు.
సర్వే ఫలితాలు వస్తే ప్రభుత్వం ఇరకాటంలో పడుతుందని వారు ముందే ఊహించి, ఆ పరిస్థితిని తప్పించుకోవాలని చూసి ఉంటారు.
ప్రజలకు నిజంగా అవసరమైన సమాచారాన్ని, విశ్లేషణను అందించడం కంటే పాలకుల ప్రతిష్ఠను, అహాన్ని కాపాడటానికే వారు ప్రాధాన్యం ఇచ్చి ఉంటారు.
ఈ విషయంలో మన ప్రింట్ మీడియా సంస్థలకూ, టెలివిజన్ చానళ్లకూ పెద్దగా తేడా లేదని చెప్పాలి.
మీడియా స్వేచ్ఛపై నీలినీడలు..
మనం ఇలాంటి ఒక ముగింపుకు రావడం నిజంగా చాలా బాధాకరం, ఒక రకంగా ఇదో విషాదం. భారతదేశ ప్రజలను పూర్తి సమాచారంతో చైతన్యపరచడంలో మన మీడియాపై ఆధారపడలేమనే విషయాన్ని ఇది సూచించడమే కాకుండా, మరికొన్ని ప్రశ్నలను కూడా లేవనెత్తుతోంది.
అలాంటప్పుడు అసలు మనకు మీడియా ఎందుకు ఉండాలి? అది నిజంగానే స్వేచ్ఛగా, నిర్భయంగా పనిచేస్తోందని చెప్పుకోగలదా?
అయితే, ఇంతటితో అయిపోలేదు. మనం ఎంతో గర్వంగా చెప్పుకునే మన ప్రజాస్వామ్యం కూడా దీనివల్ల బలహీనపడుతోంది.
దశాబ్దాలుగా అత్యంత కీలకమైన ఒక పరిణామంపై దేశ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయడానికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి తగినంత ధైర్యం, నైతిక బలం లేకపోవడం విచారకరం.
మౌనం వెనుక ఉన్న భయం.. మనం వేసుకోవాల్సిన ప్రశ్న..
చివరగా నేను ఒక ప్రశ్న అడిగి ముగిస్తాను. మనలో చాలామంది ఇప్పటికే మనసులో గ్రహించిన, అలాగే మరికొందరు తెలుసుకుంటే షాక్‌కు గురయ్యే ఆ నిజాన్ని బయటపెట్టడానికి మనం భయపడుతున్నామా? అందుకే మీడియా మనకు ఆ విషయాలను చెప్పలేదా? దీనికి మనలో ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా సమాధానం చెప్పుకోవాలి.
కానీ ఇక్కడ నేను మరొక విషయాన్ని ప్రస్తావించాలనుకుంటున్నాను. మీడియా ముఖ్య ఉద్దేశం ప్రజలను మేల్కొలిపి, వారికి వాస్తవాలను తెలియజేయడం- అంతే తప్ప మనల్ని ప్రశాంతంగా నిద్రపోయేలా చేయడం కాదు.
చివరికి, మనం ఈ మౌనాన్ని అంగీకరిస్తే, అది మన గురించి కూడా ఏదో చెబుతుంది. ఇలాంటి పరిస్థితిని మనం ఎందుకు అంగీకరిస్తున్నాం? దీనికి వ్యతిరేకంగా ఎందుకు నిరసన తెలపడం లేదు? ఇది మనమందరం సమాధానం వెతుక్కోవాల్సిన ప్రశ్న.
కరణ్ థాపర్
అనువాదం: దేవి పోలిన
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
