(16వ ఆర్థిక సంఘం అధికార సమతుల్యతను రాష్ట్రాల నుంచి కేంద్రం వైపునకు మళ్లిస్తోంది. తద్వారా భారతదేశపు ఆర్థిక సమాఖ్యవాదం ఆత్మను బలహీనపరుస్తోంది.)
భారత రాజ్యాంగంలోని సమాఖ్యవాదం కేంద్రం, రాష్ట్రాల మధ్య అధికార సమతుల్యతను చారిత్రాత్మకంగా సవాళ్లతో కూడుకున్నప్పటికీ స్థిరంగా ఉండేందుకు దోహదం చేసింది. కానీ 2014లో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది మరింత కేంద్రీకరణ వైపు మొగ్గు చూపుతోంది.
16వ ఆర్థిక సంఘం సమర్పించిన నివేదికను పరిశీలిస్తే ఈ అభిప్రాయానికి మరింత బలం చేకూరుతుంది. కేంద్రం సేకరించే పన్నులను రాష్ట్రాలతో ఎలా పంచుకోవాలి, రాష్ట్రాల మధ్య ఎలా పంపిణీ చేయాలి అనే అంశాలను నిర్ణయించడానికి ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలని భారత రాజ్యాంగం నిర్దేశిస్తుంది.
ఢిల్లీ కేంద్రంగా అధికార కేంద్రీకరణ..
ఢిల్లీలో అధికారాలను కేంద్రీకరించే ప్రయత్నంలో భాగంగా ఇప్పటికే ఉన్న వ్యవస్థలను మార్చివేసిన సుదీర్ఘ ఉదాహరణల జాబితాలో 16వ ఆర్థిక సంఘం నివేదికను తాజాగా చేర్చవచ్చు.
ప్రవేశ పరీక్షలను కేంద్రీకరించేందుకు అత్యవసరంగా ఏర్పాటు చేసిన ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’లో తీవ్రమైన సామర్థ్య లోపాలు ఉన్నాయని ఇటీవలి పరీక్షల వివాదం బట్టబయలు చేసింది.
మరో ఉదాహరణ ఏమిటంటే- వివిధ బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లుగా నియమితులైన పార్టీ విశ్వసనీయులు ప్రజాస్వామ్య ప్రక్రియలకు భంగం కలిగించేందుకు ప్రయత్నించడం.
వస్తు సేవల పన్ను అమలు తమ ఆర్థిక స్వయంప్రతిపత్తిని ఎలా దెబ్బతీసిందో రాష్ట్రాలు మొదటి నుంచీ ఫిర్యాదు చేస్తూనే ఉన్నాయి.
కేంద్రానికి అనుకూలంగా 16వ ఆర్థిక సంఘం..
ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయాలనే రాజ్యాంగ నిబంధన ఒక భారీ ఒప్పంద ఫలితం. గణతంత్ర రాజ్య నిర్మాణంలో కేంద్రానికి అపరిమిత అధికారాలను కట్టబెట్టే రాజ్యాంగ పరిషత్ నిర్ణయాన్ని, కేంద్రం – రాష్ట్రాల మధ్య కొన్ని అధికారాల పంపిణీకి అవకాశం కల్పించే ఒక ప్రత్యేకమైన సమాఖ్య రూపకల్పన ద్వారా సమతుల్యం చేసింది. ఆర్థిక సమాఖ్యవాదం ఈ నిర్మాణంలో అత్యంత కీలకమైన భాగం.
16వ ఆర్థిక సంఘం నివేదిక, రాబోయే ఐదేళ్లలో రాష్ట్రాలకు ఏ మేరకు నిధులు సమకూర్చాలో తెలిపే దాని సిఫార్సులు ఈ కట్టుబాటును పూర్వపక్షం చేసి, కేంద్రీకరణ ప్రాజెక్ట్‌కు అమితంగా సహాయ సహకారాలు అందించడానికి శ్రమించాయి.
దీని ప్రధానాంశం ఏమిటంటే- కేంద్రం రాష్ట్రాలతో పంచుకోవాల్సిన పన్నుల ‘డివిజిబుల్’ పూల్ నుండి ఇచ్చే మొత్తం విభజన నిష్పత్తిని గత ఐదేళ్ల నాటి 41 శాతం వద్దే మార్చకుండా ఉంచడం.
ఇది రాష్ట్రాల పట్ల కమిషన్ ఉక్కు పిడికిలి చాచిన వైఖరిని ప్రతిబింబిస్తుంది, అదే సమయంలో కేంద్రానికి చాలా వెసులుబాటు కల్పించింది. ఇది రెండు విధాలుగా స్పష్టమవుతోంది.
రాష్ట్రాలకు అందని పన్నుల వాటా..
మొదటిది: గడిచిన దశాబ్దన్నర కాలంగా సర్ఛార్జీలు, సెస్‌లు డివిజిబుల్ పూల్‌ను కుదించివేస్తున్నాయని ఆర్థిక సంఘం అంగీకరించింది.
13వ ఆర్థిక సంఘం కాలంలో సగటున 89.2 శాతం ఉన్న పన్నుల పంపిణీ, 14వ ఆర్థిక సంఘం నాటికి 82.1 శాతానికి, 15వ ఆర్థిక సంఘం నాటికి 78.3 శాతానికి పడిపోయింది.
రాష్ట్రాలతో సెస్‌లు, సర్ఛార్జీలను పంచుకోవడాన్ని రాజ్యాంగం స్పష్టంగా నిరోధించనప్పటికీ, అదనపు నిధులతో రాష్ట్రాలకు పరిహారం అందించడం ద్వారా 16వ ఆర్థిక సంఘం ఈ నిర్మాణాత్మక లోపాన్ని సరిదిద్దే అవకాశాన్ని విస్మరించింది.
అదనపు నిధులు ఇవ్వకపోవడానికి వారు చెప్పిన సాకు ఏమిటంటే- రక్షణ, మౌలిక సదుపాయాలపై కేంద్రానికి అదనపు మూలధన వ్యయం అవసరం, రాష్ట్రాల మూలధన లేదా రెవెన్యూ వ్యయం కంటే కేంద్రం అవసరాలే ప్రాధాన్యత కలిగినవి.
‘రెవెన్యూ లోటు గ్రాంట్ల’కు మంగళం..
రెండవది: దాదాపు 70 ఏళ్లకు పైగా రాష్ట్రాలకు కీలకమైన నిధుల వనరుగా ఉన్న ‘రెవెన్యూ లోటు గ్రాంట్లను'(రాబడి, వ్యయం మధ్య వ్యత్యాసాన్ని పూడ్చేందుకు ఇచ్చే నిధులు) సిఫార్సు చేయకూడదని 16వ ఆర్థిక సంఘం నిర్ణయించింది.
ఈ రాజ్యాంగబద్ధమైన గ్రాంట్లు లేకపోవడంతో, కేంద్రం నుండి వచ్చే విచక్షణాధికార లేదా షరతులతో కూడిన గ్రాంట్లు స్వయంచాలకంగా పైచేయి సాధిస్తాయి.
రాజ్యాంగబద్ధం కాని ఈ గ్రాంట్లు పెరుగుతూ, తక్కువ పన్నుల పంపిణీ, రాజ్యాంగబద్ధమైన గ్రాంట్ల తొలగింపు ద్వారా కేంద్రం రాష్ట్రాల వ్యవహారాల్లో ఎక్కువ జోక్యం చేసుకునేలా అధికారాన్ని కల్పిస్తాయి.
ఆర్థిక సమాఖ్యవాదం దృష్టిలో భారతదేశంలో ఆర్థిక సంఘం పరిధిలోకి రాని విచక్షణాధికార, షరతులతో కూడిన గ్రాంట్లు భారీగా పెరిగాయి.
మొత్తం పన్ను రాబడిలో పన్నుల పంపిణీ, గ్రాంట్ల శాతం..
పన్నుల పంపిణీ : తగ్గుముఖం పట్టింది.
ఆర్థిక సంఘం గ్రాంట్లు : స్వల్ప మార్పులు.
ఆర్థిక సంఘేతర గ్రాంట్లు : గణనీయంగా పెరిగాయి.
స్థానిక సంస్థల ముసుగులో కేంద్ర పెత్తనం..
16వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్రాలకు కాకుండా నేరుగా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలకు(రూ 7 లక్షల 91 వేల 493 కోట్లు) కేటాయించింది. మూడవ అంచె (స్థానిక సంస్థల) పాలనా లక్ష్యాలను నెరవేర్చడానికి నిధులు అవసరమనేది అంగీకరించదగిన విషయమే, కానీ ఈ కొత్త గ్రాంట్లలో అనేక షరతులు విధించబడ్డాయి.
ఇది స్థానిక సంస్థల విధిరాతను నియంత్రించడంలో రాష్ట్రాలను పక్కనబెట్టి కేంద్రం జోక్యాన్ని బలోపేతం చేసే ప్రయత్నమని స్పష్టమవుతోంది.
ఆర్థిక సంఘం నివేదికలోని సంపుటి-1 రాష్ట్రాల ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి ‘సామర్థ్యం’ అనే పదాన్ని 101 సార్లు ఉపయోగించింది.
“భారతదేశ అభివృద్ధి అవసరాలను పరిగణనలోకి తీసుకుంటే, పంపిణీ ప్రమాణాలలో సామర్థ్యం వైపు స్వల్ప మార్పు అవసరం” అని పేర్కొంది.
ఆర్థిక సామర్థ్యంపై మాత్రమే దృష్టి పెట్టడం వల్ల కలిగే నష్టాలను ఈ వ్యాఖ్యానం విస్మరించింది. 1989లో నోబెల్ బహుమతి గ్రహీత అమర్త్య సేన్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూను గుర్తుచేసుకుంటే, కేవలం సామర్థ్యంపైనే దృష్టి పెట్టడం వల్ల స్వల్పకాలిక ప్రయోజనాలు మాత్రమే ఉంటాయి.
16వ ఆర్థిక సంఘం సభ్యులు ఒకే అంశంపై అతిగా దృష్టి పెట్టే బదులు, బహుళ అంశాలను సమతుల్యం చేయడానికి ప్రయత్నించి ఉండాల్సింది.
రాష్ట్రాలపై ఉక్కుపాదం – కేంద్రం పట్ల మృదుత్వం..
ఈ నివేదిక భాష రాష్ట్రాలను కేంద్రానికి వ్యతిరేకంగా నిలబెట్టేలా ఉంది; దీని స్వరం కేంద్రం ఆందోళనల పట్ల సున్నితంగా స్పందిస్తూ, రాష్ట్రాల ఆందోళనలను పట్టించుకోనట్లుగా ఉంది.
ఇది రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం గురించి పాఠాలు చెబుతున్నట్లుగా ఉంది, అయితే పన్నుల సేకరణ, వ్యయ నిబంధనలలో అధిక సామర్థ్యం కోసం రాష్ట్రాలను పురికొల్పుతోంది. కానీ కేంద్రం ఆర్థిక దుర్వినియోగం లేదా మందగించిన పన్ను వసూళ్ల గురించి మాట్లాడేటప్పుడు మాత్రం ఈ గంభీర స్వరం మూగబోయింది.
ఒక్క మాటలో చెప్పాలంటే, 16వ ఆర్థిక సంఘం నివేదిక దేశంలో ఆర్థిక సమాఖ్యవాదాన్ని పెంపొందించడానికి, బలోపేతం చేయడానికి బదులుగా బలహీనపరుస్తుంది.
– రాజర్షి సింఘాల్
(వ్యాసకర్త ‘స్లిప్, స్టిచ్ అండ్ స్టంబుల్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ ఫైనాన్షియల్ సెక్టార్ రిఫార్మ్స్’ రచయిత, సీనియర్ జర్నలిస్ట్)
మింట్ పత్రిక సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
అనువాదం: కె సత్యరంజన్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
