ఆగస్టు 19 ప్రపంచ మానవతా దినోత్సవం. ప్రపంచంలో యుద్ధాలు, ఆకలి, పేదరికం, ప్రకృతి వైపరీత్యాలు, శరణార్థుల విషాదం, అంటువ్యాధులు వంటి సంక్షోభాల మధ్య ప్రజల ప్రాణాలను కాపాడేందుకు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పనిచేసే మానవతా కార్యకర్తలను గౌరవించడానికి ఈ దినోత్సవాన్ని పాటిస్తారు. కానీ 2026లో ఆగస్టు 19న జరుగుతున్న ఈ రోజు ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది.
యుద్ధాల వల్ల బాధపడుతున్న ప్రజలకు మానవతా సహాయం అందించడం మాత్రమే సరిపోతుందా? లేక ఆ యుద్ధాలకు, పౌరులపై జరుగుతున్న దాడులకు, ఆకలిని ఆయుధంగా ఉపయోగించడానికి కూడా ప్రపంచం వ్యతిరేకంగా నిలబడాలా?
ఈ ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన అవసరం నేటి గాజా, పాలస్తీనా, ఇరాన్ పరిస్థితులు మరింత స్పష్టంగా చూపిస్తున్నాయి.
దినోత్సవం వెనుక విషాదం..
ప్రపంచ మానవతా దినోత్సవానికి మూలం ఒక విషాదకరమైన సంఘటన. 2003 ఆగస్టు 19న ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లోని కెనాల్ హోటల్లో ఉన్న ఐక్యరాజ్యసమితి కార్యాలయంపై భారీ ట్రక్ బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో 22 మంది మరణించారు, అనేక మంది గాయపడ్డారు.
మరణించిన వారిలో ఇరాక్‌లో ఐక్యరాజ్యసమితి ప్రత్యేక ప్రతినిధి సెర్జియో వియెరా డి మెల్లో కూడా ఉన్నారు. ఈ దాడిని అల్-ఖైదాతో అనుబంధం ఉన్న అబూ ముసాబ్ అల్-జర్కావీ నెట్వర్క్ చేసింది అని అంటారు.
మానవతా సేవకులపై జరిగిన ఈ విషాదాన్ని స్మరించుకుంటూ ఐక్యరాజ్యసమితి 2008లో ఆగస్టు 19ను వరల్డ్ హ్యుమానిటేరియన్ డే గా ప్రకటించింది.
అయితే నేడు గాజాను ఎలా విస్మరించగలం?..
2003లో బాగ్దాద్‌లో మానవతా కార్యకర్తలు దాడికి గురైన విషాదాన్ని స్మరించుకునే రోజున, నేడు గాజాలో లక్షలాది మంది పాలస్తీనియన్లు ఎదుర్కొంటున్న మానవతా సంక్షోభాన్ని ప్రస్తావించకుండా ప్రపంచ మానవతా దినోత్సవం గురించి మాట్లాడటంలో అర్ధం లేదు.
గాజాలో ఇళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, మౌలిక వసతులను ఇజ్రాయెల్ విధ్వంసం చేసింది. వేలాది మంది ప్రజలను ముఖ్యంగా మహిళలు, పిల్లలను ఇజ్రాయెల్ హతమార్చింది.
ఆహారం, నీరు, వైద్యం, ఆశ్రయం కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మానవతా సహాయం కూడా అందకుండా ఇజ్రాయెల్ నిరోధించింది.
ఐక్యరాజ్యసమితి మానవతా వ్యవహారాల కార్యాలయం(ఓచా) ఆగస్టు 14, 2026 నివేదికలో కూడా గాజాలో మానవతా సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, సహాయ సరఫరాలపై పరిమితులు, నిధుల కొరత కొనసాగుతున్నాయని పేర్కొంది.
ఐరాస మానవ హక్కుల నిపుణులు ఆగస్టు 10న ఆక్రమిత పాలస్తీనా ప్రాంతాల్లో పాలస్తీనా పౌరులపై దాడుల తీవ్రత పెరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు.
ఇటీవల కూడా గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో పౌరులు మరణించిన ఘటనలు నమోదయ్యాయి. ఆగస్టు 18న గాజా నగరంలోని ఒక తాత్కాలిక నిరాశ్రయుల శిబిరంగా మారిన ప్రాంతంలోని కేఫ్‌పై జరిగిన దాడిలో కనీసం ఆరుగురు పాలస్తీనియన్లు మరణించినట్లు రాయిటర్స్ నివేదించింది.
ఒక సాయుధ సంస్థను లక్ష్యంగా చేసుకోవడం పేరుతో సామాన్య పౌరుల ప్రాణాలను ఎంతవరకు ప్రమాదంలోకి నెట్టవచ్చు?
గాజా మాత్రమే కాదు— ఇప్పుడు ఇరాన్ కూడా..
2026లో ప్రపంచ మానవతా దినోత్సవం మరొక తీవ్రమైన యుద్ధ పరిస్థితి మధ్య వచ్చింది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్‌పై ప్రారంభించిన సైనిక దాడులతో 2026 ఫిబ్రవరి 28 నుంచి ఇరాన్ యుద్ధం కొత్త దశలోకి ప్రవేశించింది.
అమెరికా, ఇజ్రాయెల్ కలసి ఇరాన్‌పై దాడులకు తెగబడ్డాయి. యుద్ధం మధ్యలో తాత్కాలిక ఒప్పందాలు, కాల్పుల విరమణ ప్రయత్నాలు జరిగినప్పటికీ, ఆగస్టు 2026 నాటికి పరిస్థితి మళ్లీ తీవ్ర ఉద్రిక్తతకు చేరుకుంది.
ఆగస్టు 18న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా-ఇరాన్ మధ్య ప్రస్తుతం చర్చలు జరగడం లేదని, సమీప భవిష్యత్తులో కూడా చర్చలు షెడ్యూల్ కాలేదని తెలిపారు.
అదే సమయంలో హార్ముజ్ జలసంధి తమదేనని అమెరికా అహంభావ పూరితంగా ప్రకటించి ఉద్రిక్తతను మరింత పెంచింది.
యుద్ధం ఎవరి మీద పడుతుంది?..
అమెరికా, ఇజ్రాయెల్ తమ భద్రత, జాతీయ ప్రయోజనాలు, రాజకీయ, వ్యూహాత్మక కారణాలను ముందుకు తెస్తున్నాయి. కానీ బాంబులు పడినప్పుడు సాధారణ ప్రజలే చనిపోతారు. పిల్లలు తల్లిదండ్రులను కోల్పోతారు. కుటుంబాలు ఇళ్లు కోల్పోతాయి. ఆసుపత్రులు రోగులతో నిండిపోతాయి. ప్రజలు శరణార్థులుగా మారతారు.
ఆహారం, నీరు, మందుల కొరత ఏర్పడుతుంది. అందుకే ప్రపంచ మానవతా దినోత్సవం అసలు ప్రశ్న “ఎవరు గెలుస్తారు?” కాదు- “ఎంతమంది సాధారణ ప్రజలు బతుకుతారు?”
మానవతా సేవకుల పరిస్థితి..
గాజా, ఇరాన్, సూడాన్, ఉక్రెయిన్, యెమెన్, ఇతర ప్రాంతాల్లో మానవతా కార్యకర్తలు ప్రాణాలను పణంగా పెట్టి పనిచేస్తున్నారు.
వైద్యులు, నర్సులు, అంబులెన్స్ సిబ్బంది, ఐరాస సిబ్బంది, ఆహారం, నీరు పంపిణీ చేసే స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు యుద్ధ పక్షాలు కాదు. వారు మనిషి ప్రాణాన్ని రక్షించడానికి వెళ్లినవారు. అందువల్ల అంతర్జాతీయ మానవతా చట్టం ప్రకారం పౌరులు, వైద్య సిబ్బంది, మానవతా సహాయకులకు రక్షణ కల్పించడం అత్యంత ముఖ్యమైన బాధ్యత.
అల్-ఖైదా చరిత్ర మనకు ఇచ్చే మరో పాఠం..
ఇక్కడ మరో చారిత్రక అంశాన్ని కూడా గుర్తు చేసుకోవాలి. 1980లలో సోవియట్‌కు వ్యతిరేకంగా అమెరికా సీఐఏ, పాకిస్తాన్ ఐఎస్ఐ, సౌదీ అరేబియా ముజాహిదీన్ వర్గాలకు నిధులు, ఆయుధాలు, శిక్షణ అందించడంలో ముఖ్య పాత్ర పోషించాయి.
అంతర్జాతీయ సాయుధ నెట్వర్క్ ఏర్పడిన వాతావరణంలో బిన్ లాడెన్ వంటి వ్యక్తులు ఎదిగి, తరువాత అల్-ఖైదాను నిర్మించారు. తరువాత అదే అల్-ఖైదా అమెరికాకు ప్రధాన శత్రువుగా మారింది. తక్షణ రాజకీయ ప్రయోజనాల కోసం సాయుధ శక్తులను ప్రోత్సహించడం భవిష్యత్తులో ఊహించని పరిణామాలకు దారితీయవచ్చు.
ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన అమెరికా ఉగ్రవాదాన్ని అణచివేస్తానని హెచ్చరిస్తున్నది. “దొంగే దొంగ-దొంగ” అని అరిచిన చందంగా ప్రపంచాన్ని అమెరికా మోసం చేస్తున్నది.
భారతదేశంలో మోదీ ప్రభుత్వం తీరు..
పేదరికం, నిరుద్యోగం నిర్మూలించడంలో చిత్తశుద్ధి లేకుండా, కార్పొరేట్లకు అడవుల సంపదను సర్వస్వం ధారాదత్తం చేస్తూ ప్రజలను మరింత దుర్భర పరిస్థితుల్లోకి నెడుతున్నది.
కార్పొరేట్ శక్తులు అభివృద్ధి ముసుగులో అటవీ ప్రాంత ప్రజల జీవనాధారాన్ని కొల్లగొడుతున్నాయి. మరొక వైపు ముక్త నక్సల్స్ పేర పిట్టల్ని కాల్చినట్లు నక్సల్స్‌ను కాల్చి పారేసింది.
నేడు దిమాగీ నక్సల్స్ పేర ప్రశ్నించే వారిని, ప్రజల పక్షాన మాట్లాడే మేధావులను నిర్మూలించాలని ఆగస్టు 15న ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మాట్లాడిన తీరు అత్యంత ప్రమాదకరం.
మానవతా దినోత్సవం — కేవలం దానం చేసే రోజు కాదు..
ప్రపంచ మానవతా దినోత్సవాన్ని కేవలం “బాధితులకు సహాయం చేయండి” అనే సందేశానికి పరిమితం చేయకూడదు. మానవతావాదం అంటే ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వడం. గాయపడినవారికి వైద్యం అందించడం. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం. పిల్లలకు విద్య అందించడం. కానీ అంతకంటే ముఖ్యంగా ప్రజలను యుద్ధాల బలిపశువులుగా మార్చకుండా చూడడం.
ఆకలిని ఆయుధంగా ఉపయోగించడాన్ని వ్యతిరేకించడం. ఆసుపత్రులు, పాఠశాలలు, మానవతా కేంద్రాల రక్షణను కోరడం. యుద్ధ నేరాలు జరిగినప్పుడు బాధ్యత వహించే వ్యవస్థను బలోపేతం చేయడం.
యుద్ధోన్మాద దేశాల వైఖరి, విధానాలు మారకుండా ఉన్నంతకాలం ప్రజలు సమిధలవుతూనే ఉంటారు.
భారతదేశానికి ఒక ప్రత్యేక బాధ్యత..
భారతదేశం చారిత్రకంగా శాంతి, సహజీవనం, వలసవాద వ్యతిరేకత, పంచశీల, నిరాయుధీకరణ వంటి విధానాలకు కట్టుబడి ఉండేది. కానీ నేటి మోదీ ప్రభుత్వం దానికి తిలోదకాలిచ్చి ఇజ్రాయెల్ దురాగతాలపై కనీసం నోరు మెదపకుండా, గాజాపై ఐక్యరాజ్యసమితిలో అమెరికాకు అనుకూలంగా ఓటింగ్ నుండి తప్పుకోవడం చూశాం. అందువల్ల నేటి ప్రపంచంలో భారతదేశం కూడా ఒక స్పష్టమైన సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి.
పాలస్తీనా ప్రజలకు అండగా నిలవాలి. ఇజ్రాయెల్ ప్రజలకు కూడా భద్రత కావాలి. ఇరాన్ ప్రజలకు యుద్ధం కాదు, శాంతి కావాలి.
ప్రపంచంలోని ఏ దేశం యుద్ధోన్మాదంతో వ్యవహరించినా భారత్ నిర్భయంగా అందుకు వ్యతిరేకంగా నిలబడాలి. ఇది ఏ ప్రభుత్వం లేదా ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదా వ్యతిరేకించడం కాదు.
ఇది మానవత్వానికి మద్దతు ఇవ్వడం. గతంలో అలీన విధానానికి నికరంగా కట్టుబడి ఉన్న భారత్ ఆ విధానాన్ని పునరుద్ధరించాలి.
ఆగస్టు 19 అడిగే ప్రశ్న..
2003 ఆగస్టు 19న బాగ్దాద్‌లో 22 మంది మానవతా కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. నేడు, 2026 ఆగస్టు 19న ప్రపంచం గాజా విషాదాన్ని, ఇరాన్ యుద్ధాన్ని, సూడాన్–ఉక్రెయిన్ వంటి అనేక సంక్షోభాలను చూస్తోంది. ఈ సందర్భంగా మూడు ప్రశ్నలు మన ముందున్నాయి.
యుద్ధాలను ఆపడానికి ప్రపంచం ఇంకా ఎంత మంది మరణాల కోసం వేచి చూస్తుంది? పౌరుల ప్రాణాలకు రాజకీయ సరిహద్దుల కంటే ఎక్కువ విలువ ఎప్పుడు వస్తుంది? మానవతా సహాయం అందించే వారు మాత్రమే కాదు మానవత్వమే రక్షించబడే ప్రపంచాన్ని మనం ఎప్పుడు నిర్మిస్తాం?
ప్రపంచ మానవతా దినోత్సవం మనకు ఇచ్చే సందేశం స్పష్టమైనది. “యుద్ధంలో విజేతలు ఉండవచ్చు. కానీ మానవత్వం ఓడిపోయినప్పుడు ఎవరూ విజేతలు కాదు.”
గాజాలోని పాలస్తీనియనైనా, ఇజ్రాయెల్ పౌరుడైనా, ఇరాన్‌లోని సాధారణ పౌరుడైనా, ఉక్రెయిన్‌లోని కుటుంబమైనా, సూడాన్‌లోని శరణార్థైనా ప్రపంచంలోని ప్రతి మనిషి ప్రాణానికి సమానమైన విలువ ఉంది.
మాటలు, ప్రకటనలు, దినోత్సవాలు జరుపుకొని చేతులు దులుపుకోవడం కాదు. నిర్దిష్ట కార్యాచరణతో, నిజాయితీతో అమలుకు పూనుకోవడం నేడు ప్రపంచ మానవాళి ముందున్న ఏకైక పరిష్కారం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
