ఇరాన్ యుద్ధ సమయంలో అమెరికా యుద్ధనౌకలపై నెలల తరబడి విధులు నిర్వహిస్తున్న తమ కుటుంబ సభ్యుల పరిస్థితిపై నౌకాదళ సిబ్బందికి చెందిన కుటుంబాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
తమ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఒత్తిళ్లు, దుర్భర పరిస్థితులపై రక్షణ కార్యదర్శి పీట్ హెగ్సెత్ చేసిన వ్యాఖ్యలను వారు తీవ్రంగా తప్పుబట్టారు.
అమెరికా నౌకాదళానికి చెందిన పలువురు కుటుంబ సభ్యులతో ది గార్డియన్ మాట్లాడింది. వారు తమ బంధువులు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక ఒత్తిళ్ల గురించి ఆందోళన వ్యక్తం చేశారు.
గుర్తింపు దాచిపెట్టి ఆవేదన..
తమ పేర్లను వెల్లడిస్తే అబ్రహం లింకన్, యూఎస్ఎస్ ట్రిపోలీ నౌకల్లో ఉన్న తమ బంధువులపై ప్రతీకార చర్యలు తీసుకుంటారనే భయంతో వారు తమ పేర్లు వెల్లడించడానికి నిరాకరించారు.
పశ్చిమాసియాలోని సముద్ర జలాలలో మోహరించిన అబ్రహం లింకన్ పేరుతో ఉన్న అమెరికా యుద్ధ విమాన వాహక నౌకలో పనిచేస్తున్న సిబ్బంది కొందరు గత ఐదు నెలల్లో 20–30 పౌండ్ల(9–14 కిలోల) వరకు బరువు కోల్పోయారని వారు తెలిపారు.
నౌకల్లో దుర్భర పరిస్థితులు..
ఒక నావికుడు తన తల్లితో మాట్లాడుతూ, తాను “ఎముకల గూడులా” అయిపోయానని చెప్పాడట. తాగునీరు నాణ్యత కూడా తక్కువగా ఉందని, సముద్రంలో ఎక్కువకాలం ఉండటం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి ఏర్పడుతోందని కుటుంబ సభ్యులు చెప్పారు.
యూఎస్ఎస్ అబ్రహం లింకన్ ఒక యుద్ధ విమాన వాహక నౌక. దానిపై 5,000 మందికి పైగా నావికులు, మెరైన్లు ఉన్నారు.
నవంబర్‌లో తన మోహరించబడిన ఈ నౌక దాదాపు తొమ్మిది నెలలుగా సముద్రంలో ఉన్నది. ఈ నౌకలో అనేక ఆత్మహత్యాయత్నాలు జరిగినట్లు, అందులో కొందరు సముద్రంలోకి దూకిన ఘటనలు కూడా ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
ఆందోళనలను కొట్టిపారేసిన పెద్దలు..
నౌకలోని పరిస్థితుల గురించి నౌకాదళ కుటుంబాలు ఆందోళన చెందుతున్నాయా అని గత శుక్రవారం నాడు ట్రంప్‌ను అడిగినప్పుడు, “లేదు, వారు ఆందోళన చెందడం లేదు” అని సమాధానమిచ్చారు.
అబ్రహం లింకన్ మోహరింపు “మరీ అంత ఎక్కువ కాలం జరగలేదని” కూడా ఆయన అన్నారు.
అంతకుముందు హెగ్సెత్ కూడా కుటుంబాల ఆందోళనలను కొట్టిపారేయడానికి ప్రయత్నించారు. అమెరికా యుద్ధనౌకలోని వాస్తవ పరిస్థితులను కుటుంబాలు “పూర్తిగా తప్పుగా చిత్రీకరిస్తున్నాయని” ఆయన విమర్శించారు.
ద్రోహం చేసినట్లుగా ఉంది..
లింకన్ నౌకలో పనిచేస్తున్న ఒక నావికా సభ్యుడి సోదరి మాట్లాడుతూ, ట్రంప్, హెగ్సెత్ వ్యాఖ్యలతో తాను తీవ్రంగా బాధపడ్డానని తెలిపింది.
“నేను అమెరికాలో పెరిగాను. సైన్యాన్ని ఎంతో గౌరవించాను. వారు దేశాన్ని రక్షించేందుకు, దేశం కోసం అత్యున్నత త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నారని భావించాను. ఇప్పుడు దేశాధ్యక్షుడు, రక్షణ కార్యదర్శి తమ అనుభవాలను కొట్టి పారేస్తూ, వారిని అబద్ధాలు చెబుతున్న వారిగా పేర్కొంటున్నారు. నాకు చాలా కోపంగా ఉంది” అని ఆమె చెప్పింది.
“ఇది ఒక రకమైన ద్రోహంగా అనిపిస్తోంది. వారి వ్యాఖ్యలు నిరాశ కలిగించేవి, అసత్యమైనవి, బాధ్యతారహితమైనవి. వాటి వల్ల నా సోదరుడికి అనేక పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉంది” అని ఆమె ఆందోళన కూడా వ్యక్తం చేశారు.
మరో నావికుడి తల్లి లింకన్ నౌకలోని పరిస్థితుల గురించి మాట్లాడుతూ “నా కొడుకు దేశానికి సేవ చేయాలని సంతకం చేశాడు. కానీ అతను తన దేశానికి సేవ చేస్తుంటే దేశం అతనికి ఎందుకు సేవ చేయడం లేదు? వారికి సరైన ఆహారం లేదు, నీరు అందడం లేదు. జీవన పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి. వీటి కోసం అతను సైన్యంలో చేరలేదు” అని ఆమె అన్నారు.
మానసిక వైద్యుడి కోసం ఎదురుచూపులు..
ఒక నావికా సభ్యుడి సోదరి తన సోదరుడి నుంచి వచ్చిన సందేశాలను వివరించింది. అతను చెప్పిన ప్రకారం, “నీరు వినియోగించ వీలు లేకుండా ఉంది. వారు తాగునీటి బాటిల్స్‌ను కిటికీ నుంచి బయటకు విసిరేశారు” అని ఆమె తెలిపింది.
అతను మానసిక ఆరోగ్య సేవల గురించి కూడా వివరించాడు. తీవ్రంగా అలసిపోయిన నావికులకు అందుబాటులో ఉన్న మానసిక ఆరోగ్య సేవలు సరిపోవడం లేదని తెలిపాడు.
“మా మోహరింపు సహనంపై ఆధారపడే కార్యక్రమం కొన్ని నెలల క్రితమే ముగిసింది. ఓడలో ఉన్న ఏకైక మానసిక వైద్యుడిని కలవాలంటే ఐదు వారాలు వేచి ఉండాలి. అలా కాకపోతే నీ ముగ్గురు సహచరులను నిద్రపుచ్చే మాత్రలు అడిగి తీసుకుని, నౌక నుంచి దూకాలి” అని అతను చెప్పినట్లు ఆమె వివరించింది.
సీఎన్ఎన్ నివేదిక ప్రకారం, లింకన్ నౌకలో జరిగిన అనేక ఆత్మహత్యాయత్నాల్లో ఒక నావికుడు ఈ నెల ప్రారంభంలో నౌక పైకి ఎక్కి, అనంతరం హెలికాప్టర్ ద్వారా రక్షించబడ్డాడు.
స్పందించని సైనిక అధికారులు..
ది గార్డియన్ అమెరికా సైనిక అధికారులను సంప్రదించి, ఇరాన్ యుద్ధానికి మోహరించిన అమెరికా యుద్ధనౌకలు ఎదుర్కొంటున్న సరఫరా, రవాణా సంబంధిత సమస్యలపై వివరణ కోరింది.
అయితే వారు స్పందించలేదు. వాల్ స్ట్రీట్ జర్నల్ మరో విమాన వాహక నౌక అయిన యూఎస్ఎస్ జార్జ్ వాషింగ్టన్, లింకన్ స్థానాన్ని భర్తీ చేసేందుకు వెళ్తోంది అని తెలిపింది.
లింకన్ సిబ్బంది సభ్యుడి సోదరి మాట్లాడుతూ, తన సోదరుడు మోహరింపులో ఉన్న నెలల్లో 20 పౌండ్లకు పైగా బరువు కోల్పోయాడని చెప్పింది.
యూఎస్ఎస్ ట్రిపోలీ నౌకలో ఉన్న మరో నావికుడి తల్లి పరిస్థితిని మరింత తీవ్రంగా వివరించింది. ఆమె ప్రకారం, 3,500 మంది నావికులు, మెరైన్లు ఉన్న ఆ నౌకలో ఒక నావికుడు 31వ మెరైన్ ఎక్స్‌పెడిషనరీ యూనిట్లో భాగంగా పనిచేస్తున్నాడు.
ట్రిపోలీ మార్చి 11న జపాన్‌లోని ససెబో స్థావరం నుంచి తిరిగి మోహరింపుకు వెళ్లింది. ఐదు నెలలకు పైగా క్రియాశీల మోహరింపులో ఉన్న సమయంలో తన కుమారుడు 30 పౌండ్లకు పైగా బరువు కోల్పోయాడని అతని తల్లి తెలిపింది.
ఆ తల్లి స్వయంగా ఆరు సంవత్సరాలకు పైగా నౌకాదళంలో పనిచేసిన అనుభవజ్ఞురాలు. మోహరింపుకు ముందు, మోహరింపు తర్వాత తన కుమారుడి ఫోటోలను ది గార్డియన్‌కు చూపించింది. ముందుగా అతని ముఖం నిండుగా, శరీరం బలంగా కనిపించగా, మోహరింపు తర్వాత అతను చాలా సన్నగా మారి, చేతులు బలహీనంగా, సన్నని మెడతో చాలా సన్నగా కనిపించాడు.
నౌకాదళంలో తన కుమారుడు ఇంతకుముందు కూడా అనేక మోహరింపుల్లో పాల్గొన్నాడని ఆమె చెప్పింది. అయితే ఆహారం, ఇతర ప్రాథమిక సరఫరాలు సరిగా అందడం లేదని అతను చెప్పడం ఇదే మొదటిసారి అని ఆమె పేర్కొంది. “ఏదో నిజంగా తప్పు జరిగిపోయింది” అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.
ది గార్డియన్ పత్రికలో ఎడ్ పిల్కింగ్టన్ రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం: డి వెంకన్న.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
