2019 అనుభవాలు, 2026 నిర్ణయం, మిశ్రా కమిషన్ గణాంకాలు, రాజ్యాంగ రక్షణ, బీసీల రాజకీయాధికారంపై సమగ్ర విశ్లేషణ.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో వెనుకబడిన వర్గాలకు(బీసీలకు) 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించింది.
ఆగస్టు 18న మంత్రివర్గం గ్రామీణ స్థానిక సంస్థల్లో 34 శాతం, పట్టణ స్థానిక సంస్థల్లో సుమారు 33.3 శాతం రిజర్వేషన్లకు నిర్ణయం తీసుకుంది.
బీసీల దీర్ఘకాల డిమాండ్‌కు అనుగుణంగా వచ్చిన ఈ నిర్ణయం సహజంగానే ఆశలు కలిగిస్తుంది. కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి బీసీ సమాజం ఇప్పుడు అడగాల్సిన అసలు ప్రశ్న ఒక్కటే- “సీఎం బాబూ… బీసీలకు 34 శాతం నిలబడుతుందా?”
ఈ ప్రశ్నకు కారణం గత అనుభవమే. 2019లోనూ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ప్రకటించారు, కానీ న్యాయస్థానంలో ఆ నిర్ణయం నిలబడలేదు. ఇప్పుడు అదే 34 శాతం మళ్లీ ముందుకు వచ్చింది. కాబట్టి ఈసారి రాజకీయ ప్రకటన కంటే దాని గణాంక ఆధారం, చట్టబద్ధత, న్యాయపరమైన రక్షణ ముఖ్యమైనవి.
రిజర్వేషన్ అనేది కేవలం ఒక ఎన్నికల హామీ కాదు; అది సామాజిక న్యాయానికి, సమాన ప్రాతినిధ్యానికి సంబంధించిన రాజ్యాంగ సాధనం.
అందువల్ల ప్రభుత్వం ఒక శాతం ప్రకటించడం మాత్రమే సరిపోదు. ఆ శాతాన్ని నిర్ణయించడానికి తగిన ఆధారాలున్నాయా, ప్రత్యేక కమిషన్ శాస్త్రీయంగా అధ్యయనం చేసిందా, స్థానిక సంస్థల వాస్తవ పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్నారా, న్యాయస్థానాల పరిశీలనను తట్టుకునేలా చట్టపరమైన చర్యలు తీసుకున్నారా అన్నదే అసలు పరీక్ష.
2019లో ఎదురైన న్యాయపరమైన అడ్డంకులు..
ఆంధ్రప్రదేశ్‌లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల చరిత్రను విస్మరించి ప్రస్తుత నిర్ణయాన్ని అర్థం చేసుకోవడం సాధ్యం కాదు.
2019లో అప్పటి ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించే విధంగా చర్యలు చేపట్టింది. 2019 డిసెంబరు 28న జారీ చేసిన జీవో 176 ప్రకారం ఎస్సీలకు 6.77 శాతం, ఎస్టీలకు 19.08 శాతం, బీసీలకు 34 శాతం కలిపి మొత్తం రిజర్వేషన్లు 59.85 శాతానికి చేరాయి.
ఈ నిర్ణయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకుడు బిర్రు ప్రతాప్‌రెడ్డి సవాలు చేశారు. ఆయనతో పాటు కండేపి నవీన్‌కుమార్, చుండూరు వాసు, బీసీ రామాంజనేయులు, వీరమాచినేని రేవంత్ తదితరులు కూడా వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిలో 50 శాతం పరిమితిని మించి ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు కల్పించడం, బీసీలకు 34 శాతం కనీస రిజర్వేషన్ నిర్దేశించడం సవాలు చేయబడ్డాయి.
2020 మార్చి 2న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఉమ్మడి తీర్పులో మొత్తం రిజర్వేషన్లు 59.85 శాతానికి చేరడం సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం పరిమితికి విరుద్ధమని పేర్కొంది.
బీసీలకు 34 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్ కల్పించే నిబంధనలను, వాటి ఆధారంగా జారీ చేసిన జీవో 176ను కొట్టివేసింది. బీసీల రిజర్వేషన్‌ను నిర్ణయించడానికి సమగ్ర దర్యాప్తు, సమకాలీన గణాంకాల సేకరణ, ప్రజల అభ్యంతరాల పరిశీలన వంటి స్పష్టమైన ప్రక్రియ అవసరమని కోర్టు తేల్చిచెప్పింది.
ఈ చరిత్రను గుర్తుంచుకోవాల్సిన కారణం స్పష్టమే: సామాజిక న్యాయం కోసం ఉన్న డిమాండ్ సరైనదైనా, దాన్ని అమలు చేసే విధానం రాజ్యాంగబద్ధంగా ఉండాలి. లేకపోతే హక్కు కోసం తీసుకున్న నిర్ణయమే న్యాయస్థానంలో నిలబడకుండా పోతుంది.
పార్లమెంటులో చట్టం తేవాల్సిన ఆవశ్యకత..
ఇక్కడ మరింత లోతుగా ఆలోచించాల్సిన రాజ్యాంగపరమైన కోణం ఉంది. సుప్రీంకోర్టు నిర్దేశించిన 50 శాతం పరిమితి దాటి రిజర్వేషన్లు అమలు చేయాలంటే లేదా ఆ సీలింగ్ పరిమితిని మార్చాలంటే ఖచ్చితంగా పార్లమెంటులోనే చట్టం చేయాలి లేదా రాజ్యాంగ సవరణ తీసుకురావాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వాల జీవోలతో సాధ్యమయ్యే పని కాదు.
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామ్య పక్షాలుగా ఉన్న తెలుగుదేశం, జనసేన పార్టీలకు పార్లమెంటులో ఆ చట్టం చేయించే లేదా రాజ్యాంగ సవరణ తెచ్చే అధికారం, అవకాశం ఉన్నాయి.
బీసీలకు అన్నివిధాలా పూర్తిస్థాయిలో న్యాయం చేయడమే లక్ష్యమైతే, కేంద్రంలో తమకున్న రాజకీయ ప్రాబల్యాన్ని ఉపయోగించి పార్లమెంటులో చట్టం తెచ్చే ప్రయత్నం ఎందుకు చేయడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది.
మరొకవైపు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల కోసం సుప్రీంకోర్టు నిర్దేశించిన మూడు పరీక్షల విధానం, అనుభావిక ఆధారాల సేకరణ నిబంధనలపై కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
కేవలం ఒక కమిషన్ ఇచ్చే అనుభావిక ఆధారాలు లేదా ఆ మూడు పరీక్షల విధానం బీసీల దశాబ్దాల రాజకీయ వెనుకబాటుతనానికి, సామాజిక వాస్తవాలకు ఎంతవరకు న్యాయం చేయగలవనేది గంభీరంగా ఆలోచించాలి.
పరిమితుల పేరుతో, సంక్లిష్టమైన నిబంధనల పేరుతో బీసీల హక్కులను న్యాయస్థానాల చుట్టూ తిప్పడం కంటే, పార్లమెంటరీ మార్గం ద్వారా 50 శాతం పరిమితిని ఎత్తివేసి శాశ్వత రాజ్యాంగ రక్షణ కల్పించడమే నిజమైన రాజకీయాధికారానికి పునాది అవుతుంది.
బీసీ సమాజం ముందున్న కీలక ప్రశ్నలు..
ఇప్పుడు 2026లో ప్రభుత్వం మళ్లీ బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ప్రకటించిన వేళ, బీసీ సమాజం ముందుకు ఐదు కీలకమైన ప్రశ్నలు వస్తున్నాయి.
1. 2019లో 34 శాతం రిజర్వేషన్ కొట్టివేతకు గురైన చట్టపరమైన కారణాలను ఇప్పుడు ఎలా సరిదిద్దారు?
2. రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ప్రత్యేక కమిషన్ ఏ సమకాలీన గణాంకాల ఆధారంగా తన అధ్యయనం పూర్తి చేసింది?
3. బీసీల సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనాన్ని ఏ శాస్త్రీయ పద్ధతిలో నిర్ధారించారు?
4. స్థానిక సంస్థల వారీగా ఉన్న సామాజిక వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకున్నారా లేదా?
5. రాజీవ్ రంజన్ మిశ్రా కమిషన్ నివేదికను, దాని ఆధారాలను ప్రజల పర్యవేక్షణ కోసం పూర్తిగా అందుబాటులో ఉంచుతారా?
కమిషన్ సిఫారసులకు భిన్నంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే, అందుకు గల కారణాలను బహిరంగపరచాలి. కమిషన్ ఏర్పాటు చేయడం మాత్రమే న్యాయపరమైన రక్షణ కాదు. దాని పరిశోధన, గణాంకాలు, సిఫారసులు ప్రజా పరిశీలనకు అందుబాటులో ఉండాలి.
సుప్రీంకోర్టు నిర్దేశించిన మూడు పరీక్షల విధానం పట్ల విమర్శలు ఉన్నప్పటికీ, ప్రస్తుత రాజ్యాంగ చట్రంలో ప్రభుత్వం దానిని ఎలా పాటిస్తోందో వివరించాల్సి ఉంది.
1. బీసీల రాజకీయ వెనుకబాటుతనాన్ని సమకాలీన గణాంకాలతో నిర్ధారించే ప్రత్యేక కమిషన్ ఉండాలి.
2. ఆ అధ్యయనం ఆధారంగా స్థానిక సంస్థల వారీగా రిజర్వేషన్ శాతం నిర్ణయించాలి.
3. మొత్తం ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతం మించకుండా చూడాలి లేదా పార్లమెంటులో చట్టం చేసి ఆ పరిమితిని మార్చాలి.
అలాగే, మండల పరిషత్ అధ్యక్షుల(ఎంపీపీ) స్థానాలకు రాష్ట్రాన్ని ఒకే యూనిట్‌గా పరిగణించే విధానం కూడా ప్రశ్నించాల్సిన అంశమే.
రాష్ట్రవ్యాప్త సగటు ఆధారంగా నిర్ణయం తీసుకోవడం వల్ల జిల్లాల సామాజిక నిర్మాణంలోని తేడాలు కనిపించకుండా పోయి, ఎస్సీ, ఎస్టీ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బీసీలకు దక్కే స్థానాల సంఖ్య తగ్గే ప్రమాదం ఉంది. కాబట్టి రిజర్వేషన్ శాతం మాత్రమే కాకుండా ఆ శాతం ఏ ప్రాంతాల్లో, ఏ స్థానాలకు, ఏ ప్రాతిపదికన అమలవుతోంది అన్నది కూడా చూడాలి.
గణాంక ఆధారాల ప్రాముఖ్యత – గత అనుభవాలు..
మరొకవైపు తెలంగాణ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించినప్పటికీ, అది తీవ్ర న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంది.
తెలంగాణలో 42 శాతం రిజర్వేషన్లపై ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వును హైకోర్టు కొట్టివేసినట్లు స్పష్టమైంది. శాసనసభలో తీర్మానం చేయడం ఒక ఎత్తైతే, దాన్ని కోర్టులో నిలబెట్టేంత బలమైన గణాంక ఆధారాలు రూపొందించడం మరొక ఎత్తు అని తెలంగాణ అనుభవం నిరూపిస్తోంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గీకరణ అనుభవం కూడా పాలకుల రాజకీయాలకు, న్యాయపరమైన వాస్తవాలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎండగడుతుంది.
గతంలో ఎస్సీలలో ఉపవర్గీకరణ కోసం నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావడం కోసం ఉత్తర్వు తెచ్చి అమలు చేశారు. కానీ ఆ ఉత్తర్వులను సుప్రీంకోర్టు ఈవీ చిన్నయ్య కేసులో కొట్టివేసింది. నాడే ఈ నిర్ణయం కోర్టులో నిలబడదని ముఖ్యమంత్రికి తెలియదా అంటే తెలుసు. మరి ఎందుకు ఉత్తర్వు ఇచ్చారంటే-కేవలం తాత్కాలిక రాజకీయ ప్రయోజనం కోసం.
ఆ తర్వాత దవీందర్ సింగ్(2024) కేసులో సుప్రీంకోర్టు సరైన ఆధారాలు ఉంటే ఉపవర్గీకరణ చెల్లుతుందని స్పష్టం చేసింది. దీనిని బట్టి తేలేది ఒక్కటే: చట్టబద్ధమైన గణాంక పునాది లేకపోతే ఏ రాజ్యాంగ హామీ అయినా కోర్టు గడప వద్ద వీగిపోతుంది.
జాతీయ జనగణన – రాజకీయ ప్రాతినిధ్యం..
బీసీ రిజర్వేషన్ల ప్రశ్నను కేవలం ఎన్నికల గణితంగా చూడలేం. 2027 జాతీయ జనగణనలో కులాలను నమోదు చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం ఒక చారిత్రక అవకాశం.
అయితే కులాలను లెక్కించకపోవడం వల్ల కులవ్యవస్థ అంతరించిపోదు, కేవలం అసమానతలు ప్రభుత్వ లెక్కల్లో కనిపించకుండా పోతాయి. అదే సమయంలో బీసీ సమాజంలోని అంతర్గత సవాళ్లను కూడా గుర్తించాలి.
బీసీలు సంఖ్యాపరంగా అతిపెద్ద సమూహమైనప్పటికీ, ఆ సంఖ్యాబలం రాజకీయ ఐక్యతగా మారడం లేదు. కులాల మధ్య పోటీలు, ప్రాంతీయ భేదాలు, రాజకీయ అనుబంధాలు బీసీల శక్తిని బలహీనపరుస్తున్నాయి. ఈ వైవిధ్యాన్ని, అంతర్గత భేదాలను పాలకులు తమ రాజకీయ లబ్ధికి వాడుకుంటున్నారు.
చరిత్రలో కొండా లక్ష్మణ్ బాపూజీ, సర్దార్ గౌతు లచ్చన్న వంటి మహనీయులు వెనుకబడిన వర్గాల హక్కులను రాజకీయ ప్రధానాంశంగా మార్చారు. కానీ తదనంతర కాలంలో బీసీ నాయకత్వంలోని ఒక భాగం స్వతంత్ర సామాజిక ఉద్యమాలను నిర్మించడం కంటే అధికార పార్టీలకు ఉపగ్రహాలుగా, పాలక వర్గాల అనుకరణదారులుగా మారడానికే ప్రాధాన్యమిచ్చింది.
ప్రభుత్వాలు ఇచ్చే శాతాలకు జేజేలు పలకే ఆస్థాన సంఘాలుగా బీసీ సంఘాలు మారకూడదు. 34 శాతం ఇచ్చాం అని ప్రభుత్వం చెప్పినప్పుడు, అది ఎప్పుడు అమలు చేస్తారు? ఏ గణాంకాల ఆధారంగా నిర్ణయించారు? 2019 నాటి లోపాలను ఎలా సరిదిద్దారు? అని ప్రశ్నించడమే స్వతంత్ర ఉద్యమ లక్షణం.
బీసీలకు రిజర్వేషన్ ప్రకటించే రాజకీయాలు ఎందుకు కొనసాగుతున్నాయి? కానీ ఆ రిజర్వేషన్‌ను శాశ్వతమైన రాజకీయ ప్రాతినిధ్యంగా మార్చే నిర్మాణం ఎందుకు ఏర్పడటం లేదు? అనే ప్రశ్నకు సమాధానం స్పష్టం.
పాలకులు రిజర్వేషన్లను కేవలం ఎన్నికల నినాదాలుగా వాడుకుంటున్నారు తప్ప, వాటిని కోర్టులో నిలబడే చట్టబద్ధమైన హక్కులుగా మార్చేందుకు అవసరమైన శాస్త్రీయ గణాంక పునాదిని నిర్మించడం లేదు.
2019 అనుభవం ఒక హెచ్చరిక, 2026 నిర్ణయం ఒక అవకాశం, 2027 కులగణన మరో చారిత్రక తరుణం. ఈ మూడింటినీ ఒకే సామాజిక న్యాయ క్రమంలో చూడాల్సి ఉంది.
అంటే, 1. విశ్వసనీయమైన గణాంకాలు. 2. శాస్త్రీయమైన కమిషన్ అధ్యయనం. 3. చట్టబద్ధమైన రిజర్వేషన్ ఖరారు. 4. న్యాయస్థానంలో నిలిచే రాజ్యాంగ రక్షణ. 5. ఆచరణలో వాస్తవ రాజకీయ ప్రాతినిధ్యం.
ఈ ఐదు సూత్రాల గొలుసులో ఏ ఒక్కటి బలహీనపడినా బీసీల రాజకీయాధికారం మళ్లీ కాగితపు హామీగానే మిగిలిపోతుంది. అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీసీలకు కావాల్సింది మరొక రాజకీయ ప్రకటన కాదు, 2019లో ఎదురైన న్యాయపరమైన సమస్యలు ఈసారి ఎలా పరిష్కరించబడ్డాయో చెప్పే పారదర్శకమైన, చట్టబద్ధమైన సమాధానం, పార్లమెంటులో చట్టం చేయించి 50 శాతం సీలింగ్ పరిమితిని సవరించేలా కేంద్రంపై తెచ్చే ఒత్తిడి.
బీసీలకు కావాల్సింది ప్రకటన కాదు-అమలు, హామీ కాదు-చట్టబద్ధమైన హక్కు, సంఖ్య కాదు-వాస్తవ ప్రాతినిధ్యం, ఓటు కాదు-ఆ ఓటుతో నిర్ణయాధికారం, బీసీల ఓటు – రాజ్యాధికారానికి బాట.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
