ప్రైవేటు రంగం నుంచి ప్రతిపాదనలు కోరుతూ ఇచ్చిన పిలుపును “పాలనాపరమైన కారణాల” వల్ల ఉపసంహరించుకుంటున్నట్లు ఆగస్టు 14న జారీ చేసిన ప్రకటనలో దీవుల పరిపాలన తెలియజేసింది.
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో “గ్రీన్” ఏఐ డేటా సెంటర్ అభివృద్ధి కోసం ప్రైవేటు రంగం నుంచి ప్రతిపాదనలు కోరుతూ ఇచ్చిన పిలుపును “పాలనాపరమైన కారణాల” వల్ల ఇప్పుడు అండమాన్ నికోబార్ దీవుల పరిపాలన ఉపసంహరించుకుంది.
ఆగస్టు 10న ఈ డేటా సెంటర్ ప్రతిపాదనలకు పిలుపునిచ్చిన ఐటీ కార్యదర్శి కార్యాలయమే- ఇప్పుడు గ్రీన్ ఏఐ/డేటా సెంటర్ అభివృద్ధికి ప్రైవేటు రంగం ఆసక్తిని కోరడాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపింది.
“పరిపాలనా కారణాల వల్ల ఇది తక్షణమే అమలులోకి వస్తుందని” ఆగస్టు 14న ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
అయితే ఆ “పాలనాపరమైన కారణాలు” ఏమిటనేది ప్రత్యేకంగా ఆ ప్రకటనలో స్పష్టత ఇవ్వలేదు.
ఆగస్టు 10న జారీ అయిన ఈఓఐ నోటీసు..
అండమాన్ నికోబార్ దీవుల్లోని గ్రేట్ నికోబార్ లేదా లిటిల్ అండమాన్‌లో సూచించిన ప్రదేశాలలో “గ్రీన్ ఏఐ లేదా డేటా సెంటర్ వర్టికల్” కేంద్రం అభివృద్ధికి సాధ్యాసాధ్యాలను అన్వేషించడానికి ప్రైవేటు రంగ సంస్థల ఆసక్తికి(ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్-ఈఓఐ) పిలుపునిస్తూ ఆగస్టు 10న దీవుల పరిపాలన నోటీసు జారీ చేసింది.
ప్రతిపాదించిన డేటా సెంటర్‌కు సంబంధించి ఆ నోటీసు అనేక వివరాలను పొందుపరిచింది.
హైపర్ స్కేల్ లేదా ఏఐ ఫోకస్డ్ డేటా-సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ (జీపీయూ), హై-పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లౌడ్ కంప్యూటింగ్ సావరిన్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రెన్యూవబుల్-ఎనర్జీ-పవర్డ్ డేటా-సెంటర్ ఆపరేషన్స్, సీవాటర్-బేస్డ్ ఆర్ అదర్ ఇన్నోవేటివ్ కూలింగ్ సిస్టమ్స్, ఫ్రెష్‌వాటర్-ఫ్రీ కూలింగ్ సొల్యూషన్స్, ఇంకా ఎన్నో ఇందులో ఉన్నాయి.
గ్రేట్ నికోబార్ దీవిలో వివాదాస్పద ప్రాజెక్టులు..
గ్రేట్ నికోబార్ ద్వీపంపై ప్రతిపాదించిన డేటా సెంటర్ కోసం క్యాంప్‌బెల్ బే సముద్ర ప్రాంతం, అండర్సన్ బే సముద్ర ప్రాంతం, విజయ్ నగర్ బే సముద్ర ప్రాంతం లేదా గాంధీ నగర్ బే సముద్ర ప్రాంతం వంటి ప్రదేశాలను ప్రతిపాదించారు.
ఈ ద్వీపం ఇప్పటికే రూ 92 వేల కోట్లు విలువ చేసే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నిలయమై ఉంది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టు, ఒక ఇంటర్నేషనల్ ట్రాన్స్షిప్మెంట్ కంటైనర్ టెర్మినల్, ఒక పవర్ ప్లాంట్, ఒక టౌన్షిప్, టూరిజం సౌకర్యాల ప్రాజెక్టులు ఇందులో ఉన్నాయి.
కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఈ ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చిన తీరుతో పాటు ఈ ప్రాజెక్టులు వివిధ కారణాల వల్ల అనేక వివాదాలు, విమర్శలకు దారి తీశాయి.
ఈ ప్రక్రియలో ప్రాజెక్టులకు వ్యతిరేకంగా ఉన్న స్థానిక అసమ్మతిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోలేదు. ఈ అంశాలకు సంబంధించి కలకత్తా హైకోర్టులో రెండు కేసులు ఇంకా విచారణలో ఉన్నాయి.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
