విద్యావ్యవస్థను ప్రైవేటీకరిస్తూ, చరిత్రను తిరగరాస్తూ, ప్రశ్నించే విద్యార్థులపై రాజద్రోహం ముద్రలు వేస్తున్న నిరంకుశ కాలమిది. ఇలాంటి చీకటి రోజుల్లో ‘స్వాతంత్ర్యం – ప్రజాస్వామ్యం – సోషలిజం’ అనే ఎస్ఎఫ్ఐ మూల సిద్ధాంతాన్ని భుజానకెత్తుకుని వీధిపోరాటాలకు ఊపిరిపోస్తోంది ఐషీ ఘోష్.
2020లో జేఎన్‌యూపై జరిగిన హేయమైన దాడిలో తలకు తీవ్ర గాయాలైనా వెరవక, 2026లో ఏకేజీ భవన్‌లోకి పోలీసులు జొరబడి అరెస్టు చేయాలని చూసినా భయపడక- కోర్టు మెట్టెక్కి పాలకుల కుట్రలను తిప్పికొట్టిన రాజీలేని పోరాట పటిమ ఆమెది.
జంతర్ మంతర్ ఉద్యమం నుంచి నవ భారత్ నిర్మాణం వరకు, విద్యార్థుల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సిద్ధాంత నిబద్ధతతో సాగుతున్న ఐషీ ఘోష్ పోరాట గాథ ప్రతిఒక్కరినీ ఆలోచింపజేసే ఒక అపూర్వ అధ్యాయం.
కొంతమంది నాయకులు పదవులతో గుర్తింపు తెచ్చుకుంటారు. మరికొందరు ఉద్యమాలతో తమ పేరును చరిత్రలో నమోదు చేసుకుంటారు. ఐషీ ఘోష్ రెండో కోవకు చెందిన యువ నాయకురాలు.
విద్యార్థి రాజకీయాల నుంచి జాతీయ స్థాయి ఉద్యమాల వరకూ ఎదిగిన ఆమె పేరు ఇటీవలి కాలంలో మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
జంతర్‌మంతర్ నిరసనలు, పరీక్షల అక్రమాలపై ఉద్యమం, విద్యార్థుల హక్కుల ప్రశ్న, పోలీసు చర్యలు, కోర్టు కేసులు- ఇవన్నీ కలిపి ఐషీ ఘోష్‌ను కేవలం ఒక ఎస్ఎఫ్ఐ నాయకురాలిగా కాకుండా భారత విద్యార్థి ఉద్యమంలో ఒక ప్రభావవంతమైన పోరాట స్వరంగా నిలిపాయి.
బొగ్గు గనుల నేల నుంచి ఉద్భవించిన చైతన్యం..
పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ బర్ధమాన్ జిల్లా దుర్గాపూర్ పట్టణంలో 1995 అక్టోబర్ 22న ఐషీ ఘోష్ జన్మించారు. తండ్రి దేబాశిష్ ఘోష్ దామోదర్ వ్యాలీ కార్పొరేషన్(డీవీసీ) ఉద్యోగిగా, సీఐటీయూ కార్మిక ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించగా, తల్లి షర్మిష్ఠ గృహిణి.
ఇంట్లో చిన్నతనం నుంచే కార్మిక చైతన్యం, ఎర్రజెండా సిద్ధాంతాల వాతావరణంలో పెరిగిన ఐషీ, ప్రజాసమస్యలపై స్పందించే గుణాన్ని సొంతం చేసుకున్నారు.
ఢిల్లీ క్యాంపస్ రాజకీయాల్లోకి అడుగులు..
ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన దౌలత్ రామ్ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఐషీ, ఆ తర్వాత ఉన్నత విద్య కోసం ప్రతిష్టాత్మక జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో చేరారు.
ప్రస్తుతం జేఎన్‌యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్ విభాగం నుంచి ఎంఫిల్/పీహెచ్డీ పరిశోధన చేస్తూ, శ్రమజీవుల పిల్లలకు ఉన్నత విద్య అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఎఫ్ఐ)లో చురుకైన నాయకురాలిగా మారారు.
ఆమెకు జేఎన్‌యూ కేవలం విద్యాసంస్థ కాదు. ఆలోచనలు ఢీకొనే వేదిక, ప్రశ్నలు పుట్టే ప్రదేశం, ఉద్యమాలు రూపుదిద్దుకునే రాజకీయ ప్రయోగశాలగా మారింది.
పదమూడేళ్ల నిరీక్షణకు తెర దించిన చారిత్రాత్మక విజయం..
సెప్టెంబర్ 2019లో జరిగిన జేఎన్‌యూ విద్యార్థి యూనియన్(జేఎన్‌యూఎస్‌యూ) ఎన్నికల్లో ఐషీ ఘోష్ ఎస్ఎఫ్ఐ అభ్యర్థిగా అధ్యక్షురాలిగా గెలుపొందారు.
గత 13 ఏళ్లలో ఎస్ఎఫ్ఐ నుంచి జేఎన్‌యూ విద్యార్థి యూనియన్ అధ్యక్ష పదవిని కైవసం చేసుకున్న తొలి నాయకురాలిగా ఆమె చరిత్ర సృష్టించారు. విద్యార్థుల హక్కుల కోసం క్యాంపస్ వేదికగా బలమైన పోరాటాలకు శ్రీకారం చుట్టారు.
విద్యారంగ ప్రైవేటీకరణపై సమరభేరి..
విశ్వవిద్యాలయాల్లో ఆకస్మిక ఫీజుల పెంపు, హాస్టల్ కొరత, లైబ్రరీ నిధుల కోత, కరెంట్ ఛార్జీల పెంపు, విద్యార్థులపై ఆంక్షలకు వ్యతిరేకంగా ఐషీ నాయకత్వంలో నిరసనలు మిన్నంటాయి.
కేంద్ర ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాల వల్ల జేఎన్‌యూ దేశంలోనే అత్యంత ఖరీదైన సెంట్రల్ యూనివర్సిటీగా మారడాన్ని తీవ్రంగా నిరసిస్తూ, ఉన్నత విద్య అనేది లాభాపేక్ష లేని ప్రభుత్వ బాధ్యత అని గళమెత్తారు.
రక్తం ఓడినా వెరవని ధైర్యం..
ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో, 2020 జనవరి 5న ముసుగులు ధరించిన దుండగులు జేఎన్‌యూ క్యాంపస్‌లోకి చొరబడి చేసిన క్రూరమైన దాడిలో ఐషీ ఘోష్ తలకు తీవ్ర గాయాలయ్యాయి.
రక్తం ఓడుతున్న తలతోనే ఆమె మీడియా ముందుకు వచ్చి పాలకుల, పోలీసుల, యూనివర్సిటీ యంత్రాంగం కుట్రలను నిర్భయంగా ఎండగట్టారు.
ఈ ఘటనతో ఆమె రాత్రికి రాత్రే దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమానికి ప్రతిరూపంగా మారారు.
దేశవ్యాప్త మద్దతు.. పెల్లుబికిన ఆగ్రహం..
ఆమెపై జరిగిన దాడిని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. సినీ నటి దీపికా పడుకోణె, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్వయంగా వచ్చి ఐషీకి మద్దతు ప్రకటించారు.
అయితే బాధితులైన విద్యార్థులపైనే పోలీసులు కేసులు నమోదు చేయడం ద్వారా ఫాసిస్టు ప్రభుత్వ కక్షసాధింపు ధోరణి బట్టబయలైంది.
సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ఉద్యమ పంథా..
కేవలం విద్యా రంగానికే పరిమితం కాకుండా, దేశ లౌకికత్వానికి గొడ్డలిపెట్టుగా మారిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా సాగిన ప్రజా ఉద్యమాల్లో ఐషీ ఘోష్ అగ్రభాగాన నిలిచారు.
పాలకుల విభజన రాజకీయాలను ఎండగడుతూ దేశవ్యాప్తంగా విద్యార్థులను, యువతను చైతన్యపరిచారు.
ఎన్నికల బరిలో శ్రమజీవుల గొంతుక..
విద్యార్థి ఉద్యమాల నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఐషీ, 2021 పశ్చిమ బెంగాల్ శాసనసభ ఎన్నికల్లో దుర్గాపూర్ పూర్బా నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేశారు.
కార్మికుల, యువత, విద్యార్థుల ఆకాంక్షలను చట్టసభల్లో వినిపించేందుకు అసెంబ్లీ బరిలో నిలిచి తన పోరాట పటిమను చాటారు.
ఎస్ఎఫ్ఐ విప్లవ వారసత్వం..
1970 డిసెంబర్ 30న ఆవిర్భవించిన ఎస్ఎఫ్ఐ ‘అందరికీ విద్య – అందరికీ ఉపాధి’, ‘స్వాతంత్ర్యం – ప్రజాస్వామ్యం – సోషలిజం’ అనే లక్ష్యాలతో సాగిస్తున్న సుదీర్ఘ ప్రయాణంలో ఐషీ ఘోష్ ఒక బలమైన సైనికురాలిగా నిలిచారు.
వర్గ పోరాటాల్లో ప్రాణాలర్పించిన అమరుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని, సైంటిఫిక్, సెక్యులర్ విద్యావ్యవస్థ కోసం ఎస్ఎఫ్ఐ అఖిల భారత జాయింట్ సెక్రటరీగా ఆమె పోరాడుతున్నారు.
ఏకేజీ భవన్‌పై ఢిల్లీ పోలీసుల దాడి..
పాలకుల పీఠాలను కదిలించిన ఇటీవల జంతర్ మంతర్ విద్యార్థి ఉద్యమం తర్వాత, కేంద్ర ప్రభుత్వం మళ్లీ కక్షసాధింపు చర్యలకు దిగింది.
2026 జులై చివర్లో 2021 నాటి ఒక పాత కేసును సాకుగా చూపి, ఢిల్లీ పోలీసులు ఏకేజీ భవన్(సీపీఐ-ఎం కేంద్ర కార్యాలయం)లోకి అక్రమంగా జొరబడి ఐషీ ఘోష్‌ను అరెస్టు చేయడానికి ప్రయత్నించారు.
ఎంపీ జాన్ బ్రిట్టాస్, పినరయి విజయన్ నిలదీత..
పోలీసుల చట్టవిరుద్ధ చర్యలను సీపీఐ(ఎం) రాజ్యసభ ఎంపీ జాన్ బ్రిట్టాస్ గట్టిగా నిరోధించారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశత్వాన్ని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, మాజీ ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ తీవ్రంగా ఖండించారు.
ప్రశ్నించే గొంతుకలను భయపెట్టేందుకే ప్రభుత్వం పాత వారెంట్ల పేరుతో వేధింపులకు పాల్పడుతోందని దుయ్యబట్టారు.
కోర్టులో పాలకులకు ఎదురుదెబ్బ..
పోలీసుల వేధింపులకు భయపడకుండా ఐషీ ఘోష్ స్వయంగా పాటియాలా హౌస్ కోర్టులో హాజరయ్యారు. ఆమె వివరణతో సంతృప్తి చెందిన జుడీషియల్ మేజిస్ట్రేట్, పోలీసులు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్‌ను రద్దు చేస్తూ తీర్పునిచ్చారు. దీంతో పాలకుల కుట్ర కోర్టు వేదికగా మరోసారి పటాపంచలైంది.
సంఘ్ పరివార్ కుట్రలపై సమరభేరి..
విద్యాసంస్థలను ఆరెస్సెస్, సంఘ్ పరివార్ భావజాలంతో నింపేందుకు జరుగుతున్న యత్నాలను, ఎన్టీఏ నిర్వహించే పరీక్షల కుంభకోణాలను ఐషీ ఘోష్ తీవ్రంగా నిలదీస్తున్నారు.
కేరళతో పాటు దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యార్థి మహాసభల్లో పాల్గొంటూ నవతరాన్ని సమరసిద్ధం చేస్తున్నారు.
మిలిటెంట్ పోరాట శైలి – అణిచినా లొంగని నైజం..
అందుకే వామపక్ష శిబిరం ఆమెను ‘మిలిటెంట్’ లేదా ‘పోరాటపటిమ కలిగిన’ నాయకురాలిగా అభివర్ణిస్తుంది. పాలకుల తుపాకులు, కేసులు, జైలు శిక్షలు ఆమె పోరాట పటిమను ఆపలేకపోయాయి.
రాజ్యాంగబద్ధమైన పౌర హక్కుల పరిరక్షణ కోసం, గిరిజన, దళిత, బహుజన విద్యార్థుల ఆత్మగౌరవం కోసం ఆమె రాజీలేని పోరు సాగిస్తున్నారు.
ప్రజాస్వామ్యానికి అవసరమైన పౌరురాలు..
ఐషీ ఘోష్ కథ చివరికి ఒక వ్యక్తి కథ మాత్రమే కాదు. అది భారత యువత ఏ ప్రశ్నలను అడుగుతోంది? విద్య హక్కా… వ్యాపారమా? నిరసన ప్రజాస్వామ్య హక్కా…నేరమా? ప్రభుత్వాన్ని ప్రశ్నించే విద్యార్థి దేశద్రోహినా-లేక ప్రజాస్వామ్యానికి అవసరమైన పౌరుడా? అన్న ప్రశ్నల సమాహారం.
నవభారత నిర్మాణంలో చెరిగిపోని శక్తులు..
నేహా బోరా నుంచి ఐషీ ఘోష్ వరకు… దేశంలో ఉద్భవిస్తున్న ఈ యువ విద్యార్థి నాయకత్వం కేవలం నిరసనలకే పరిమితం కావడం లేదు.
విభజన రాజకీయాలను, కార్పొరేట్ అనుకూల విధానాలను కూకటివేళ్లతో పెకిలించి, ప్రజాస్వామ్య, సోషలిస్టు, లౌకిక ప్రత్యామ్నాయ భారతాన్ని నిర్మించే దిశగా దేశ యువతను నడిపిస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
