చిన్నప్పుడు చరిత్ర పాఠాల్లో అలెగ్జాండర్ – పురుషోత్తమ్(పోరస్)ల యుద్ధం గురించి చదివాం. ఆ యుద్ధం జీలం – చీనాబ్ నదుల మధ్య జరిగిందని తెలుసుకున్నాం. అంత వరకే.
ఆ యుద్ధానికి సంబంధించిన నేపథ్యం ఏమిటి అన్నది మనకు ఎవరూ చెప్పలేదు.
గొప్ప హృదయ సంస్కారానికి, మానవీయ విలువలకు, నైతికతకు ప్రాధాన్యమున్న ఆ సంఘటనలు చరిత్రలో నమోదయ్యే ఉన్నాయి.
తాము రాసిన గ్రంథాల్లో చరిత్రకారులు నమోదు చేశారు. కానీ, ఆ వివరాలు సామాన్యులకు అందలేదు. వాటిని పాఠ్య గ్రంథాల్లోకి తెచ్చి చిన్న పిల్లల్ని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే ప్రయత్నం జరగలేదు.
బౌద్ధాన్ని నాశనం చేసి, వైదిక మతం బలపడుతూ వచ్చిన విషయం మనం అప్పుడప్పుడు చర్చించుకుంటూనే ఉన్నాం.
రక్షాబంధన్ కూడా బౌద్ధం నుంచి జన జీవితంలోకి వచ్చిన ఒక ముఖ్యమైన ఘటనే. అది ఎలాగా? అంటే మనం సాధారణ శకానికి ముందు 326 వ సంవత్సరం జూన్ మాసంలో అలెగ్జాండర్‌కు పోరస్కు మధ్య జరిగిన యుద్ధ కాలానికి వెళ్ళాలి.
అలెగ్జాండర్ దండయాత్ర – అంబి వ్యూహాలు..
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తత్త్వవేత్త అరిస్టాటిల్‌కు శిష్యుడైన అలెగ్జాండర్ సాధారణ శకానికి ముందు తన ఇరవయ్యవ యేట మాసిడోనియాకు రాజయ్యాడు.
సామ్రాజ్య విస్తరణ చేసుకుంటూ పదేళ్ళలో గ్రీస్ నుండి వాయువ్య భారత దేశానికి చేరుకున్నాడు. ఆసియా ఖండంలో దండయాత్రలు చేస్తూ బాక్ట్రియాను పాలిస్తున్న బౌద్ధరాజు ఆక్సీయార్టెస్ను ఓడించాడు. అక్కడే అతణ్ణి తన రాజప్రతినిధిగా నియమించి, అతని కూతురైన రొక్సానా అందానికి, నమ్రతకు ఆకర్షింపబడ్డాడు.
ఆమెను తన రెండో భార్యగా స్వీకరించి, జైత్రయాత్రలో ముందుకు కదిలాడు. తక్షశిలను పాలిస్తున్న బ్రాహ్మణ రాజు అంబి ఉరఫ్ ఓంఫిస్, అలెగ్జాండర్ భారత దేశం మీద దండెత్తబోతున్నాడని తెలుసుకుని, తన రాజకీయ చతురతను ప్రదర్శించాడు. తమ దేశానికి రావల్సిందిగా వర్తమానం పంపాడు.
అయితే ఆ ప్రాంతపు గిరిజన తెగలు లొంగిపోవడానికి నిరాకరించాయి. పరిస్థితులు గమనించిన అంబి, అలెగ్జాండర్ పక్షాన నిలిచి గిరిజన తెగల్ని అణచివేయడంలో సహకరించాడు.
అంతేకాదు, జీలం – చీనాబ్ నదుల మధ్య గల పురుషోత్తమ్(పోరస్) పై దాడి చేయవలసిందిగా పురమాయించాడు. ఎందుకంటే, పోరస్కు అంబికి శత్రుత్వముంది. అతణ్ణి హతమార్చడానికి అలెగ్జాండర్‌ను ఉపయోగించుకున్నాడు. అది ఒక పన్నాగం.
తన సైన్యంలోంచి ఐదు వేల మంది సైనికుల్ని అలెగ్జాండర్ వైపున యుద్ధం చేయడానికి పంపించాడు. అలాగే జీలం నది దాటడానికి తాత్కాలికంగా ఒక వంతెనను నిర్మించాడు. ఆ విధంగా అంబి అన్ని విధాలా అలెగ్జాండర్‌కు సహకరించాడు.
బ్రాహ్మణ రాజులు ఈ దేశ మూలవాసుల రక్షణ ఎప్పుడూ కోరుకోలేదు. ఈ విషయం మనకు అనేక సందర్భాలలో, అనేక సార్లు చరిత్ర పుటల్లో కనిపిస్తూనే ఉంది.
ఆర్య బ్రాహ్మణ మూలాలున్న ఆరెస్సెస్ స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనకుండా బ్రిటీష్ వారికి క్షమాపణలు కోరుతూ, తమ బాగోగులు తాము చూసుకున్నారు కదా. గతంలోనైనా ఆధునిక యుగంలోనైనా, ఇప్పుడైనా వారి ప్రవర్తన మారలేదు, మార్చుకోరు.
హైడాస్పస్ యుద్ధం – అలెగ్జాండర్ పరివర్తన..
క్రీస్తు పూర్వం 326లో అలెగ్జాండర్ – పోరస్(పురుషోత్తమ్)ల మధ్య జరిగిన హైడాస్పస్ చారిత్రక యుద్ధం ఆనాటి స్థితిగతులను పూర్తిగా మార్చేసింది.
పంజాబ్ ప్రాంతంలో హైడాస్పస్ నది ఒడ్డున ఆ యుద్ధం జరిగింది. దానినే ఇప్పుడు జీలం నది అని అంటున్నాం. అప్పుడు జీలమ్ – చీనాబ్ నదుల మధ్య పౌరవ వంశ రాజు పాలకుడు పురుషోత్తమ్ పాలిస్తూ ఉండేవాడు. అలసిపోయి ఉన్న మాసిడోనియా అలెగ్జాండర్ సైన్యం పోరస్ సైన్యాన్ని ఎదుర్కోలేక పోయింది.
యుద్ధంలో రక్తసిక్తమైన ఇరు పక్షాల సైనికులకు కట్లు గట్టి, బౌద్ధ భిక్షువులు వైద్య సేవలందిస్తూ ఉండడం అలెగ్జాండర్ ప్రత్యక్షంగా చూశాడు. క్రమంగా మానసిక పరివర్తనకు గురయ్యాడు. జాలి, దయ, కరుణల ముందు ఈ హింస, రక్తపాతం, రాజ్య విస్తరణ చిన్నవిగా తోచసాగాయి.
లాచి మానవత్వం – వైద్య సేవ..
అలెగ్జాండర్‌కు, అతని గుర్రానికీ తీవ్రంగా దెబ్బలు తగిలి, ఓ మూల పడి మూలుగుతున్నప్పుడు లాచి అనే యువతి వచ్చి, వైద్య సేవలు అందించింది. తను మాసిడోనియా మహారాజునని, అలెగ్జాండర్నని ఆయన తనను తాను ఆ యువతికి పరిచయం చేసుకున్నాడు.
ఆ మాటలకు ఆమె స్పందిస్తూ, “నీ వెవరైతే నాకేమిటి, దెబ్బలు తిని, రక్తం కారుతూ లేవలేక పడి ఉన్నావు, నీకు వైద్యం చేసి ప్రాణాలు నిలపడం మనిషిగా నా కర్తవ్యం. ప్రాణాలు తీయడం చాలా సులువు, ప్రాణాలు నిలపడమే చాలా కష్టం. నేను మనిషిని కాబట్టి, మనిషిగా నీకు సేవ చేశాను అంతే..” అని చెప్పింది లాచి.
ప్రపంచ విజేత అలెగ్జాండర్ ఆమె మాటలకు తలదించుకున్నాడు. ఆమెలోని మానవత్వాన్నీ ఆ మానవత్వపు విలువనీ గ్రహించుకున్నాడు.
“ఇంత సహనం, ఓర్పు, తాత్త్విక చింతన ఎలా అబ్బాయి” అని అలెగ్జాండర్ ఆ అమ్మాయి లాచిని అడిగాడు. ఆమె, తను బౌద్ధ భిక్షు తంతిమాస్ శిష్యురాలినని, ఇక్కడి క్షతగాత్రులకు సేవలు చేస్తున్న వారంతా ఆ బౌద్ధభిక్షు శిష్యులేనని చెప్పింది.
అంతే ఆయన వెంటనే బౌద్ధ భిక్షు తంతిమాస్ను కలవాలని, ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకోవాలని అనుకున్నాడు.
రొక్సానా రాఖీ – ప్రాణభిక్ష..
అప్పటికి బౌద్ధం దేశంలో బాగా వ్యాపించి ఉంది. యుద్ధం జరుగుతున్న సమయంలోనే శ్రావణ పౌర్ణమి వచ్చింది. ఉపాసకా, ఉపాసకులు ధమ్మ శ్రవణం చేసి, ఉత్సాహంగా ఒకరికొకరు ధమ్మరక్షలు(రక్షాబంధన్) కట్టుకున్నారు. అంటే మనమంతా కలిసి ధమ్మాన్ని రక్షించుకుందామని ప్రతిన బూనడం అన్నమాట. ఆ సంప్రదాయాన్ని ఆనాటి నుంచి నేటిదాకా బౌద్ధ విహారాల్లో ఆచరిస్తూనే ఉన్నారు.
యుద్ధ భూమిలో లాచి తనకు చేసిన సేవల గూర్చి, బౌద్ధ సంప్రదాయం గూర్చి, అలెగ్జాండర్ తన సతీమణి రొక్సానాకు వివరించాడు. బలంగా ఉన్న పోరస్ను గెలవడం కష్టంగానే ఉందన్న విషయం, తన సైన్యం బలహీనపడిన విషయం కూడా ఆయన తన భార్యకు చెప్పుకున్నాడు.
అప్పుడు రొక్సానా వెంటనే ఒక నిర్ణయం తీసుకుంది. పురుషోత్తమ్(పోరస్)కు ఒక రాఖీ పంపించింది. దానితో పాటు ఒక కోరిక కూడా కోరింది.
నిరాయుధుడైన తన భర్త అలెగ్జాండర్ గనక ఆయనకు చేజిక్కినట్లయితే దయదలిచి ప్రాణభిక్ష పెట్టమని అర్థించింది. తనను చెల్లెలిగా భావించి పతిభిక్ష పెట్టాలని వేడుకుంది. విషయం అర్థం చేసుకున్న పురుషోత్తమ్ విశాల హృదయుడై అలాగే జరుగుతుందని రొక్సానాకు మాట ఇచ్చాడు.
పోరస్ ఔదార్యం – మిత్రబంధం..
మరునాడు మళ్ళీ భీకర యుద్ధం ప్రారంభమైంది. రొక్సానా ఊహించిన విధంగానే అలెగ్జాండర్ నిరాయుధుడై పురుషోత్తమ్ చేతికి చిక్కాడు. పురుషోత్తమ్ అలెగ్జాండర్ పై వేటు వేయడానికి కత్తి ఎత్తాడు. కానీ, చేతికి ఉన్న రక్షాబంధన్ కనబడగానే తను ఇచ్చిన మాటను, తన కర్తవ్యాన్నీ గుర్తు చేసుకున్నాడు. కత్తి దించాడు.
పురుషోత్తమ్ ఔదార్యాన్ని అలెగ్జాండర్ మనసులోనే అభినందించుకున్నాడు. అంతే వారిరువురూ శత్రువులుగా కాకుండా మిత్రులుగా కలిసి సంధి కుదుర్చుకున్నారు. పురుషోత్తమ్ ధైర్య సాహసాలను అలెగ్జాండర్ ప్రశంసించాడు.
గెలుపు అలెగ్జాండర్ దే అయినా, రాజ్యాన్ని పురుషోత్తమ్‌కు అప్పగించి యథావిధిగా పరిపాలించుకోమన్నాడు. తన సైన్యంతో ముందుకు సాగిపోతూ అలెగ్జాండర్ పురుషోత్తమ్ ను ఒక కోరిక కోరాడు.
యుద్ధరంగంలో తనకు సేవలందించి, ప్రాణం కాపాడిన లాచిని భార్యగా స్వీకరించి రాణిని చేయమన్నాడు. పురుషోత్తమ్ అంగీకరించి లాచిని భార్యగా స్వీకరించాడు. అంబి కుట్రలు పని చేయలేదు. అతను కురిపించిన విషం శీల త్యాగ నిరతి హృదయ వైశాల్యాలతో అమృతమై పోయింది. సోదరభావం వెల్లివిరిసింది.
బౌద్ధ ధమ్మ ప్రచారం..
రాజ్యకాంక్షతో దేశాల్ని జయిస్తూ వచ్చిన అలెగ్జాండర్ భారత దేశంలో బౌద్ధ సంప్రదాయాలకు తలవంచాడు. సోదరభావాన్ని నిలుపుకునే ధమ్మ దీక్షకు ప్రాధాన్యమిచ్చాడు. బౌద్ధ సంస్కృతిని ఖండాంతరాలకు తీసుకుపోయాడు.
తాత్త్వికుడైన బౌద్ధభిక్షు తంతిమిస్ బోధనలు విని ప్రభావితుడై, ఆయన బోధనల సారాంశాన్ని అప్పటికి అందుబాటులో ఉన్న ఒక రకమైన కాగితాలపై రాయించుకుని, కూజాలలో భద్రపరిచి వాటిని గుర్రాలపై, ఏనుగులపై తరలించాడు.
వెళ్ళేప్పుడు తన వెంట కొంతమంది బౌద్ధ భిక్షువులను కూడా తీసుకుని వెళ్ళాడు. ఆ రకంగా బౌద్ధ-గ్రీకు సంస్కృతుల సంగమం ఏర్పడింది.
తర్వాత కాలంలో జరిగిన కళింగయుద్ధం(క్రీస్తు పూర్వం 261)లో చండాశోకుడు మనసు మార్చుకుని, ఆయుధాల్నీ, హింసనూ వదిలి ఎలా బౌద్ధం స్వీకరించాడో మనకు తెలుసు.
మానవీయ విలువల్ని నిలపడానికి విస్తృతంగా బౌద్ధాన్ని అశోక చక్రవర్తి ఎలా ప్రచారం చేయించాడో కూడా మనకు తెలుసు.
అలెగ్జాండర్ అంతిమ సందేశం..
క్రీస్తు పూర్వం 323లో అంటే అలెగ్జాండర్ తన ముప్పై రెండవ యేట బాబిలోన్లో(ప్రస్తుత ఇరాక్ ప్రాంతం) ఒక అంతు తెలియని వ్యాధికి గురై మరణించాడు. అంతకు ముందు ఆయన తన అనుచరులతో ఒక వీలునామా పత్రం వంటిది రాయించాడు. అందులో ముఖ్యంగా మూడు విషయాలున్నాయి.
తన శవపేటికను వైద్యులే ఖననం చేయాలి, తన సంపదను దారి వెంట వెదజల్లుకుంటూ వెళ్ళాలి, తన ఖాళీ చేతులు బయటకు పైకి సాచి ఉంచి తీసుకు పోవాలి. వీటి అర్థం ఏమిటంటే, మరణాన్ని ధ్రువీకరించిన వారే ఖననం చేయాలన్నది ఆయన కోరిక. తను ఏ సంపదను తీసుకు పోవడం లేదని, అది ఈ ప్రజలదేనని, అందుకే దారి పొడవునా ధనాన్ని వెదజల్లుకుంటూ వెళ్ళాలన్నది ఆయన ఆలోచన.
తను ఈ ప్రపంచాన్నుంచి ఏమీ తీసుకుపోవడం లేదని ప్రజలకు ఒక సందేశం ఇచ్చే విధంగా, ఖాళీ చేతులు బయటికి కనబడాలన్నాడు. ఇన్ని శతాబ్దాలు గడిచినా, ఇప్పటికీ శవయాత్రల్లో దారి పొడవునా డబ్బులు చల్లుతూ వెళ్ళడం జరుగుతూ ఉంది. ఇది ఇంకా కొనసాగుతున్న ఆనాటి ఆచారమే.
ధమ్మరక్ష అసలు ఉద్దేశం..
ధమ్మ రక్ష అంటే ధర్మాన్ని రక్షించడం. ధర్మం అంటే ఇక్కడ మతం అని కాదు. న్యాయాన్నీ, సత్యాన్నీ రక్షించడం. సహోదరత్వాన్ని, మైత్రీ బంధాన్ని రక్షించడం. బౌద్ధం చెప్పిన జాలి, దయ, కరుణలను కాపాడుకోవడం. ఇవి ఒక ప్రాంతానికి, ఒక దేశానికి సంబంధించినవి కూడా కాదు.
విశ్వజనుల శ్రేయస్సును ఉద్దేశించి ఏర్పరుచుకున్నవి. బౌద్ధంలో సత్యానికి, అహింసకి, శీలానికి, శాంతికి ఎల్లలు లేవు. ఇవి చాటి చెప్పడానికి బౌద్ధారామాలలో ధమ్మరక్షలు (రక్షాబంధనలు) కట్టుకుంటారు. దాన్ని ఉపయోగించి రొక్సానా తన భర్త ప్రాణాల్ని కాపాడుకుంది. అప్పటి నుండి అది అన్నాచెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక అయ్యింది.
కాలక్రమంలో దాని చుట్టూ వచ్చిన ఇతర ఆచారాలన్నీ వైదిక మతస్థులు కల్పించినవి. ఇతర పండుగ దినాలను, ఇతర అంశాలను వక్రీకరించినట్లు ఈ విషయం పెద్దగా వక్రీకరణకు గురికాలేదు.
అయితే ఇది దేశ ప్రజల జీవితాల్లోకి ఎలా వచ్చింది, ఎలా స్థిరపడింది అన్నది మాత్రం కప్పి పుచ్చారు. మనం దాన్ని వెలుగులోకి తేవాలి. నిజాన్ని నిలబెట్టాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
