రాష్ట్రంలో కొత్త జలవిద్యుత్ చొరవలను వెంటనే నిలుపుదల చేసి, ఇప్పటికే పని చేస్తున్న ప్రాజెక్టుల విషయంలో ఒక స్వతంత్ర కమిషన్ ద్వారా నిర్ధారించిన గడువులోగా దర్యాప్తు జరిపించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, ది సిక్కిం భూటియా లెప్చా అపెక్స్ కమిటీ (ఎస్ఐబీఎల్ఏసీ) పిలుపునిచ్చింది.
న్యూఢిల్లీ: నేపాల్‌లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదల నుంచి గుణపాఠం నేర్చుకొని హిమాలయ ప్రాంతంలో ఏర్పాటు చేయనున్న లేదా ప్రణాళికలు వేసుకున్న జలవిద్యుత్ ప్రాజెక్టులను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సిక్కింలో రెండు జాతుల సమూహాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక సంఘం కోరింది.
నేపాల్‌లో ధ్వంసమైన 13 జలవిద్యుత్ ప్రాజెక్టులు..
నేపాల్ విద్యుత్ అథారిటీ ప్రకారం టిబెట్‌లో భూకంపం సంభవించడం వల్ల మంచు హిమపాతం టిబెట్‌ను కుదిపివేసిందని, దాని ఫలితంగా భోటేకోషీ, త్రిశూలి నది లోయలో కనీసం 13 జలవిద్యుత్ ప్రాజెక్టులు తీవ్రంగా ధ్వంసం అయ్యాయని తెలియజేసింది.
టిబెట్‌లో గైరోంగ్ ఓడరేవు ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో ఆకస్మికంగా వరదలు సంభవించి రోడ్లు, విద్యుత్ మౌలిక సదుపాయాలు కొట్టుకుపోయాయి.
అనేక గ్రామాలను అది ముంచేసింది. అనేక సౌకర్యాలతో పాటు రసువా జిల్లాలో ఉన్న నేపాల్ 111 మెగావాట్ల రసువాగఢీ జలవిద్యుత్ ప్లాంట్ దెబ్బతింది.
బుధవారం ఉదయం రసువా జిల్లానే మొదట వరదలు తాకడం గుర్తు పెట్టుకోవాలి.
స్వతంత్ర దర్యాప్తు జరిపించాలి..
రాష్ట్రంలో కొత్త జలవిద్యుత్ చొరవలన్నింటినీ వెంటనే నిలిపివేసి, ఇప్పటికే పని చేస్తున్న ప్రాజెక్టులపై స్వతంత్ర కమిషన్ ద్వారా నిర్ధారించిన గడువులోగా దర్యాప్తు జరిపించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ది సిక్కిం భూటియా లెప్చా అపెక్స్ కమిటీ (ఎస్ఐబీఎల్ఏసీ) విజ్ఞప్తి చేసింది.
అభివృద్ధి కార్యకలాపాలపై తాజా అంచనాల అవసరాన్ని నేపాల్ వరదలు సూచిస్తున్నాయని, ఎస్ఐబీఎల్ఏసీ కన్వీనర్, భారతీయ జనతా పార్టీ సిక్కిం శాఖ ముఖ్య సలహాదారు త్సేటెన్ తాషీ భూటియా అన్నారు.
నేపాల్‌లో విపత్తు హిమాలయ ప్రాంతం దుర్బలత్వాన్ని తెలియజేస్తుందని, అందుకే అభివృద్ధి కార్యకలాపాలపై తాజా సమీక్ష అవసరం ఉందని ఆయన చెప్పారు.
సిక్కిం నదులపై తదుపరి జలవిద్యుత్ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం పునరాలోచన చేయాల్సిన అవసరం ఉందని కన్వీనర్ పేర్కొన్నారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి..
సిక్కింలో ఉన్న ప్రతి జలవిద్యుత్ ప్రాజెక్టును పర్యావరణ, భౌగోళిక, భూకంప, సామాజిక, జాతీయ భద్రతా కోణం నుంచి లోతుగా స్వతంత్ర సమీక్ష జరపాలని భూటియా నొక్కి చెప్పారు.
అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న లేదా ప్రతిపాదిత ప్రాజెక్టులపై సమీక్షకు సంబంధించి పూర్తి వివరాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కూడా ప్రభుత్వాన్ని ఆయన కోరారు.
గతంలో సిక్కింలోనూ విపత్తులు..
జలవిద్యుత్ మౌలిక సదుపాయాలతో ముడిపడి ఉన్న విపత్తులను ఎదుర్కోవడం సిక్కింకు ఇది మొదటిసారి కాదు.
చుంగ్థాంగ్లో అక్టోబర్ 2023లో హిమనదీయ సరస్సు పొంగడంతో సంభవించిన వరదలు 1,200 మెగావాట్ల తీస్తా-3 ప్రాజెక్టును ధ్వంసం చేశాయి.
దానితో పాటు తీస్తా నది దిగువ ప్రాంతం పొడవునా ఉన్న విద్యుత్ మౌలిక సదుపాయాలను పూర్తిగా నాశనం చేశాయి.
గల్లంతైన భారతీయులు..
రసువా జిల్లాలో ఆగస్టు 28 న సంభవించిన ఆకస్మిక వరదల వల్ల సుమారు 320 మంది భారత జాతీయులు గల్లంతు లేదా అందుబాటులో లేరని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) వెల్లడించింది.
దానితో పాటు భారత సంతతికి చెందిన ఇతర దేశస్తులు సుమారు వంద మంది వ్యక్తులు కూడా అందుబాటులో లేరని ఎంఈఏ తెలిపింది.
కాగా నేపాల్‌లో మృతుల సంఖ్య 547 కి పెరిగిందని స్థానిక అధికారులు చెప్పినట్లు బీబీసీ పేర్కొంది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
