అన్నీ మనకు తెలియవు కనుక, తెలిసినవాళ్లతో మాట్లాడడం తెలివైన పని. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో సీఎం అయినప్పుడు చేసింది అదే. ఆయన అప్పుడు జేఎన్‌యూ ఎకనామిక్స్ ప్రొఫెసర్ జయతీ ఘోష్‌ను దారి(‘రోడ్ మ్యాప్’) అడిగారు. అప్పటికి రాష్ట్రంలో రైతు వెతలు గరిష్ట స్థాయికి చేరడంతో, ఆమె ఇచ్చిన నివేదికను ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడానికి ప్రయత్నం చేసింది. అప్పటికి ఉన్న పరిస్థితిని అది కొంత మెరుగుపరిచింది.
ఆర్థిక సంస్కరణల నాటి ఆర్థిక మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధాన మంత్రి అయ్యాక, సంస్కరణల అమలు తొలి పదేళ్ల నాటికి రాష్ట్రంలో లోతైన సమీక్ష అవసరమని అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనిపించింది. ఆ తర్వాత సింగ్ హైదరాబాద్ వచ్చినప్పుడు తానే దీన్ని- “రిఫామ్స్ విత్ హ్యూమన్ ఫేస్” (మానవత్వంతో కూడిన సంస్కరణలు) అన్నారు.
మారుతున్న కాలంతో పాటుగా, ప్రభుత్వ సేవలు కోరే లబ్ధిదారులు ఎవరు, వారికి ‘రాజ్యం’ నుంచి చేరుతున్నది ఏమిటి? అది ఎంత మేర? అందుకు ఎటువంటి ‘పబ్లిక్ పాలసీ’ అవసరం? అనే ఎరుక ఎన్నికైన ప్రభుత్వానికి ఉన్నప్పుడు ఇటువంటి సమీక్షలు, దిద్దుబాటు చర్యలు జరుగుతాయి.
తమిళనాడు సీఎం జోసఫ్ విజయ్ తన ప్రభుత్వం రాష్ట్రంలో పన్నుల విధానాన్ని ‘రేషనలైజ్’ చేయడానికి, మాజీ ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ మాంటేక్ సింగ్ అహ్లూవాలియాను ప్రభుత్వ సలహాదారుగా నియమించడం ఈ కోవలోకే వస్తుంది.
ఏపీ విషయంలో ఎందుకు లేదు?
తెలంగాణ 2014లో కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు, అప్పటికే ‘టీఆర్ఎస్’ పార్టీ రాష్ట్ర విభజన కోసం ఏళ్ల తరబడి చేసిన ఉద్యమం కోసం అది సిద్ధం చేసుకున్న- ‘రోడ్ మ్యాప్’ ఆ ప్రభుత్వ ప్రాధాన్యతలకు ఒక ‘డాక్యుమెంట్’గా ఉపకరించింది.
అయితే, రాష్ట్రం ఒక్కటిగా కలిసి ఉండాలని ఆందోళన చేసిన ఆంధ్రప్రదేశ్ వద్ద ఎటువంటి ‘కాయితం’ లేదు. పైగా కేంద్ర ప్రభుత్వం ఏపీ రాజధాని ఎక్కడ అనే ఎంపిక కోసం నియమించిన శివరామ కృష్ణన్ కమిటీ ఇచ్చిన నిపుణుల రిపోర్టును కూడా ఆ రాష్ట్రం పక్కన పెట్టింది.
ప్రభుత్వం అనగానే, దేశానికి 80 ఏళ్లు వచ్చినా- రాజకీయ పార్టీలు వాటి నాయకులను చూసే ప్రాథమిక దశలోనే మన ప్రజాస్వామ్య ఎరుక ఉందిగాని, ఆ స్థితిని అధిగమించడానికి ‘రాజ్యము’ చూపిస్తున్న చొరవ(‘స్టేట్ ఇంట్రవెన్షన్’) ఎటువంటిది? అనే సమీక్ష ఆంధ్రప్రదేశ్ విషయంలో ఎందుకు లేదు? అనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది.
ఏపీ పౌర సమాజం శాశ్వత దోషి..
ఈ మాట అనడానికి కారణం, పైన చెప్పుకున్న ప్రత్యేక శ్రద్ధ, చొరవ ఏపీ విషయంలో 2014-19 మధ్య కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి లేకపోయింది. ఈ విషయంలో ఎటువంటి చొరవ చూపకుండా నిస్తేజంగా మిగిలిన ఏపీ పౌర సమాజం పాత్ర మాత్రం శాశ్వత దోషిగా భవిష్యత్ చరిత్రలో రికార్డ్ అవుతుంది.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో ‘అర్బన్ ప్లానింగ్’ అంటే, అది రాష్ట్ర ఆర్థిక వృద్ధికి దోహదం చేసేదిగానూ, అన్ని ప్రాంతాలను ‘బ్యాలెన్స్’ చేస్తూ, భూమి వినియోగం అమలులో ఉన్న నిబంధనలను పాటిస్తూనే, శాశ్వత మౌలిక వసతులు కల్పించే విధంగా పట్టణాల, నగరాల విస్తరణ ఉండాలి.
అలా చేస్తూ ప్రభుత్వం వద్ద నిధుల కొరత ఉన్నప్పుడు, ఇక్కడ ‘పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్ షిప్’ విధానం అమలు చేయవచ్చు. లేదా అంతర్జాతీయ ఆర్థిక సంస్థల సహకారం అందుకోవచ్చు. ఎందుకంటే, రక్షిత మంచినీటి పైప్ లైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, మురుగునీటి ‘ట్రీట్మెంట్ ప్లాంటు’లు నగర విస్తరణలో భాగంగా ఉండాలి.
భౌగోళిక అభివృద్ధి ప్రణాళిక..
ఇక్కడ ఒక పాత విషయం గుర్తు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం 2021 అక్టోబర్‌లో మంత్రిమండలి సమావేశంలో కడప జిల్లాలోని రాయచోటి పట్టణానికి రక్షిత మంచినీటి పైప్ లైన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజి, మురుగు నీటి ‘ట్రీట్మెంట్ ప్లాంటు’ కోసం రూ 236 కోట్లు మంజూరు చేసింది.
రాయచోటి పట్టణం కర్నూలు, కడప, చిత్తూరు జిల్లాలను కలిపే రాయలసీమ ఎక్స్‌ప్రెస్ హైవే మీద ఉన్న ‘నేషనల్ హైవే 40’ పై ఉంటుంది.
‘కోవిడ్’ కాలంలో నిధుల కటకట రోజుల్లో రాయచోటికి ఎందుకీ ప్రాధాన్యమని, అప్పట్లో అనుమానం కలిగింది. ఇది జరిగిన ఆరు నెలల్లో ఏప్రిల్ 2022న రాయచోటి జిల్లా కేంద్రంగా కొత్తగా అన్నమయ్య జిల్లాను అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రకటించింది.
ఏ ప్రభుత్వం అయినా ఇటువంటి ‘జియోగ్రాఫికల్ డెవలప్మెంట్ ప్లానింగ్’ (భౌగోళిక అభివృద్ధి ప్రణాళిక) చేసినప్పుడు, అది వృథా వ్యయం కాకుండా వెంటనే ‘రిటర్న్స్’ ఉండే భరోసా ఉంటుంది.
కొత్త అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు..
ఈ ఆగస్టు 18న రాష్ట్ర ప్రభుత్వం ‘అర్బన్ ప్లానింగ్’ను పూర్తిగా నవీకరించినట్టుగా ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో స్థూలంగా కనిపిస్తున్నది పాత జిల్లా కేంద్రాలు అయిన- విశాఖపట్టణం, కాకినాడ, ఏలూరు, మచిలీపట్టణం, నెల్లూరు, ఒంగోలు, కడప, కర్నూలు పట్టణాల పేరు పక్కన ‘అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’ అని కొత్తగా ఒక ‘టైటిల్’ తగిలించారు.
‘భారీ పరిపాలనా ప్రక్షాళనలో భాగంగా…’ అంటూ ప్రభుత్వం ఈ చర్యను ప్రచారం చేసుకుంది.
ఇక్కడ మరోసారి ఒక పాత విషయం గుర్తు చేయక తప్పడం లేదు. ఏలూరు పట్టణం పాత జిల్లా కేంద్రం, మున్సిపాలిటీ కూడా. దాన్ని 2005లో ప్రభుత్వం మున్సిపాలిటీ నుంచి ‘కార్పొరేషన్’ హోదాకు పెంచింది.
గత నెల జులై చివరి వారంలో ఒక పూట పనిమీద కుటుంబంతో ఏలూరు వెళ్లాను. వెళ్లాల్సిన ఇల్లు ఉన్న ప్రాంతంలో ఆ రోజు పగటిపూట అంతా ‘మెయింటెనెన్స్’ పేరుతో కరెంటు లేదు.
మంచినీళ్లు ఒక్క పూట మాత్రమే సరఫరా అవుతున్నాయి అన్నారు. సాయంత్రానికి ‘ఇన్వర్టర్’లు కూడా పనిచేయక ఫ్యానులు ఆగిపోవడంతో రోడ్డు మీదికి వస్తే, వీధుల్లో పందులు యథేచ్ఛగా తిరుగుతూ కనిపించాయి.
అక్కడ క్షణం ఆగి గతం గుర్తు చేసుకుంటే, ‘జన్మభూమి’, ‘క్లీన్ అండ్ గ్రీన్’ రోజుల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఏలూరులో ఒక చెత్త కుండీ వద్ద ఒక మున్సిపల్ అధికారిని సస్పెండ్ చేసిన చోటికి సమీపాన నేను ఉన్న విషయం అప్పుడు గుర్తుకు వచ్చింది.
సీ పోర్టులు కట్టడం అంత సులభం కాదు..
ఐదేళ్లు అధికారంలో ఉండే ప్రభుత్వాలు ‘గ్రీన్ ఎయిర్ పోర్టు’ అంటూ కొత్తగా ఒక ఎయిర్ పోర్ట్‌ను రాష్ట్రంలో ఎక్కడైనా కట్టొచ్చు. కానీ ఒక సీ పోర్టును అలా కట్టలేము. కారణం, దాన్ని సముద్ర తీరంలోనే కట్టడం సాధ్యం అవుతుంది.
అయితే దాని నుంచి తిరిగి ఫలితాలు వెంటనే అందవు. అందుకు ఏళ్లు పడుతుంది. కానీ అటువంటివి శాశ్వతంగా నేలమీద ఉండేవి. అవి ఒక ‘ప్రోగ్రామ్’లాగా ‘ఈవెంట్’ లాగా కొన్నాళ్లపాటు గుర్తు ఉండేవి కాదు.
ఇప్పటి ఏపీ సీఎం- “తరచూ నేను సైబరాబాద్‌ను కట్టాను..” అంటుంటారు. అది నిజం కూడా కావొచ్చు, కానీ అదిప్పుడు వేరే రాష్ట్రం తెలంగాణలో ఉంది. అటువంటిది మరొకటి ఇక్కడ కూడా కడతాను అన్నా అది కూడా సరికాదు.
శ్రీకృష్ణ కమిషన్ నివేదికలో ఏపీలో వెనుకబడిన ఏడు జిల్లాలను గుర్తించి, రాష్ట్ర విభజన కనుక జరిగితే ఏపీలో ఈ ఏడింటిని ప్రత్యేక ప్రణాళికలతో అభివృద్ధి చేయాలని అది కేంద్రానికి నివేదించింది. వాటిలో మూడు ఉత్తరాంధ్ర, నాలుగు రాయలసీమ జిల్లాలు.
మెరైన్ ఎకానమీతో ప్రాంతీయ అసమానతల తగ్గింపు..
కొత్త రాష్ట్రంలో ‘జియోగ్రాఫికల్ డెవలప్మెంట్ ప్లానింగ్’ అన్నప్పుడు, వెంటనే మనం దృష్టి పెట్టాల్సింది 1053 కిమీ ఉన్న సముద్ర తీరం మీద. కారణం మానవాభివృద్ధికి అక్కడ లభించే వనరులు అనంతం, శాశ్వతం.
మానవాభివృద్ధి అంటున్నప్పుడు, ఏ మానవాభివృద్ధి అనే ప్రశ్నకు కూడా మనం జవాబు వెతకాలి. మన జ్ఞాన సమాజంలో మెడిసిన్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాలు ఇప్పటికే భూమి, ఖనిజ సంపద వంటి ప్రకృతి వనరుల మీద యాజమాన్య హక్కులు ఉన్నవారి చేతిలో ఉన్నాయి.
వారి వద్ద నుంచి వాటిని వెనక్కి తీసుకురాలేని పరిస్థితుల్లోనే 2004 నాటికి ఏర్పడిన యూపీఏ ప్రభుత్వం ‘నరేగా’ పేరుతో ఉపాధి అంటూ మట్టి పనుల్ని కింది వర్గాలకు అప్పగించింది.
ప్రస్తుత ‘ఎన్డీఏ’ ప్రభుత్వం దాన్ని కూడా ఇంకా ఇది అవసరమా? అని సమీక్షిస్తున్నది. అటువంటప్పుడు, ఏపీ వంటి కొత్త రాష్ట్రం ఆర్థిక వృద్ధికి ‘జియోగ్రాఫికల్ డెవలప్మెంట్ ప్లానింగ్’ ఒక్కటే శాశ్వత పరిష్కారం అవుతుంది. అది ప్రకృతి పరంగా ఉన్న భౌగోళిక సానుకూలతను వినియోగించునే విజ్ఞత అవుతుంది.
‘మెరైన్ ఎకానమీ’లో మార్కెట్‌ను తలకిందులు చేసే స్థాయి ఒడుదుడుకులు ఉండవు. పైగా ఉపాధి బహుళ స్థాయి శ్రేణులకు అందుబాటులో ఉంటుంది.
కేవలం దేహదారుఢ్యం, శారీరక శ్రమపై ఆధారపడే వారి వద్ద నుంచి మెరైన్ సైంటిస్టులు, ఇంజనీర్ల వరకు లెక్కకు మించిన మానవవనరుల అవసరత సముద్ర వాణిజ్యంలో ఉంటే, మత్స్యవనరులు దానికి అదనం.
వీటి కోసం అన్ని స్థాయిల్లోనూ శిక్షణా కేంద్రాలను ఇప్పటి నుంచే ప్రభుత్వమే ఏర్పాటు చేస్తే, రెండు తెలుగు రాష్ట్రాలలోని యువతకు పెద్ద ఎత్తున ఇక్కడే ఉపాధి దొరుకుతుంది.
ఈ కొత్త కోర్సులు ‘పాలిటెక్నిక్’ స్థాయిలో ఉండాలి. ‘జియోగ్రాఫికల్ డెవలప్మెంట్ ప్లానింగ్’లో భాగంగా ‘మెరైన్ ఎకానమీ’ కోస్తాంధ్రలో గరిష్ట స్థాయిలో విస్తరించిన రోజున, దాని ప్రతిఫలాలు కాలక్రమంలో అనంతపురం సరిహద్దుల వరకు వ్యాపిస్తూ ప్రాంతీయ అసమానతలను తగ్గిస్తాయి.
పోర్టులు, హార్బర్ల కేంద్రంగా అభివృద్ధి..
ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న పోర్టులు శ్రీకాకుళం జిల్లాలో మూలపేట, నెల్లూరు-ప్రకాశం సరిహద్దుల్లో రామాయపట్నం, కృష్ణాజిల్లా మచిలీపట్టణం, తూర్పు గోదావరి కాకినాడ గేట్ వే ఇలా ఈ పోర్టులు పలు దశలలో నిర్మాణంలో ఉన్నాయి.
ఇక ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు- మొదటి దశలో పై నాలుగు ప్రధాన పోర్టులతో అనుసంధానం అవుతున్నాయి. వీటిలో మొదటి దశలో నిర్మాణం పూర్తి అవుతున్నవి నెల్లూరు జువ్వలదిన్నె, తూగో ఉప్పాడ, గుంటూరు నిజాంపట్నం, కృష్ణా మచిలీపట్టణం.
రెండవదశలో శ్రీకాకుళం బుడగట్లపాలెం, మంచినీళ్ల పేట; విశాఖ పూడిమడక, ప్రకాశం కొత్తపట్నం, వాడ్రేవు; పశ్చిమ గోదావరి బియ్యపు తిప్ప ఉన్నాయి.
ప్రకృతి పరంగా కేవలం సముద్రం ఉన్న కారణంగా నిర్మితమవుతున్న ‘గ్రోత్ ఇంజన్లు’ ఇవి. ఇందులో మనం అదనంగా చేసింది ఏమీ లేదు.
కేవలం వాటి కేంద్రంగా ఇకముందు మన ‘అర్బన్ ప్లానింగ్’ ఉంటే చాలు. ఉదాహరణకు: బుడగట్లపాలెం నుంచి ‘ఎన్ హెచ్ 16’ మీద ఉన్న మండల కేంద్రం అయిన ఎచ్చెర్లకు రావాలంటే, దూరం 25 కిమీ ఉంటుంది.
దీన్ని ‘ఆల్ వెదర్ రోడ్’ చేసి దారిలో ‘కోల్డ్ స్టోరేజి’లు, పెట్రోల్ బంకులు, హోటళ్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి దొరుకుతుంది.
‘బిజినెస్’ ఉంది అనుకునే చోట మినీ ట్రక్కులకు బ్యాంకులు అప్పులు ఇస్తాయి. అదే కనుక జరిగితే, భవిష్యత్తులో ఈ ప్రాంత యువత శ్రీకాకుళం వైపు కూడా ఉపాధి కోసం చూడరు.
స్వయం సహాయ గ్రూపుల వ్యవహారాలు చూసే ‘సెర్ప్’ వంటి సంస్థలు ఈ ఫిషింగ్ హార్బర్లు, జెట్టీలు ఉన్న కేంద్రాల్లో మహిళలకు ఎండు చేపలు ఎగుమతి మార్కెట్ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందించవచ్చు.
సముద్రం ఎంత అనంతమో దాని నుంచి వనరులు తీసుకునే తెలివిడి కనుక మనకు ఉంటే, వాటి విలువ కూడా అనంతమే.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
