సామాన్యుడి జీవితంలో రుణం అంటే కేవలం డబ్బు కాదు- నిద్రలేని రాత్రులు. వాయిదా తప్పితే భయం. నోటీసు వస్తే అవమానం. రికవరీ ఫోన్ వస్తే ఆందోళన. కానీ అదే రుణం వేల కోట్లకు చేరినప్పుడు దాని భాష ఎందుకు మారుతున్నట్లు కనిపిస్తోంది?
సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా కేసులో రూ 22,006.57 కోట్ల క్లెయిమ్‌లకు కేవలం రూ 6.5 కోట్ల రీపేమెంట్ ప్లాన్‌కు ఎన్సీఎల్టీ ఆమోదం ఇవ్వడం దేశవ్యాప్తంగా ఈ చర్చకు తెరలేపింది.
ఇది ‘రుణం మాఫీ అయిపోయింది’ అనే సాదాసీదా కథ కాదు. ఐబీసీ చట్టం, వ్యక్తిగత గ్యారంటీ, క్రెడిటర్ల మెజారిటీ నిర్ణయం, ఆస్తుల వాస్తవ విలువ, బ్యాంకుల రికవరీ—అన్నీ ఇందులో ముడిపడి ఉన్నాయి.
అయినా ఒక ప్రశ్న మాత్రం తప్పించుకోలేం- చట్టం పుస్తకంలో ఒకటే ఉన్నా… దాని ఫలితం సామాన్యుడికీ, శక్తిమంతుడికీ ఒకేలా ఉంటుందా?
చట్టం ముందు అందరూ సమానులేనా?
భారత ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం అందించిన అతిపెద్ద హామీ- ‘చట్టం ముందు అందరూ సమానులే.’ కానీ, కార్పొరేట్ రుణాల రికవరీ విషయంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ సూత్రం బలిపీఠమెక్కినట్లే కనిపిస్తోంది.
వేల కోట్ల రూపాయలు బ్యాంకుల వద్ద అప్పులు చేసి, ఎగ్గొట్టిన బడా పారిశ్రామికవేత్తలకు లభించే వెసులుబాటు- కొద్దిపాటి అప్పు చేసి దాన్ని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే సామాన్యుడికి, రైతుకు ఎందుకు లభించడం లేదు?
భారతదేశంలో చట్టం, న్యాయం ఒక్కొక్కరికీ ఒక్కోలా పనిచేస్తున్నాయా? అనే భయంకరమైన సత్యాన్ని ఈనాటి ఆర్థిక పరిణామాలు మన ముందు ఉంచుతున్నాయి.
జీ మీడియా అధినేత సుభాష్ చంద్ర దివాలా వ్యవహారంలో నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ) ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా పెను సంచలనాన్ని రేపింది.
‘దేశంలో చట్టాలు ఒక్కొక్కరికీ ఒక్కోలా పనిచేస్తున్నాయా?’ అని నిపుణులు ప్రశ్నిస్తుంటే, కార్పొరేట్ వర్గాల్లో ఈ నిర్ణయం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది.
రూ 22 వేల కోట్ల అప్పుకు 6.5 కోట్ల సెటిల్మెంట్..
సుభాష్ చంద్రకు సంబంధించిన సుమారు రూ 22,006.57 కోట్ల రుణ బకాయిల క్లెయిమ్‌లను కేవలం రూ 6.50 కోట్లకు సెటిల్ చేసుకోవడానికి ట్రిబ్యునల్ ఆమోదం తెలపడం మన బ్యాంకింగ్ వ్యవస్థ విశ్వసనీయతపైనే అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.
ట్రిబ్యునల్ తీర్పు ప్రకారం, బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అంగీకరించాల్సిన హెయిర్‌కట్(రుణ మినహాయింపు) ఏకంగా 99.97 శాతం. అంటే ప్రతి వంద రూపాయల అప్పులో బ్యాంకులు రాబట్టుకునేది కేవలం మూడు పైసలు మాత్రమే.
ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్(ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్) వంటి సంస్థలు రూ 1,322 కోట్ల బకాయికి గాను కేవలం రూ 38 లక్షల ఆఫర్‌ను తీవ్రంగా వ్యతిరేకించినా, మెజార్టీ క్రెడిటర్ల ఆమోదం పేరుతో ట్రిబ్యునల్ దీన్ని ఖరారు చేసింది.
ఇది ఒక్క సుభాష్ చంద్ర కేసుతోనే ఆగిపోయిన వ్యవహారం కాదు. గత 13 ఏళ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో దాదాపు రూ 15 లక్షల కోట్లకు పైగా బడా పారిశ్రామికవేత్తల బకాయిలను ‘రైట్ ఆఫ్’ (వసూలు కావు అని పక్కనబెట్టడం) పేరుతో మినహాయింపులు ఇచ్చారనే గణాంకాలు తీవ్ర నిరసనలకు కారణమవుతున్నాయి.
అభివృద్ధి పేరుతో కార్పొరేట్ దిగ్గజాలకు వందల వేల కోట్ల రుణాలు ఇవ్వడం, అవి తీర్చలేమని చేతులెత్తేయగానే ‘హెయిర్ కట్’ల పేరుతో మాఫీ చేసేయడం ఒక అధికారిక ప్రక్రియగా మారిపోయింది.
తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి..
ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి ఘటనే తీవ్ర అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. సినీ నిర్మాత, రాజకీయ నాయకుడు టీ సుబ్బరామిరెడ్డికి(గాయత్రి ప్రాజెక్ట్స్) చెందిన వేల కోట్ల రుణాల విషయంలోనూ దాదాపు రూ 5,700 కోట్లకు పైగా బకాయిలు బ్యాంకులు మాఫీ చేశాయనే వార్తలు ఉభయ రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టించాయి.
రూ 8,100 కోట్లకు పైగా అప్పులుంటే వన్-టైమ్ సెటిల్మెంట్ (ఓటీఎస్) పేరుతో కేవలం రూ 2,400 కోట్లకు సెటిల్ చేయడం, మిగిలిన రూ 5,700 కోట్లను నీటిపాలు చేయడం చూస్తుంటే- రాజకీయ అండదండలు, వ్యవస్థలోని లొసుగులు ఉన్నవారికి చట్టం ఎలా ఎర్రతివాచీ పరుస్తుందో స్పష్టమవుతోంది.
ఇక సామాన్యుడి పరిస్థితి ఏమిటి? కొద్దిపాటి పంట రుణం తీర్చలేక పురుగుల మందు డబ్బా ఆశ్రయించే రైతు కథలు మన దేశంలో రోజూ చూస్తున్నాం.
బైకుకో మరోదానికో ఈఎంఐలు లేట్ అయితే రౌడీ మూకలతో ఇంటికి వచ్చి వాహనాన్ని గుంజుకెళ్లే రికవరీ ఏజెంట్ల భయంతో బతికే మధ్యతరగతి జీవితాలు మనకళ్ల ముందే ఉన్నాయి.
సామాన్యుడి విషయంలో ఏనాడైనా బ్యాంకులు 99 శాతం హెయిర్‌కట్ ఇచ్చాయా?
చట్టంలోని లొసుగులు..
సుభాష్ చంద్ర తన వ్యక్తిగత ఆస్తులు రూ 31.79 కోట్లు మాత్రమే ఉన్నాయని, కాబట్టి రూ 6.5 కోట్లు చెల్లించడమే గరిష్టమని దాఖలు చేశారు.
2017, 2018లలో దాదాపు రూ 45,000 కోట్ల నికర విలువ(నెట్ వర్త్) చూపించిన వ్యక్తి ఆస్తులు ఐదేళ్లలో రూ 31 కోట్లకు ఎలా పడిపోయాయనే దానిపై ఫోరెన్సిక్ ఆడిట్ కూడా అవసరం లేదనడం చట్టంలోని లొసుగులకు నిదర్శనం.
ఒక కంపెనీ రుణాలు ఎగ్గొడితే ఆ కంపెనీ అధినేత ఇచ్చిన ‘పర్సనల్ గ్యారెంటీ’(వ్యక్తిగత హామీ) ఆధారంగానే బ్యాంకులు వేల కోట్లు అప్పులిస్తాయి. కానీ చివరికి ఆ హామీల విలువ శూన్యంగా మారుతోంటే, ఇక గ్యారెంటీల వ్యవస్థపై నమ్మకం ఎలా ఉంటుంది?
ఇది ఉద్దేశపూర్వకంగా బ్యాంకు సొమ్మును దారి మళ్లించే వారికి చట్టపరమైన రక్షణ కల్పించడమే అవుతుంది.
ప్రభుత్వ వర్గాలు, కంపెనీ వర్గాల వివరణ ప్రకారం- ఈ రూ 22,000 కోట్లు కేవలం వ్యక్తిగత గ్యారెంటీ పరిధికి సంబంధించినవని, అసలు అప్పు తీసుకున్న సంస్థలు(బారోవర్ ఎంటిటీస్) విడిగా చెల్లింపులు చేస్తాయని చెబుతున్నాయి.
అంతేకాకుండా, దివాలా తీసి రూపాయి కూడా రాకుండా పోవడం కంటే లభించిన రూ 6.5 కోట్లే మేలని ట్రిబ్యునల్ భావించింది.
ప్రాక్టికల్‌గా చూస్తే బడా సంస్థల అసలు రుణాల రికవరీ కూడా ఏళ్ల తరబడి కోర్టుల్లో నలుగుతూనే ఉంటుంది. చివరికి బ్యాంకులు తమ బాలన్స్ షీట్లలో వాటిని ‘రైట్ ఆఫ్'(రద్దు) చేసి, ప్రజల డిపాజిట్ సొమ్ముతో ఆ నష్టాలను పూడ్చుకుంటాయి. అంటే పెద్దలు చేసే అప్పుల భారాన్ని పరోక్షంగా మోసేది మళ్లీ సామాన్య పన్ను చెల్లింపుదారుడే.
బడాబాబులకు ఎర్ర తివాచీ..
నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో రగిలిపోతున్నారు. ‘మామూలు వ్యాపారి ఫెయిల్ అయితే రోడ్డున పడేసే వ్యవస్థ, కోట్ల అప్పులు చేసిన బడా బాబులకు మాత్రం ఎర్ర తివాచీ పరుస్తోంది’ అని మండిపడుతున్నారు.
రాజకీయ అండదండలు, మీడియా పవర్ లేకపోతే మిగిలిన వారిపై కొరడా ఝుళిపించి, బడా రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలను చట్టం కంటికి కనిపించకుండా వదిలేస్తుందా అనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
దివాలా, బ్యాంక్రప్సీ కోడ్(ఐబీసీ) ఉద్దేశం రుణాల రికవరీని వేగవంతం చేయడం, పారదర్శకతను పెంచడం. కానీ ప్రస్తుత తీర్పులు చూస్తుంటే, బడా బాబులు తమ వేల కోట్ల రుణాలను చట్టబద్ధంగా తుడిచిపెట్టేసుకోవడానికి (చట్టపరమైన మినహాయింపు వ్యూహం) ఐబీసీ ఒక సాధనంగా మారుతోందా అనే అనుమానం కలుగుతోంది.
బ్యాంకుల్లో డిపాజిట్ చేసే ప్రతీ రూపాయి సామాన్యుడి రక్తం, చెమట. కానీ, ఆ సొమ్మును కార్పొరేట్ దిగ్గజాలు రుణాలుగా తీసుకెళ్లి 99 శాతం ఎగ్గొడితే, ఆ నష్టాన్ని భరించేది ప్రజా ధనమే.
ఆర్థిక వ్యవస్థపై పౌరుల్లో నమ్మకం సన్నగిల్లితే అది దేశ భవిష్యత్తుకే తీవ్ర ప్రమాదకరం.
ఉచితాలపై ఏడ్చే మేధావులు బడా రుణాలపై సైలెంట్..
సామాన్యుడికి, పేదవాడికి అందించే అరకొర ఉచిత పథకాలపై, సంక్షేమ ఫలాలపై నిత్యం టీవీ స్టూడియోల్లో, పత్రికల్లో దేశ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోతోందంటూ ఊగిపోయే మేధావులు- బడా పారిశ్రామికవేత్తల లక్షల కోట్ల రుణాల మాఫీపై నోళ్లు ఎందుకు మెదపడం లేదు?
లక్షల కోట్లు కార్పొరేట్ దొరల జేబుల్లోకి ప్రజాధనం రూపంలో కొల్లగొట్టబడుతుంటే కనీసం ప్రశ్నించని ఈ ‘వ్యవస్థాపక మేధస్సు’, పేదవాడికిచ్చే సాయాన్ని మాత్రం ఉచితాలంటూ చులకన చేసి మాట్లాడటం విడ్డూరం.
ఇది ఏనుగులు హాయిగా దూరిపోయే దారులను, చట్టాల్లోని కన్నాలను విశాలంగా తెరిచి ఉంచి- కేవలం చీమలు దూరే చిన్న కన్నాలను పట్టుకుని రాద్ధాంతం చేస్తున్న చందంగా ఉంది.
బడా వ్యాపారుల రుణాలను నీరుగార్చే సాంకేతిక ‘లొసుగుల’ను ఆర్థిక సంస్కరణలుగా వర్ణిస్తూ, ఆకలి తీర్చే పథకాలను దేశ ఆర్థిక పునాదులకే ప్రమాదకరమని ముద్రవేయడం ఈ సమాజంలోని ఆధిపత్య నిష్పాక్షిక రహిత ధోరణికి నిలువుటద్దం.
చట్టంలో ఉన్న లొసుగులను ఆసరాగా చేసుకుని వేల కోట్ల రుణాలను నీరుగార్చే పద్ధతికి తక్షణమే స్వస్తి పలకాలి. ఫోరెన్సిక్ ఆడిట్లను తప్పనిసరి చేయాలి. ఆస్తుల మళ్లింపుపై కఠినమైన దర్యాప్తు జరగాలి.
పెద్దల విషయంలో కఠినంగా, పేదల విషయంలో మానవత్వంతో వ్యవహరించినప్పుడే ఈ దేశంలో చట్టం, న్యాయం బతికి ఉన్నాయని ప్రజలు నమ్ముతారు.
ఈ దోపిడీ వ్యవస్థ మారనంత వరకు, చట్టాలు కేవలం పేదలకే చుట్టాలుగా మిగిలిపోతాయి. సమాజం ఈ అసమానతను, ఆర్థిక అన్యాయాన్ని ప్రశ్నించకపోతే- సామాన్యుడు ఎప్పటికీ ఈ వ్యవస్థలో బలిపశువుగానే మిగిలిపోతాడు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
