అహ్మదాబాద్‌లో శాంతియుతంగా జరుగుతున్న ఒక బహిరంగ పుస్తక పఠన కార్యక్రమంపై మితవాద మూక దాడికి పాల్పడింది. వారు చదువుతున్న పుస్తకాలపై ఆ గుంపు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పుస్తకాలలో భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ, బీఆర్ అంబేడ్కర్లకు సంబంధించిన రచనలు కూడా ఉన్నాయి.
న్యూఢిల్లీ: మితవాద శక్తులకు వ్యతిరేకంగా చేపట్టిన ఒక సాధారణ శాంతియుత నిరసన— గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక పబ్లిక్ పార్క్‌లో పుస్తకాలు చదవడం— గందరగోళానికి, దాడులకు, పోలీసు కేసుకు దారితీసింది. పుస్తకాలు చదువుతున్న వారిపై ఒక అల్లరి మూక విరుచుకుపడింది.
ఆగస్టు 27న, ‘స్టూడెంట్ అండ్ యూత్ కలెక్టివ్ అహ్మదాబాద్(ఎస్వైసీఏ)’, ‘గుజరాత్ రీడ్స్ ఎనీవే(జీఆర్‌ఏ)’ ఆధ్వర్యంలో అహ్మదాబాద్ వాసుల బృందం నగరంలోని ప్రముఖ నివాస ప్రాంతమైన వస్త్రాపూర్లోని ఒక పబ్లిక్ పార్క్‌లో సమావేశమైంది.
ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుగాంచిన పుస్తకాలు, జ్ఞాపకాలను చదవాలన్నదే వారి లక్ష్యం. వాటిలో అన్నే ఫ్రాంక్ రాసిన ‘ది డైరీ ఆఫ్ ఏ యంగ్ గర్ల్’, మలాలా యూసుఫ్‌జాయ్ రాసిన ‘ఐ యామ్ మలాలా’ వంటి పుస్తకాలు ఉన్నాయి.
పుస్తక పఠన కార్యక్రమానికి నేపథ్యం..
ఎస్వైసీఏ, జీఆర్‌ఏ సంస్థలు ఉద్దేశపూర్వకంగానే ఈ రెండు పుస్తకాలను ఎంచుకున్నాయి. అన్నే ఫ్రాంక్ ఒక యూదు బాలిక, హిట్లర్ సాగించిన హోలోకాస్ట్(మారణహోమం)లో కేవలం పదిహేనేళ్ల వయసులో జర్మనీలో ప్రాణాలు కోల్పోయింది.
ఇక మలాలా యూసుఫ్‌జాయ్ పాకిస్థాన్‌కు చెందిన నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, తాలిబన్ల హత్యాయత్నం నుంచి ప్రాణాలతో బయటపడిన ఉద్యమకారిణి. ఇటీవల జరిగిన కొన్ని పరిణామాల నేపథ్యంలో ఈ పుస్తకాలను చదవాలని వారు నిర్ణయించుకున్నారు.
మొదటగా, ఆగస్టు 11న నగరంలోని ఆనంద్ నికేతన్ స్కూల్లో చదువుతున్న ఒక చిన్నారికి పెట్టిన ఆహారంలో గాజు ముక్క రావడంపై కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ తర్వాత, యూసుఫ్‌జాయ్, ఫ్రాంక్ రాసిన పుస్తకాలను చదవాలని తమ పిల్లలను బలవంతం చేయడం ద్వారా పాఠశాల మతపరమైన “వివక్ష”కు పాల్పడుతోందని కొందరు తల్లిదండ్రుల బృందం ఆరోపించింది.
దీనికి స్పందించిన పాఠశాల యాజమాన్యం.. తమ పాఠశాల పూర్వ విద్యార్థి అయిన ఒక కన్సల్టెంట్‌ను విధుల నుంచి తొలగించింది.
ముస్లిం మతానికి చెందిన ఆ వ్యక్తి, తన సొంత పాఠశాలతో ‘కరిక్యులమ్ డిజైనర్ అండ్ టీచర్ ట్రైనర్’గా పనిచేస్తున్నాడు.
ఈ పరిణామాలే ఎస్వైసీఏ, జీఆర్‌ఏ సంస్థలను, మరికొందరు స్థానికులను ఈ ప్రపంచ ప్రఖ్యాత పుస్తకాలను బహిరంగంగా కలిసి చదివేలా పురిగొల్పాయి.
సెన్సార్షిప్, వెలివేత, వివక్షలకు వ్యతిరేకంగా తమ నిరసనను తెలియజేయడానికే వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.

అల్లరి మూకల బీభత్సం..
వస్త్రాపూర్లోని ఔడా గార్డెన్‌కు వారు తీసుకువచ్చిన పుస్తకాలలో విప్లవ స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్, తొలి న్యాయ శాఖ మంత్రి బీఆర్ అంబేడ్కర్, తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూల రచనలు కూడా ఉన్నాయి. కానీ, 45 నుంచి 50 మందితో కూడిన ఒక గుంపు పార్కులోకి ప్రవేశించి, కర్రలు, బ్యాట్లతో వారిపై దాడి చేసింది.
విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్‌కు చెందిన వారుగా భావిస్తున్న ఈ హింసాత్మక మూక సభ్యులు పుస్తకాలు చదువుతున్న మహిళలపై దాడి చేసి, వారి మౌన పఠన కార్యక్రమాన్ని భగ్నం చేశారు.
ఈ హింసాత్మక వర్గాల ప్రధాన అభ్యంతరం ఏమిటంటే, మలాలా యూసుఫ్‌జాయ్ రాసిన జ్ఞాపకాల పుస్తకం.
మతపరమైన నినాదాలు, బెదిరింపులు..
రెచ్చగొట్టే మతపరమైన నినాదాలు చేస్తూ, పెద్దపెట్టున “జై శ్రీరామ్” అంటూ కేకలు వేస్తూ ఆ గుంపు అక్కడికి చేరుకుందని, అలాగే పుస్తకాలు చదువుతున్న వారిని “కశ్మీర్ వ్యతిరేకులు”(జమ్మూ కశ్మీర్ విషయంలో ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తున్న వారు) అంటూ దూషించారని పఠన కార్యక్రమంలో పాల్గొన్న వారు తెలిపారు.
ఆ హింసాత్మక మూక బేస్‌బాల్ బ్యాట్లు, భారీ చెక్క కర్రలు, ఇనుప రాడ్లకు చుట్టిన కాషాయ జెండాలతో ఆయుధాలు ధరించి వచ్చింది.
పఠన కార్యక్రమంలో పాల్గొని ఆ మూకను ఎదుర్కొన్న వారు, ఇదొక విద్వేషపూరిత నేరమని(హేట్ క్రైమ్), తమ భౌతిక భద్రతకు ఇది తీవ్రమైన ముప్పు అని ఆందోళన వ్యక్తం చేశారు.
“ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన విద్వేషపూరిత నేరం, అలాగే అల్లరి మూకల హత్యాయత్నం(మాబ్ లించింగ్)” అని పఠన కార్యక్రమంలో పాల్గొన్న సభ్యుల్లో ఒకరైన జే థక్కర్ అన్నారు.
ఆ హింసాత్మక గుంపు ముగ్గురు వ్యక్తులను లాక్కెళ్లి, వారిపై పదే పదే దాడి చేసిందని ఆయన చెప్పారు. ఆ వ్యక్తులను తీవ్రంగా గాయపరచాలన్నదే ఆ మూక ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
హింసాత్మక వర్గాల సభ్యులు పాల్గొనేవారిని “ఉగ్రవాదులు” అని పిలిచారని థక్కర్ ఆరోపించారు. ఒకానొక దశలో, అల్లరి మూకలోని కొందరు సభ్యులు మతపరమైన వ్యాఖ్యలు చేస్తూ అరిచారని తెలిపారు.
జాతీయ గీతం పాడినా మారని తీరు..
అల్లరి మూక వచ్చిన వెంటనే, తాము తీసుకువచ్చిన పుస్తకాలలో భగత్ సింగ్, అంబేడ్కర్, నెహ్రూ వంటి ప్రముఖుల రచనలు కూడా ఉన్నాయని వివరించడానికి తాము ప్రయత్నించామని పఠనకారులు చెప్పారు.
ఆ గుంపుతో కలిసి జాతీయ గీతం పాడాలని తాను సూచించానని, వాస్తవానికి అందరూ కలిసి జాతీయ గీతాన్ని పాడారని థక్కర్ చెప్పారు. కానీ ఇవేవీ ఆ మూకను శాంతపరచలేకపోయాయి.
ఈ సమావేశంలో పాల్గొన్న వారు తర్వాత ఫిర్యాదు దాఖలు చేశారు. జాతీయ గీతం ముగిసిన వెంటనే, హింసాత్మక వర్గాల సభ్యులు తమపై దాడి చేయడం ప్రారంభించారని ఆ ఫిర్యాదులో ఆరోపించారు.
అక్కడున్నట్లుగా ఆరోపిస్తున్న వారిలో హిరేన్ రబారీ, జిమిత్ రబారీ పేర్లను ఆ ఫిర్యాదులో ప్రస్తావించారు. ఆ వర్గాలు ఒక ప్రణాళికాబద్ధమైన దాడికి పాల్పడ్డాయని ఆరోపించారు. తాము కేవలం పార్కులో పుస్తకాలు చదువుకోవడానికే సమావేశమయ్యామని ఆ ఫిర్యాదు స్పష్టం చేస్తోంది.
పోలీసుల ముందే దాడి..
సమీపంలో ఆపి ఉంచిన పోలీసు వ్యాన్ వద్దకు చేరుకునేలోపే- మూక సభ్యులు పఠనకారులను గార్డెన్‌లోని వివిధ ప్రాంతాలకు లాక్కెళ్లి కొట్టారని, చెంపదెబ్బలు కొట్టారని, రక్కారని, బలంగా గుద్దారని ఎస్వైసీఏ తెలిపింది.
పోలీసుల ముందే వాళ్లు పఠనకారులను కొడుతూనే ఉన్నారని పేర్కొంది. దాడికి గురైన పుస్తక పఠనకారులను వ్యాన్ లోపల కూర్చోవాలని పోలీసులు చెప్పారని, “ఈ వ్యక్తులు మాకు తెలియదు, వాళ్లు మిమ్మల్ని చంపేయగలరు కూడా” అని పోలీసులు వ్యాఖ్యానించారని ఎస్వైసీఏ ఆరోపించింది.
బీఎన్ఎస్ చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు..
హింసాత్మక వర్గాల దాడికి వ్యతిరేకంగా పఠనకారులు వస్త్రాపూర్ పోలీస్ స్టేషన్లో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ ‘ది వైర్’కు లభించింది.
పఠనకారులు వీడియోలు, వైద్య రికార్డులు, ఆ వర్గాలు వదిలేసి వెళ్లినట్లు ఆరోపిస్తున్న కర్రలను సాక్ష్యాలుగా సమర్పించారు. గార్డెన్, పరిసర ప్రాంతాలలోని సీసీటీవీ ఫుటేజీలను భద్రపరచాలని వారు పోలీసులను కోరారు.
ఆగస్టు 28న కేసు నమోదైంది. ఆగస్టు 27 సాయంత్రం 6 గంటల నుంచి ఆగస్టు 28 రాత్రి 12:30 గంటల మధ్య ఈ ఘటన జరిగినట్లు ఎఫ్ఐఆర్లో రికార్డు చేశారు.
చట్టవిరుద్ధంగా గుంపుగా ఏర్పడటం, మూక హింసాత్మక చర్యలకు ఉమ్మడి బాధ్యత వహించడం, ఉద్దేశపూర్వకంగా తీవ్రమైన గాయాలు చేయడం, అల్లర్లు, బెదిరింపులు, ఇతర నేరాలకు సంబంధించి భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్)లోని సెక్షన్లు 189(1), 119(2), 191(3), 190, 115(2), 351(2) కింద కేసులు నమోదు చేశారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
