ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ ఉద్యమం మహత్తరమైంది. ఈ విద్యుత్ ఉద్యమంలో భాగంగా 2000 ఆగస్టు 28న ఛలో అసెంబ్లీ పిలుపునిచ్చారు. దీనిని అనుసరించి అసెంబ్లీ వైపు దూసుకెళ్తున్న ఉద్యమకారులపై పోలీసులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
బషీర్‌బాగ్ చౌరస్తాలో జరిగిన ఈ కాల్పుల్లో అమరులైన ముగ్గురు ఉద్యమకారులకు వామపక్ష పార్టీల నాయకులు, పలు ప్రజా సంఘాల ప్రతినిధులు, అనేక మంది కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు.
స్మారక స్థూపం వద్ద నివాళులు..
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ చౌరస్తాలో ఉన్న విద్యుత్ ఉద్యమం అమరవీరుల స్మారక స్థూపం వద్ద కాల్పుల్లో అమరులైన ఎస్ రామకృష్ణ, ఐ బాలస్వామి, జి విష్ణువర్ధన్ రెడ్డిలకు వామపక్ష పార్టీల రాష్ట్ర నగర నాయకులు నివాళులర్పించారు.
ట్యాంక్‌బండ్ నుంచి ర్యాలీ..
ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి స్మారక స్థూపం వరకు ర్యాలీగా వచ్చి అమరవీరులకు జోహార్లు అర్పించిన వారిలో వామపక్ష పార్టీల రాష్ట్ర నగర నాయకులు జాన్ వెస్లీ, వెంకటేశ్(సీపీఐ(ఎం)), ఈటీ నరసింహ, స్టాలిన్ (సీపీఐ), ఝాన్సీ(సీపీఐ-ఎంఎల్-న్యూడెమోక్రసీ), చంద్రశేఖర్ (ఎంసీపీఐ), తేజ (ఎస్‌యూసీఐ), హన్మేష్ (సీపీఐ-ఎంఎల్-మాస్ లైన్), షేక్ షావలి (సీపీఐ-ఎంఎల్-చంద్ర పుల్లారెడ్డి)తో పాటు ప్రజా సంఘాల నాయకులు, కాంగ్రెస్ సేవాదళ్ కార్యకర్తలు ఉన్నారు.
నాటి ఉద్యమ నేపథ్యం..
ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో నాటి ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని తెలుగు దేశం ప్రభుత్వం ప్రపంచ బ్యాంక్ షరతులకు తలొగ్గి విద్యుత్ సంస్కరణలను తీసుకొచ్చింది.
ఇందులో భాగంగా పెంచిన విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల నాయకత్వాన రైతులు, ఉద్యోగులు, కార్మికులు, యువజన, విద్యార్థులు, మహిళలు కొన్ని నెలల పాటు రాష్ట్రవ్యాప్తంగా జరిపిన ఉద్యమానికి చివరికి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా మద్దతు తెలుపుతూ హైదర్‌గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కాంగ్రెస్ శాసన సభ్యులు ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు.
ఉద్యమంలో భాగంగా ఛలో అసెంబ్లీకి పిలుపునివ్వగా బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద పోలీసులు కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే.
విద్యుత్ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలి..
ఇదిలా ఉండగా కేంద్రంలోని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చి ఈ రంగాన్ని మొత్తం ప్రైవేటీకరణ చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను ఐక్య ఉద్యమాలతో ప్రతిఘటించాలని ఈ సందర్భంగా మాట్లాడుతూ సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ పిలుపునిచ్చారు.
ఆనాడు జరిగిన విద్యుత్ ఉద్యమం ఛలో అసెంబ్లీ పిలుపు సందర్భంగా జరిగిన ఘటనలు మరో జలియన్‌వాలాబాగ్‌ను తలపించిందని ఆయన అన్నారు. ఆ ఉద్యమ స్ఫూర్తితో విద్యుత్ రంగంలో తాజా సంస్కరణలను వ్యతిరేకించాలని కోరారు.
సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ మాట్లాడుతూ 26 సంవత్సరాల క్రితం ఈ రోజు ఈ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొని ఉండిందని గుర్తు చేశారు.
విద్యుత్ ఉద్యమం ప్రభావంతో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు 10-15 సంవత్సరాల వరకు విద్యుత్ చార్జీలను పెంచడానికి సాహసించలేదని చెప్పారు.
ఇప్పుడు విద్యుత్ రంగంలో సంస్కరణలు తెచ్చి ప్రైవేటుపరం చేయడానికి రాష్ట్రాలపై బలవంతం చేస్తున్న మోదీ ప్రభుత్వ ప్రయత్నాలను ఐక్య ఉద్యమాలతో మరోసారి తిప్పికొట్టాలని కోరారు.
సీపీఐ-ఎంఎల్-న్యూడెమోక్రసీ నాయకురాలు ఝాన్సీ, ఎంసీపీఐ నాయకులు చంద్రశేఖర్, ఎస్‌యూసీఐ నాయకులు తేజ, సీపీఐ-ఎంఎల్-మాస్ లైన్ నాయకులు హన్మేశ్, సీపీఐ-ఎంఎల్-చంద్ర పుల్లారెడ్డి నాయకులు షావలీ కూడా మాట్లాడిన వారిలో ఉన్నారు.
నేపాల్ బాధితులకు సంతాపం..
అనంతరం నేపాల్ జల ప్రళయంలో చనిపోయిన బాధితులకు నివాళులర్పిస్తూ, సంఘీభావం తెలియజేస్తూ నాయకులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
