ఇవాళ..
మరిన్ని రంపపు కోతలు అక్కర్లేదు;
ఇంకొన్ని పదునైన కత్తులు అవసరం లేదు;
పొగలు కక్కే యాసిడ్ సీసాల అగత్యం అసలే లేదు;
ఘోర, భీకర దాడుల శబ్దాలు వినిపించే పనే లేదు;
వికృత చేష్టలు కనిపించే జాడే లేదు.
వాటి రూపాలన్నీ మారిపోయాయ్!
వాటి తీవ్రతలూ పలు రెట్లు పెరిగిపోయాయ్!!
ఇప్పుడు అవన్నీ..
మాధ్యమ సమాజం మీదుగా
సామాజిక మాధ్యమ క్షేత్రాన..
కామెంట్ల రూపంలో.,
పోస్టుల రూపంలో.,
ఎమోజీల రూపంలో.,
రూమర్ల రూపంలో.,
తుడిపేసుకోలేని, చెరిపేసుకోలేని
మురికి మరకల రూపంలో
మన చుట్టూతా వలయాకారంగా
తిరుగుతున్నాయ్.
పర్యవసానం?
శారీరకంగానే కాదు,
మానసికంగా, సామాజికంగా,
రాజకీయంగా, ఆర్థికంగా
తిరిగి పైకెక్కలేని పాతాళ లోకాలకు
తొక్కివేసే నార్మలైజ్డ్ దాడులుగా నిలిచి పోయాయ్.
మిగిలింది ఏమున్నది..?
దీన్ని మించిన ఇంకో క్రియేటివ్ దాడి వార్తల్లోకి వచ్చేలోగా..
స్పాన్సర్డ్ రీల్స్ మన కండ్ల లోలోపలికి
వచ్చి చేరవా?
మన టియరింగ్ గ్లాండ్లను, రియాక్టివ్ హార్మోన్లను జోలపాడి సుషుప్తిలోకి జార్చేందుకు..
ఇక హాయిగా పడుకుందాం
తరతరాల పాటు, యుగయుగాల పాటు
ఈ వేదన మిగతా భద్ర సమూహానికి వినోదంగా పరిణమించే దాకా..
అది పూర్తి కాకుండానే..
ఉరకలెత్తించే ఉల్లాసపు రీల్ కోసం
ఫుల్లీ ఛార్జ్డ్ స్క్రీన్ మీద
బొటనవేలుని పైకి, మరింత పైపైకి జరుపుతూ పోదాం
డోపమైన్, ఎడ్రినలిన్ పెంచుకుందాం..
ప్రపంచమెక్కడ పోతే మనకేంటి బ్రో
ఇవాళ నా దేశంలో..
నా రాష్ట్రంలో..
నా జిల్లాలో..
నా ఊరిలో..
నా వీధిలోనే..
ఇదే బిలియన్ వ్యూస్
సాధించిన విధ్వంసకర దాడుల ట్రెండింగ్ స్టోరీ..
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
