ఈ శతాబ్దం గడియారాల కాలం కాదు
గాయాల కాలం
గాయాలు శరీరాల మీద పడవు
మ్యాప్‌ల మీద పడతాయి
వీధుల మీద పడతాయి
భవిష్యత్తు నుదుటిపై పడతాయి
*
వ్యాసుడు మహాభారతాన్ని ముగించాడు
చక్రవ్యూహం పరీక్షలు రాసిన రోజున చనిపోలేదు
అది ప్రతి అధికారపు గుండెలో
రహస్యంగా పెరిగింది.
గోడల ఎత్తు పెరిగినప్పుడల్లా చక్రవ్యూహం
కొత్త వలయం గీసుకుంది
*
ఇప్పుడు ఒక్క అభిమన్యుడు కాదు
ప్రతి తరగతి గదిలో ఒక అభిమన్యుడు
ప్రతి గ్రంథాలయంలో ఒక అభిమన్యుడు
ప్రతి హాస్టల్ గదిలో నిద్రపోని వేలాది అభిమన్యులు
వారి చేతుల్లో ధనుస్సులు లేవు
సిలబస్
కవిత్వం
రాజ్యాంగం
తల్లిదండ్రుల కలలు
స్నేహితుల నవ్వులు
చిన్ననాటి బొమ్మలు
భూమి వాసన
ఇవన్నీ మోసే భుజాలపై
లోహం గురిపెట్టిన కాలం
*
ఏకలవ్యుడు ఈసారి
అడవిలో నిలబడలేదు
విశ్వవిద్యాలయ ప్రాంగణంలో నిలబడ్డాడు
విద్యాలయాల ప్రాంగణంలో
జంతర్ మంతర్ మధ్యన నిలబడ్డాడు
ద్రోణుడు ముఖం మార్చుకున్నాడు
ఆజ్ఞ మాత్రం పాతదే
ఆలోచించే చేయి ఆగాలి
ప్రశ్నించే కన్ను మూయాలి
చదివే మనసు భయపడాలి
చరిత్ర ప్రతి యుగంలో ఒకే పాఠాన్ని
కొత్త దుస్తుల్లో బోధిస్తోంది
*
నచికేతుడు యముడిని వెతకాలేదు
అధికారాన్ని వెతికాడు
“భయం ఎక్కడి నుంచి పుడుతుంది?”
ఒక ప్రశ్న వేల తుపాకుల కంటే
భారీ శబ్దం
ఆకాశం చెవులు మూసుకుంది.
భూమి వినడం ఆపలేదు
*
పిల్లల కలలపై పొగ పరచిన చేతులు
చరిత్ర ముందు నగ్నంగా నిలుస్తాయి.
కాలం బట్టలు తొడగదు.
నిజాలు తొడుగుతుంది.
ద్రౌపదికి ఈసారి వస్తాపహరణంతో పాటు
స్వప్నాపహరణం జరిగింది
*
సరస్వతి తెల్లని పద్మాన్ని విడిచింది
రక్తపు చారలు పడిన ఒక నోట్‌బుక్‌ను
ప్రశ్నలా నిల్చున్న రుధిరాన్నీ
గుండెలకు హత్తుకుంది
అక్షరాలకు ఏడవడం రాదు
నిశ్శబ్దంమే కన్నీటి భాష
*
శంబూకుడు ఇంకా చనిపోలేదు
ప్రతి ప్రశ్నలోమళ్లీ పుడుతున్నాడు
తల నరికిన ఖడ్గం తుప్పు పట్టింది
ప్రశ్న ఇంకా ఇంకా పదునెక్కుతోంది
*
బుద్ధుడు బోధివృక్షం కింద కళ్లుమూయలేదు
ఈసారి పొగతో నిండిన వీధిలో
కళ్లుతెరిచాడు
ద్వేషం మొదట కాల్చేది తన యజమానినే
కరుణ మొదట రక్షించేది ఎదుటివాడినే
ఆ వాక్యం గాలిలో తేలింది
పొగ దాన్ని దాచలేకపోయింది
*
విత్తనాన్ని భూమిలో పాతిపెడితే
అడవి
విద్యార్థిని భయంలో పాతిపెడితే
శ్మశానం
ఈ రెండు సత్యాల మధ్య
ఒక దేశం
తన భవిష్యత్తును ఎన్నుకుంటుంది
*
పిల్లల కళ్లలో దేశం మొలుస్తుంది
ఆ కళ్లను గాయపరిచిన చేయి ఒక మనిషిని కాదు
అది భవిష్యత్తును తాకింది
రేపటి రోజు
రక్తం మర్చిపోవచ్చు
గాయం మానిపోవచ్చు
భూమి
వానను మళ్లీ తాగవచ్చు
చెట్లు
మళ్లీ చిగురించవచ్చు
ఒక్క ప్రశ్న మాత్రం
యుగాల దాకా
నిద్రపోదు
విద్యార్థి ప్రశ్నలకి భయపడే రాజ్యం
తన భవిష్యత్తును
ఎవరి చేతుల్లో వెతుకుతుంది?
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
