దోసకాయ పంట సాగు కోసం తన కుటుంబం పేరిట రూ 1.16 కోట్ల ప్రభుత్వ సబ్సిడీని పొందిన నరేశ్ పాల్ గాంగ్వార్ అప్పట్లో వార్తల్లో నిలిచారు.
న్యూఢిల్లీ: కేంద్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ కార్యదర్శిగా ఉన్న నరేశ్ పాల్ గాంగ్వార్‌ను ప్రభుత్వం నూతన ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా నియమించింది. దీంతో ఆయన గతంలో వార్తల్లో నిలిచిన అంశంపైకి అందరి దృష్టి మళ్లింది.
రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన గాంగ్వార్ తల్లి, భార్య, కొడుకు సమిష్టిగా రూ 1.16 కోట్ల ప్రభుత్వ సబ్సిడీని పొందినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం వెల్లడించింది.
“వాణిజ్య పంటలను ప్రోత్సహించడానికి” మరీ ముఖ్యంగా దోసకాయ పంట సాగు కోసం జాతీయ ఉద్యానవన బోర్డు పథకం కింద ఈ నిధులను పొందారు.
పత్రిక దర్యాప్తు ప్రకారం గడచిన ఐదు సంవత్సరాలుగా ఆయన కుటుంబం ఈ నగదును అందుకుంది.
ఈ నిధులను ఆయన కుటుంబం ఐదేళ్ల వ్యవధిలో పొందినట్లు తెలిసింది.
మంత్రికి సైతం లబ్ధి..
“ఉద్యానవన పంటల సాగు, కోత అనంతరం నిర్వహణ ద్వారా వాణిజ్య ఉద్యానవన పంటల అభివృద్ధి” అన్న పేరుతో ఉన్న ఈ సబ్సిడీ పథకం జాతీయ ఉద్యానవన బోర్డు కింద అమలవుతోంది.
రాజస్థాన్‌కు చెందిన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌదరి ఈ బోర్డుకు చైర్మన్‌గా ఉన్నారు.
“వాణిజ్య పంటల సాగును” ప్రోత్సహించే పథకం కింద స్వయంగా మంత్రే ఈ సంవత్సరం 50 శాతం సబ్సిడీగా రూ. 99.6 లక్షలు పొందారని సమాచారం.
నిబంధనల మేరకేనన్న అధికారి..
ఈ పథకం కింద సొంత మంత్రిత్వ శాఖ పంపిణీ చేసే నిధులను మంత్రే పొందడంపై రాజస్థాన్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా మోదీ ప్రభుత్వంపై దుమారం చెలరేగింది.
సీనియర్ ఐఏఎస్ అధికారి నరేశ్ పాల్ గాంగ్వార్ పాత్ర కూడా వెలుగులోకి వచ్చింది. 2021-22 సంవత్సరానికి గాను డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవోపీటీ)కి సమర్పించిన చట్టబద్ధమైన వార్షిక స్థిరాస్తి ఆస్తుల ప్రకటనలో ఈ పథకం కింద ఆమోదం పొందిన ఒకే ఒక ప్రాజెక్టు వివరాలను పొందుపరిచినట్లు అప్పట్లో గాంగ్వార్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెప్పారు.
సర్వీస్ నిబంధనల ప్రకారం భారీ స్థాయి లాభాపేక్ష ప్రాజెక్టులను మాత్రమే ప్రకటించాల్సి ఉంటుందని గాంగ్వార్ వివరించారు.
వాస్తవానికి ఈ పథకంలో ఒక కుటుంబం గరిష్టంగా రూ. కోటి వరకు మాత్రమే సబ్సిడీ పొందేలా పరిమితి ఉంది.
ప్రభుత్వ తీరుపై విపక్షాల విమర్శలు..
“జవాబుదారీతనాన్ని నిర్ధారించే ప్రధాన మంత్రి పద్ధతి ఇదా” అని సీపీఐ (ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ ఈ రోజు ఎక్స్ వేదికగా ప్రశ్నించారు.
“ఇది తీవ్ర హాస్యాస్పదం. పరీక్షల కుంభకోణాలు, పేపర్ లీక్‌ల వ్యవహారంలో దేశం జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వం నరేశ్ పాల్ గాంగ్వార్‌ను నూతన ఉన్నత విద్యా శాఖ కార్యదర్శిగా నియమించింది. వాణిజ్య పంటల ప్రోత్సాహం (దోసకాయ సాగు) పేరిట జాతీయ ఉద్యానవన బోర్డు పథకం కింద రూ. 1.16 కోట్ల ప్రభుత్వ సబ్సిడీని తన తల్లి, భార్య, కొడుకు పేరిట సమిష్టిగా పొందిన ఐఏఎస్ అధికారి ఈయనే” అని బ్రిట్టాస్ విమర్శించారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
