తర్వాత కాలంలో ఇరాక్‌పై దండయాత్రకు అత్యంత బలంగా మద్దతు తెలిపిన వారిలో ఒకరిగా నిలిచిన సంప్రదాయవాద రాజకీయ వ్యాఖ్యాత కెన్ అడెల్మన్, అమెరికా శత్రువులుగా భావించే ప్రపంచ నాయకులతో మడీబా కొనసాగించిన సంబంధాల గురించి ఆయనను నిలదీశాడు.
అయితే మడీబా ఆ ఉచ్చులో పడకపోగా ఇలా సమాధానమిచ్చారు.
కొంతమంది రాజకీయ విశ్లేషకులు చేసే తప్పుల్లో ఒకటి ఏమిటంటే, వారికి శత్రువులైనవారే మాకూ శత్రువులు కావాలని వారు భావించడం అని.
దక్షిణాఫ్రికా కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు కూస్ వాన్ డెర్ మెర్వే మడీబాతో ఒక క్రమశిక్షణ లేని పాఠశాల బాలుడితో మాట్లాడినట్లుగా ఉపదేశిస్తూ, “హింసాత్మక పోరాటాన్ని విడిచిపెట్టండి. వచ్చి కూర్చోండి. ఒక సాధారణ వ్యక్తిలా మారి చర్చించండి. చివరగా కమ్యూనిజాన్ని మర్చిపోండి” అని అన్నారు.
అప్పుడు మడీబా ఒక చిరునవ్వు చిందించారు.
ఆ తర్వాత ఆఫ్రికాన్స్ భాషలో, “మిమ్మల్ని కలవడం నాకు సంతోషంగా ఉంది. ఏదో రోజు మన దేశ వ్యవహారాల గురించి చర్చించుకునే అవకాశం మనకు లభిస్తుందని నేను ఆశిస్తున్నాను” అని సమాధానమిచ్చారు.
ఆ తర్వాత 80 నిమిషాలు ఎలా గడిచాయో మీరు ఊహించవచ్చు. పదే పదే మడీబాను చులకన చేసి మాట్లాడారు.
ఆయనను ఉగ్రవాదిగా, హింసాత్మక అతివాదిగా, శాంతికి అడ్డంకిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.
ప్రతి శత్రుత్వపూరిత ప్రశ్న తర్వాత టెడ్ కొప్పెల్ మరింత ఒత్తిడి పెంచుతూ మడీబా ఎప్పుడు తడబడతారో, ఎప్పుడు బలహీనత చూపుతారో అన్నట్లు వేచి చూశాడు. కానీ ప్రతిసారీ మడీబా తనను అడిగిన ప్రతి ప్రశ్నకూ ప్రశాంతంగా, నిదానంగా సమాధానం ఇచ్చారు.
రాజీలేని సంఘీభావం..
ఆ కార్యక్రమం ప్రారంభమైన గంట తర్వాత కొప్పెల్ మళ్లీ మడీబా పాలస్తీనా ఉద్యమానికి ప్రకటించిన సంఘీభావం గురించి ప్రశ్నకు తిరిగి వచ్చాడు. “ఆ సంఘీభావం కారణంగా యూదు సమాజాన్ని దూరం చేసుకోవడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారా?” అని ఆయన మడీబాను ప్రశ్నించాడు.
అది ఎంత కృత్రిమంగా రూపొందించిన ప్రశ్నో మడీబా అసలు తన ఉద్దేశం ఏమిటో చెప్పాలని కొప్పెల్ను తిరిగి అడగాల్సి వచ్చింది.
నిజం చెప్పాలంటే ఆ ప్రశ్న నాకు కూడా బాగా పరిచయమే.
అదే ప్రశ్నను వేరువేరు రూపాల్లో నన్ను కూడా ఎన్నోసార్లు అడిగారు— “ఇజ్రాయెల్ యుద్ధ నేరాలను, అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనలను వ్యతిరేకించడం వల్ల ఒక ప్రజల పట్ల మీకు ద్వేషం ఉన్నట్టే అవుతుందా”అని.
మడీబా ఆ ప్రశ్నలో అంతర్లీనంగా దాగి ఉన్న ఊహనే తిరస్కరించారు. దానికి బదులుగా దానిని పూర్తిగా భిన్నమైన ప్రశ్నగా మార్చారు.
మినహాయింపులతో నిండిపోయినప్పుడు విశ్వజనీనత ఆధారంగా నడిచే రాజకీయాలు మనుగడ సాగించగలవా? మనలో కొందరు స్వేచ్ఛగా లేనప్పుడు మనలో ఎవరైనా నిజంగా స్వేచ్ఛగా ఉండగలరా?
తన సమాధానం చివర్లో, “దీనిని మీరు రాజకీయ విషయం అనవచ్చు లేదా నైతిక ప్రశ్న అనవచ్చు కానీ ఎవరితో వ్యవహరిస్తున్నాడన్న దాన్ని బట్టి తన విలువలను మార్చుకునే వ్యక్తి ఒక దేశానికి నాయకత్వం వహించగల మనిషి కాదు” అని ఆయన అన్నారు.
కపటత్వం, రాజకీయ సౌలభ్యం ఈ రెండింటికీ మనల్ని తమవైపు లాగే గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది.
చాలా సందర్భాల్లో ఒక రాయితీ ఇవ్వడం, చాలాకాలంగా విశ్వసిస్తున్న ఒక నమ్మకాన్ని విడిచిపెట్టడం, ఒక విలువను పరిత్యజించడం దృఢంగా నిలబడటంకన్నా చాలా సులభంగా అనిపిస్తుంది.
వర్ణ వివక్ష (అపార్థైడ్) పై రాజీ పడాలని ప్రపంచం మడీబాను కోరినప్పుడు కూడా అదే నిజం.
పాలస్తీనా స్వేచ్ఛా పోరాటానికి తన మద్దతును ఉపసంహరించుకోవాలని చాలామంది ఆయనను కోరినప్పుడు కూడా అదే నిజం. ఈ రోజుకీ అది అలాగే నిజంగానే ఉంది.
కానీ ఆ క్షణంలో ప్రకాశవంతమైన లైట్ల కింద టెడ్ కొప్పెల్ ఆయనపై ఒత్తిడి తీసుకొస్తున్నప్పుడు మడీబా మనకు విశ్వజనీనమైన, రాజీలేని సంఘీభావ శక్తిని చూపించారు.
అది అందరికీ విస్తరించే సంఘీభావం. అన్యాయం జరిగిందా లేదా అన్న విషయంపైనే వివాదం ఉన్నప్పటికీ వెనక్కి తగ్గని సంఘీభావం.
తాము సత్యమని తెలుసుకున్న విషయాన్నే చాలామంది తిరస్కరించడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ నిలకడగా ఉండే సంఘీభావం.
పోప్ ఫ్రాన్సిస్ చెప్పినట్లుగా సంఘీభావం సౌకర్యవంతమైనది కాదు.
అది అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మడీబా తన 95 ఏళ్ల జీవితంతో నిరూపించినట్లుగా సంఘీభావం కేవలం ఒక విలువ మాత్రమే కాదు అది ఒక వ్యూహం కూడా.
కపటత్వం – మడీబా క్షమాగుణం..
తన నుంచి అలాగే మనలో ప్రతి ఒక్కరి నుంచి కూడా సంఘీభావాన్ని కోరిన మడీబా కేవలం ఒక మనిషి కాదు, కేవలం ఒక మెస్సయ్య కూడా కాదు, మనల్ని మనం చూసుకుని ప్రశ్నించుకునే అద్దంగా మారిపోతారు.
తనతో కలిసి ఒకే లక్ష్యం కోసం పోరాడిన ప్రజలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టనని మడీబా చెప్పినప్పుడు “నేనూ ఇలాగే నిలబడగలనా?” అని మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నామా? అధికారం కోసం తన వ్యక్తిత్వాన్ని, తన విలువలను అమ్ముకోకుండా అవసరమైతే అధికారాన్నే వదులుకోవడానికి ఆయన సిద్ధపడ్డారని తెలుసుకున్నప్పుడు “నాకూ అలాంటి ధైర్యం ఉందా?” అని మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నామా? సంఘీభావాన్ని కేవలం ఒక గొప్ప మాటగా కాకుండా ఆచరణలో చూపాల్సిన బాధ్యతగా ఆయన భావించినప్పుడు “నేనూ అలాగే చేస్తున్నానా?” అని మనల్ని మనం ప్రశ్నించుకుంటున్నామా?
లేక మన నుంచి ఎలాంటి బాధ్యతనూ, త్యాగాన్నీ, నిబద్ధతనూ ఆశించని మండేలా రూపాన్నే మనం ఇష్టపడుతున్నామా? దురదృష్టవశాత్తూ చాలామంది ఇష్టపడేది అలాంటి మండేలానే.
మడీబా మరణించిన తర్వాత ఆయనను నిజమైన ప్రపంచ వీరుడు అని కొనియాడిన బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీ (టోరీలు) నాకు గుర్తుకొస్తారు. కానీ అదే టోరీలు 1980లలో దక్షిణాఫ్రికాలోని అపార్థైడ్ ప్రభుత్వంపై ఆంక్షలు విధించడాన్ని వ్యతిరేకించారు.
అదే టోరీలు మడీబా నాయకత్వంలోని ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్(ఏఎన్సీ)ను వ్యతిరేకించారు. అదే టోరీలు మడీబాను జైలు నుంచి విడుదల చేయాలన్న డిమాండ్‌ను కూడా వ్యతిరేకించారు.
మడీబా పట్ల అపారమైన గౌరవం ఉందని చెప్పుకున్న అమెరికా కేంద్ర ప్రభుత్వ అత్యున్నత స్థాయి నాయకులు కూడా నాకు గుర్తుకొస్తారు. కానీ అదే వారు మడీబాకు 90 ఏళ్లు వచ్చి 2008 సంవత్సరం వచ్చే వరకు ఆయన పేరును ఉగ్రవాదుల నిఘా జాబితా నుంచి తొలగించలేదు.
మడీబాను జైలులో హింసించిన జైలు అధికారుల గురించి కూడా నేను ఆలోచిస్తుంటాను. రక్షణ లేకుండా సున్నపు రాయి గనిలో పని చేయించి ఆయన కంటి చూపు శాశ్వతంగా దెబ్బతినేలా చేసిన వారే తర్వాత ఆయన అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు.
ఆ వ్యక్తులందరి గురించి, ఆ కపటత్వం వ్యక్తమైన ప్రతి సందర్భం గురించి నేను ఆలోచించినప్పుడు నేను మాటలు కోల్పోతాను. అప్పుడు నాకు మడీబా గుర్తుకొస్తారు. క్షమించే శక్తి ఉన్న మనిషి, అందరికీ సంఘీభావాన్ని అందించిన మనిషి మండేలా.
అలాంటి సంఘీభావం వల్లే దక్షిణాఫ్రికా తన గతానికి భిన్నమైన ఒక కొత్త భవిష్యత్తును ఊహించగలిగింది. అలాంటి సంఘీభావం ద్వారానే మనం కూడా మన గతానికి భిన్నమైన భవిష్యత్తును నిర్మించగలం.
అన్యాయంపై పోరాటమే నిజమైన నివాళి..
ఇంకా 3 రోజుల్లో ప్రపంచం నెల్సన్ మండేలా దినోత్సవాన్ని జరుపుకోనుంది. ప్రాథమిక పాఠశాలల చిన్నారులు మండేలా గురించి ప్రసంగాలు, ప్రదర్శనలు చేస్తారు.
ప్రపంచ నాయకులు ఆయనను స్మరిస్తూ ప్రకటనలు విడుదల చేస్తారు. కోట్లాది మంది ఒకచోట చేరి మడీబా వారసత్వానికి తమ నివాళులు అర్పిస్తారు.
న్యూయార్క్ నగరంలో కూడా మేము మండేలా దినోత్సవాన్ని నిర్వహిస్తాము.
నగరంలోని 5 బరోల (పరిపాలనా జిల్లాలు) లో నివసించే న్యూయార్క్ వాసులు స్వేచ్ఛ కోసం మడీబా జీవితాంతం కొనసాగించిన అవిశ్రాంత పోరాటాన్ని స్మరించుకుంటారు.
అనువాదం: మనోహర రాజు
ఈ వ్యాసం మూడు భాగాలుగా ప్రచురితమవుతుంది, ఇది రెండవ భాగం. మొదటి భాగం కోసం క్లిక్ చేయండి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
