కేంద్ర ఆర్థిక మంత్రి తన 2026-27 కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో చేసిన ప్రకటనకు అనుగుణంగా, ‘వికసిత్ భారత్ కోసం బ్యాంకింగ్’పై భారత ప్రభుత్వం 2026 అక్టోబరు 30న ఒక హై-లెవల్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి ఆరు నెలల పదవీకాలం కేటాయించారు.
ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులతో సహా భారతదేశ బ్యాంకింగ్ రంగాన్ని సమీక్షించడం, వికసిత్ భారత్ 2047 కోసం దాన్ని ప్రపంచవ్యాప్తంగా పోటీపడేలా, ఆర్థికంగా కలుపుకుపోయేలా, దృఢంగా మార్చడానికి నిర్మాణాత్మక, సంస్థాగత, నియంత్రణ, చట్టపర సంస్కరణలను సిఫారసు చేయడం దీని ముఖ్య ఉద్దేశం.
ఈ పదజాలం ఆకర్షణీయంగా కనిపిస్తున్నప్పటికీ, జాతీయ అభివృద్ధి ఆకాంక్షలను రేకెత్తిస్తున్నప్పటికీ, వాస్తవానికి ఈ కమిటీ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ చూస్తే దేశ బ్యాంకింగ్ నిర్మాణాన్ని మౌలికంగా పునర్నిర్మించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలియవస్తుంది.
ఉద్యోగులు, ముఖ్యంగా బ్యాంక్ ట్రేడ్ యూనియన్ ఉద్యమం, ఈ కమిటీని సాధారణ పరిపాలనా నియామకంగా చూడలేదు.
ప్రభుత్వ రంగ యాజమాన్యం, సామాజిక బ్యాంకింగ్, బ్యాంకింగ్ పరిశ్రమ అభివృద్ధి బాధ్యతలపై కొనసాగుతున్న నయా-ఉదారవాద దాడి నేపథ్యంలో దీన్ని చూడాలి.
ప్రతిపాదిత కమిటీ పనితీరు
టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్‌లో పేర్కొన్న ఏడు సూచన నిబంధనలను కలిపి పరిశీలిస్తే, ప్రతిపాదిత కమిటీ పనితీరు ఎలా ఉండబోతోందో అర్థమవుతుంది.
ప్రపంచస్థాయి పోటీతత్వం, ప్రైవేట్ పెట్టుబడి, మూలధన అవసరాలు, నియంత్రణ పునర్నిర్మాణం, డిజిటల్ పరివర్తనం, సామాజిక బ్యాంకింగ్ విధానాల పునఃమూల్యాంకనంపై పదేపదే నొక్కిచెప్పడం అనేది బ్యాంకింగ్ పరిశ్రమను గుణాత్మకంగా భిన్నమైన సంస్థాగత నిర్మాణం కోసం సిద్ధం చేసే ప్రయత్నాన్ని సూచిస్తోంది.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక విధానాల నుంచి ఈ అంశాన్ని వేరు చేసి చూడలేము. పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల ప్రతిపాదిత ప్రైవేటీకరణ, విదేశీ మూలధనానికి ఐడీబీఐ బ్యాంక్ వ్యూహాత్మక విక్రయం, ప్రైవేటీకరణ కోసం పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను గుర్తించడానికి సంబంధించిన నివేదికలు, ప్రైవేట్ రంగ బ్యాంకుల్లో పెరుగుతున్న విదేశీ భాగస్వామ్యం, బ్యాంకింగ్ ఏకీకరణ వైపు కొనసాగుతున్న ఒత్తిడి అన్నీ కలవరపరిచే పరిణామాలే.
వికసిత్ భారత్ 2047 నినాదం
ఆర్థిక పునర్నిర్మాణం కొత్త దశకు రాజకీయ చట్టబద్ధతను కల్పించడానికి వికసిత్ భారత్ 2047 నినాదం ముందుకు తెస్తున్నారు.
అయితే బ్యాంకుల పరిమాణం, వాటి ప్రపంచ ర్యాంకింగ్‌లు, సాంకేతిక పరిజ్ఞానం లేదా ప్రైవేట్ పెట్టుబడులను సమీకరించే సామర్థ్యం ద్వారా మాత్రమే అభివృద్ధిని సాధించలేము.
1969, 1980లలో బ్యాంకుల చారిత్రాత్మక జాతీయీకరణ అనేది ప్రైవేట్ చేతుల్లో ఉన్న ఆర్థిక వనరుల కేంద్రీకరణకు వ్యతిరేకంగా ప్రజల పక్షాన తీసుకున్న నిర్ణయాత్మక జోక్యంగా నిలిచింది.
తద్వారా దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలకు బ్రాంచ్ బ్యాంకింగ్ సౌకర్యాల విస్తరణ, వ్యవసాయ రుణాలు, చిన్న పరిశ్రమలకు సంస్థాగత ఆర్థిక సహాయం, ఆర్థిక సమ్మిళితాన్ని సాధ్యం చేసింది.
నయాఉదారవాద సంస్కరణలు
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థ ఆర్థిక సార్వభౌమాధికారం, సామాజిక పరివర్తనకు ఒక సాధనంగా ఉంది. ఆధునికీకరణకు ప్రైవేట్ రంగ నేతృత్వంలోని బ్యాంకింగే అనివార్యమైన గమ్యస్థానంగా చూపడం ద్వారా జాతీయీకరణ విజయాలను తుడిచిపెట్టలేరు.
నయాఉదారవాద ఆర్థిక సంస్కరణల తదుపరి దశను ముందుకు తీసుకెళ్లడంలో ప్రతిపాదిత కమిటీ ఒక ముఖ్యమైన సాధనంగా మారుతుందని ప్రజలు గుర్తించాలి.
కార్పొరేట్ మూలధనం, దేశీయ గుత్తాధిపత్యాలు, అంతర్జాతీయ ఆర్థిక ప్రయోజనాల అవసరాల రీత్యా మన దేశ బ్యాంకింగ్ వ్యవస్థ భవితవ్యం నిర్ణయించడాన్ని మనం అనుమతించరాదు.
ట్రేడ్ యూనియన్ల కర్తవ్యం
ఈ కమిటీ ఏర్పాటు మొత్తం బ్యాంకింగ్ ట్రేడ్ యూనియన్ ఉద్యమానికి మేల్కొలుపు కావాలి. మన ముందున్న సవాలు కేవలం వ్యక్తిగత సిఫార్సులు సమర్పించినప్పుడు వాటికి ప్రతిస్పందించడం మాత్రమే కాదు. ఈ కమిటీ నియామకం వెనుక ఉన్న సైద్ధాంతిక, ఆర్థిక దిశను మొదటి నుంచీ మనం ఎత్తిచూపాలి.
భారతీయ బ్యాంకింగ్ వ్యవస్థ జాతీయీకరణ స్వభావాన్ని బలహీనపరిచే ఏ ప్రయత్నానికైనా వ్యతిరేకంగా ప్రజాభిప్రాయాన్ని సమీకరించాలి.
జాతీయీకరణ ద్వారా సాధించిన విజయాలను కాపాడుకోవడానికి, ప్రైవేటీకరణను వ్యతిరేకించడానికి ఉద్యోగ వర్గం సిద్ధంగా ఉండాలి.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ను రక్షించే పోరాటం కేవలం ట్రేడ్ యూనియన్ సమస్య మాత్రమే కాదు. ఆర్థిక సార్వభౌమాధికారం, ఉపాధి భద్రత, ఆర్థిక సమ్మిళితం, శ్రామిక ప్రజల ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించే విస్తృత పోరాటంలో ఇది అంతర్భాగం కావాలి.
సామాన్య ప్రజల ప్రయోజనాలకు, దేశ ఆర్థిక సార్వభౌమాధికారానికి విరుద్ధంగా ఏ సంస్కరణలు వచ్చినా వాటిని వ్యతిరేకిస్తామని బ్యాంక్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా స్పష్టంగా ప్రకటిస్తోంది.
నయాఉదారవాద సంస్కరణలకు వ్యతిరేకంగా ఐక్యంగా ప్రతిఘటించాలని బెఫి దేశ పౌరులకు, కార్మిక వర్గ ఉద్యమానికి విజ్ఞప్తి చేస్తోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
