డాక్టర్ అమర్త్యసేన్ 1933 నవంబరు 3న పశ్చిమబెంగాల్లోని శాంతినికేతన్లో జన్మించారు. 1998లో ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు. సంక్షేమ ఆర్థికశాస్త్రం (Welfare Economics) రంగంలో చేసిన విశేష కృషికి ఈ పురస్కారం లభించింది.
ఢాకా విశ్వవిద్యాలయంలో రసాయనశాస్త్ర ఆచార్యుడిగా అమర్త్యసేన్ తండ్రి ఆశుతోష్ సేన్ పనిచేశారు. తల్లి అమితా సేన్. తాత క్షితిమోహన్ సేన్ సంస్కృతం, ప్రాచీన భారతీయ సంస్కృతి, మధ్యయుగ భారతీయ సంస్కృతులపై అధ్యయనం చేసిన పండితుడు.
అమర్త్యసేన్ జన్మించిన శాంతినికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన విశ్వభారతి విద్యాసంస్థకు నిలయం. ఆయన బాల్యవిద్యపై ఠాగూర్ విద్యా తత్వం ప్రభావం చూపింది. విద్య అంటే కేవలం పరీక్షల్లో మార్కులు సాధించడం కాదని, ప్రశ్నించడం, స్వతంత్రంగా ఆలోచించడం, సమాజాన్ని అర్థం చేసుకోవడం అని ఆ విద్యావిధానం ప్రోత్సహించింది.
బాల్యంలోనే సంస్కృతం, గణితం, భౌతికశాస్త్రంపై ఆసక్తి చూపిన ఆయన చివరకు ఆర్థిక శాస్త్రాన్ని తన ప్రధాన అధ్యయన రంగంగా ఎంచుకున్నారు.
బెంగాల్ కరువు – జీవితాన్ని ప్రభావితం చేసిన అనుభవం
1943 బెంగాల్ కరువు అమర్త్యసేన్ ఆలోచనలను ప్రభావితం చేసింది. ఆ సమయంలో ఆయన బాలుడే. బెంగాల్లో లక్షలాది మంది ఆకలి, పేదరికం కారణంగా ప్రాణాలు కోల్పోవడాన్ని ఆయన ప్రత్యక్షంగా చూశారు.
ఒక దేశంలో ఆహారం అందుబాటులో ఉన్నప్పటికీ ప్రజలు ఆకలితో ఎందుకు చనిపోవాలి? అని ఆ కరువు ఆయన మనసులో ఒక ప్రశ్నను రేకెత్తించింది.
సాధారణంగా కరువు వచ్చినప్పుడు దేశంలో ఆహార ఉత్పత్తి తగ్గిపోయిందని భావిస్తారు. కానీ అమర్త్యసేన్ పరిశోధనలు ఆ సమస్యకు మరింత లోతైన ఆర్థిక, సామాజిక కారణాలను వెల్లడించాయి.
ఆహారం ఉన్నా కొనుగోలు శక్తి లేకపోవడం, ఉపాధి కోల్పోవడం, ఆహార పంపిణీలో అసమానతలు, పేదల జీవనోపాధి దెబ్బతినడం వంటి కారణాలు కూడా కరువుకు దారితీస్తాయని ఆయన వివరించారు.
ఈ ఆలోచనలే తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆయన పరిశోధనలకు పునాది అయ్యాయి.
ఉన్నత విద్య – ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుడిగా
అమర్త్యసేన్ కోల్‌కతాలోని ప్రెసిడెన్సీ కళాశాలలో ఆర్థిక శాస్త్రం అభ్యసించారు. తర్వాత ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ట్రినిటీ కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించి, 1959లో పీహెచ్డీ పూర్తి చేశారు.
చాలా చిన్న వయసులోనే భారతదేశంలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర విభాగంలో ఆచార్యుడిగా బాధ్యతలు చేపట్టారు.
ఆ తర్వాత ఆయన ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం, హార్వర్డ్ విశ్వవిద్యాలయం లాంటి ప్రముఖ విద్యాసంస్థల్లో పనిచేశారు.
1998లో తాను ఉన్నత విద్యనభ్యసించి, పీహెచ్డీ పొందిన కేంబ్రిడ్జిలోని ట్రినిటీ కళాశాల మాస్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. ప్రపంచంలోని అత్యున్నత విద్యాసంస్థల్లో ఆయనకు విశిష్ట గుర్తింపు లభించింది.
1998 నోబెల్ బహుమతి – ప్రపంచ గుర్తింపు
1998లో అమర్త్యసేన్‌కు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ బహుమతి లభించింది. ఆయనకు ఈ బహుమతి రావడానికి ప్రధాన కారణం సంక్షేమ ఆర్థిక శాస్త్రంలో చేసిన పరిశోధనలు.
ఆర్థిక వ్యవస్థ విజయాన్ని కేవలం స్థూల జాతీయోత్పత్తి, తలసరి ఆదాయం, పారిశ్రామిక ఉత్పత్తి వంటి గణాంకాలతో మాత్రమే కొలవలేమని ఆయన స్పష్టం చేశారు.
ప్రజలకు ఆహారం లభిస్తోందా? పిల్లలకు విద్య అందుతోందా? ప్రజలకు వైద్య సదుపాయాలు ఉన్నాయా? మహిళలకు సమాన అవకాశాలు లభిస్తున్నాయా? ప్రజలకు గౌరవంగా జీవించే స్వేచ్ఛ ఉందా? లాంటి ప్రశ్నలకు సమాధానాలు దేశాభివృద్ధిని కొలవడానికి అవసరమని ఆయన ప్రతిపాదించారు.
అమర్త్యసేన్ ఆర్థిక సిద్ధాంతాలు – ముఖ్యమైన పరిశోధనలు
సంక్షేమ ఆర్థికశాస్త్రం: సాధారణ ఆర్థిక శాస్త్రం ఉత్పత్తి, ఆదాయం, పెట్టుబడి, లాభం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తుంది.
అయితే ఆర్థిక వ్యవస్థ అంతిమ లక్ష్యం మానవ సంక్షేమం కావాలని అమర్త్యసేన్ వాదించారు. ఒక దేశంలో సంపద పెరిగినా పేదరికం, నిరుద్యోగం, ఆకలి, నిరక్షరాస్యత కొనసాగితే ఆ అభివృద్ధి సమగ్ర అభివృద్ధి కాదని ఆయన అభిప్రాయం. ఆర్థిక విధానాల వల్ల సమాజంలోని వివిధ వర్గాలకు కలిగే ప్రయోజనాలను పరిశీలించడం అవసరమని చెప్పారు.
కరువు – ఆహార హక్కు: 1981లో ఆయన రచించిన ‘Poverty and Famines: An Essay on Entitlement and Deprivation’ ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యం పొందింది.
కరువు అనేది కేవలం ఆహార కొరత వల్లనే ఏర్పడదు. ఆహారాన్ని పొందగలిగే హక్కు, కొనుగోలు శక్తి, ఉపాధి అవకాశాలు కోల్పోవడం కూడా కరువుకు కారణమవుతాయనేది ఆయన ఈ గ్రంథంలో ప్రతిపాదించిన ముఖ్యమైన అంశం.
ఉదాహరణకు, ఒక ప్రాంతంలో ఆహారధాన్యాల ఉత్పత్తి ఉన్నప్పటికీ వ్యవసాయ కార్మికులకు పని దొరకకపోతే, వారి ఆదాయం పడిపోతుంది. ఆహార పదార్థాల ధరలు పెరిగితే వాటిని కొనుగోలు చేయలేరు.
ఫలితంగా ఆకలి, పోషకాహార లోపం, మరణాలు సంభవించవచ్చు. ఈ సిద్ధాంతం ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రతా విధానాల రూపకల్పనపై ప్రభావం చూపింది.
సామర్థ్యాల సిద్ధాంతం: అమర్త్యసేన్ ప్రపంచానికి అందించిన అత్యంత ముఖ్యమైన భావనల్లో ఇది ఒకటి. ఒక వ్యక్తి వద్ద ఎంత డబ్బు ఉందనే దానికంటే, ఆ డబ్బుతో అతను లేదా ఆమె ఎలాంటి జీవితాన్ని గడపగలుగుతున్నారు అనేది ముఖ్యం.
ఉదాహరణకు ఒక వ్యక్తికి ఆదాయం ఉన్నప్పటికీ వైద్య సేవలు అందుబాటులో లేకపోతే ఆరోగ్యంగా జీవించలేరు. విద్య అందుబాటులో లేకపోతే తన సామర్థ్యాలను అభివృద్ధి చేసుకోలేరు. మహిళలకు స్వేచ్ఛ, భద్రత లేకపోతే సమాన అవకాశాలను పొందలేరు. ఉపాధి లేకపోతే ఆహారం కొనుగోలు చేయగలిగే ఆర్థిక స్వాతంత్ర్యం కోల్పోతారు. అందువల్ల అభివృద్ధి అంటే ప్రజలకు తమకు విలువైన జీవితాన్ని ఎంచుకునే స్వేచ్ఛ, సామర్థ్యాలను కల్పించడం అని ఆయన వివరించారు.
మానవాభివృద్ధి సూచిక: పాకిస్థాన్‌కు చెందిన ఆర్థికవేత్త మహబూబ్ ఉల్ హక్‌తో కలిసి మానవాభివృద్ధి భావనను అభివృద్ధి చేయడంలో అమర్త్యసేన్ కీలకమైన మేధోపరమైన పాత్ర పోషించారు.
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం 1990లో తొలి మానవాభివృద్ధి నివేదికను విడుదల చేసింది. మానవాభివృద్ధి సూచికలో మూడు ప్రధాన అంశాలు ఉంటాయి.
1. ఆరోగ్యం – ఆయుర్దాయం.
2. విద్య – విద్యా స్థాయి, విద్యను పొందే అవకాశాలు.
3. జీవన ప్రమాణం – తలసరి జాతీయ ఆదాయం.
ఇది కేవలం ఆర్థికవృద్ధిని కాకుండా ప్రజల జీవితాల్లో వస్తున్న మార్పులను అంచనా వేయడానికి ప్రపంచానికి ఒక కొత్త పద్ధతిని అందించింది.
ఒక దేశం ఎంత ధనిక దేశం అనేది కాకుండా, ఆ దేశ ప్రజలు ఎంత ఆరోగ్యంగా, విద్యావంతులుగా, మెరుగైన జీవితాన్ని గడుపుతున్నారో పరిశీలించాలనే దృక్పథం మానవాభివృద్ధి సిద్ధాంతం ప్రధాన ఉద్దేశం.
మహిళల స్థితిగతులు-లింగ సమానత్వం: భారతదేశంలో మహిళల పట్ల వివక్ష, బాలికలకు విద్యలో తక్కువ అవకాశాలు, పోషకాహార లోపం, ఆరోగ్య అసమానతలు వంటి అంశాలపై ఆయన విస్తృతంగా పరిశోధనలు చేశారు.
పురుషులు, మహిళల మధ్య ఆరోగ్యం, విద్య, ఉపాధి, జీవనావకాశాల్లో ఉన్న వ్యత్యాసాలను గణాంకాల ఆధారంగా విశ్లేషించారు. మహిళల అభివృద్ధి అనేది కేవలం కుటుంబానికి సంబంధించిన విషయం కాదని, దేశ ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అత్యంత కీలకమని ఆయన నొక్కి చెప్పారు.
ప్రజాస్వామ్యం-పత్రికా స్వేచ్ఛ-కరువు నివారణ: అమర్త్యసేన్ పరిశోధనల్లో ప్రజాస్వామ్యానికి కూడా ప్రత్యేక స్థానం ఉంది.
ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు, స్వేచ్ఛాయుత పత్రికలు, ఎన్నికల ద్వారా ప్రభుత్వాలను మార్చే అవకాశం ఉంటాయి.
కరువు వంటి తీవ్రమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు స్వేచ్ఛాయుత మీడియా వాటిని ప్రజల ముందుకు తీసుకువస్తుంది.
ప్రజాభిప్రాయానికి స్పందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుంది. అందువల్ల ప్రజాస్వామ్య వ్యవస్థలు, పత్రికా స్వేచ్ఛ కరువు నివారణకు కీలకమైన రక్షణ వ్యవస్థలుగా పనిచేస్తాయని ఆయన వివరించారు. ఇది ప్రపంచ రాజకీయ, ఆర్థిక చర్చల్లో అత్యంత ప్రభావవంతమైన ఆయన వాదనల్లో ఒకటి.
ముఖ్యమైన గ్రంథాలు
అమర్త్యసేన్ రచనలు ప్రపంచవ్యాప్తంగా అనేక భాషల్లోకి అనువదించబడ్డాయి.
♦ ప్రజల అభిప్రాయాలు, సామాజిక నిర్ణయాలు, ప్రజాస్వామ్య ఎంపికలపై పరిశోధన-1970
♦ ఆర్థిక అసమానతల స్వభావం, వాటిని కొలిచే పద్ధతులపై విశ్లేషణ-1973
♦ పేదరికం, కరువు, ఆహార హక్కులపై ప్రపంచ ప్రసిద్ధ గ్రంథం (1981)
♦ మానవ సామర్థ్యాలు, జీవన ప్రమాణాలపై అధ్యయనం-1985
♦ స్వేచ్ఛే అభివృద్ధికి పునాది అనే ఆలోచనను వివరించిన గ్రంథం-1999
♦ భారతదేశంలో చర్చ, వాదన, హేతుబద్ధత, బహుళత్వ సంప్రదాయాలపై రచన-2005
♦ న్యాయం, సమానత్వం, మానవ హక్కులపై తాత్విక పరిశీలన-2009.
భారతదేశానికి చేసిన సేవలు – భారతరత్న
అమర్త్యసేన్‌కు భారత ప్రభుత్వం 1999లో భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నను ప్రదానం చేసింది.
విద్య, ఆరోగ్యం, ఆహార భద్రత, పేదరిక నిర్మూలన, మహిళా సాధికారత వంటి అంశాలపై ఆయన చేసిన పరిశోధనలు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా విధాన నిర్ణేతలకు ఉపయోగపడ్డాయి.
నాలుగు దశాబ్దాలకు పైగా ప్రపంచ విశ్వవిద్యాలయాల్లో బోధన, పరిశోధన చేస్తూ భారతీయ మేధో సంపదకు అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చారు.
అమర్త్యసేన్ ఆలోచనలను నేటి భారతదేశ సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అన్వయించుకోవాల్సిన అవసరం ఉంది.
దేశంలో జీడీపీ పెరుగుదల, పారిశ్రామిక అభివృద్ధి, విదేశీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాల విస్తరణ ముఖ్యమైనవే.
అయితే వాటితో పాటు ఈ ప్రశ్నలకు ప్రభుత్వాలు సమాధానాలు చెప్పాలి. పేద కుటుంబాలకు నాణ్యమైన విద్య అందుతోందా? ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్యం లభిస్తోందా? యువతకు గౌరవప్రదమైన ఉపాధి దొరుకుతోందా? మహిళలకు సమాన అవకాశాలు, భద్రత ఉన్నాయా? రైతులకు, వ్యవసాయ కార్మికులకు న్యాయమైన ఆదాయం లభిస్తోందా?
పేదలకు ఆహార భద్రత, సామాజిక భద్రత ఉన్నాయా? ప్రజలకు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశం ఉందా? ఈ అంశాలను విస్మరించి కేవలం ఆర్థిక వృద్ధి గణాంకాలతో దేశాభివృద్ధిని నిర్ణయించడం సరైన పద్ధతి కాదని అమర్త్యసేన్ తేల్చి చెప్పారు.
దేశ సంపద పెరగడం మాత్రమే అభివృద్ధి కాదు, ఆ సంపద ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పును తీసుకువచ్చింది అనేదే అసలైన అభివృద్ధికి కొలమానం అని అమర్త్యసేన్ బలంగా వాదించారు.
ప్రజలు ఆకలితో ఉండకూడదు. ప్రతి బిడ్డకు విద్య అందాలి. ప్రతి ఒక్కరికీ ఆరోగ్య సేవలు లభించాలి. మహిళలకు సమాన హక్కులు ఉండాలి. ప్రతి మనిషికి గౌరవంగా జీవించే స్వేచ్ఛ ఉండాలి. ఈ మానవతా దృక్పథమే అమర్త్యసేన్‌ను ప్రపంచంలోని గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరిగా నిలబెట్టింది.
ఇలాంటి విశ్వవిఖ్యాత ఆర్థికవేత్త, భారత ప్రభుత్వ “భారతరత్న” అవార్డు గ్రహీత అయిన అమర్త్యసేన్ గారినే తన పౌరసత్వాన్ని రుజువు చేసుకోవాలని ఎన్నికల సంఘం నోటీసు ఇచ్చింది. మన దేశం ఎటు పోతోందో ఇది రుజువు చేస్తోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
