బ్రెజిల్ 1980వ దశకంలో ప్రజాస్వామిక పునఃప్రస్థానం ప్రారంభించిన తర్వాత తొలి రౌండ్లో ఓడిపోయిన ఏ అభ్యర్థి మళ్లీ రౌండులో విజయపతాకం ఎగురవేయలేదు.
లూలా డిసిల్వా నాలుగోసారి అధ్యక్ష పీఠం గెలుచుకోవడం వెనక సోషల్ మీడియా కీలక పాత్ర పోషించింది. అయితే శక్తివంతమైన డిజిటల్ యుద్ధం ఒక్కటే ఈ గెలుపుకు కారణం కాదు.
ఈ గెలుపు వెనక కీలక పాత్ర పోషించిన వారిలో ఒక రాష్ట్రంలో డిప్యూటీగా ఉన్న ఆండ్రే జనోనెస్ ఒకరు. ఈ ఎన్నికలకు ముందు ఆయన ఏమీ పెద్ద దేశవ్యాప్త ప్రాచుర్యం కలిగిన నాయకుడు కాదు. ఆయన పోటీ చేసిన మినాస్ గిరాయిస్లో అత్యధిక ఓట్లు సంపాదించిన పార్లమెంట్ సభ్యుడు నికోలస్ ఫెరీరకంటే కొద్దిగా తక్కువ(78 వేలు) ఓట్లు సంపాదించుకున్న నాయకుడు.
అయితే లూలా తరఫున జరిగిన ప్రచారంలో ఈయన అనుసరించిన వినూత్న వ్యూహం దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చింది. దానికి కారణం జనోనెస్ ప్రారంభించిన ‘లూలా సైన్యం’ అనే సోషల్ మీడియా ప్రచార సాధనం.
వాట్సాప్ సైన్యం
ఈ ఆలోచన తక్షణం ప్రభావాన్ని చూపించింది. దేశవ్యాప్తంగా ఓటర్లను ఏకతాటి మీదకు తెచ్చింది. ఈ వాట్సాప్ గ్రూపులో కోటి పది లక్షల మంది చేరారు.
జనరల్ జనోనెస్ అందించే సందేశాలను ప్రజలందరికీ చేరువేయడంలో వీరందరూ భాగస్వాములయ్యారు. ఈ ప్రయత్నం బ్రెజిల్లో ఎన్నికల చర్చను సమూలంగా మార్చేసింది.
“లూలాకి అనుకూలంగా అంతర్జాల రంగంలో సైన్యాన్ని సమీకరించి చర్చను నడపడంలో జనోనెస్ కీలకపాత్రధారి. సోషల్ మీడియాలో ఓటర్లతో చర్చలు జరుపుతూ ఇంటర్నెట్ పరిధికి బయట వీధులలో ఈ చర్చ ఆధారంగా కార్యాచరణకు దిగటం ఈసారి లూలా ఎన్నికల ప్రచారంలో అనుసరించిన వినూత్న వ్యూహం. ఈ డిజిటల్ సమీకరణను సమర్థవంతంగా నిర్వహించడానికి వీలైన సాధనాలన్నింటినీ జనోనెస్ సమకూర్చారు. ఓటర్లను భావోద్వేగపరచడానికి కావాల్సిన కారణాలు, స్పష్టమైన లక్ష్యాలు, కార్యాచరణకు అవసరమైన ఆదేశాలు జనోనెస్ నడిపిన ఈ గ్రూపులో ముఖ్యమైన అంశాలు. దాంతో ఈ వాట్సాప్ సైన్యం రెండవ దఫా ఎన్నికలలో నిర్మాణ రూపంతో వీధుల్లోకి వచ్చింది” అని పొలిటికల్ కమ్యూనికేషన్స్, ఎలక్టోరల్ మార్కెటింగ్ విభాగం ఆచార్యుడు ఫెలిపె రోడ్రిగుయేజ్ అన్నారు.
“ఈ ఎన్నికలలో ప్రజలను రాజకీయాల వైపు ఆకర్షించిన ప్రధాన సాధనం సోషల్ మీడియా. సోషల్ మీడియా వినియోగంతో మొత్తంగా రాజకీయ సమాచారం ఇచ్చిపుచ్చుకోవడంలో పూర్తిగా మార్పులు వచ్చాయి. సోషల్ నెట్‌వర్క్‌లు, మెసేజ్ యాప్‌లు 24 గంటలూ పనిచేస్తూనే ఉన్నాయి. ఫోన్ ఉన్న ప్రతి ఓటరుకు సందేశాలు చేరుతూనే ఉన్నాయి” అని రోడ్రిగుయేజ్ ‘ఎన్‌డబ్ల్యూఎస్’ వార్తా సంస్థతో అన్నారు.
డిజిటల్ చట్టాలు, మేధోసంపత్తి, డేటా ప్రొటెక్షన్, సైబర్ సెక్యూరిటీ వంటి విషయాల నిపుణుడు కాల్జా నేతో, రోడ్రిగుయేజ్ అభిప్రాయంతో ఏకీభవిస్తూ “ఎన్నికల ప్రచారం ఇక ఏమాత్రం నిర్దేశించిన టీవీ సందేశాలకు పరిమితం కాలేదు.
ఓటర్లు పనిలో ఉన్నా, ప్రయాణంలో ఉన్నా, ఇంట్లో ఉన్నా, కుటుంబ సభ్యులు, మిత్రులతో ముచ్చట్లలో ఉన్నా.. ప్రతి నిమిషం ఎన్నికల ప్రచారం వారిని చేరుతూనే ఉంది. ఈ ప్రయత్నంలో ప్రతి పౌరుడు సమాచారం అందుకోవడమే కాక, పంచుకునే సాధనంగా కూడా మారాడు” అని అన్నారు.
ఫ్లావియో బోల్సొనారోను ఆత్మరక్షణలోకి నెట్టడం
ప్రధాన ప్రత్యర్థి ఫ్లావియో బోల్సొనారో చుట్టూ ఉన్న ప్రతికూల విషయాలను కూడా జనోనెస్ తన సోషల్ మీడియా ప్రచారంలో సాధనాలుగా వాడుకున్నారు. 2025 ఆగస్టు నుంచి ఫ్లావియో తండ్రి, మాజీ దేశాధ్యక్షుడు జైర్ బోల్సొనారో ప్రభుత్వ కూల్చివేత కుట్ర కేసులో గృహనిర్బంధంలో ఉన్నారు.
జనోనెస్ ప్రధానంగా ప్రచారంలో తెచ్చిన విషయం ఫ్లావియో నివాసం ముందు హత్యకు గురైన ఐదేళ్ల అనా క్లారాకు సంబంధించిన విషయం.
ఫోరెన్సిక్ నివేదిక ప్రకారం మిలిటరీ పోలీసు అధికారి బ్రూనో దియాస్ డెలరోలీ తుపాకి నుంచి వచ్చిన బుల్లెట్లు ఆ పాపకు తగలటంతో ఆమె చనిపోయింది. ఈ ఘటన 2021లో జరిగింది. అప్పటినుంచి ఆయన బెయిల్ మీదనే ఉన్నారు. ఈ అధికారి తరఫున ఫ్లావియో న్యాయవాదిగా ఉన్నారు.
పాపకు ఇవ్వాల్సిన నష్టపరిహారం ఇవ్వకుండా కేసును వాయిదా వేస్తూ వచ్చారు. చివరకు కేసు 2027 మే 5వ తేదీకి వాయిదా పడటంతో సదరు ముద్దాయి మిలిటరీ పోలీసు అధికారి ఊపిరి పీల్చుకున్నాడు.
2019 నుంచి 2022 వరకు అధికారంలో ఉన్న జైర్ బోల్సొనారో అనుసరించిన విధానాలతో ప్రస్తుత అధికారంలో ఉన్న లూలా ప్రభుత్వ విధానాలను పోలుస్తూ కూడా ఈ వాట్సాప్ ఆర్మీ అనేక విషయాలు ప్రచారంలోకి తెచ్చింది.
భారీగా పెరిగిన ధరలు, కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరించటం కారణంగా 7 లక్షల మంది చనిపోయిన విషయాన్ని కూడా ఈ వాట్సాప్ ఆర్మీ చర్చకు పెట్టింది.
“లూలా ఎన్నికల ప్రచారంలో దిట్ట. రెండో దఫా గెలుపుకు పాత కొత్త ప్రభుత్వాల మధ్య పోలికే కీలకం అన్న విషయం బాగా తెలిసిన నాయకుడు. జైర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను చర్చకు పెడుతూ బోల్సొనారో అధికారానికి తిరిగి వస్తే జరగబోయే నష్టం ఏమిటో జనంలో చర్చకు తెచ్చాడు. బోల్సొనారో కుటుంబం అధికారానికి వస్తే దేశంలో ఏమి జరుగుతుంది అనే భయం చుట్టూనే ఈ ప్రచారం, పోలిక జరిగాయి. రిస్క్ తీసుకోదలుచుకుంటే మరెవరికైనా ఓటు వేయండి అనే వాదనలు వినిపించారు. ఇలాంటి ప్రచారంతోనే లూలా ఓటర్లను రెండో దఫా పోలింగ్ నాటికి తన వైపు తిప్పుకున్నాడు” అని బ్రెజిలియన్ పొలిటికల్ సైంటిస్ట్ అలెగ్జాండ్రే బందేయిరా ఎన్డబ్ల్యూఎస్తో అన్నారు.
బోల్సొనారో పొరపాట్లు
బోల్సొనారో చేసిన ఒక పొరపాటును లూలా టీమ్ బాగా ఉపయోగించుకుంది. మొదటి దఫా గెలిచి అప్పటికే ఐదు శాతం ఓట్లు సంపాదించుకున్న రోనాల్డో కేయి, అగస్టో క్యూరీ మద్దతు సంపాదించుకున్న తర్వాత వెంటనే తన కొత్త ప్రభుత్వంలో ఎవరెవరు ఏ శాఖలకు నాయకత్వం వహిస్తారో ఒక కేబినెట్ లాగా ప్రకటించేశారు. దాంతో ఫ్లావియోకు కొత్త సమస్యలు ఎదురయ్యాయి.
“మౌలిక సమస్యలపై బోల్సొనారో అనేక తప్పుడు నిర్ణయాలు చేశారు. ఎన్నికల క్రమం పూర్తికాకముందే మంత్రిమండలి ప్రకటించడంతో ప్రజలు దాన్ని అహంకారంగా భావించారు. ఒకసారి మంత్రిమండలిని ప్రకటించిన తర్వాత వాళ్లే రెండో దఫా ఎన్నికల ప్రచారకులుగా మార్చుకున్నాడు. ఇది అత్యంత ముఖ్యమైన పొరపాటు. ప్రచారంలో ఎక్కువ మందిని దించడంతో ఎవరు ఏం చేస్తున్నారో, ఎవరు ఏ ఎజెండా ముందుకు తెస్తున్నారో అన్నది అభ్యర్థి నియంత్రణలో లేకుండా పోయింది. ఎక్కువ మంది అనేక విషయాలు మాట్లాడుతున్నప్పుడు నీవు ఏమి మాట్లాడుతున్నావు అన్నది జనానికి తెలియకుండా పోతుంది. దాంతో పాటు ఇతరులు ఏమి చెప్తున్నారో కూడా వినేవాళ్లకి గందరగోళం ఉంటుంది” అని బందేయిరా అన్నారు.
ఫ్లావియో మంత్రిమండలిలో ఆర్థిక మంత్రిగా ప్రకటించబడిన దేనిలా మార్క్విజ్తో పాటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లుగా ఉన్న పాబ్లో మార్కల్, నికోలస్ ఫెరీరాలు బోల్సొనారో ఎన్నికల ప్రచారాన్ని గందరగోళంగా మార్చేశారు.
దేనిలా మార్క్విజ్ తన ప్రచారంలో చివరకు ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న వాళ్లందరి స్థానంలో కృత్రిమ మేధను ఉపయోగించడం కొత్త ప్రభుత్వ విధానంగా ఉండబోతోందని కూడా ప్రకటించాడు. ఈ అంశాన్ని లూలా తర్వాత తన ప్రచారంలో భాగంగా వాడుకున్నాడు.
ఫ్లావియో మంత్రిమండలి రూపంలో ఎత్తుకున్న ప్రచార వ్యూహంతో చివరకు న్యాయవ్యవస్థపై బోల్సొనారో ఎక్కుపెట్టిన విమర్శ కూడా పలచబారింది.
తన తండ్రి పేరున వచ్చిన విమర్శల నేపథ్యంలో తనను తాను మధ్యవాదిగా చూపించుకునే ప్రయత్నం చేయటంతో దేశంలోని అత్యంత బలమైన మితవాదుల మద్దతును ఫ్లావియో కోల్పోయారు.
కోర్టులు, మెటా – నియంత్రణల గురించిన పోరాటం
సోషల్ మీడియాలో కథనాలను నిర్మించే ప్రయత్నం(నేరేటివ్ బిల్డింగ్) చివరకు కోర్టు మెట్లెక్కింది. లూలా ప్రారంభించిన ఈ నేరేటివ్ బిల్డింగ్ జైర్ బోల్సొనారో నియమించిన ఇద్దరు న్యాయమూర్తులు – కసియో నూనెస్ మార్క్వేజ్, అండ్రే మెండొకలతో తలపడాల్సి వచ్చింది.
ఈ ఉద్రిక్తతల నడుమ బ్రెజిల్ ప్రభుత్వం ఐక్యరాజ్యసమితిలో ‘మెటా’కు వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. మెటా కంపెనీ బ్రెజిల్లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో జోక్యం చేసుకుంటోందన్నది ఫిర్యాదు. సామాజిక మాధ్యమాలపై నియంత్రణ పెరగాలన్న డిమాండ్ పుంజుకుంది.
మెటా జోక్యంతో స్వయంగా అధ్యక్షుడు లూలా చేపట్టిన ప్రచారం వెనుకంజ వేయడంతో లూలా ఎన్నికల ప్రచార నిర్వహణ బృందం ఈ డిమాండ్‌ను ముందుకు తీసుకువచ్చింది.
“బ్రెజిల్ సోషల్ మీడియాను నియంత్రించాలి. కానీ ఇక్కడ ప్రధాన సమస్య నియంత్రణ లేకపోవడం కాదు. ప్రధాన టెక్నాలజీ కంపెనీల ప్రవర్తన నియమావళిని నిర్దేశించి నియంత్రించడానికి కావాల్సిన చట్టపరమైన విధివిధానాలు బ్రెజిల్లో అమలులో ఉన్నాయి. అయితే వీటిని సమర్థవంతంగా అమలులోకి తీసుకురావడమే ఇప్పటి అవసరం” అని కాల్జా నేతో అభిప్రాయపడ్డారు.
“పరువు నష్టం, బెదిరింపులు, రెచ్చగొట్టే చర్యలు, నేరాలకు ప్రేరేపించటం, ఆన్లైన్ స్కాములు, మోసాలు, తెలిసి మోసపూరిత చర్యలను సమర్థించడం వంటి నేరాలను నియంత్రించడానికి కావాల్సిన చట్టాలు ఉన్నాయి. అందువల్ల ప్రస్తుతం ఉన్న సమస్య ఆ చట్టాలను అమలు చేయడం. ప్రభుత్వ శాఖల్లో ఈ చట్టాలను అమలు చేయడానికి కావాల్సిన నైపుణ్యం, నిబద్ధత కరువయ్యాయి” అని ఆయన అన్నారు.
పార్లమెంట్ – లూలా కోసం ఎదురుచూస్తున్న ప్రత్యర్థి
లూలా 4వ దఫా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత న్యాయవ్యవస్థను సంస్కరించటం ఆయన ముందున్న ప్రధానమైన సవాలు.
తొలిసారిగా 2002లో, ఆ తర్వాత 2006, 2023 సంవత్సరాల్లో ఆయన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2027 నుంచి బాధ్యతల్లోకి రానున్న అధ్యక్షుడికి అనేక నూతన సవాళ్లు ఎదురుకానున్నాయి.
న్యాయవ్యవస్థలో సంక్షోభంతో పాటు లూలా తన రాజకీయ జీవితంలో ఎన్నడూ ఎదురుకానంత బలమైన ప్రతిపక్షంతో నిండిన పార్లమెంట్‌ను ఎదుర్కోనున్నారు.
ఫ్లావియో నేతృత్వంలోని లిబరల్ పార్టీకి 513 మంది ఉన్న పార్లమెంట్లో 121 మంది సభ్యులు, 81 మంది సభ్యులు ఉన్న ఎగువ సభలో 29 మంది ఎంపీలు ఉన్నారు.
సాధారణ చట్టాలు ఆమోదించడానికి లూలాకి సాధారణ మెజారిటీ సరిపోతుంది. కానీ రాజ్యాంగ సవరణ ఆమోదం పొందాలంటే పార్లమెంట్లో ఐదింట మూడు వంతుల మంది ఎంపీల మద్దతు కావాలి.
“లూలా సాధించిన విజయం అసామాన్యమైనది. నాలుగోసారి అధ్యక్షుడిగా గెలిచారు. అది బ్యాలెట్ బాక్స్ విజయం. అయితే మితవాద, మధ్యేవాదుల ఆధిపత్యంలో ఉన్న పార్లమెంట్లో గట్టి ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. నేడున్న దానికంటే ఎక్కువ వ్యతిరేకతతో ఉన్న ప్రతిపక్షాన్ని లూలా ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రస్తుత దశలోనే పార్లమెంట్లో వివిధ బృందాలతో చర్చలు, సంప్రదింపుల ద్వారా లూలా తీవ్రమైన ఒత్తిడి ఎదుర్కొన్నారు. పార్లమెంటులో వివిధ బృందాలతో చెప్పుకోదగ్గ సత్సంబంధాలు లేవు. సమర్థవంతమైన పాలన అందించాలంటే ఈ లోపాలను అధిగమించాలి” అని బందేయిరా అన్నారు.
లూలా గెలుపు ప్రకటన వెలువడిన తొలిరోజు దేశ కరెన్సీ విలువ గణనీయంగా పడిపోయింది. స్టాక్ మార్కెట్లు కూడా పతనమయ్యాయి.
అయితే గతంలో వర్కర్స్ పార్టీ గెలిచిన సందర్భాల్లో కూడా స్టాక్ మార్కెట్లు ఇలా వ్యవహరించడం సహజమే. వ్యాపార వర్గాలు లూలాను బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు.
పనిగంటల కుదింపు ఎక్కడ వస్తుందో, ఆరు రోజుల పనికి ఒక గంట విరామం ప్రకారం పని జరుగుతుందా లేదా అన్న ఆందోళన వారిలో ఉంది. ఈ విధానం పట్ల ప్రైవేటు రంగం పూర్తిగా వ్యతిరేకతతో ఉన్నది.
81 ఏళ్ల లూలా ఇపుడు తన జీవితంలోనూ, దేశ చరిత్రలోనూ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ కొత్త అధ్యాయంలో ఎన్ని మలుపులు ఉండనున్నాయన్నది ఎవరికీ తెలియదు.
ఇప్పటికే బ్రెజిల్లో అనేక చారిత్రక మార్పులకు పునాదులు వేసిన లూలా ఈ నాలుగేళ్లలో ఆధునిక బ్రెజిల్లో అత్యంత ప్రభావవంతమైన ప్రముఖుడిగా నిలిచిపోనున్నారు. ఏమైనా తేడాలు జరిగితే, తప్పటడుగులు పడితే ఆరు దశాబ్దాల ప్రజాజీవితంలో లూలా తెచ్చుకున్న పేరు ప్రతిష్ఠలు మసకబారనూవచ్చు.
రచన: థియగో రాబేలో
అనువాదం: కొండూరి వీరయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
