♦ విద్వేష దాడులకు పుస్తక ప్రేమికుల సవాలు
♦ ‘వాక్ ఫర్ బుక్స్’తో కోల్కతా వీధుల్లో అక్షర విప్లవం
♦ బెంగాల్ చైతన్య దీపం ముందు మోకరిల్లిన నిరంకుశత్వం
చేతుల్లో రాజకీయ జెండాలు లేవు.. పార్టీ నినాదాలు లేవు.. రెచ్చగొట్టే ప్రసంగాలు లేవు. కానీ ప్రతి ఒక్కరి చేతిలో ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకమే వారి నిరసన ఆయుధం.. ఆ అక్షరాలే వారి ఆవేదన.. ఆ అడుగులే వారి ప్రజాస్వామిక ప్రతిఘటన.
2026 అక్టోబరు 31 శనివారం సాయంత్రం కోల్కతా వీధులు ఒక అపూర్వ విప్లవానికి వేదికయ్యాయి. ‘పుస్తకాల కోసం నడవండి’(Walk for Books – Boiyer Jonno Hatun) అనే పిలుపుతో చారిత్రాత్మక కాలేజ్ స్క్వేర్ నుంచి ఎగిసిపడిన అక్షరాల సైన్యం నిరంకుశ ఫాసిస్టు శక్తుల పునాదులను కదిలించింది. ఈ ర్యాలీ దేశవ్యాప్తంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
చేతుల్లో పుస్తకాలే నిరసన చిహ్నాలు
రచయితలు, కవులు, మేధావులు, అధ్యాపకులు, విద్యార్థులు, ప్రచురణకర్తలు, కళాకారులు, సామాన్య పౌరులు వేలాదిగా తరలివచ్చారు.
రవీంద్రనాథ్ ఠాగూర్, శరత్చంద్ర ఛటోపాధ్యాయ, బంకించంద్ర ఛటోపాధ్యాయ రచనలతో పాటు మార్క్సిస్టు, ప్రగతిశీల సాహిత్యాన్ని చేతబూని వీధుల్లో నడిచారు.
పుస్తక స్టాళ్లపై దాడులకు నిరసనగా, చదివే హక్కును, ఆలోచించే స్వేచ్ఛను కాపాడాలనే సంకల్పంతో సాగిన ఈ ర్యాలీలో పార్టీల జెండాలకు బదులు పుస్తకాలే నిరసన చిహ్నాలయ్యాయి.
ఇది ఒక రాజకీయ పార్టీ నిర్వహించిన ప్రదర్శనగా కాకుండా పుస్తక ప్రేమికులు, పౌర సమాజం స్వచ్ఛందంగా గొంతుకలిపిన అరుదైన పౌర నిరసనగా నిలిచింది.
ఎనిమిదేళ్ల చిన్నారుల నుంచి 90 ఏళ్ల వృద్ధ మేధావుల వరకు వేలాది మంది పౌరులు తమ చేతుల్లో పుస్తకాలను ఆకాశం వైపు ఎత్తిపట్టి నిశ్శబ్దంగా, అగ్నిపర్వతంలా అడుగులు వేశారు.
అక్షరాన్ని విద్వేషం జయించలేదని, పుస్తకాలను తగలబెట్టే మూకలకు సమాజం లొంగదని ఈ ర్యాలీ విశ్వరూపం చూపిస్తూ చాటిచెప్పింది.
బీజేపీ-ఆరెస్సెస్ శక్తుల విధ్వంసకాండ
పశ్చిమబెంగాల్ శరదృతువు దసరా ఉత్సవాల వేళ దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయానికి గండికొడుతూ, సుమారు 300కు పైగా ప్రగతిశీల, సామాజిక పుస్తక దుకాణాలపై బీజేపీ-ఆరెస్సెస్ మతతత్వ మూకలు, మున్సిపల్ బుల్డోజర్లు దాడులకు పాల్పడ్డాయి.
ధాకురియా నుంచి నార్త్ 24 పరగణాల వరకు పుస్తకాలపై సాగిన ఈ విధ్వంసకాండకు నిరసనగా ఈ అపూర్వ ప్రజా చైతన్యం వెల్లువెత్తింది.
90 ఏళ్ల వయోవృద్ధ మేధావి ప్రొఫెసర్ పవిత్ర సర్కార్, విశ్రాంత ఐఏఎస్ అధికారి జవహర్ సర్కార్, పాత్రికేయులు పరంజాయ్ గుహా ఠాకుర్తా, ప్రముఖ నటులు సబ్యసాచి చక్రవర్తి, శిఖా ముఖర్జీ, ప్రొఫెసర్ సుకాంత చౌదరి వంటి ఎందరో మేధావులు, కళాకారులు మోకాళ్ల నొప్పులను సైతం లెక్కచేయకుండా ఈ ర్యాలీ ముందువరసలో నడిచి తమ నిరసనను వ్యక్తం చేశారు.
పుస్తకం.. నిరంకుశత్వాన్ని కూల్చే ఆయుధం
దుర్గాపూజ ఉత్సవాల్లో ప్రగతిశీల ఆలోచనలు సమాజంలోకి వెళ్లకుండా అడ్డుకోవడానికి పుస్తక స్టాళ్లను తగలబెట్టిన శక్తులకు బెంగాల్ పౌర సమాజం ఇచ్చిన సమాధానం ఇది.
‘పుస్తకం కేవలం కాగితాల కట్ట కాదు.. అది రగులుతున్న ఆలోచన, ప్రశ్నించే గొంతుక, నిరంకుశత్వాన్ని కూల్చే ఆయుధం’ అని పౌర సమాజం ఏకకంఠంతో చాటిచెప్పింది.
దాడులకు భయపడటం అటుంచి, పౌరులు అందించిన అపూర్వ మద్దతుతో బెంగాల్ వ్యాప్తంగా ఈ పుస్తక స్టాళ్ల ద్వారా ఏకంగా రూ 1.5 కోట్లకు పైగా విలువైన జ్ఞాన సాహిత్యం అమ్ముడుపోవడం విశేషం.
పుస్తకాలను ధ్వంసం చేయాలనుకున్న విద్వేష మూకల చెంపపెట్టులా ఈ ఫలితం నిలిచింది.
పుస్తక స్టాల్ అనేది కేవలం వ్యాపార స్థలం కాదు. శ్రమజీవుల జీవితాలను, వర్గ అసమానతలను, సామాజిక దోపిడీని, అధికార సంబంధాలను చర్చించే ప్రజా వేదిక. అలాంటి వేదికలను బలవంతంగా మూసివేయడం భావజాల పోరాటాన్ని భౌతిక బలంతో అణచివేయాలనే ప్రయత్నంగా విమర్శకులు అభివర్ణిస్తున్నారు. ప్రజలు మాత్రం పుస్తకాన్ని ఆయుధంగా చేసుకుని తమ నిరసనను తెలియజేశారు.
పుస్తకాలు కేవలం జ్ఞానాన్ని అందించే సాధనాలు కావు. సమాజంలోని వర్గ సంబంధాలను అర్థం చేసుకోవడానికి, దోపిడీ స్వరూపాన్ని గుర్తించడానికి, ఆధిపత్య వ్యవస్థలను ప్రశ్నించడానికి అవి కీలకమైన సాధనాలు.
కార్మికులు, రైతులు, మహిళలు, విద్యార్థులు తమ హక్కుల గురించి తెలుసుకుని సంఘటితమయ్యే ప్రక్రియలో పఠనం, చర్చ, విమర్శనాత్మక ఆలోచనలకు ప్రత్యేక స్థానం ఉంది.
అక్షరాన్ని అవమానించేవారు అజ్ఞానులు
మానవ నాగరికత పురోగతికి ఏకైక పునాది పుస్తకం మాత్రమేనని, అలాంటి అక్షరాన్ని అవమానించేవారు నాగరిక సమాజంలో నివసించే అర్హత లేని అజ్ఞానులని పౌర సమాజం తీవ్ర ఆక్రోశంతో స్పందించింది.
పుస్తకాలను తొక్కివేసిన విద్వేష మూకల ముఖంపై ఈ అపూర్వ ‘బొయెర్ జోన్నో హాటున్'(Walk for Books) ఉద్యమం ఒక బలమైన చెంపపెట్టు అని, బెంగాల్ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవడానికి వేలాది మంది పుస్తకంతో వీధుల్లోకి రావడం ఒక నవ శకానికి సూచిక అని మేధావులు పేర్కొన్నారు.
గతంలో తస్లీమా నస్రీన్ పుస్తకం ‘ద్విఖండితో’ నిషేధం నుంచి నేటి పుస్తక స్టాళ్ల విధ్వంసం వరకు—ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా భావప్రకటన స్వేచ్ఛపై జరిగే దాడిని ఖండించాల్సిందేనని పౌర శక్తులు స్పష్టం చేశాయి.
ఎన్నికల రాజకీయం, ఏ పార్టీ ఓటు బ్యాంక్ అనే లెక్కలకు అతీతంగా- అక్షరం కోసం, ప్రశ్నించే స్వేచ్ఛ కోసం పౌరులంతా పుస్తకాన్ని ఆయుధంగా పట్టి కదం తొక్కడమే నిజమైన ప్రజాస్వామ్య చైతన్యమని సమాజం ఏకకంఠంతో నినదించింది.
నాగేర్బజార్ వీధుల్లో 73 ఏళ్ల వృద్ధుడు బిపుల్ దాస్గుప్తా తగులబడుతున్న స్టాల్ ముందు మోకరిల్లి ‘పుస్తకాలను నాశనం చేయకండి, చదువే సమాజాన్ని మారుస్తుంది’ అని వేడుకున్న దృశ్యం కాలేజ్ స్ట్రీట్ ర్యాలీలో ప్రతి ఒక్కరిని కదిలించింది.
అది ఒక్క వృద్ధుడి విజ్ఞప్తి కాదు, ఫాసిజం ముందు ప్రజాస్వామ్యం విసిరిన చారిత్రక సవాలు. మున్సిపల్ అధికారులను వాడుకుని బుల్డోజర్లతో పుస్తక దుకాణాలను కూల్చివేయడం, ‘బామ్ బాధ్'(వామపక్షాలను అంతం చేయండి) అనే ముసుగులో విజ్ఞాన విక్రయాలను ఆపడం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ స్ఫూర్తిని బహిరంగంగా హత్య చేయడమే.
ఎస్ఆర్ఎఫ్టీఐ విద్యార్థులపై దాడులు
ఇటు వీధుల్లో పుస్తకాలపై దాడులు జరుగుతుంటే, మరోవైపు దేశానికే గర్వకారణమైన కోల్కతాలోని సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్(ఎస్ఆర్ఎఫ్టీఐ) ప్రాంగణంలోకి బయటి హిందుత్వ శక్తులను అనుమతించి, విద్యార్థులపై భౌతిక దాడులకు పాల్పడ్డారు.
సెప్టెంబరు 27, అక్టోబరు 4 తేదీల్లో ఎబీవీపీ, హిందూ జాగరణ్ మంచ్ వంటి సంస్థల కార్యకర్తలు రాళ్లు, పదునైన ఆయుధాలతో దాడి చేసి పదుల సంఖ్యలో విద్యార్థులను గాయపరిచారు.
దాడులకు పాల్పడిన మూకలను విడిచిపెట్టి, ప్రశ్నించిన ఆరుగురు విద్యార్థులను ఏడాది పాటు సస్పెండ్ చేయడం పరిపాలనా వ్యవస్థ నైతిక పతనానికి నిదర్శనం.
ఈ అణచివేతపై దేశవ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. నసీరుద్దీన్ షా, పాయల్ కపాడియా, ఆనంద్ పట్వర్ధన్ వంటి ప్రముఖ కళాకారులు విద్యార్థుల వెన్నంటి నిలిచారు. విద్యార్థుల భద్రతను గాలికి వదిలేసినందుకు నిరసనగా ఎస్ఆర్ఎఫ్టీఐ అధ్యాపకులు అంతర్జాతీయ చలనచిత్రోత్సవం నుంచి వైదొలగడం ఈ పోరాట నైతిక బలాన్ని చాటుతోంది.
కుల, మత విభజన రాజకీయాలు
అసలైన ప్రజల సమస్యలైన పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం నుంచి సమాజ దృష్టిని మళ్లించడానికే ఈ రకమైన కుల, మత విభజన రాజకీయాలను తెరపైకి తెస్తున్నారు. ప్రజలను మానసికంగా, మతపరంగా విడదీసి తమ పబ్బం గడుపుకోవాలని చూసే శక్తుల కుట్రలను పౌర సమాజం తిప్పికొడుతోంది.
అధికారం, సంపద కేంద్రీకృతమైన శక్తులు ఎప్పుడూ ఆలోచనకు, ప్రశ్నించే అక్షరానికి తీవ్రంగా భయపడతాయి.
చరిత్రలో హిట్లర్ నాజీ జర్మనీలో పుస్తకాలను తగలబెట్టినట్లే, నేడు బెంగాల్ సాంస్కృతిక స్వేచ్ఛపై దాడులు చేస్తున్నారు. కానీ పుస్తకాలను తగలబెట్టిన ఏ నిరంకుశత్వమూ చరిత్రలో మిగలలేదు.
అక్షర చైతన్యాన్ని ఎవరూ చంపలేరు
మనుషులను, వారి భౌతిక దేహాలను చంపవచ్చు కానీ.. వారి గుండెల్లో రగిలే భావాలను, శతాబ్దాల అక్షర చైతన్యాన్ని ఏ శక్తి కూడా చంపలేదనే సత్యాన్ని దాడులకు పాల్పడుతున్న విద్వేష మూకలు గుర్తుంచుకోవాలని పౌర సమాజం తీవ్ర హెచ్చరిక జారీ చేసింది.
విద్యాసంస్థల్లో రాజ్యాంగబద్ధంగా సిద్ధించిన హక్కులను కాలరాస్తూ, తమ హక్కుల కోసం నిలదీసే విద్యార్థులను ‘అర్బన్ నక్సల్స్’, ‘దేశద్రోహులు’ అంటూ ముద్రవేసి భయభ్రాంతులకు గురిచేసే కుట్రలను తిప్పికొట్టాల్సిన చారిత్రక బాధ్యత నేడు దేశ పౌరులపై, యువతపై ఉందనడంలో ఎలాంటి సందేహం లేదని ఈ చారిత్రక ర్యాలీ స్పష్టం చేసింది.
కళాశాలలు, విశ్వవిద్యాలయాలు స్వేచ్ఛా మేధోమథనానికి నిలయాలుగా విలసిల్లాలి తప్ప, మతతత్వ రాజకీయాల క్రీడాప్రాంగణాలుగా మారకూడదని ఈ ప్రజాస్వామ్య చైతన్యం బిగ్గరగా నినదించింది.
తక్షణమే ఎస్ఆర్ఎఫ్టీఐ పరిపాలనా యంత్రాంగం విద్యార్థులపై విధించిన ఏకపక్ష సస్పెన్షన్ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని పౌర వేదికలు ఖండితంగా డిమాండ్ చేశాయి.
ఈ ‘వాక్ ఫర్ బుక్స్’ ర్యాలీ కేవలం ఒక నిరసన మాత్రమే కాదు.. అది ఫాసిస్టు ధోరణులపై ప్రజాస్వామ్య సమాజం ప్రకటించిన యుద్ధం. పుస్తకాన్ని కాపాడుకోవడం అంటే మన ఆలోచనా స్వేచ్ఛను, రాజ్యాంగాన్ని కాపాడుకోవడమే.
నిరంకుశత్వంతో ఆలోచనను అణచివేయాలనుకునే చీకటి శక్తుల ముందర రాజ్యాంగ స్ఫూర్తి, అక్షర చైతన్యం ఎన్నటికీ తలవంచవని బెంగాల్ పౌర సమాజం తెగేసి చెప్పింది.
కాలేజ్ స్ట్రీట్ వీధుల నుంచి ఉద్భవించిన ఈ అక్షరాయుధం, దేశమంతటా ప్రజాస్వామ్య వెలుగులను నింపుతూ చైతన్య రథాన్ని ముందుకు నడిపిస్తుందని పౌర శక్తులు స్పష్టం చేశాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
