న్యూఢిల్లీ: ప్రముఖ స్కాలర్లు, సామాజిక కార్యకర్తలు ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు బెయిల్ నిరాకరిస్తూ గతంలో సుప్రీంకోర్టుకు చెందిన మరో ధర్మాసనం ఇచ్చిన వివాదాస్పద తీర్పుపై నేడు సర్వోన్నత న్యాయస్థానపు ప్రస్తుత ధర్మాసనం తీవ్ర సందేహాలు వ్యక్తం చేసింది.
2020లో జరిగిన ఢిల్లీ మత అల్లర్ల వెనుక ఉన్న “బృహత్తర కుట్ర”లో భాగస్వామ్యం ఉందన్న ఢిల్లీ పోలీసుల ఆరోపణల నేపథ్యంలో ఐదేళ్లకు పైగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖలీద్, ఇమామ్‌ల బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ఈ ఏడాది జనవరిలో తిరస్కరించింది.
అదే సమయంలో గుల్ఫిషా ఫాతిమా, మీరాన్ హైదర్, షిఫా ఉర్ రెహ్మాన్, షాదాబ్ అహ్మద్, మహ్మద్ సలీమ్ ఖాన్లకు మాత్రం బెయిల్ మంజూరు చేసింది.
‘నజీబ్’ తీర్పును పట్టించుకోకపోవడంపై ఆందోళన..
నార్కో-టెర్రరిజం ఆరోపణలపై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఐదేళ్లకు పైగా కస్టడీలో ఉన్న సయ్యద్ ఇఫ్తికార్ అంద్రాబీ బెయిల్ పిటిషన్‌ను అనుమతిస్తున్న సందర్భంగా, మే 18న జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌లతో కూడిన ధర్మాసనం గత(జనవరి) తీర్పు పట్ల తమ తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసినట్లు ‘లైవ్‌లా’ కథనం తెలియజేసింది.
ఉపా కేసుల్లో సుదీర్ఘకాలం పాటు విచారణ ఆలస్యం కావడం అనేది బెయిల్‌కు సరైన ప్రాతిపదికగా పరిగణించబడుతుందని 2021లో ‘యూనియన్ ఆఫ్ ఇండియా వర్సెస్ కేఏ నజీబ్’ కేసులో ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును- గత బెంచ్ సరిగ్గా పాటించలేదని ప్రస్తుత ధర్మాసనం స్పష్టం చేసింది.
హక్కులను కాలరాయడమే..
2024 నాటి ‘గుర్విందర్ సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ కేసులోనూ నజీబ్ తీర్పును గౌరవించలేదని కోర్టు ఈ సందర్భంగా గుర్తుచేసింది.
“గుల్ఫిషా ఫాతిమా కేసులో ఇచ్చిన తీర్పు పట్ల మాకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయి. సెక్షన్ 43D(5) నుంచి నజీబ్ తీర్పు(నిందితులను నిరవధికంగా జైలులో ఉంచలేమని చెప్పే తీర్పు) అనేది కేవలం ఒక ఇరుకైన, అసాధారణమైన మినహాయింపు మాత్రమేనని ఆ తీర్పు మమ్మల్ని నమ్మించేలా ఉంది. నజీబ్ కేసులోని పరిశీలనల ప్రాముఖ్యతను ఇలా నిర్వీర్యం చేయడమే మా ప్రధాన ఆందోళన. చుట్టుపక్కల ఉన్న పరిస్థితుల ఆధారంగా, కేవలం సుదీర్ఘ సమయం గడిచిపోవడం అనేది ఒక నిందితుడిని యాంత్రికంగా విడుదల చేయడానికి అర్హుడిని చేస్తుందని నజీబ్ తీర్పు స్పష్టం చేస్తోంది” అని కోర్టు పేర్కొన్నట్లు ‘బార్ అండ్ బెంచ్’ పేర్కొన్నది.
‘నజీబ్’ తీర్పు అత్యున్నతమైనది..
నజీబ్ తీర్పు అత్యున్నతమైనదని, దానితో చెలగాటం ఆడటానికి వీల్లేదని ధర్మాసనం స్పష్టం చేసింది.
“ఆ స్ఫూర్తితో, నజీబ్ అనేది అందరూ కట్టుబడి ఉండాల్సిన చట్టమని, దానికి న్యాయపరమైన క్రమశిక్షణ రక్షణ ఉందని మేము స్పష్టం చేస్తున్నాము. కింది కోర్టులు, హైకోర్టులు లేదా ఈ సుప్రీంకోర్టులోని తక్కువ బలం ఉన్న ధర్మాసనాలు కూడా దీన్ని పలుచన చేయడం, ఉల్లంఘించడం లేదా విస్మరించడం లాంటివి చేయకూడదు” అని కోర్టు తేల్చి చెప్పింది.
అలాగే, ఉపా కింద విచారణకు ముందు సుదీర్ఘకాలం జైలులో ఉంచడాన్ని సమర్థించుకోవడానికి నజీబ్ తీర్పుకు ముందు వచ్చిన ‘ఎన్ఐఎ వర్సెస్ జహూర్ అహ్మద్ షా వటాలీ(2019)’ తీర్పును సాకుగా చూపకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
చిన్న ధర్మాసనాలు పెద్ద వాటిని ఉల్లంఘించలేవు..
“ఉపా కింద కూడా బెయిల్ అనేది నియమమేనని, జైలు అనేది కేవలం ఒక మినహాయింపు మాత్రమేనని చెప్పడంలో మాకు ఎలాంటి సందేహం లేదు. అయితే, ఆయా నిర్దిష్ట కేసుల వాస్తవాలను దృష్టిలో ఉంచుకుని తగిన సందర్భాల్లో బెయిల్ నిరాకరించవచ్చు” అని బార్ అండ్ బెంచ్ నివేదిక వెల్లడించింది.
ధర్మాసనాల బలం గురించి కూడా కోర్టు ఒక కీలక సూచన చేసింది. “తక్కువ మంది న్యాయమూర్తులున్న ధర్మాసనం(చిన్న ధర్మాసనం) ఇచ్చే తీర్పు, ఎక్కువ మంది న్యాయమూర్తులున్న ధర్మాసనం(పెద్ద ధర్మాసనం) ప్రకటించిన చట్టానికి కట్టుబడి ఉండాలి. ఇలాంటి బైండింగ్ ప్రిసిడెంట్ను(కట్టుబడి ఉండాల్సిన పూర్వ తీర్పును) తప్పక పాటించాలని లేదా సందేహం ఉన్న సందర్భంలో దానిని మరింత పెద్ద ధర్మాసనానికి సూచించాలని న్యాయపరమైన క్రమశిక్షణ నిర్దేశిస్తుంది. అంతేకాని, పెద్ద ధర్మాసనం ఇచ్చిన తీర్పును చిన్న ధర్మాసనం పలుచన చేయడం, పక్కదారి పట్టించడం లేదా విస్మరించడం చేయకూడదు” అని జస్టిస్ భుయాన్ ఈ తీర్పులో పేర్కొన్నట్లు లైవ్‌లా తెలిపింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
