NEET-UG(నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) చుట్టూ పదే పదే వెలువడుతున్న వివాదాలు కేవలం పరీక్షల్లో జరిగే అక్రమాలకు మాత్రమే సంబంధించినవి కావు.
ప్రశ్నాపత్రాల లీకులు, ఇతరుల బదులు పరీక్షలు రాయించడం, అక్రమాలు, చివరి నిమిషంలో పరీక్షల రద్దు వంటి ఘటనలు భారత విద్యా వ్యవస్థలో ఒక లోతైన నిర్మాణాత్మక సంక్షోభాన్ని సూచిస్తున్నాయి.
ఈ సమస్యను కేవలం పోలీసింగ్, పర్యవేక్షణ కోణంలో మాత్రమే చూడకుండా, విద్యా వ్యవస్థలోని విస్తృత సమస్యగా అర్థం చేసుకోకపోతే ఇలాంటి కుంభకోణాలు మళ్లీ మళ్లీ జరుగుతూనే ఉంటాయి.
ప్రతి లీక్ తర్వాత ప్రభుత్వ ప్రతిస్పందన దాదాపు ఒకేలా ఉంటుంది— అరెస్టులు, దర్యాప్తులు, కఠిన భద్రతా చర్యలు, బయోమెట్రిక్ ధృవీకరణ, సాంకేతిక రక్షణల హామీలు.
అయినప్పటికీ లీకులు ఆగడం లేదు. అంటే సమస్యను కేవలం నేరంగా మాత్రమే చూడలేమని ఇది సూచిస్తుంది.
అసలు సమస్య అధికంగా కేంద్రీకృతమైన, అత్యంత ప్రాధాన్యతను పొందిన పరీక్షలపై ఆధారపడిన విద్యా వ్యవస్థలో ఉంది.
గత మూడు దశాబ్దాలుగా భారతదేశం విద్యను పరీక్షల చుట్టూ తిరిగే వ్యవస్థగా మార్చుకుంది. కొన్ని గంటల్లో జరిగే ఒకే ఒక్క పరీక్ష ద్వారా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నిర్ణయించబడుతున్నప్పుడు, భారీ సామాజిక, మానసిక, ఆర్థిక ఒత్తిళ్లు సహజంగానే ఉత్పన్నమవుతాయి.
అలాంటి పరిస్థితుల్లో కోచింగ్ సంస్థలు, మధ్యవర్తులు, సంఘటిత మోసగాళ్ల నెట్వర్కులు విస్తరిస్తాయి. విద్య కంటే పరీక్షకే ఎక్కువ విలువ కలిగిన పరిస్థితి ఏర్పడుతుంది.
దీని ఫలితంగా విద్యార్థులను విభిన్న ప్రతిభలు కలిగిన వ్యక్తులుగా కాకుండా కేవలం ర్యాంకులు, మార్కుల రూపంలో మాత్రమే చూసే విద్యా సంస్కృతి పెరుగుతోంది.
ప్రమాణీకృత పరీక్షలపై అతిగా ఆధారపడటం వల్ల పాఠ్యాంశాలు, బోధనా విధానాలు, ఉపాధ్యాయ-విద్యార్థి సంబంధాలు వక్రీకృతమవుతున్నాయి.
అదే సమయంలో విద్య అసలు ఉద్దేశ్యమే సంకుచితమవుతోంది. కాబట్టి NEET సంక్షోభాన్ని ఈ విస్తృత నేపథ్యంతో చూడాలి.
పరీక్షల ఆర్థిక వ్యవస్థ విస్తరణ..
2017లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ఏర్పాటును ప్రవేశ పరీక్షలను వృత్తిపరంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు తీసుకున్న ప్రధాన సంస్కరణగా ప్రచారం చేశారు. కాని ఆశ్చర్యకరంగా, దాని స్థాపన తర్వాతి సంవత్సరాల్లో పరీక్షల విశ్వసనీయతపై అనేక వివాదాలు తలెత్తాయి.
వ్యక్తుల మార్పిడి ఆరోపణల నుంచి నీట్-యూజీ 2024లో బయటపడిన పెద్ద ఎత్తున అక్రమాల వరకు, కేంద్రీకృత పరీక్షల విశ్వసనీయతపై తీవ్రమైన సందేహాలు వ్యక్తమయ్యాయి.
నీట్ మాత్రమే కాదు, యూజీసీ-నెట్ 2024 రద్దు, పలు నియామక పరీక్షలపై దర్యాప్తులు కూడా కేంద్రీకృత పరీక్షా వ్యవస్థల సమగ్రతపై ప్రశ్నలు లేవనెత్తాయి.
ఇవి కేవలం పరిపాలనా వైఫల్యాలు కావు. భారీ ఆర్థిక ప్రయోజనాలు, కోచింగ్ పరిశ్రమలు, ప్రైవేట్ ఏజెంట్లు, నేర నెట్వర్కులు కలిసిపోయిన “పరీక్షల ఆర్థిక వ్యవస్థ” ఏర్పడిందని ఇవి సూచిస్తున్నాయి.
ఈ సంక్షోభపు మూలాలను మధ్యప్రదేశ్‌లో జరిగిన వ్యాపం(Vyapam-Vyavsayik Pariksha Mandal) కుంభకోణం ద్వారా అర్థం చేసుకోవచ్చు.
అధిక ప్రాధాన్యమున్న కేంద్రీకృత ప్రవేశ పరీక్షలు ఎలా నకిలీలు, లంచాలు, సంఘటిత మోసాలు, రాజకీయ ఆశ్రయాలకు దారితీసే ఆర్థిక వ్యవస్థలను సృష్టిస్తాయో వ్యాపం బయటపెట్టింది.
అంతర్జాతీయంగా కూడా ఇలాంటి కుంభకోణాలున్నాయి. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో విద్యార్థులు (133 లక్షలు) హాజరయ్యే చైనా, నేషనల్ కాలేజీ ఎంట్రన్స్ పరీక్ష(Gaoko)లో కూడా మోసాలు జరిగిన సందర్భాలున్నాయి.
అమెరికాలో 2019లో జరిగిన “ఆపరేషన్ వర్సిటీ బ్లూస్” కుంభకోణం ధనిక కుటుంబాలు లంచాలు, నకిలీ క్రీడా అర్హతలు, ప్రవేశ పరీక్షలలో జోక్యాల ద్వారా కళాశాల ప్రవేశాలను ఎలా మోసపూరితంగా సాధించాయో వెల్లడించింది.
విలియం సింగర్ నిర్వహించిన ఈ స్కాం తీవ్రమైన అసమానతలున్న సమాజంలో ఉన్నత విద్యా ప్రవేశాలపై ఎంతటి ఒత్తిడి ఉందో చూపించింది.
అయితే వ్యాపం, వర్సిటీ బ్లూస్ వంటి ఘటనల నుంచి పాఠాలు నేర్చుకోవాల్సింది పోయి, భారతదేశం కేంద్రీకృత పరీక్షల వ్యవస్థను మరింత విస్తరింపజేసింది.
కోచింగ్ సంస్కృతి, విద్యా వ్యాపారీకరణ..
నీట్ ప్రపంచంలోనే అతిపెద్ద కోచింగ్ ఆర్థిక వ్యవస్థలలో ఒకదాన్ని సృష్టించింది. ఇప్పుడు అనేక నగరాలు పూర్తిగా కోచింగ్ కేంద్రాలుగా మారిపోయాయి.
యువకులు సంవత్సరాల పాటు బహుళ ఎంపిక ప్రశ్నల పరీక్షల కోసం మాత్రమే సిద్ధమవుతున్నారు. వేగంగా పెరుగుతున్న ప్రైవేట్ కోచింగ్ రంగం, భారత పరీక్షల ఆర్థిక వ్యవస్థ ఎంత పెద్దదో సూచిస్తుంది.
ఐఐటీ- జెఇఇ 2026 కోసం 14.5 లక్షల విద్యార్థులు, నీట్ కోసం 22.7 లక్షల విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు.
ఈ రెండు పరీక్షల కోచింగ్ 58,000 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నది, ఇది 2028 కల్లా 1.3 లక్షల కోట్లకు విస్తరిస్తుందని చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో పేపర్ లీకులు అత్యంత లాభదాయక వ్యాపారాలుగా మారుతాయి. ఒక మెడికల్ సీటు సామాజిక గౌరవం, ఆర్థిక భద్రతకు ప్రతీకగా మారినప్పుడు అక్రమాలు సహజంగానే పెరుగుతాయి.
ఇంకా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ప్రభుత్వ విధానాలు ఈ కోచింగ్ సంస్కృతిని తప్పనిసరి వాస్తవంగా స్వీకరిస్తున్నాయి.
పాఠశాల విద్యను బలోపేతం చేసి కోచింగ్‌పై ఆధారపడటాన్ని తగ్గించాల్సింది పోయి, ఈ పరిశ్రమను నియంత్రించే దిశలోనే ఉంటున్నాయి, అవి కూడా సమగ్రంగా ఉండటం లేదు.
కేంద్ర ప్రభుత్వ “Guidelines for Regulation of Coaching Centers- 2024” కూడా నియంత్రణలేని కోచింగ్ కేంద్రాల పెరుగుదల, అధిక ఫీజులు, విద్యార్థుల ఒత్తిడి, ఆత్మహత్యలు, అగ్నిప్రమాదాలు, ఇతర అక్రమాలను అంగీకరించింది(Ministry of Education 2024).
ప్రస్తుత పరీక్షా వ్యవస్థ “హానికరమైన కోచింగ్ సంస్కృతిని” పెంచిందని కూడా గుర్తించింది.
ప్రవేశ పరీక్షలలో సంస్కరణలు చేసి కోచింగ్‌పై ఆధారపడటాన్ని తగ్గించాలని NEP కూడా సూచించింది), కాని కోచింగ్ పరిశ్రమను నిలబెట్టే పరీక్షా కేంద్రీకృత వ్యవస్థ మాత్రం ప్రశ్నించబడటం లేదు, కేవలం నియంత్రణ, రిజిస్ట్రేషన్, కౌన్సెలింగ్ వంటి చర్యలకే పరిమితమవుతున్నారు.
ఈ మార్గదర్శకాలు కోచింగ్ సంస్థలు తప్పుడు ర్యాంక్ హామీలు ఇవ్వకూడదని, 16 ఏళ్ల లోపు విద్యార్థులను చేర్చకూడదని, అత్యధిక సమయం తరగతులు నిర్వహించకూడదని పేర్కొంటున్నాయి.
అలాగే మానసిక కౌన్సెలింగ్, వారాంతపు విశ్రాంతి, మానసిక ఆరోగ్య శిబిరాలు, ఒత్తిడి నియంత్రణ చర్యలను కూడా సూచిస్తున్నాయి. ఇది ఒక ముఖ్యమైన వైరుధ్యాన్ని చూపిస్తోంది.
కోచింగ్ వ్యవస్థ విద్యార్థుల్లో తీవ్రమైన మానసిక ఒత్తిడి, ఆందోళనలను కలిగిస్తోందని ప్రభుత్వం అంగీకరిస్తోంది.
కాని కోచింగ్‌పై ఆధారపడటాన్ని తగ్గించడం బదులుగా, ఇప్పటికే సాధారణీకరించబడిన తీవ్రమైన పోటీ సంస్కృతిని అంగీకరించే ప్రయత్నం మాత్రమే జరుగుతోంది. 2018 నుంచి నిర్వహించబడుతున్న ప్రధాన మంత్రి ‘పరీక్ష పే చర్చ’ కార్యక్రమం దీనికి ఉదాహరణగా నిలుస్తుంది.
చైనా తీసుకున్న చర్యలతో పోలిస్తే, ఈ విధాన పరిమితులు మరింత స్పష్టమవుతాయి. 2021లో చైనా “డబుల్ రిడక్షన్” సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రైవేట్ ట్యూషన్ వ్యాపారీకరణను నియంత్రించింది.
ప్రధాన పాఠశాల విషయాల్లో లాభాపేక్షతో ట్యూషన్లు నిషేధించబడ్డాయి. కోచింగ్ సంస్థలు లాభాపేక్షలేని సంస్థలుగా పనిచేయాల్సి వచ్చింది. వారాంతాలు, సెలవుల్లో ట్యూషన్లపై పరిమితులు విధించబడ్డాయి.
ఈ సంస్కరణల ఉద్దేశ్యం విద్యార్థులపై విద్యా ఒత్తిడిని తగ్గించి పాఠశాల విద్యకు మళ్లీ ప్రాధాన్యం ఇవ్వడమే.
దీనికి విరుద్ధంగా, భారతదేశం కోచింగ్ వ్యవస్థ శాశ్వతమని అంగీకరిస్తూ దాని దుష్ప్రభావాలను మాత్రమే నియంత్రించేందుకు ప్రయత్నిస్తోంది.
అంతర్జాతీయ పాఠాలు, ప్రమాణీకృత పరీక్షల పరిమితులు..
ఫిన్లాండ్లో ప్రమాణీకృత పరీక్షలను చాలా తక్కువగా ఉపయోగిస్తారు. అక్కడ ప్రభుత్వ పాఠశాలలపై విశ్వాసం ఎక్కువ.
జర్మనీలో నిరంతర పాఠశాల ప్రదర్శన, వికేంద్రీకృత విద్యా నిర్మాణాలకు ప్రాధాన్యం ఉంటుంది.
అమెరికాలో ప్రమాణీకృత పరీక్షలపై పెరుగుతున్న విమర్శలు, విద్యా సమానత్వంపై ఆందోళనల కారణంగా చాలా విశ్వవిద్యాలయాలు SAT/ACT స్కోర్లను తప్పనిసరి చేయడం మానేశాయి.
FairTest ప్రకారం, అమెరికాలో 2,000కి పైగా కళాశాలలు, విశ్వవిద్యాలయాలు ఇప్పుడు SAT/ACT స్కోర్లు లేకుండానే ప్రవేశాలు ఇస్తున్నాయి.
జపాన్‌లో కూడా జాతీయ పరీక్షలతో పాటు విశ్వవిద్యాలయాల ప్రత్యేక పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా ఒత్తిడిని తగ్గిస్తారు.
ఈ వ్యవస్థల్లో కూడా అసమానతలు, పోటీ ఉంటాయి. కాని ఒకే ఒక్క పరీక్ష ఆధారంగానే విద్యావకాశాలను కల్పించవు.
ప్రతిభావాదం, సామాజిక చట్టబద్ధత..
అత్యంత పోటీతో కూడిన ప్రవేశ పరీక్షలలో ఉన్న పెద్ద ప్రమాదం కేవలం అక్రమాల్లోనే కాదు; అవి పెంచే సామాజిక విలువలలో కూడా ఉంది.
హార్వర్డ్ ప్రొఫెసర్ మైఖేల్ శాండెల్ ప్రకారం, ప్రతిభావాద సమాజాలు విజయం పూర్తిగా వ్యక్తిగత ప్రతిభ ఫలితమనే భ్రమను సృష్టిస్తాయి. కానీ అవకాశాలను నిర్ణయించే అసమాన సామాజిక పరిస్థితులను అవి పట్టించుకోవు.
పరీక్ష మార్కులే ప్రతిభకు ఏకైక కొలమానంగా మారినప్పుడు, విజయవంతమైన వారు తామే ఆ విజయానికి అర్హులమని భావిస్తారు.
విఫలమైన వారు అవమానం, నిస్సహాయతను అంతర్గతంగా స్వీకరిస్తారు. విద్య ఒక ప్రజాస్వామ్య హక్కు కాకుండా పోటీ ద్వారా వర్గీకరించే వ్యవస్థగా మారుతుంది.
ఇదే సామాజిక మానసికత కోచింగ్ పరిశ్రమను, పరీక్షల మోసాలను పెంచుతోంది. నీట్ చుట్టూ కనిపించే ఆత్రుత కేవలం డాక్టర్ కావాలనే కోరిక మాత్రమే కాదు; గౌరవం, సామాజిక గుర్తింపు, స్థానం కోసం జరుగుతున్న పోరాటం కూడా.
శాండెల్ చెప్పినట్లుగా, ఉన్నత విద్యా ప్రవేశాలపై ఉన్న మోజు పెరుగుతున్న అసమానతలను, విద్యా విజయమే వ్యక్తి విలువను నిర్ణయిస్తుందనే నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది.
ప్రవేశ విధానాలు, ప్రభుత్వ విద్యపై పునరాలోచన..
కాబట్టి నీట్ సంక్షోభానికి పరిష్కారం కేవలం ఎన్క్రిప్షన్ టెక్నాలజీలు, పర్యవేక్షణ వ్యవస్థలు, పోలీసింగ్ సంస్కరణల్లో లేదు.
భారతదేశం తన ప్రవేశ విధానాల వెనుక ఉన్న తత్వాన్ని మౌలికంగా పునరాలోచించాలి.
మొదటగా, నాణ్యమైన పాఠశాల విద్యను పెంపొందించుకోవాలి, దానికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.
పన్నెండు సంవత్సరాల విద్య ఒకే పరీక్ష ముందు విలువ కోల్పోతే, పాఠశాలల, ఉపాధ్యాయుల ప్రాముఖ్యత కూడా తగ్గిపోతుంది.
రెండవది, ప్రవేశ ప్రక్రియలు మరింత వైవిధ్యంగా ఉండాలి. పాఠశాల స్థాయి సాధన, అభిరుచి పరీక్షలు, ఇంటర్వ్యూలు, ప్రాంతీయ పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే ప్రమాణాలు కూడా ప్రవేశ పరీక్షలకు తోడుగా ఉండాలి. అతిగా కేంద్రీకరణ అసమానతలను, వ్యవస్థ బలహీనతలను పెంచుతుంది.
మూడవది, నాణ్యమైన ఉన్నత విద్యలో ప్రభుత్వ పెట్టుబడులు గణనీయంగా పెరగాలి.
తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న మెడికల్ సీట్ల కొరత నిరాశను పెంచి, పరీక్షల చుట్టూ నల్లబజార్ ఆర్థిక వ్యవస్థను పెంచుతోంది.
నాలుగవది, కోచింగ్ సంస్థల వ్యాపారీకరణను కఠినంగా నియంత్రించాలి. వాటిని తప్పనిసరి సమాంతర విద్యా వ్యవస్థలుగా అంగీకరించకూడదు.
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసి కోచింగ్‌పై ఆధారపడటాన్ని తగ్గించకపోతే పరీక్షా ఆధారిత అసమానత మరింత తీవ్రమవుతుంది.
చివరిగా, తీవ్రమైన పోటీ స్వయంగా విద్యా నాణ్యతను పెంచుతుందనే భావనను విడిచిపెట్టాలి. అధిక విద్యా పోటీ వల్ల సార్థకమైన అభ్యసన కంటే ఆందోళన, ఒంటరితనం, అక్రమాలే ఎక్కువగా పెరుగుతాయి.
అందువల్ల నీట్ ట్టూ పదేపదే జరుగుతున్న వివాదాలు కేవలం పరీక్షల నిర్వహణలోని వైఫల్యాలు కావు. అవి విద్యను ర్యాంకులు, కోచింగ్ మార్కెట్లు, ప్రమాణీకృత పోటీకి లోబరచిన లోతైన మార్పుల లక్షణాలు.
ప్రవేశ విధానాలను మరింత ప్రజాస్వామ్య, సమానత్వ దృష్టితో పునర్నిర్మించకపోతే ప్రశ్నాపత్రాల లీకులు కొనసాగుతూనే ఉంటాయి. ప్రజల నమ్మకం దెబ్బతింటూనే ఉంటుంది. పరీక్షలనే విద్యగా భావించే వ్యవస్థలో లక్షలాది యువత మానసిక భారాన్ని మోయాల్సి వస్తూనే ఉంటుంది.
(ఎడమ శ్రీనివాస రెడ్డి, కాకతీయ ప్రభుత్వ కళాశాల (అటానమస్), కాకతీయ విశ్వవిద్యాలయం, హనుమకొండలో అధ్యాపకుడు. తెలంగాణలోని Society for Change in Education ప్రధాన కార్యదర్శి. విద్యారంగంలో వస్తున్న సంస్కరణలు, మార్కెట్ విధానాలు, సమాన విద్య, ప్రజాస్వామ్య బోధనపై రచనలు చేస్తున్నారు. వీరి వ్యాసాలు Economic and Political Weekly, Mainstream Weeklyలో ప్రచురితమయ్యాయి.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
