కారూర్ కేసులో ప్రస్తుత నియామకాలకు అనుమతిస్తే, అది పారిశ్రామిక ప్రమాదాలు, మోటార్ ప్రమాదాలు, బాణసంచా పేలుళ్లతో పాటు ఇతర విషాదాల తర్వాత ఇలాంటి డిమాండ్లకు అనివార్యంగా ద్వారాలు తెరుచుకుంటాయని కోర్టు పేర్కొంది.
న్యూఢిల్లీ: గత సంవత్సరం ముఖ్యమంత్రి సీ జోసెఫ్ విజయ్ కారూర్ ర్యాలీలో మరణించిన వ్యక్తుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని విజయ్ ఆధ్వర్యాన తమిళగ వెట్రి కజగం(టీవీకే) నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు జూలై 27న కొట్టివేసింది.
రాజ్యాంగ నిబంధనల ఉల్లంఘన..
న్యాయమూర్తులు జస్టిస్ సీవీ కార్తికేయన్, జస్టిస్ ఆర్ శక్తివేళ్లతో కూడిన ఇద్దరు సభ్యుల డివిజన్ బెంచ్ తన తీర్పును వెలువరిస్తూ, తొక్కిసలాటలో మరణించిన 41 బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు కల్పిస్తూ తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు చట్టం ముందు అందరూ సమానులే, ప్రభుత్వ ఉపాధిలో అందరికీ సమాన అవకాశాల గ్యారంటీ ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 16కు విరుద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసిందని ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం తెలియజేసింది.
“ఉపాధి కోసం అనేక మంది వేచి చూస్తున్నారని” కోర్టు వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ ఉద్యోగాలను “రాజ్యం ఇలా విసిరేయరాదు”, రాజ్యాంగానికి అనుగుణంగా నియామక పద్ధతుల ప్రకారం సంపాదించాలని కోర్టు చెప్పింది.
“కార్యవర్గ చర్యలకు ఆంక్షలు లేకుండా స్వేచ్ఛగా వదిలేస్తే గందరగోళ పాలన ఏర్పడుతుందని” కోర్టు అభిప్రాయపడింది.
ప్రజా ప్రయోజన వాజ్యంపై విచారణ..
న్యాయవాది ధీరన్ తిరుమురుగన్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వాజ్యంపై విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు కొట్టివేసింది.
కారూర్ తొక్కిసలాట బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలనేది గుర్తింపు పొందిన మినహాయింపు ద్వారా ప్రత్యేక కేటగిరీలో ప్రభుత్వ ఉద్యోగం పొందే పరిధిలోకి రారని పిటిషన్‌దారుడు వాదించారు.
కారుణ్య నియామకాల కోసం స్థాపించబడిన చట్టబద్ధమైన వ్యవస్థ ఉందని అన్నారు.
కారూర్ కేసులో ప్రస్తుత నియామకాలకు అనుమతిస్తే, అది పారిశ్రామిక ప్రమాదాలు, మోటారు ప్రమాదాలు, బాణసంచా పేలుళ్లతో పాటు ఇతర విషాదాల తర్వాత ఇలాంటి డిమాండ్లకు అనివార్యంగా ద్వారాలు తెరుచుకుంటాయని, ఇలాంటి విషాదాల్లో ప్రభుత్వ ఉద్యోగం కాకుండా బాధితులు నష్టపరిహారం పొందారని కోర్టు తెలియజేసింది.
బాధిత కుటుంబాలకు నియామక పత్రాలు..
గత ఏడాది సెప్టెంబర్ 27న జరిగిన తొక్కిసలాట నాటి నుంచి తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ జూలై 11న తొలిసారిగా కారూర్ను సందర్శించి బాధిత కుటుంబాలను పరామర్శించి రాష్ట్ర పునరావాస పథకం కింద అర్హులైన వారి బంధువులకు ప్రభుత్వ ఉద్యోగ నియామక ఉత్తర్వులను అందజేశారు.
తన పార్టీ టీవీకే తరఫున తొక్కిసలాట బాధితుల కోసం స్మారక చిహ్నాన్ని కూడా ముఖ్యమంత్రి ప్రకటించారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
