సాహిత్య విమర్శకునిగా, పత్రికా రచయితగా, రాజకీయ విశ్లేషకునిగా, అనువాదకునిగా, కథా రచయితగా కల్లూరి భాస్కరం చిరపరిచితులే.
మహాభారతంలోని అనేక అంశాలతో నలభై ఏళ్ల పాటు సహజీవనం చేసి, ప్రతి పదాన్ని, ప్రతి వాక్యాన్ని, ప్రతి ఘట్టాన్ని దర్శిస్తూ, అనుభవిస్తూ, ఆనందిస్తూ రాశానని ఆయన అంటారు.
పురాణాలు, చరిత్ర, పురాతత్వ శాస్త్రం, సామాజిక పరిణామ శాస్త్రం, సాహిత్యం వంటి అనేక రంగాలలో లోతైన పరిశోధన చేసి రాసిన గొప్ప రచన మంత్ర కవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే.
పురాణాల్లో రాజ్యాధికారం – తండ్రితో చర్చ..
ఒకసారి భాస్కరం డీడీ కోశాంబి రాసిన ‘మిత్ అండ్ రియాలిటీ’ చదివిన తర్వాత సంభ్రమాశ్చర్యానికి గురై అందులో పురాణ కథకూ చరిత్రకూ; పురాణ కథకూ, వాస్తవికతకూ మధ్య అడ్డుగీతలు చెరిగిపోతూ ఒక అద్భుత స్వాప్నిక ప్రపంచం చూడగలిగారు.
పండితులైన తండ్రితో చర్చ చేస్తూ- ‘తండ్రి తర్వాత పెద్ద కొడుకుదే రాజ్యాధికారం అంటారు కదా, కొన్ని సార్లు చిన్న కొడుకుకు రాజ్యాన్ని అప్పగించిన ఉదాహరణలు ఉన్నాయి కదా’ అని ప్రశ్నించారు.
యయాతి తన పెద్దకొడుకు యదువుకు కాకుండా చిన్న కొడుకు పూరునికి; శంతనుడు తన పెద్దకొడుకు భీష్మునికి కాకుండా విచిత్రవీర్యునికి రాజ్యం ఇవ్వడం, కురు పాండవులలో పెద్ద అయిన ధర్మరాజుకు, చిన్న అయిన దుర్యోధనునికి మధ్య రాజ్యాధికారం ఎవరిదన్న విషయంలో తలెత్తిన వివాదం ఏకంగా కురుక్షేత్ర యుద్ధానికి దారి తీయడం గురించి ప్రస్తావించారు.
‘ధర్మ శాస్త్రాల ప్రకారం తండ్రి తర్వాత పెద్దకొడుకుదే రాజ్యాధికారం. కొన్ని మినహాయింపులున్నా వాటిని సార్వత్రిక నియమంగా చూడకూడ’దని తండ్రి అన్నారు.
మాతృస్వామ్య వ్యవస్థ – మూలాల అన్వేషణ..
దానితో తృప్తి చెందక సమాధానం కోసం వెతుకుతుంటే రొమిల్లా థాపర్ రచించిన ‘జినియాలజీ ఆఫ్ ది మహాభారత’లో సమాధానం దొరికింది.
మాతృస్వామ్య వ్యవస్థలో చివరి సంతానానిదే పెత్తనమని ఆమె రాశారు.
ఆ తర్వాత జార్జి థామ్సన్ రచన చదివినప్పుడు, ఈశాన్య భారతంలోని ఖాసీ తెగవారిలో మాతృస్వామ్యం ఉందని, కడగొట్టు కూతురికే అధికారం సంక్రమిస్తుందన్న సంగతి భాస్కరానికి తెలిసింది.
తాను మేఘాలయకు వెళ్ళినప్పుడు, అక్కడి వారి ఆచారం ప్రకారం, పెళ్ళైన తర్వాత భర్తే అత్తగారింటికి వస్తాడు తప్ప మన దగ్గరలా భార్య వెళ్ళదని అక్కడి మహిళలతో మాట్లాడినప్పుడు తెలిసింది.
వంశ చరిత్రను కాపాడిన అమ్మమ్మలు – మౌఖిక సంప్రదాయం..
ఆఫ్రో అమెరికన్ రచయిత ఎలెక్స్ హేలీ తన వంశ మూలాలు వెతుక్కుంటూ వెళ్ళి, చివరికి వాటిని కనుగొని ‘రూట్స్’ పేరుతో ఒక పుస్తకం రాశాడు.
అమెరికాలో పుట్టిన ఎలెక్స్ హేలీకి, అతని బంధువులందరికీ మూలపురుషుడైన కుంటా కింటేను, తమకు ఏడు తరాల క్రితం అమెరికన్లు ఎత్తుకుపోయి ధనికులకు బానిసగా అమ్మేస్తారు. అతను ఎన్నోసార్లు పారిపోయేందుకు ప్రయత్నించి దొరికిపోతాడు.
చివరికి అతని యజమాని అతని పాదాన్ని నరికివేస్తాడు. ఇక తన జీవితం ఇంతే అనుకుని అతను తోటి బానిసను పెళ్ళి చేసుకున్నాక ఒక అమ్మాయి పుడుతుంది.
తన యజమాని పెట్టిన పేరును తిరస్కరించి కుంటా కింటే అనే అతను పిలిపించుకుంటాడు.
ఆఫ్రికాలో తన పూర్వీకులు జీవించిన తన ఊరు గురించి, తమ కుటుంబం గురించి ఒక పాట రూపంలో తన కూతురికి చెప్పి, తమ సొంత భాషలోని కొన్ని పదాలను నేర్పిస్తాడు. అప్పటినుంచీ అతని వారసులు ఆ పాటను, పదాలను తరం నుంచి తరానికి అందిస్తూ కాపాడుకుంటారు.
అలాగే తనూ అందుకున్న ఎలెక్స్ హేలీ వాటిని మననం చేసుకుంటూ, వాటి ఆధారంగా ఎంతో పరిశోధన చేసి, ఎందరితోనో మాట్లాడి తన పూర్వీకులు నివసించిన ప్రాంతాన్ని, వారు మాట్లాడిన భాషనూ ఎట్టకేలకు తెలుసుకుంటాడు.
ఆఫ్రికా ఖండంలో వారు నివసించిన ఒక మారుమూల గిరిజన కుగ్రామాన్ని గుర్తిస్తాడు.
కుంటా కింటే వంశ చరిత్రను కాపాడుకుంటూ వచ్చినవారు, అతని కుటుంబానికి చెందిన స్త్రీలే. ఈ పుస్తక రచయిత ‘అమ్మమ్మలు కాపాడిన చరిత్ర’ అనే శీర్షికతో ఈ వివరాలు అన్నీ ఇస్తారు.
హేలీ వెళ్ళింది ఒకనాడు మనందరం జీవించిన గణ సంస్కృతిలోకి. గణదశలో ప్రపంచ మానవాళి అంతా ఒకే రకమైన అనుభవాలను, విశ్వాసాలను, పురాణ గాథలను పంచుకున్నారు.
ఎలెక్స్ హేలీ పూర్వీకుల జన్మస్థానానికి వెళ్ళి దర్శించింది కూడా మన వాల్మీకి, వ్యాసుడు, గ్రీకుల హోమర్, హెసియడ్ల ప్రతిరూపాన్నే. ఎలెక్స్ హేలీ, రెండు వందల ఏళ్ళ క్రితం నాటి తన కుల, వంశ చరిత్రను ఒక గాయకుడి నోట వినడం ఇందులో ఉత్కంఠభరితమైన పతాక సన్నివేశం.
లిఖిత సంప్రదాయం లేని రోజుల్లోని గాథలు, చరిత్రలన్నీ మౌఖిక సంప్రదాయం వల్లనే వెలుగు చూశాయి.
గణ వ్యవస్థలో మార్పులు..
కుంటా కింటే ముస్లిం మతస్థుడు. అతని నుంచి ఏడో తరానికి వచ్చేసరికి ఒంటి రంగు కారు నలుపు నుండి గోధుమ వర్ణానికి మారిపోయింది. మతం కూడా మారింది.
అంతకుముందు మనిషి చరిత్రలో వేల సంవత్సరాలు కొనసాగిన గణవ్యవస్థలోకి వెళితే, అందులో సామాన్యుడు, అసామాన్యుడన్న విభజన లేదు.
గణంలోని ప్రతి సభ్యుడు సామాన్యుడే లేదా అసామాన్యుడే. ప్రకృతితో కలిసికట్టుగా సంఘర్షించినంత కాలం వారిలో తారతమ్యాలు లేవు; మనిషికి సాటి మనిషితో సంఘర్షణ ప్రారంభమయ్యాక సామాన్యులు, అసామాన్యులు అన్న విభజన వచ్చింది.
వంశ ప్రాధాన్యత – మహాభారతం చెప్పిన వాస్తవాలు..
క్రీస్తు శకం 11వ శతాబ్దిలో రాజమహేంద్రవరం రాజధానిగా పరిపాలించిన చాళుక్య రాజు రాజరాజ నరేంద్రుడు తనను పాండవ వంశీకునిగా చెప్పుకోవడం, మనుచరిత్ర రాసిన అల్లసాని పెద్దన తుళువ వంశస్తుడైన శ్రీకృష్ణ దేవరాయలను యయాతి కొడుకు తుర్వసుని వంశానికి చెందినవాడని చెప్పడం, నేడు పంజాబ్ లోని పురి పేరున్నవారు పురు వంశీయులమని చెప్పుకోవడం వంశ ప్రాధాన్యతను తెలియచేస్తుంది.
క్షత్రియులన్న ముద్ర కోసం, సూర్య, చంద్ర రాజ వంశాలతో ఏదో ఒక వంశంతో ముడిపెట్టుకోవడం కొనసాగింది.
మహాభారతం రెండు విషయాలు ప్రధానంగా చెప్పింది. ఒకటి సాంప్రదాయక క్షత్రియులు అంతరించిపోవడం. రెండు రాజ్యాధికారం క్షత్రియేతరుల చేతుల్లోకి వెళ్ళడం.
భూపతిగా మారుతున్న గోపతి – సామాజిక పరిణామాలు..
మహాభారతంలో రాజులను వర్ణించేటప్పుడు గొప్ప భాషతో చెప్పడమే కానీ సంపదకూ, అధికారానికీ అప్పటికి భూమి కొలమానం కాదు.
సంపదను గోవులతోనే కొలిచేవారు. అంటే, అప్పుడు రాజు గోపతే కాని భూపతి కాడు.
ఆనాడు ఉగ్రారణ్యాలు వారి పాలన కిందికి రావు. తొలి రాజులు ఆదివాసులను స్వతంత్ర జీవనులుగా గుర్తించి వారితో సఖ్యంగా ఉండేవారు.
వ్యవసాయ ప్రాధాన్యం పెరిగి అరణ్యాలలోకి చొచ్చుకు వెళ్ళవలసిన అవసరం ఏర్పడ్డాకే రాజులకూ, ఆదివాసులకూ యుద్ధాలు మొదలయ్యాయి. ఆ తర్వాత ఇనుము లభించే సరికి చాలా మార్పులు జరిగాయి.
జనపదాలు రాజ్యాలుగా అవతరించాయి. గణాలు మహాజనాలుగా మారాయి. అరణ్యాలను పెద్ద ఎత్తున ఛేదించడానికి శ్రామికవర్గం అవసరమై, వర్ణ వ్యవస్థ గట్టిపడింది.
పురాతన అవశేషాలు – సోషల్ ఇంజనీరింగ్..
పాశ్చాత్య ప్రపంచంతో పోలిస్తే భారతదేశం ప్రత్యేకం. ఇక్కడ పురాకాలపు వారసత్వం పూర్తిగా అంతరించలేదు.
గణసమాజ అవశేషాలు నేటికీ ఉన్నాయి. ఒకరకంగా మన దేశం నేడు కూడా మహాభారత కాలంలోనూ, మహాభారత సమాజంలోనే ఉంది.
మరోలా చెప్పాలంటే, క్రీస్తు పూర్వ దశలోనే ఉంది తప్ప క్రీస్తు శకంలోకి అడుగు పెట్టలేదు.
పాశ్చాత్యుల దృష్టిలో భారతదేశంలో ఇప్పటికీ రహస్య సమాజాలు, గుప్త లిపులు ఉండి, అన్వేషణకు పురికొల్పుతున్నాయి.
నిన్నమొన్నటి వరకూ ఊరి బయట రహస్య ప్రదేశాలు(తోపులు) ఉండేవి. అందులో స్త్రీలకు మాత్రమే ప్రవేశం ఉండేది.
వారు ఆరాధించే అమ్మవారి వనాలే ఆదికాలపు గుడులు. అలాంటి అమ్మవారి వనం లుంబినిలోనే బుద్ధుడు పుట్టాడు. బృందావనం, గోకులం అటువంటివే.
కృష్ణుడు పురుషులపై ఉన్న నిషేధాన్ని ఉల్లంఘించి స్త్రీలకు చెందిన అటువంటి ఒక రహస్య ప్రదేశంలోకి ప్రవేశించి అక్కడ జలక్రీడలాడుతున్న స్త్రీల చీరలు దొంగిలిస్తాడు.
భాగవతం దానిని గోపికా వస్త్రాపహరణంగానూ, స్త్రీలను కృష్ణ భక్తులుగానూ చిత్రిస్తుంది. పురుషస్వామ్యం వచ్చాక దానికి అనుకూలంగా ఇటువంటి కథనాలను సృష్టించడం కనిపిస్తుంది.
ఆటవిక తెగకు చెందిన జాంబవతి, రుక్మిణిని పెళ్ళిచేసుకోవడం భిన్న తెగలలోకి కృష్ణారాధనను శాంతియుతంగా చొప్పించే ప్రయత్నమేనని కోశాంబి వివరణ.
కృష్ణుడి వివాహాలు మాతృస్వామ్యానికి చెందిన కొన్ని అనార్య తెగలను ఆర్యుల పితృస్వామిక వ్యవస్థలో విలీనం చేసే ప్రక్రియలో కీలకమైన ముందడుగుగా ఆయన వర్ణిస్తారు.
ఇది కృష్ణుని సోషల్ ఇంజనీరింగ్‌కు చక్కని ఉదాహరణ.
మానవుడు భూమిపై ఉన్న ప్రకృతి రేఖలను, కృత్రిమ రేఖలను కూడా ఉల్లంఘిస్తూ, నదీ నాగరికతలు విలసిల్లిన కాలంలో నది నడచిన దారి వెంట నడిచి కొత్త రేఖాపటాలు నిర్మించుకున్నాడు.
భౌగోళిక రేఖలే కాదు గణం, తెగ, వర్ణం, కులం, జాతి చట్రాలను కూడా ఉల్లంఘిస్తూ పోయాడు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
